ఆధ్యాత్మిక సమాచారం

      భారతీయ హైందవ సంప్రదాయం, అందులోని సంస్కారాల వెనుక మనిషి మానసిక, శారీరక ఔన్నత్యానికి దోహదపడే విశేష క్రియలున్నాయి. దీపారాధన మొదలు హారతిదాకా... గంట కొట్టడం మొదలు మంత్రపుష్పందాకా ప్రతి క్రతువులోనూ మంత్రాలకు మించిన మహిమేదో ఉందంటే, మన ధర్మానికి ఎంత పవిత్రత ఉందో అర్థమవుతుంది. ఆ ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నారిలా...

      “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. అంటే నిండైన జీవితంతో పాటు నిండైన ఆరోగ్యం, నిండైన ఐశ్వర్యం కూడా ఉండాలని భావం. మన జీవన విధానం అంత బాగుండాలని ఆశీర్వదించే ఆ మహాగ్రంథాలు ఏ మార్గంలో ప్రయాణిస్తే, ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనం నిండునూరేళ్లూ వర్థిల్లుతామన్న సంగతిని చెప్పకుండా ఉంటాయా..! ఆ దిశలో మనిషికి దిశానిర్దేశం చేయకుండా ఉంటాయా..! వెలుగునిచ్చే జ్యోతిని నిత్యం పూజించమనే ఆ జ్ఞానదీపికలు మన బతుక్కి వెలుగుబాటలు పరవకుండా ఉంటాయా..!

      మనిషి జననం మొదలు నిండు నూరేళ్ల పాటూ జరగాల్సిన క్రతువులూ మరణానంతరం నిర్వహించే సంస్కారాల వరకూ అన్ని విషయాలనూ వేదాలు పూసగుచ్చినట్టు చెప్పాయి. నల్లేరుమీద నడకలా జీవితాన్ని నడుపుకోవడమే కాదు అప్పుడప్పుడూ వచ్చే పెనుతుపానులను సమర్థంగా ఎదుర్కొనేందుకూ స్థైర్యాన్ని ఇచ్చేలా, ప్రతిదశలోనూ పాటించాల్సిన పూజా విధానాల్ని పొందికగా మలిచి మనకందించాయి. పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కొన్నీ, మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి కొన్నీ, ఆరోగ్యాన్ని అమర్చిపెట్టేవి కొన్నీ... అన్నీ మనకోసమే, మన బాగుకోసమే. తెలిసో తెలీకో భక్తితోనో భయంతోనో మనం యాంత్రికంగా చేసే వివిధ క్రియల వెనుక పరమార్థాన్ని తెలుసుకుంటే మన పూజకూ ఓ నిండుదనం వస్తుంది.

    ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం!    

      తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు.

      ఆధ్యాత్మికత అనగానే దేవుడిని నమ్మటం అనుకుంటారు. నాస్తికులమని అనేవారు దేవుడు లేడని వాదిస్తూ ఆధ్యాత్మికత వ్యర్థం అంటుంటారు. అసలు ఆధ్యాత్మికతకి దేవుడున్నాడా లేడా అనే వాదానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికత అనేది ఈ విషయాలకు చాలా అతీతమైంది. ఆధ్యాత్మికత ఒక కళ వంటిది. కళ ఒక శారీరక మానసిక కౌశలం. కళ మనలోపలి అంశం. సాధన ద్వారా కళ మెరుగుపడి ఔన్నత్యాన్ని పొందుతుంది. కళ ద్వారా భావనాత్మక ఆనందం పుడుతుంది. కళ ఒక ఆనందపు గని. ఆనందించడానికి ఉపయోగపడే పరికరం లాంటిది. కళ పరమావధి ఆనందం. తనలోపల ఉన్న ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని శాస్త్రబద్ధంగా అభ్యసించి, నిరంతరం సాధన చేసి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఔన్నత్యాన్ని అందుకొని మనిషి కళాకారుడుగా పరిణతి చెందుతాడు. కళాకారుడు గొప్ప వాడు కావలంటే తాను సాధన చేస్తున్న కళను లోతుగా తాను ఆనందిస్తూ, అదే కళ ద్వారా ఇతరులకు ఆనందాన్ని పంచాలి. ఒక సంగీతకారుడు తాను పాడుతూ ఏవో దివ్యలోకాల్లో విహరిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఆ పాట వినేవాళ్లు కూడా తప్పకుండా ఆనందిస్తారు. కాస్తోకూస్తో ప్రవేశం ఉన్నవారైతే అతని తాదాత్మ్యతలోని గాఢతను కూడా అర్థం చేసుకోగలుగుతారు కూడా. ఆధ్యాత్మికత కూడా అలాంటిదే. కళను సాధన చేసినట్టుగానే ఆధ్యాత్మికతను కూడా సాధన చెయ్యాలి. మన అందరిలోనూ ఆధ్యాత్మికత ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. అది పూర్తిస్థాయిలో వికసించి మన ఆనందానికి కారణం కావాలంటే నిరంతర సాధన చెయ్యడం అవసరం. ఆప్పుడే అందులోని పూర్తి ఆనందాన్ని మనం ఆస్వాదించగలం.

భక్తి ఆధ్యాత్మికత ...

      భక్తి అనేది ఒక భావోద్వేగం. అపారమైన గౌరవం. అనిర్వచనీయమైన ప్రేమ, త్యాగ శీలతవంటి రకరకాల భావోద్వేగాల మేళవింపును భక్తిగా చెప్పుకోవచ్చు. డబ్బు, సమయం లెక్కచేయని ఒక సమ్మోహన స్థితి. ఇలాంటి భావోద్వేగాన్ని ఎవరి మీద చూపగలం?! అలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మనకు ఏదో ఒక సాధనం కావాలి. ఎవరినైనా పూజించాలి. సేవించాలి. తరించాలి. మన చుట్టూ ఉన్న మనుషుల పైన అలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలను చూపలేం. ఎందుకంటే వారిలో లోపాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే పురాణ పురుషులను, అరూప్య భావనలను ఆదర్శ మూర్తులుగా చిత్రీకరించుకొని, భావించుకొని వాళ్ల విగ్రహాలు, పటాలను పూజిస్తూ భక్తిని ప్రదర్శిస్తాము. భక్తిలో సంతోషం ఉంది. భక్తి అనే భావోద్వేగం కలిగినపుడు దాన్ని బయటకు ప్రదర్శించినప్పుడు మాత్రమే దానివల్ల సంతోషం కలుగుతుంది. అయితే నిరంతరం భక్తిలో ఉండడం సాధ్యమైతే సంతోషం బానే ఉంటుంది. కానీ అది సాధ్యపడదు. దైనందిన జీవితాన్ని గడపడంలో మనం మరో భావోద్వేగంలోకి వెళ్లిపోతాం, అందువల్ల ఇక ఆ అనుభూతి దూరమై మరో రకమైన భావనలో పడిపోతాం.

