మన పల్లె చరిత్ర

జల జల పారే నాగార్జునసాగర్ కుడి కాలువ... ఆ ఒడ్డునే పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఆకుపచ్చని పల్లె.... అదే మన కండ్లగుంట. కండ్లగుంట ఓ ఆకుపచ్చని ఆదర్శ గ్రామం... ఎందరికో బతుకునిచ్చింది. ఎందరికో బతకడం నేర్పింది. మొత్తానికి తన ఊరి బిడ్డలందరికి “బతుకు ... బతకనివ్వు” అనే అమూల్యమైన పాఠాన్ని బోధించింది. అవే మన ఊరికి ఖ్యాతిని తెస్తున్నాయి. అందుకే కండ్లగుంట అంటే–సమ్ థింగ్ స్పెషల్. కండ్లగుంట చాలా పురాతనమైన పల్లెటూరు. మన గ్రామ పంచాయితీ శివారు గ్రామమైన చాగల్లు (నకిరికల్లు) గ్రామానికి అంతరాభాగంగా ఉన్నది. పూర్వం నుండి మన గ్రామం పెద్దబజారు, చిన్నబజారు, యాదవులబజారు, పెద్దపల్లె, చిన్నపల్లె, ఎరుకల గుడిసెలు, బి.సి కాలనీలు అను సామాజిక ప్రాంతాలుగా ఉండేది. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న మన గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్నది. మన గ్రామంలో నాగార్జున సాగర్ జలాశయం యొక్క కుడి కాలువ వుండుట చేత ఊరి చుట్టూరా పచ్చని వరి పొలాలతో, ఎటు చూసినా పచ్చదనంతో పరవశిస్తూ, కనుచూపుమేర ప్రకృతి శోభాయానంగా, పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఆకుపచ్చని పల్లె. గ్రామం ప్రధాన వీధులన్నీ సిమెంటు రోడ్లే. మన గ్రామం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం-సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం కిందకు వచ్చే పచ్చని పల్లె. గ్రామంలో దాదాపు 998 కుటుంబాలతో 3766 పై చిలుకు జనాభా ఉన్నది. మన గ్రామం 20.35 ఎకరాల గ్రామ విస్తీర్ణంతో, సముద్ర మట్టానికి 106 మీటర్ల ఎత్తులో, క్రొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 50 కిలోమీటర్ల సమీపంలో ఉన్నది.

మన దగ్గరలోని మూడు పట్టణాలు (నరసరావుపేట-సత్తెనపల్లి-పిడుగురాళ్ళ)కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మన గ్రామం... ఎటు చూసినా పచ్చదనంతో పరవశిస్తూ కనిపిస్తుంది. చిరుగాలులకు తలలూపే వరి పైరు... అందమైన బంతిపూల తోటల నిగారింపు... నిమ్మ తోటల హోయలు.... మన చింతతోపు-పంటలపై వాలుతూ కిలకిల రాగాలు చేసే అందమైన పక్షులు ... మొత్తంగా ఓ అందమైన దృశ్య కావ్యం... మన పల్లె “చిత్రం”.

