దేవాలయం
    దేవాలయాలు అనగా...    

      'దేవళము' లేదా 'దేవాలయం' మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. ‘దేవానాం దేవస్యవా ఆలయా’ అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే 'దేవాలయం' అని అన్నారు మన పెద్దలు.

      దేహం దేవాలయం వంటిది. అందులో ప్రతిష్ఠమైన సనాతనుడైన జీవత్మాయే పరమాత్మా. విశ్వవ్యాప్తంగా వెలసియున్న దేవాలయాలన్నీ మానవ కల్యాణానికై ఏర్పాటు చేయబడినవే. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. అవి జాతి మత కులభేదాలకు అతీతంగా నిర్మించబడ్డాయి. అది దేవాలయం, చర్చి, మసీదు, జైనమందిరం, మఠం మరేదైనా కావచ్చు, వాటి లక్ష్యం ఒక్కటే, మానవ మస్తిష్కంలోని దుష్టబుద్ధిని తొలగించి మానవత్వాన్ని పెంపొందిచడమే. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి. అందుకే మనవాళ్ళూ దేవాలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది. మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం.

      పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం. నేనే అతనని పూజించాలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం: శిరస్సు, గర్భగృహం: మెడ, ముందరి మంటపం: ఉదరం, ప్రాకారపు గోడలు: కాళ్ళు, గోపురం: పాదాలు, ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.

    దేవాలయ ప్రాచీనత...    

      భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు, అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలాల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రమంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.

      ‘దేవాలయాలు వైదికయుగం’లో నిర్మితమైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలవు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణమును శరీర నిర్మాణము ననుసరించి కావించినారు.

    దేవాలయ వాస్తు...    

దేవాలయాలను మనం రెండు వర్గాలుగా విభజించుకోవచ్చు.

      1. గ్రామదేవతాలయాలు 2. శిష్టదేవతాలయాలు. మొదటి వర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామ సంస్కృతిలో నిలద్రొక్కుకున్న పోలేరమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మలు మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రీలే. ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవాలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారణంగా ఉంటాయి. ఇక రెండవ వర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వరుల మొదలైన శిష్టదేవతలు లేక నాగరీక దేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు సామన్యంగా బ్రాహ్మణులు. అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.

      శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధారపడి, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి. కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింపబడుతుండేవి.

      వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండేవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆర్యావర్తం ప్రవేశించడానికి ముందే ఈ దేశంలో నెలకొన్న ద్రావిడులు అనేక శతాబ్దాలుగా తమదే అయిన ఒక సంస్కృతిని పెంపొందించుకొంటూ వచ్చారనీ, ఆర్యులు వాళ్ళనుంచి వాస్తువిద్యను నేర్చుకొన్నారనీ కొంతమంది అభిప్రాయం. మొదట్లో వెదురుతో నిర్మింపబడి, అనంతరం కొయ్యలతో కట్టడాలు నిర్మంపబడి ఉండవచ్చు. ఆ తర్వాత మన్ను, ఇటుకలతో నిర్మింపబడి క్రీ.శ 4వ శతాబ్ది తర్వాత విడివిడి రాళ్ళతో గృహాలు, దేవాలయాలు నిర్మింపబడడం మొదలయ్యాయి. ఇటుకలు, రాళ్ల పురాతన కట్టడ అవశేషాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాస్తుకళ క్రమేపి ఏ విధంగా వృద్ధి చెందిందో ఇవి చూపడతాయి.

      ఆధునిక విద్వాంసులు ఉత్తర హిందూస్థానపు దేవాలయ రీతిని “ఇండోఆర్యన్” శైలి అనీ, దక్షిణ హిందూస్థానపు రీతిని “ద్రావిడశైలి” అని అంటారు. వాస్తు శైలి దృష్టిచే ద్రావిడ వాస్తురీతి వికాసాన్ని ఐదు కాలాలుగా విభజించడం జరిగింది.

1. పల్లవుల కాలం క్రీ.శ. 600900

2. చోళుల కాలం క్రీ.శ. 9001150

3. పాండ్యుల కాలం క్రీ.శ. 11501350

4. విజయనగర కాలం క్రీ.శ.13501565

5. ఆధునిక కాలం క్రీ.శ. 1600 – .... (నాయక) పైన పేర్కొనబడ్డ ఐదు ప్రధాన రాజవంశాలు దక్షిణ దేవాలయ వాస్తు పరిణామానికి తోడ్పడ్డారు.

      భారతదేశంలోని దేవాలయాలను, వాటి రచనా శైలికి అనుగుణంగా మూడు విధాలుగా వర్గ్రీకరించారు. 1. గర్భగృహం మీదున్న గోపురం ఎత్తుగా ఉంది. వక్రరేఖాకృతిలో ఉన్న “నాగర” శైలి. ఇటువంటి దేవాలయాలు క్రింద నుండి శిఖరం దాకా చతురస్రాకారంలో ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశంలోని దేవాలయాల్లో గమనింపవచ్చు. 2. గర్భగృహము మీద గోపురం భిన్నంగా పిరమిడ్ లో ఉన్నది. “ద్రావిడ” శైలి ఈ లక్షణం పల్లవులు, చోళులకు చెందిన దక్షిణ భారత దేవాలయాల్లో కనిపిస్తుంది. 3. ఈ రెండు లక్షణాలను లోనున్నది “వేసర” శైలి.