      ఆధ్యాత్మికతకి సింహద్వారమే భక్తి. ఇది ఆధ్యాత్మికతలోకి మనతో ప్రయాణం చేయిస్తుంది. చాలా మంది భక్తిలో ఉంటుంటారు. కానీ తర్వాత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించరు. అసలు తర్వాత స్థాయి ఉందన్న అవగాహన కూడా ఉండదు. భక్తి ద్వారా దొరుకుతున్న సంతోషమే చివరిదని భావిస్తారు. కొంత మందికి తర్వాత స్థాయి గురించి ఎరుక ఉన్నప్పటికీ ఇంతకంటే ముందుకు వెళ్తే ఏమౌతుందో, భార్యాపిల్లలకు దూరమైపోతామేమో అనే భయం ఒక మూలన ఉంటూ ఉంటుంది. తమ భక్తి ద్వారా చేసే పూజలు, వ్రతాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నామని చెప్తుంటారు చాలామంది. కాని ఈ పయనం ఇక్కడితోనే ఆగకూడదు. తర్వాత స్థాయి ఏమిటి అనేది తెలుసుకోగలగాలి. ఆ స్థాయికి చేరగలగాలి. ఇంకొందరు ఆచారాన్నే భక్తిగా భావిస్తుంటారు. మడి, తడి, అంటూ పాటించడమే భక్తి అనే భ్రమలో ఉంటారు. కానీ అవి కేవలం బాహ్యపరమైన విషయాలే. ఒక నాట్యకళారూప ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆహార్యం, అలంకరణల వంటివి ఈ అంశాలు. కాగా నాట్యం భక్తి. అలంకరణలు గొప్పగా ఉండి, నాట్యం పేలవంగా ఉంటే ఉపయోగం ఉండదు. ఆచార సంప్రదాయలు కూడా అలాంటివే. ఆచార సంప్రదాయాలకంటే కూడా మనసులో ఉండే భక్తి భావన ముఖ్యం. దీనికి పనికి చవ్చే సాధానాల వంటివి మాత్రమే ఆచారసంప్రదాయాలు.

బ్రహ్మానందానికి మార్గం ...

      ఇక ఆధ్యాత్మిక కళా సాధనకు వస్తే ప్రాణాయామం, ధ్యానం వంటి అనేక రకాల సాధానాలను ఉపయోగించి వ్యక్తి తనలోకి తాను చూసుకునే ప్రయత్నం చేస్తాడు. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటాడు. తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు. సృష్టిలోని రహస్యాలను ఎరుకలోకి తెచ్చుకుంటాడు. చివరికి తనే సృష్టిగా.... సృష్టికర్తననే భావనని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. మనసులో ఉత్పన్నమైన అనుమానాలకు సమాధానం వెతుక్కుని తృప్తి చెందే స్థితి... ఆ తర్వాత ఆలోచనలే రాని స్థితికి వెళతాడు. అంతా అర్థమైతే ఇక మిగిలేది ఆనందమే.

      ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే లేదా మనసు సమాధాన పడితే తృప్తి కలుగుతుంది. అలా మన ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికాక ప్రశ్నలే లేని స్థితిలో మిగిలేది తృప్తి మాత్రమే. ఆ తృప్తే బ్రహ్మానందం. తియ్యగా ఉంటుంది అన్నంత మాత్రాన తీపి రుచి అర్థం కాదు. తీపి తిని చూడాలి. అలాగే సాధన చేసి బ్రహ్మానందాన్ని అనుభవించాలి. సాధన చేసి అటువంటి అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఉంటున్నప్పటికీ వాటికి అతీతంగా నిరంతరం ఆనందంలో ఉండడం సాధ్యపడుతుంది. ప్రపంచానికి సంబంధించిన దిగులు పెద్దగా బాధించదు. ప్రశాంత వదనుడై సృష్టి ఆటని గమనిస్తుంటాడు తరగని చిరునవ్వుతో!

    ఎవరు దేవుడు...    

      మనం దేవుడంటే నమ్మకం ఉన్నవాళ్లం. దేవుణ్ణి పూజించడమన్నా, ఉపాసించడమన్నా మనకు చాలా ఇష్టం. దేవుని గురించి తలచుకునేవాళ్లు చాలామంది ఉన్నా దేవుని స్వరూపం తెలిసిన వారు చాలా తక్కువ. దేవుని స్వరూపం అనగానే దేవునికి ఆకారం ఉందనుకుంటాం. కాని స్వరూపం అంటే స్వభావం. అంటే లక్షణం అని అర్థం. దేవుడంటే ఎవరో, ఆయన లక్షణం ఏంటో తెలిస్తే మనకు దేవుణ్ణి ఆరాధించిన ఫలం సంపూర్ణంగా లభిస్తుంది. మోక్షానికి మార్గం ఏర్పడుతుంది.

      దేవుణ్ణి దేవత అనవచ్చు. కాని ప్రతి దేవత దేవుడు కాదు. దేవతా శబ్దానికి నిర్వచనం మొదట తెలుసుకుందాం.

"దేవో దానాద్ వా దీపనాద్ వా ద్యోతనాద్ వా" (నిరుక్తమ్ 7-15-1)

      దానం చేయడం, ప్రకాశింపజేయడం, స్వయంగా ప్రకాశించడం మొదలైన సద్గుణాలను కలిగినట్టిది దేవత అని యాస్కుడు నిర్వచించాడు. ఉదాహరణకు సూర్యుణ్ణి దేవతగా చెప్పవచ్చు. ధరిత్రికి వెలుగులు ప్రసాదించేవాడు అతడే. అంతేకాదు, సమస్త వస్తు ప్రపంచాన్ని ప్రకాశింపజేసేవాడతడే. ఇంకా చెప్పాలంటే స్వయంగా ప్రకాశించేవాడు కూడా అతడే. ఇన్ని సుద్గుణాలు కలిగిన సూర్యుడు జడ దేవత అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జడ దేవత అంటే జ్ఞానం లేని దేవత అని అర్థం. సూర్యుణ్ణి సృష్టించినది దేవుడే.

33 దేవతలు...