మరో పక్క చూస్తే ... ఆధ్యాత్మిక చైతన్యంతో మన గ్రామం అలరారుతుంది. పచ్చగా పరుచుకున్న చెట్లమధ్య ఒద్దికగా కనిపించే ఇళ్ళు.... అణుకువగా, బాధ్యతగా నడుచుకొనే గ్రామస్తులు... ఊరికి మధ్యలో శివాలయం, రామాలయం, చెన్నకేశవాలయం, ఆంజనేయ మరియు వినాయక ఆలయాలు... ఒక పక్క బ్రహ్మంగారిమఠం.... ఇంకోపక్క పోలేరమ్మ, నాభిశిల గ్రామదేవతల కోవెలలు ... ఇంకో దిక్కున మసీదు ... మరోదిశలో పెద్ద చర్చి .... కండ్లగుంటకు వన్నె తెస్తున్నాయి. ఇవన్నీ మత సామరస్యానికి ప్రతీకగా గ్రామంలో భాసిల్లుతున్నాయి. కులమతాలకు అతీతమైన సమాజం మన పల్లెలో పరిఢవిల్లుతున్నది. సంక్రాంతి, ఉగాది, వినాయకచవితి, దసరా, రంజాన్, క్రిస్మస్ వేడుకలు ఇక్కడ సామరస్యపూర్వక వాతావరణంలో కొనసాగుతాయి. పల్లె ప్రజల జీవనానికి, శ్రమైక జీవన సౌందర్యానికి, ప్రశాంత వాతావరణానికి, సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామా మా ఊరు. మన ఈ పచ్చని పల్లెలోని మనుషుల అద్భుతమైన దానశీలత, జన్మభూమిపై అంతులేని ప్రేమ ఆప్యాయతులు కూడా ఎంతో స్వచ్ఛం. అందుకే కండ్లగుంట గ్రామం వివాదాలకు, ఘర్షణలకు ఎంతో దూరం.

మా ఊరిలోని ఉన్నత పాఠశాలలో ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉన్నది. ఇది దాదాపు 150 సంవత్సరాలుగా మన ఊరందరి గొంతు తడుపుతోంది. గ్రామంలో రెండు పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. వీటి కింద కొన్ని వందల ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. నీళ్ళు పారే ఊరిలో నాపరాళ్ళు కూడా పండుతాయంటారు. కండ్లగుంట చాలా పుణ్యం చేసుకుంది. గుంటూరు బ్రాంచి కెనాల్ గా పిలువబడే నాగార్జునసాగర్ కుడి కాలువ నేరుగా మన గ్రామం నుంచే వెళ్తోంది. దీంతో కృష్ణమ్మ పరవళ్లతో ఎప్పుడూ పాడిపంటలతో, పచ్చటి పైరులతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా వర్ధిల్లుతోంది. కండ్లగుంట గ్రామస్తుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి ప్రధాన పంట. వరి, మొక్కజొన్న, మిరప, పత్తి ప్రధాన పంటలు గాను... మినుము, పెసర, కంది అంతర పంటలు గాను ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఊరి మీదగా ప్రవహిస్తున్న నాగార్జున సాగర్ కుడి కాలువ కారణంగా గ్రామంలోని మెట్ట ప్రాంతాలలో సైతం రైతులు పంటలు సాగు చేస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. వాణిజ్య పంటలు కూడా కండ్లగుంటలో సాగవుతున్నాయి. అన్నింటికి మించి నిరంతరం శ్రమించే మన ఊరి అన్నదాతలు.... వీరే మా స్ఫూర్తిప్రదాతలు.

