నా జట్టు

      వేసవి సెలవులు రాగానే మా అమ్మమ్మ వాళ్ల ఊరు గుంటూరు జిల్లాలోని కండ్లగుంట గ్రామానికి వెళ్లేవాణ్ని. పొలిమేర నుంచే తాటిచెట్లు, ఈత చెట్లు, మామిడి తోటలు స్వాగతం పలికేవి. ఆ ఊళ్లోని ప్రతి చెట్టూ, పుట్టా మాకు వేసవి విడిదే. ఉదయం లేవడంతోనే స్నేహితులతో కలసి ఊరంతా తిరిగేవాణ్ని. ఆనాడు తిన్న తాటి ముంజెలు, బుర్రలతో చక్రాల బండీ తయారు చేసుకుని ఆడుకున్న రోజులు.. ఇప్పటికీ గుర్తున్నాయి.

      మేనమామ ముద్దు మేలైన ముద్దు అని అంటారు. నన్ను మా మేనమామలు అంత అపురూపంగా చూసుకునేవారు మరి. వారితో నా ఆటపాటలు చాలా సరదాగా సాగిపోయేవి. ఈత రాకపోయినా.. మామయ్యల సహకారంతో మోటబావిలో గంటల తరబడి స్నానాలు చేసేవాడిని.

      అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదురుగానే పెద్దబజారు ఉండేది. వాడకట్టులోని పిల్లలంతా చేరుకుని అక్కడికి చేరుకుని ఇసుకలో చెడుగుడు ఆడుకునేవాళ్లం. సీతమ్మగారు అనే ఓ పెద్దావిడ ఉండేది. ఆమెకు ఖాళీగా ఎవరు కనిపించినా ఏదో ఒక పని చెప్పేది. బహుమతిగా సపోటాలు ఇచ్చేది. అదే వీధిలో పీనాసి సుబ్బమ్మ అని ఒకావిడ ఉండేది. చెట్టుకున్న జామ కాయలు పిల్లలెవరైనా కోసుకెళ్తారేమోనని.. కాయలకు బట్టలు చుట్టి కాపలా కాసేది. మేమేం తక్కువ తిన్నామా.. ఆవిడ అలా లోపలికి వెళ్లగానే ఇలా కాయలు కొట్టేసేవాళ్లం. తర్వాత ఆమె ఓ గంటపాటు తిట్లదండకం అందుకునేది.

      వేసవి నాటికి ఊరి చెరువులో నీళ్లు బాగా తగ్గిపోయేవి. మోకాల్లోతు కూడా ఉండేవి కావు. పిల్లలమంతా చెరువుకు వెళ్లి.. కేరింతలతో నీరంతా బురదమయం చేసేవాళ్లం. పొద్దంతా ఆటలతో అలసిపోయిన నేను రాత్రి ఆరుబయట ఆదమరచి నిదురపోయేవాడిని. ఇలాంటి సరదా సన్నివేశాలతో సాగిపోయే వేసవి సెలవులు ఇట్టే గడిచిపోయేవి. మా ఊరికి తిరుగుప్రయాణం అయ్యే రోజు నాకు ఏడుపు ఆగేది కాదు. అప్పుడు మల్లమ్మ గుడిదాకా నన్ను సాగనంపి.. తన కొంగుతో నా కళ్లు తుడిచి.. చేతిలో చిల్లర ఉంచి నన్ను పంపించిన అమ్మమ్మను.. ఆ శేకూరును ఎలా మరచిపోగలను.

S.no Name Gender ContactNo Status Action