      మనకు సూర్యునితో కలిపి 33 దేవతలున్నారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం (ఇవి అష్ట వసువులు), ద్వాదశాదిత్యులు (పన్నెండుమంది సూర్యులు), దశ ప్రాణాలు, యజ్ఞము, విద్యుత్తు, జీవుడు. ఈ 33 దేవతలలో ఒక్క జీవుడు తప్ప మిగిలినవన్నీ జడ దేవతలే. ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, సుఖం, దుఃఖం, జ్ఞానం ఈ ఆరు గుణాలు కలిగినవాడు జీవుడు. ఈ గుణాలు లేనివి జడాలు. జడ దేవతల కంటే, జీవుల కంటే భిన్నమైనవాడు దేవుడు. పతంజలి యోగదర్శనంలో దేవునికిచ్చిన నిర్వచనం ఏంటంటే--

"క్లేశకర్మ విపాకాశయైర పరామృష్టః పురుష విశేష ఈశ్వరః" (యోగ.ద. 1-24)

      అవిద్య,అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అనే క్లేశాలు లేనివాడు, మనవలె కర్మలు చేయనివాడు, కర్మ వాసనలు అంటనివాడు, కర్మ ఫలాలు అనుభవించనివాడు, విశేష పురుషుడు (బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నవాడు) దేవుడు. దైవమన్నా, దేవుడన్నా ఒకే అర్థం. కాని దేవతకు, దేవునికి గల భేదం తెలుసుకోదగింది. ప్రకృతిని దేవతగా ఆరాధిస్తాం. కాని అది జడం. దేవునికి వశమై ఉంటుంది.

“సత్తరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతిః”

      సత్తం, రజస్సు, తమస్సు అనే ఈ మూడు గుణాలతో సమానమైన అవస్థకే ప్రకృతి అని పేరు. ప్రకృతి అనే ద్రవ్యంతో పాంచభౌతికమైన విశ్వాన్ని సృష్టించేవాడు దేవుడు. ప్రకృతి పరిణామశీలం కలిగింది. కాని అది పరిణామం చెందడానికి గల చైతన్య కారణం దేవుడే. ప్రకృతి శక్తులన్నీ దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేస్తాయి.

ఎలాంటివాడు దేవుడు...

      యస్యవిశ్వ ఉపాసతే ఎవనిని ఈ విశ్వమంతా ఉపాసిస్తుందో అనగా ఎవనికి సమీపంలో ఉందో అతడే దేవుడు.

“య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః
యస్యచ్ఛాయామృతం యస్యమృత్యుః
కస్మై దేవాయ హవిషా విధేమ” (యజు. 25-13)

      ఎవడు మానవ జన్మతో పాటు కావలసిన సమస్త శక్తుల్ని ప్రసాదిస్తాడో, ఎవడిని ఈ విశ్వమంతా అన్ని వేళలా ఉపాసిస్తుందో, ఎవని ఆజ్ఞను ముప్పది మూడు దేవతలు శిరసావహిస్తాయో, ఎవనిని ఆశ్రయిస్తే మోక్షం (దుఃఖం విముక్తి) లభిస్తుందో, ఎవనిని ఆశ్రయించకపోతే మళ్లీ మళ్లీ జన్మలెత్తుతూ మృత్యుముఖంలో ఉండిపోవలసి వస్తుందో అతడే దేవుడు. అతడినే మ్రొక్కాలని వేదోపదేశం. ఇదే యజుర్వేదంలోని 40వ అధ్యాయంలో దేవుడు ఎట్టివాడో వివరింపబడింది.

“సపర్యగాచ్ఛుక్రమ కాయమవ్రణ మస్నావిరం శుద్ధమపాపవిద్ధం, కవిర్మనీషీ పరిభూః
స్వయంభూః యాథాతథ్యతో ర్థాన్
వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః” (యజు. 40-8)

      అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వ శక్తిమంతుడు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు లేనివాడు, వ్రణాలు లేనివాడు, నాడులు లేనివాడు, అవిద్య మొదలైన దోషాలు అంటనివాడు, పాపాలు చేయనివాడు, పాప సంయుక్తుడు కానివాడు, సర్వజ్ఞుడు, జీవకోటి మనోవృత్తులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు, దుష్టులను శిక్షించేవాడు, స్వయంగా ఉన్నవాడు, ఎన్నటికీ నశించనివాడు, జన్మవృద్ధిక్షయాలు లేనివాడు, జీవుల సౌఖ్యార్థమై యదార్థ భావంతో, వేదం ఆధారంగా ఆయా పదార్థాలను సృష్టించేవాడు దేవుడు. దేవుడు కదులుతున్నట్లు అనిపిస్తాడు. కాని కదలడు. కారణమేమంటే అతడు అంతటా నిండి ఉండడమే. దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు. కాని అతడు మనకు సన్నిహితుడు. కారణమేమంటే అతడు లేనిచోటు లేదు కదా!

ఇతడే దేవుడు!...

      కఠోపనిషత్తు దేవుణ్ణి గురించి ఈ విధంగా తెలియజేస్తుంది.

“సర్వే వేదా యత్ పద మానన్తి,
తపాంసి సర్వాణి చయద్ వదన్తి!
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తేపదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్” (2-15)

      ఎవరిని గురించి నాలుగు వేదాలు, సర్వ శాస్ర్తాలు, తపశ్చర్యలు చెప్పుచున్నాయో, ఎవరిని గౌరవించుచున్నాయో, ఎవరిని ప్రసన్నంచేసుకోవడానికి బ్రహ్మచర్యాశ్రమం పాటింపబడుతున్నదో అతడే దేవుడని, అతని పేరు ఓమ్ అని తాత్పర్యం. ఎవరు అందరికి శిక్షకుడో, సూక్ష్మముల కెల్ల సూక్ష్మమైనవాడో, స్వయంగా ప్రకాశించేవాడో, యోగులకు సమాధి స్థితిలో ఎరుగదగినవాడో అతడే దేవుడని మనుస్మృతి నొక్కి వక్కాణిస్తుంది. చివరికి భగవద్గీత కూడా

“ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ" (8-13)

అని ఓమ్ అనబడే అక్షరమే దేవుడని తెలియజేస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన మాటలను గమనిస్తే దేవుని స్వరూపం తేటతెల్లమవుతుంది.

“అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయేతి” (91-3-28)

      ఇందుమూలంగా మృత్యువు నుండి అమతత్తాన్ని పొందవలెననే సందేశం అందుతుంది. ఇందలి అసత్తు, తమస్సు అనే మాటలకు మృత్యువనే అర్థం. సత్తు, జ్యోతి, అమృతం దేవునికి పర్యాయ పదాలు. సచ్చిదాంద స్వరూపుడైనవాడే దేవుడని తెలుసుకుంటే మోక్ష సిద్ధి తప్పక కలుగుతుంది.

మూడు తత్తాల సమాహారం...