      ఉత్తర హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు లంబప్రవృద్ధి దేవాలయాలు, ఆలయ శిఖరాలు చాల ఎత్తులో నిర్మింపబడి ఉంటాయి. దక్షిణ హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు ప్రస్తవిస్తరణ దేవాలయాలు. వీటినే ద్రావిడ పద్ధతికి చెందిన దేవాలయాలుగా పరిగణిస్తున్నాము. ఈ పద్ధతికి చైందిన ఆలయాలలో విస్తీర్ణము ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలుగా శ్రీకాళహస్తి, మధుర దేవాలయాలను తీసుకోవచ్చు. సహస్ర స్తంభ మండపాలు, అనేక ప్రాకారాలు, దాదాపు 200 అడుగుల ఎత్తుండే గోపురాలు, 1520 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించిన అంగణాలు, విశాల కల్యాణ మంటపాలు ఇత్యాది ఈ ఆలయ లక్షణాలుగా కనిపిస్తాయి. ఆంధ్రదేశంలో చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజ వంశాలవారు దేవాలయ నిర్మాణానికి విశేష కృషి గావించారు. వీరి వాస్తుశిల్పం, దేవాలయ నిర్మాణం, వీటికి నిదర్శనం నేటికి చెక్కు చెదరక నిలిచి ఉన్న దేవాలయాలు.

    ఆలయములు అయిదు విధములు...    

స్వయంవ్యక్త స్థలములు: భగవంతుడే స్వయంగా అవతరించిన స్థలములు.

దివ్య స్థలములు: దేవతలచే ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.

సిద్ధ స్థలములు: మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించిన స్థలములు.

పౌరాణ స్థలములు: పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములు.

మానుష స్థలములు: రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.

    దేవాలయ నిర్మాణం...    

      దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రమైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది.

      నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను, దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు. అలాగే “శిల్పప్రకాశ” ఇలా పేర్కొన్నది. నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనది, బురదగానున్న భూమిని, స్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి, రప్ప, శిల, లోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్త్రాభరణాలు అవసరమో, ఆలయానికి, విగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం.

      ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుషమండలాన్ని రచించడం. వాస్తుపురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్ల, ఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడే నెలకొని ఆలయ నిర్మాణకార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కాని, అగ్నిని కాని స్థాపించి, పూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చదరమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత “గర్భన్యాస” మనే విధిని మానవుల్లో “గర్భాదానా” నికి సమానంగా పూర్వులు విధించారు. భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్ట స్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది.

    దేవాలయ ప్రధాన భాగాలు...   

      దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, పాకశాల మొదలైన వివిధ భాగాలుంటాయి. దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న“గర్భగృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగా దేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా “గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే “మూలవిగ్రహం” లేదా “మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు.

      గర్భగృహం పైభాగంలో “గోపురం” ఉంటుంది. దీన్నే విమానం అంటారు. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. విమానం మీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహం చుట్టూ భక్తులు తిరగడానికి “ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు.

      గర్భగృహం ముందు భాగంలో “ముఖమంటపం” వుంటుంది. దీన్నే “అర్ధమంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంటుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.

      ధ్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్న బలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది. సాధారణంగా దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలమీద ఆకాశానినంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3 ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామి పుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.

      సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట. సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది. వైష్ణవాలయల్లో గర్భగుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. మిగిలిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు.

    దేవాలయ నియమావళి...    

      హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ప్రక్క చిత్రంలో గమనించవచ్చును.

* ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

* ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.

* ఆలయ ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.

* ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.

* ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.

* ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.

* ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.

* ఆలయములో ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు.

* ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.

* ఆలయములో దేవుని ఎదుట పరస్తుతిని, పరనిందను కూడా చేయరాదు.

* ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.

* ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.

* అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.

* ఒక చేతితో ప్రణామము చేయరాదు.

* ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

    హుండి...    

      దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ. ఈ హుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని "కొప్పెరలు" అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈ హండీ ద్వారా ఆలయంలో కొలువైన భగవంతునికి సమర్పణగా భావించి భక్తులు సమర్పిస్తారు.

    చివరిగా...    

      భగవంతుడు దేవతామూర్తుల రూపములలోను, మనుష్యుల రూపములలోను, తదితర విధములుగా అవతరించి, తను తలపెట్టిన లీలా కార్యక్రమాన్ని నడిపించుచున్నాడని ప్రతీతి. భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. కొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. నేడున్న దేవాలయాలను దర్శంచి మనంతా గర్వపడాలి. ఎందుకంటే, దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దాని మీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది. నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్ళో నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం “తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం. తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాల, అయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగు తుంది.

      దేవాలయాలు శాంతికి నిలయాలు కావాలి. అక్కడి ప్రశాంత వాతావరణం, ధర్మబోధ, మానవ మహోన్నతికి బీజం వేయాలి. వ్యక్తుల దురాలోచనలు వారి నుండి దూరం కావాలి. అవగుణాలను గురించి ఆలోచింపజేసి వాటి నిర్మూలనకు కృషి చేయాలి. దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకు కలుగుతుంది. సాటివారితో మీలాగే తీరు చాల సవ్యంగా ఉంటుంది. తన కష్టాలను భగవంతునికి విన్నవించుకొని భక్తిభావమును పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కారణాల వలన ఉదాత్తమైన వ్యక్తిత్వము ప్రతి ఒక్కరికి పెంపొందుతుంది. ఇదే ఆలయాల అర్ధం పరమార్థం.