ఒకప్పుడు “కండ్లగుంట” గ్రామంలో విద్యాబోధనకై ఏవిధమైన సౌకర్యాలు ఉండేవి కావు. కేవలం ఒక ప్రాధమిక పాఠశాల తప్ప వేరేదేదీ ఉండేది కాదు. ఈ స్ధాయిలోనే 1980వ సంవత్సరం వరకూ చాలా మంది తమ చదువులను ముగించుకోవడం జరిగేది. కొద్ది మంది మాత్రమే సమీపంలో ఉండే నగరాలలో తమ ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్ళేవారు. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించడం ఎంత కష్టమో భావించి, ఊరిలోనే పైచదువుల కొరకు ఓ పాఠశాలను ఏర్పాటు చేయాలనే తలంపుతో, పాఠశాలను వారి శక్తిమేరకు వీలైనంత ఉన్నతమైన స్ధాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. గ్రామపెద్దలు, సంబంధిత రాజకీయ నాయకులతోనూ మరియు ప్రభుత్వ అధికారులతోనూ కలసికట్టుగా కృషిచేసి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను(జెడ్.పి.పి.హెచ్) నెలకొల్పడంలో విజయం సాధించారు. గ్రామంలో 'నిరక్షరాస్యత రూపుమాపాలనే ఉద్దేశ్యంతో' పాఠశాల నిర్మాణానికి కాలసిన భూమిని శ్రీ జంపని చిన్నబ్బాయి గారు, సుమారుగా 3.5 ఎకరాలను శాశ్విత భవనాలు నిర్మించుట మరియు క్రీడా మైదానాలను ఏర్పరుచుట కొరకు భూమిని దానం చేయడం జరిగింది. గ్రామం అంతగా అభివృధ్ది పొందినది కాకపోయినా, ఉన్నత పాఠశాల భవనాలను, వాటితో పాటుగా మంచి మౌలికసదుపాయాలు కల్పించి విద్యాబోధనకు అనుకూలమైన మరియు సౌకర్యాలున్న పాఠశాలగా ప్రభుత్వ నిధులతో ఉన్నత పాఠశాల రూపుదిద్దుకున్నది. ఊరి పాఠశాలలో ప్రయోగశాలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా జరిగింది. కేవలం తెలుగు మీడియంతో ప్రారంభమైన స్కూలులో ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో అత్యుత్తమ ఉన్నత విద్యార్హతలతో కూడిన నిష్టాతులయిన ఉపాధ్యాయులతో విద్యా భోదన జరుగుచున్నది. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకొనే విధంగా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో విద్యాసౌకర్యాలు మెరుగయ్యాయి. కండ్లగుంట ఓ విద్యాకేంద్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు ఎందరో నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో కొనసాగుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాఫ్ట్ వేర్ హార్డ్ వేర్ ఇంజినీరింగ్, న్యాయ, రాజకీయ, ఆర్ధిక, జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమ తదితర రంగాల్లో కండ్లగుంట వాసులు స్థిరపడ్డారు. నరసరావుపేట, హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, విదేశాల్లో సైతం పలువురు మంచి స్థానాల్లో ఉన్నారు. ఓర్పు-నేర్పు, చదువు-వినయం ప్రతి కండ్లగుంట పౌరుడి సహజ లక్షణాలు. కష్టపడి శ్రమించే తత్వం, కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేసే నైజం.... మన గ్రామస్తుల సొంతం. అందుకే మన గ్రామానికి చెందిన వారంతా.. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా తోటివారికి చేతనైనంతలో చేయూతనందిస్తూ “బతుకు..బతకనివ్వు” అనే స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు .

ఈ దేశం నాకు ఏమిచ్చింది అని అడిగే ముందు, మనం ఈ దేశానికీ ఏమి చేశాము అని మొదట నిన్ను నీవు ప్రశ్నించుకో... అన్నారు గాంధీ. మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఆడుకున్నాము, ఇక్కడే చదువుకున్నాము కానీ ఈరోజు ఎక్కడో మంచి ఉద్యోగం చేస్తూ, ఉన్నత జీవితం గడుపుతున్నాము. ఈ జీవితం మన మాతృభూమి మనకిచ్చిన వరం. మన గ్రామం ఇంకా మనకు ఏమి ఇవ్వాలి, మనకు జన్మనిచ్చింది...అది చాలదా...! మనం మన మాతృభూమి ఋణం కొంతయిన తీర్చుకుందాము. మన గ్రామంలో ఎంతోమంది వృద్ధులు ఇంకా ఈ గ్రామాన్ని, ఈ మట్టిని నమ్ముకొని జీవిస్తున్నారు. అలాంటి వారికి మనం ఏదో ఒక విధంగా మన యొక్క సహాయ సహకారాలను అందిద్దాము. గ్రామంలో కొంత అభివృద్ధి జరిగింది. ఇంకొంత జరుగుతోంది. మరెంతో జరగాల్సి ఉంది. గ్రామస్తుల సమిష్ఠి కృషి, ఇక్కడ చదువుకుని వేర్వేరు చోట్ల స్థిరపడిన వారి సంకల్పంతో ప్రస్తుతం కళ్యాణమండపం, వైకుంఠ మహాప్రస్థాన శ్మశానవాటిక రూపుదిద్దుకున్నాయి. ఇవి సరిపోతాయా? గ్రామానికి ఇంకా ఏం కావాలి? గ్రామం కోసం మనం ఇంకా ఏం చేయగలం? ఏం చేస్తే బాగుంటుంది? విద్య, వైద్య సౌకర్యాలు ఇంకా ఎలా మెరుగు పరచాలి? పల్లె ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఏమేం చేయాలి?