      ప్రకృతి, జీవులు, దేవుడు అని వేదం మూడు తత్తాలను ప్రతిపాదిస్తున్నది. ప్రకృతి కారణం, ప్రపంచం కార్యం. ఋగ్వేదంలో ఈ మూడు తత్తాలను గూర్చి ఆలంకారికంగా చెప్పబడింది.

“ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్నన్యో భిచాక శీతి” (ఋగ్వేదం. 11-6-420)

      జీవుడు, దేవుడు అనే పక్షులెప్పుడూ కలిసే ఉంటాయి. అంతకుమించి స్నేహంగా ఉంటాయి. ప్రపంచం అనే వృక్షాన్ని సమానంగా ఆశ్రయిస్తాయి. వాటిలో జీవాత్మ అనే పక్షి వృక్ష ఫలాన్ని ఆరగిస్తూ ఉంటే పరమాత్మ (దేవుడు) అనే పక్షి తానేమీ ఆశించకుండా వీక్షిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది.

దుఃఖాలను తొలగించేవాడు...

      దేవుడు సనాతనుడు. అనగా ఎల్లప్పుడు ఉండువాడు. సృష్టికర్త కనుక సృష్టికి ముందే ఉన్నవాడు. సృష్టిని నడపాలి కనుక వర్తమానంలో ఉన్నవాడు. జీవకోటికి కర్మానుసారం సుఖ దుఃఖాలు కలిగించాలి కనుక భవిష్యత్తులోనూ ఉంటాడు. 33 దేవతల విస్తృతిని బట్టి మనవాళ్లు 33 కోట్ల దేవతలన్నారు. దేవతలకు దేవత దేవుడే. అతణ్ణే దైవం అని పిలుస్తాం. దేవుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఎల్లప్పుడు ఉండడం. దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. చిత్ అంటే జ్ఞానం. దేవుని జ్ఞానం ఎక్కువ తక్కువలు లేనిది. ఆనందం అనే మాటకు శాశ్వత సుఖమని అర్థం. దుఃఖం ఏమాత్రం లేనివాడు దేవుడు.
      ఈ ప్రపంచానికి అసత్తు అని పేరు. అందుకే విద్వాంసులు అసత్తు నుండి సత్తులోనికి వెళ్లమని తమస్సు నుండి జ్యోతి (అనగా జ్ఞానం)లోనికి వెళ్లమని, మృత్యువు నుండి అమృతత్త్వాన్ని పొందమని చెప్తారు. మూడు రకాల (త్రివిధ) దుఃఖాలను తొలగించేవాడు, ముక్తిని ప్రసాదించేవాడు దేవుడు. త్రివిధ దుఃఖాలు అంటే ఆధ్యాత్మికం (శరీరం వల్ల కలిగే దుఃఖం), ఆధి భౌతికం (తోటి ప్రాణుల వల్ల కలిగే దుఃఖం), ఆధి దైవికం (ప్రకృతి వల్ల కలిగే దుఃఖం), త్రివిధ దుఃఖాత్యంత నివృత్తిః అత్యంత పురుషార్థః మూడు దుఃఖాలు పూర్తిగా తొలగిపోవడమే మోక్ష పురుషార్థం. దేవుడు మోక్ష ప్రదాత. అంతేకాదు, కర్మ ఫల ప్రదాత. సాంఖ్య దర్శనంలో మొదటి సూత్రంలోనే మోక్షం ప్రస్తావింపబడింది.
      నాలుగు వేదాలలో దేవుని పేరు ఓమ్. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో మొదలవుతుంది. పతంజలి యోగ దర్శనంలో వేదాన్ని అనుసరించి తస్యవాచకః ప్రణవః అని తెలియజేశాడు. దేవుని పేరు ఓమ్ అని సూత్రార్థం. ఓం అనే పేరు సృష్టి స్థితి లయకారుడు దేవుడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఋగ్వేదం దేవుడొక్కడేనని, విద్వాంసులు ఎన్నో పేర్లతో పిలుస్తారని తెలియజేస్తుంది.

"ఏకం సద్ విప్రా బహుధా వదంతి" (10-164-46)
"యజుర్వేదం ఓం ఖం బ్రహ్మ" (40-17)

      అంటుంది. దేవుడు ఓంకారవాచ్యుడు. అతడు ఆకాశం వలె గొప్పవాడని దాని అర్థం. ఆకాశం వ్యాపక తత్త్వం కలిగింది. అది పంచ భూతాల్లో ఒకటి. దేవుడు పాంచభౌతికమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కనుక ఆకాశం వలె అన్నప్పటికీ ఆకాశం కంటే గొప్పవాడని అర్థం చేసుకోవాలి.

      ఋగ్వేదీయులు ఓంకారోపాసకులు. కాగా సామవేదీయులు ఉద్గీథోపాసకులు. ఉచ్ఛైస్వరంతో దేవుణ్ణి కీర్తిస్తారు. ఉద్గీథం లోని ఉత్=ప్రాణం, గీః=వాక్కు, థం=అన్నం ఈ మూడూ దేవుని అధీనంలోనే ఉంటాయి కనుక ఆయన ఉద్గీథం అనబడుతాడు. ఈ విషయాన్ని సామవేదానికి సంబంధించిన ఛాందోగ్యోపనిషత్తు తెలియజేస్తుంది.

"ఓ మిత్యే త దక్షర ముద్గీథముపాసీత" (1-1)
"అథర్వ వేదం దేవునికిచ్చిన పేరు ప్రాణం.
ప్రాణాయ నమో యస్య సర్వమిదం వశే!
యోభూతః సర్వస్యేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్" (11-24-2)

ప్రాణవశంలో శరీరం ఉన్నట్లు, పరమేశ్వరుని వశంలో సర్వ జగత్తు ఉంది. కనుక దేవుని నామం ప్రాణం అయింది.

దేవుడొక్కడే.. నామాలెన్నో!...

      దేవుని ముఖ్య నామం ఓంకారమే అయినప్పటికీ ఎన్నో పేర్లతో వేదాది శాస్త్ర గ్రంథాలలో పిలువబడుతున్నాడు. ఐతే ఆ పేర్లు కొన్ని గుణాలను తెలుపుతాయి. మరికొన్ని కర్మలను తెలుపుతాయి. ఇంకా కొన్ని స్వభావాన్ని తెలుపుతాయి. దేవుడు అఖండ మండలాకారుడు. అతనిలో విభాగాలు లేవు. అతడు సృష్టికర్త కనుక బ్రహ్మ అని, జగద్రక్షకుడు కనుక విష్ణువు అని, లయకారుడు కనుక శివుడు అని పిలువబడుతాడు. అతడు జగత్తును ఉత్పన్నం చేస్తాడు కనుక సవితా అనే పేరుతోను, ప్రకృతి మొదలైన పదార్థాలకు, జీవులకు స్వామి కనుక గణపతి అనే పేరుతోను, దివ్యగుణాలు కలిగిన వాడు కనుక దేవుడు అనే పేరుతోను, ఏడ్పించేవాడు కనుక రుద్రుడు అనే పేరుతోను, కర్మలకు తగిన ఫలాలిచ్చే వ్యవస్థ చేస్తాడు కనుక యముడు అనే పేరుతోను, బ్రహ్మాండమనే పురంలో ఉంటాడు కనుక పరమ పురుషుడు అనే పేరుతోను, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక పరమాత్మ అనే పేరుతోను, జన్మలిచ్చేవాడేగాని జన్మలెత్తనివాడు కనుక అజుడు అనే పేరుతోను, ఆది లేని వాడు కనుక అనాదిగా, అంతం లేనివాడు కనుక అనంతుడుగా, భూత భవిష్యద్వర్తమానాల్లో ఉండేవాడని నిత్యుడుగా, జడచేతన జగత్తులో నిండినవాడు కనుక అంతర్యామి, ఉత్పత్తి ప్రళయాల నుండి మిగిలివుంటాడు కనుక శేషుడుగా, వేదం ఆధారంగా అన్ని విద్యలను ఉపదేశిస్తాడు కనుక కవి అనే పేరుతోను, స్వయంగా ప్రకాశించువాడు కనుక స్వయంభువుగా, ఐశ్వర్యశాలి కనుక భగవంతుడనీ, జగత్తును ధరించి, పోషిస్తాడు కనుక విశ్వంభరుడుగా పిలువబడుతాడు. దేవుడు పురుష సూక్తంలో సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడుగా, భూమిని అన్ని దిక్కుల నుండి ఆవరించినవాడుగా, అంగుష్ఠ ప్రమాణంలో ఉన్న జగత్తుకు అధినాయకుడిగా చెప్పబడినాడు. ఈ సందర్భాన్ని బట్టి సహస్ర శీర్షుడంటే వెయ్యి తలలు కలిగినవాడని కాదు. తనలో కోట్లాది ప్రాణుల శిరస్సులు కలిగినవాడని అర్థం. అట్లే వెయ్యి నేత్రాలు. ఇక్కడ కూడా సహస్ర శబ్దానికి అనేకం అని అర్థం. మొత్తం మీద ప్రాణికోటికి, విశ్వాసానికి అధిపతి దేవుడని అర్థమవుతుంది.
      దేవుడు అంతరాత్మ రూపంలో అన్ని ప్రాణుల యందు ప్రకాశిస్తుంటాడని ముండకోపనిషత్తు తెలుపుతున్నది.

“అగ్నిర్మూర్థా చక్షుషీ చంద్రసైర్యౌ
దిశః శ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః!
వాయుప్రాణక్ష విశ్వం హృదయమస్య
పధ్భ్యాం పృథివీహ్యేష స్సర్వభూతాంతరాత్మా” (2-1-4)

      దేవుడు విశ్వమంతటా నిండి ఉన్నాడు. కనుక విశ్వమే అతడనుకొని చేసిన వర్ణన ఇది. విరాట్ పురుషునికి దివ్య ప్రకాశమే శిరస్సు. సూర్యచంద్రులు కన్నులు, దిక్కులు చెవులు. వాక్కులు వేదాలు. గాలి ప్రాణం. విశ్వం గుండె, భూమి పాద స్థానంగా కలిగిన దేవుడు సర్వ ప్రాణికోటికి అంతరాత్మగా వెలుగొందుచున్నవాడని చెప్పిన ఉపనిషత్కారుడు ధన్యుడు.

    ‘ఓం’ కారం    

      ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం:'. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకారరూపం(నామ) నాదరూపం ‘ఓం’కారము. ప్రణవ నాదము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ‘ఓం’కారము. ‘ఓం’కారం పరబ్రహ్మ స్వరూపము. ఆ ‘ఓం’కారం నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ‘ఓం’కారం. బ్రహ్మనాదము ‘ఓం’ కారం. అకార, ఉకార, మకారములను మూడు అక్షరంల కలయిక వలన ‘ఓం’కారం ఉద్భవించినది. ఓం, ఓమ్, లేదా ‘ఓం’కారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. ‘ఓం’ కారం శభ్ధాలలో మొదటిది. భగవంతుని ముఖ్యనామమైన ‘ఓం'కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు.

      హిందూమతానికి కేంద్ర బిందువు, పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అందులో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ‘ఓం’కారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతి పదమునకు మూలాధారముగా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణలో మనం కంఠంలోని స్వరపేటికను, అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా అంటే? ఆ శబ్దమే ప్రణవము లేక ‘ఓం’కారం. ఆ, ఊ, మ్‌ కలసి ఓంకారం అయింది. నీవు ‘ఆ’ అన్నప్పుడు ప్రాణశక్తి శరీరపు కింది భాగంలో ఉన్నది. ‘ఊ’ అన్నప్పుడు శరీరపు మధ్యభాగంలో ఉన్నది. ‘మ్‌’ అన్నప్పుడు పైభాగంలో ఉంటుంది. ‘ఓం’ అన్నప్పుడు ప్రాణశక్తి శరీరమంతటా విస్తరించి, సంపూర్ణం అవుతుంది. నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది. ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా "ఓం" కారం తెలియజేస్తూంది. ఓం శబ్దమే రూపాంతరం చెంది క్రైస్తవంలో ఆమెన్‌గా, ఇస్లాంలో అమీన్‌గా ఏర్పడ్డాయి. అందువలనే ఓంకారం అన్ని మతాలలోనూ అంగీకరింపబడింది. అన్ని మతాల ప్రార్థనల్లోనూ ఓంకారం గాని, దానికి దగ్గరగా ఉండే శబ్దం కానీ వినిపిస్తోంది. ఓం అనేది చైతన్యపు పూర్ణత్వానికి సమీపంగా వచ్చే శబ్దం. మిగిలిన అన్ని పేర్లూ పైపైన ఉండేవే.

      ‘ఓం’ హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న శబ్దం. హిందూ మతానికి సంబంధించిన ఏ పుస్తకమైనా, ఏ మంత్రమైనా ఈ శబ్దంతోనే ప్రారంభమై ముగుస్తుంది.

      ఉదాహరణకు బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికి ఆప్యాయంగా ఆ బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తమూర్తులు, మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.

      ఈ నేపధ్యంలో ‘అసలు మంత్రం అంటే ఏమిటి?’ అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.