రండి... గ్రామంలో ఉంటున్న... గ్రామానికి చెంది వేర్వేరు చోట్ల స్థిరపడిన వారంతా ఒకే చోట ఆనందోత్సాహాలను పంచుకుంటూనే ఆదర్శాన్ని చాటుకుందాం, సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అంటూ “కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్” ప్రతి సంవత్సరం సంక్రాంతి వేళ “పల్లెకు పోదాం రా....” అంటూ ఆత్మీయంగా పిలుస్తోంది.

మనకు బ్రతుకునిచ్చిన, అందమైన భవిష్యత్తునిచ్చిన కండ్లగుంటను “ఆదర్శ గ్రామం”గా తీర్చిదిద్దేందుకు చేయిచేయి కలుపుదాం. మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకొన్న మన పల్లె తల్లి మెడలో ప్రగతి హారాన్ని అలంకరిద్దాం. “గ్రామం బాగుండాలి... అందరం బాగుండాలి” అనే ఆదర్శ భావాన్ని భావితరానికి నజరానాగా అందిద్దాం!

గ్రామ సరిహద్దులు :-   తూర్పు: దమ్మాలపాడు,         పడమర : చీమలమర్రి,         ఉత్తరం: చాగల్లు,        దక్షిణం: రూపెనగుంట్ల.

కండ్లగుంట గ్రామ కంఠం వైశాల్యం :- హిందువుల నివాస వైశాల్యం: 18.04 ఎకరాలు (సర్వే నెం: 468), క్రైస్తవులు నివాస వైశాల్యం: 2.04 ఎకరాలు (సర్వే నెం: 479-A), ముస్లింల నివాస వైశాల్యం: 0.27 ఎకరాలు (సర్వే నెం: 469),    గ్రామం మొత్తం నివాస వైశాల్యం: 20.35 ఎకరాలు,
చెరువు వైశాల్యం :- చింతల చెరువు వైశాల్యం: 14.31 ఎకరాలు (సర్వే నెం: 477-B), చింతల చెరువు వైశాల్యం: 0.36 ఎకరాలు (సర్వే నెం: 477-G), చెరువు కుంట వైశాల్యం: 6.68 ఎకరాలు (సర్వే నెం: 470),    మొత్తం చెరువు-కుంటల వైశాల్యం: 21.35 ఎకరాలు,
పంటపొలాల వైశాల్యం :- సాగు వైశాల్యం: 2413.35 ఎకరాలు, పోరంబోకు స్థలం వైశాల్యం: 443.31 ఎకరాలు,    మొత్తం మెట్ట-మాగాణి సాగు వైశాల్యం: 2856.66 ఎకరాలు, అసైన్డ్ స్థలం వైశాల్యం: 105.74 ఎకరాలు, సభ్యులు: 167 మంది,     గ్రామం మొత్తం వ్యవసాయ పొలం వైశాల్యం: 2856.66 ఎకరాలు,
వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక వైశాల్యం :- హిందూ (OC) వైశాల్యం: 3.93 ఎకరాలు (సర్వే నెం: 479-B2B), హిందూ (SC) వైశాల్యం: 2.74 ఎకరాలు (సర్వే నెం: 480), ముస్లిం వైశాల్యం: 0.15 ఎకరాలు(సర్వే నెం: 365-D2),
అక్షాంశాలు మరియు రేఖాంశాలు :- 16o20’19.58” N 80o01’16.07” E,   సముద్ర మట్టం నుండి ఎత్తు : 106 మీటర్లు లేదా 347.68 అడుగులు

“గ్రామ వికాసమే...మన అంతిమ ఆశయం”