      ‘మననాత్ త్రాయతే’ ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.

      ‘ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీం’ అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రం యొక్క లక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి. ‘ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు‘యజస్సులూ.

      ఇక అన్ని మంత్రాలకు ముందు ‘ఓం’ కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ‘ఓం’ కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవ శరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ‘ఓంకారం’. ‘ఓం’ నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి ‘ఆ’కారం, యజుర్వేదం నుండి ‘ఊ’కారం, సామవేదం నుండి ‘మ’కారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు. సకలవేదరూపం "ఓంకారం".

    దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు...    

      ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో..., అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు... అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే... పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.

ఉదాహరణకు...

* మన కాళ్ళు... ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

* మన చేతులు... కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

* మన కళ్ళు... అతి విసృతమైన పదార్ధాన్నిగానీ, అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.

ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే... మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.

మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారు కదా.. అని మీరు అడగవచ్చు...

* కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

* మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.

‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.

మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న...

పంచభూతాల శక్తుల సమ్మిళితమే... భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే... ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ..., వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే... పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు...అంటే....

* ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం... శబ్దం.

* వాయువుకు ఉన్నగుణాలు రెండు... శబ్ద, స్పర్శ.

* అగ్నికి ఉన్న గుణాలు మూడు... శబ్ద, స్పర్శ, రూపములు.

* జలముకు ఉన్న గుణాలు నాలుగు... శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

* భూమికి ఉన్న గుణాలు ఐదు...శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

* జలము.. ‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

* అగ్ని.. ‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

* వాయువు... ‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

* ఆకాశం.. ‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు..., ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే..., పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా... ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.

    భక్తి అంటే ఏమిటి...    

      భగవంతుని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుణ్ని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవడమే అనే ధ్యాసలో భక్తులున్నారు. కోర్కెల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్ధించాలనుకునేవారికి అసలు భక్తి తత్వపు పరమార్ధం బోధపడనట్లే. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోర్కెలు తెలిపి, ఇదీ నా ఫలానా నా అవసరం, దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా. మనతో పాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..? సరిగ్గా ఆలోచిస్తే, భగవంతునితో మనం కోర్కెలు మొర పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదపు పనో అర్ధమవుతుంది. భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకం. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికీ, భక్తుడికీ అక్కడే తేడా ఉంటుంది.

      భక్తికి సరైన ఉదాహరణ, కృష్ణార్జునుల అనుబంధం. కృష్ణుడు అర్జునునికి రథసారథి. ఇది భౌతిక అర్ధం కాదు. జీవితమనే యుద్ధరంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సర్వేశ్వరునికే వదిలేస్తే, విజయగీత వినిపించి కార్యోన్ముఖుణ్ని చేస్తాడు ఆ అంతర్యామి. యుద్ధానికి ముందు ధుర్యోధనుణ్ని నేను కావాలా నా సైన్యం కావాలా అని అడుగుతాడు కృష్ణుడు. ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది అన్న విషయ వాంఛాలోచనలో, సైన్యాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం, నీవే నా రథసారథి పరమాత్మా అని శరణువేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం. ఆ అనంత శక్తిని శరణువేడి నా జీవితమనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రీ అని మనసా వాచా కర్మణా వేడిన నాడు, మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా, మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామరంగా కురుస్తుంది. భగవంతుణ్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే.

    షోడశోపచారాలు ...    

      పూజ చేయడం అంటే భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి సేవించడం. అంటే మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన అతిథి అన్నమాట. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి సత్కారాలు చేస్తామో అదే విధంగా దేవుణ్ణీ సేవించడమే పూజావిధానం. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞొపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం ఈ పదహారూ షోడశోపచారాలు. ఇంట్లోకి అతిథి వస్తున్నప్పుడు ఎదురెళ్లి లోపలికి తీసుకువస్తాం, అది ఆవాహనం. వచ్చాక కుర్చీ వేస్తాం, అది ఆసనం. కాళ్లు కడుక్కునే నీళ్లు ఇవ్వడాన్ని పాద్యం అంటారు. చేతులుకడుక్కునే నీళ్లు అర్ఘ్యం, ఇక దాహానికి ఇచ్చే నీరు ఆచమనీయం. తర్వాత స్నానానికి నీళ్లు పోసి, కట్టుకునేందుకు వస్త్రం ఇస్తాం. ఆ తర్వాత యజ్ఞొపవీతం సమర్పిస్తాం. తర్వాత భగవంతుడికి బొట్టు పెట్టి, చల్లటి గంధాన్ని రాస్తాం. పూలతో అలంకారం చేస్తాం. ఆ తర్వాత వాతావరణాన్ని హాయిగా చేసేలా ధూపం రూపంలో కాస్త పరిమళం వేస్తాం. ఆ చోటంతా కాంతిమంతంగా అనిపించేందుకు దీపాన్ని చూపిస్తాం. తర్వాత పూజను బట్టి, ముందుగా అవసరార్థ నివేదనమని ఏ బెల్లపు ముక్కో, అరటి పండో పెట్టేస్తాం. లేదంటే, మహానైవేద్యం సమర్పిస్తాం. తర్వాత చక్కగా సుగంధ ద్రవ్యాలతో నిండిన తాంబూలాన్ని అందిస్తాం. చివరిగా హారతిచ్చి, మనల్ని మనమే ఆయనకు అర్పించుకునే క్రతువుగా మంత్రపుష్పాన్ని సమర్పించి పూజను ముగిస్తాం. మనింటికి వచ్చిన మహా అతిథిని మనకున్నంతలో గౌరవంగా చూసుకోవడమే ఈ షోడశోపచారాల పరమార్థం.

    దీపారాధన...    

“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”

      దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించటాన్ని దీపారాధనం అంటాం. దేవుడిని ఆరాధించటానికన్న ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్న మాట. ముందు దీపం వెలిగించటమే కాదు షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం దీపం నైవేద్యం అయినా తప్పవు. దీపం దేవతల ముఖమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు.

      దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించట మంటే ప్రాణం పోయటమే. దీపం.. చీకట్లను పారదోలుతుంది. అజ్ఞానాన్ని తరిమివేసి.. జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేస్తుంది. భారతీయ సంప్రదాయంలో దీపానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. అందుకే ప్రతి దేవాలయం, గృహం దీపకాంతులతో వెలిగిపోతుంటాయి. కొన్ని గృహాల్లో ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు. మరికొందరు ఉభయ సంధ్యల్లోనూ దీపాలు వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండ దీపారాధన ఉంటుంది. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ ఉంటుంది. ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం . దీపాలు వెలిగించటం అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. దీపశిఖ స్ఫూర్తిగా మనలోని జ్ఞానం కూడా అదే క్రమంలో పైకి ఎదగాలి. సాధారణంగా దీపారాధన ఆవునెయ్యితో చేయాలి. వీలుకాని పక్షంలో నువ్వుల నూనె వాడటం శ్రేయస్కరం.

మన పెద్దలు దీపారాధనకు సంబంధించి ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు.

“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”

      “మూడు వత్తులు నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాసుడిని రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని, ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టేప్పుడు అనుకుంటాం. ఎంత గొప్ప భావన! ఎంతటి ఉదాత్తమైన ఆలోచన!! పెట్టేది చిన్నదీపం. ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని. అంతే కాదు. నరకం నుండి రక్షింపబడాలట.

      మూడు వత్తులు ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరు అడ్డవత్తులు బొడ్డు వత్తులు అని చేసి, ప్రమిదలో ఒక అడ్డ వత్తి, ఒక బొడ్డు వత్తి వేస్తారు ప్రత్యేకంగా ఐదు పోగులతోనూ, తొమ్మిది పోగులతోనూ, కమల వత్తులని ఎనిమిది పోగులతోనూ, ఇంక అనేక రకాల వత్తులు చేస్తారు. అంతే కాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఆవునెయ్యి [దేశవాళీ] శ్రేష్ఠం. ఆవు నేతిలో పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగిస్తే బంగారురంగు కాంతి వస్తుంది. తెల్లని గోడలు బంగారు మలాము చేసినట్టుంటాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చుని జపమైనా, పూజైనా చేస్తే ఏకాగ్రత కుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. దీపం వెలిగించినప్పుడు ఆ దీప శిఖలు దక్షిణా వర్తంగా, అంటే కుడి వైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభమని నమ్మకం.

      ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేప్పుడు విద్యుద్దీపాలు లేకాపోతే, చేతితో దీపం పట్టుకుని చూపించుతాము కదా! అదే విధంగా దేవుడు ఊరేగించేటప్పుడు కాగడా పట్టుకుంటాము.

      లోకాలకి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సంప్రదాయం.

    దీపంలో ఎన్ని వత్తులు వేయాలి...    

      పూజగదిలో ఇన్ని దీపాలే వెలిగించాలని నియమం ఎక్కడా ఉండదు. ఆచారం ప్రకారం పూజ గది పరిమాణాన్ని బట్టి దీపాలు వెలిగిస్తుంటారు. చిన్న గది అయితే ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుంది. దీపంలో ఎన్ని వత్తులు వెలిగించాలన్న విషయంలో ప్రత్యేక శాస్త్ర నియమాలు ఏమీ లేవు. ఒక్క వత్తి వెలిగించడం ఉండదు. సాధారణంగా రెండు వత్తులతో దీపాలు వెలిగిస్తుంటారు. అంతకు మించి అంటే మూడు, ఐదు, ఏడు వత్తులు వెలిగిస్తూ ఉంటారు.

    ధూపం ఎందుకంత ప్రత్యేకం ...    

      నిప్పుల్లో సాంబ్రాణి, గుగ్గిలం, అగరులాంటివి వేస్తారు. ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేవే. వాసన మనిషిని ఉత్తేజపరుస్తుంది. అరోమాథెరపీ అనే పదం వినే ఉంటాం. మిడతలా ఎగిరే మనసును కట్టడి చేయాలంటే మంచి పరిమళంతోనే సాధ్యం మరి! అంతేకాదు, మన దగ్గర కొంచెమే ఉంది. దాన్ని పదిమందికీ పంచాలి అనే భావనను కూడా ఈ ధూపం చక్కగా ప్రతిబింబిస్తుంది.

    పూజ గదిలో దేవి-దేవతలను ఎలా అమర్చుకోవాలో మీకు తెలుసా...    

      పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికి కారణం తెల్లవారుఝామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. హిందువుల ఎవరి ఇంట్లోనైనా దేవీ-దేవతల ఫోటోలు వుంటాయి. కొందరి ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజాగది ఉంటుంది. మరికొందరి ఇంట్లో గోడలకు మాత్రమే దేవీ-దేవతల ఫోటోలు వ్రేలాడుతూ కనబడతాయి. అసలు ఈ దేవీ-దేవతల విగ్రహాలను కానీ, ఫోటోలు కానీ ఎలా వరుస క్రమంలో పెట్టుకోవాలో చూద్దాం.

      గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతికి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు). స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీ-దేవతల కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు) వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే అతను కేవలం గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.

    ఘంటానాదం ఎందుకు చేస్తారు...    

      దేవునికి హారతినిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ, ఇంట్లో పూజ సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలురకాల దుష్టశక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజాఫలాన్ని పొందే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు ఘంటానాదం చేస్తుంటాం. అయితే గుడిలోనూ, ఇంట్లోనూ పూజలకు వాడే గంటలు వేర్వేరుగా వుంటాయి. దేవాలయంలో పెద్ద గంటలు వుంటాయి. అదే ఇంట్లో పూజా సమయంలో మనం ఒక చేతితో చిన్న గంటను మోగించి మరో చేతితో హారతి ఇస్తాం. గంట శబ్దం మంగళకరం, శుభకరం. అందుకే గంట శబ్దం కర్ణకఠోరంగా కాక, చెవులకు ఇంపుగా ఉండాలి. అందుకే గంటను తయారు చేసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. శైవాగామంలో గంట తయారికి సంబంధించిన కొలతలు కూడా చెప్పబడ్డాయి. ఐదంగుళాలు ఎత్తు ఉండే గంట నాలుగు గోధుమ గింజలంత మందంతో కూడి ఉండాలని పేర్కొనబడింది. ఇక, మహాగంట విషయంలో ఎత్తు సుమారు ఏడు అంగుళాలు వరకు ఉండాలి. క్రింది వైపున చుట్టుకొలత ఎనిమిది అంగుళాలు, పైవైపున రెండు అంగుళాలు ఉండాలి. అయితే ఈ కొలతలను ఎవరూ పట్టించుకోవడం లేదు. గంట మ్రోగుతున్నప్పుడు, శబ్దం శ్రావ్యంగా ఉండాలన్న విషయంపైనే అందరి దృష్టి నిమగ్నమవుతోంది. అందుకనే మన సంప్రదాయంలో గంటకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. తిరుమలలో శాత్తుమొర... తదితర సమయాల్లో గంటలు మోగిస్తారు. ఈ శబ్దాలను బట్టి భక్తులు దర్శనాలకు సిద్ధమవుతుంటారు.

      మన దేవాలయాల నుంచి వచ్చే ఘంటారావాలను వినడం ఓ అద్భుతమైన అనుభవం. అల్లంత ఎత్తున ఉన్న గంటను అందుకోవడం పిల్లలకు సరదా అయితే పెద్దలకు ఓ ఆచారం. ఇంతకీ ఈ ఘంటారావం వెనుక ఏదన్నా శాస్ర్తీయత ఉందా అంటే చాలా జవాబులే లభిస్తాయి. దేవాలయంలోకి అడుగుపెట్టే సమయంలో మన మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. పైగా ఏదన్నా బాధలోనో, తీరని వ్యధతోనో ఆలయంలోకి ప్రవేశించేవారే ఎక్కువమంది. అలాంటి మనసుని ఒక్కసారిగా మేల్కొలిపి ‘వచ్చిన పని చూడు’ అని హెచ్చరిస్తుంది ఘంటానినాదం. అంటే అన్యమనస్కంగా ఉన్న మన దృష్టిని ఒక్కసారిగా దేవుని మీదకి మరలుస్తుందన్నమాట. గంటలో ఉండే కంచు, రాగి వంటి లోహాలు అన్నీ కలిసి ఓ చిత్రమైన శబ్దాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాలలో ఈ శబ్దం ఓంకార నాదాన్ని పోలి ఉంటుంది. ఆ శబ్దాన్ని వినగానే మనసంతా మనసు భక్తి భావనలతో నిండిపోతుంది.

      మనం గంటను మోగించగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోదు. కొన్ని సెకన్ల పాటు దాని శబ్ద తరంగాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ తరంగాలు మన షట్చక్రాల మీదా పనిచేస్తాయని నమ్మకం. శ్రావ్యమైన ఈ ఘంటారావాలు గుడి ఉన్న ప్రతి చోటా ఆధ్మాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. పండుగలు, పర్వదినాలలో దేవాలయాల నుంచి నిరంతరం వినిపించే ఘంటానాదాలు చుట్టుపక్కల ప్రజలలో భక్తిభావాన్ని నింపి ఉంచుతాయి. గంటను మోగించడం అంటే దేవునికి మన రాకను తెలియచేయడమే కాదు… ‘తండ్రీ! నీ శరణు కోరి, నీ ముందు నిల్చొని ఉన్నాను’ అని సవినయంగా వేడుకోవడమే!

ఇళ్లలో పూజని చేసుకునేటప్పుడు కూడా గణపతిని ప్రార్థించిన తరువాత…

“అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్”

      అంటూ గంటని మోగిస్తాము. దైవిక శక్తులను మేల్కొలుపుతూ, చుట్టూ ఉన్న దుష్టశక్తులను పారద్రోలుతూ ఘంటానాదంతో, తాను దేవతలను ఆహ్వానిస్తున్నానని దీని అర్థం. దైవిక శక్తులు అంటే మనలోని ధార్మిక భావనలు అని పెద్దల అంతరార్థం కావచ్చు. పైగా, అలికిడి ఉన్న ప్రదేశాలలో ఎలాంటి పురుగూ పుట్రా తిరగడానికి ఇష్టపడవు. మన దేవాలయాలన్నీ ఒకప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండేవి. ఇప్పటికీ చాలా గుళ్లలోని గర్భాలయాలు చీకటిగా ఉంటాయి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండటం వల్ల, విషకీటకాలు ఆయా ప్రాదేశాలకి దూరంగా ఉంటాయి.

    దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు...    

      ఆ భగవంతునికి మనం ఇచ్చే నివేదన ఎంతో పవిత్రంగా ఉండాలి. నిరంతరం మనల్ని రక్షించే ఆ భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయడమే ఆ స్వామికి మనం చేసే సేవ. ఏ ఆలయానికెళ్లినా మొదటగా ఆభగవంతుడికి సమర్పించేది టెంకాయ.. టెంకాయనే ఎందుకు ఇస్తామో తెలియకపోయినప్పటికి అందరూ ఇస్తున్నారు కదా మేము కూడా ఇస్తున్నామంటుంటారు. ఆ భగవంతునికి టెంకాయే ఎందుకిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. టెంకాయలోని నీరు ఏంతో పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీ వుండదు. టెంకాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి మరియు నీళ్లు వుంటాయి. మనిషిలో ఉన్న అహంకారాన్ని దేవుడి దగ్గర వదిలివేయడానికి ప్రతీకగా చేసే చర్య కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయను కొట్టాలని పెద్దలు చెబుతారు. కొబ్బరికాయను కొడుతున్నామంటే, మన అహంకారాన్ని పూర్తిగా విడనాడి, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును పవిత్రంగా మార్చుకున్నామని, నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలను ఉంచుకుంటామని దేవుడికి విన్నవించుకుంటున్నట్టు అర్థం.

      ఇదే కాకుండా విఘ్ననాధుడైన వినాయకుడికి తొలి వందనం చేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను టెంకాయతోనే తయారుచేస్తారు. అందుకు ఆస్వామికి ఇష్టానుగ్రహం కోసం టెంకాయను సమర్పిస్తాం. టెంకాయకున్న మూడు కళ్లు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటగా దేవుడికి, ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం.

    పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా... కాదా...    

      గుడిలో, ఇంటి పూజా మందిరంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది మురిగి (కుళ్లి) పోయినా, అందులో నీళ్లు లేకపోయినా అదేదో అశుభం అని చాలామంది కంగారు పడుతుంటారు. దైవానుగ్రహం కోరి పూజ చేస్తే ఇలా అయిందేమిటని బాధపడతారు. అపశకునంగా భావిస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదో ఒక కొబ్బరికాయ కుళ్లిపోవడం సహజం. అది అశుభ సూచనగా అనుకోవాల్సిన పనిలేదు. పైగా కుళ్లిపోవడం కాదు ‘కుళ్లు పోవడం’ అని చమత్కరిస్తూ.. మనకు జరగబోయే కీడు తొలగిపోయిందని చెప్పిన పెద్దలూ ఉన్నారు. కొబ్బరికాయ కుళ్లిపోతే కీడు కలుగుతుందనుకోవడం మానసిక బలహీనతే తప్ప.. యథార్థం కాదు. ఇలాంటివి నమ్మి నిష్కారణంగా బాధపడటం సరికాదు. శాస్త్రాలలో, పురాణాలలో ఎక్కడా ఇందుకు ఆధారాలు కనిపించవు. దైవంపై చలించని నమ్మకం ఉంటే.. ఇలాంటి సందేహాలు తొలగిపోతాయి.
      పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కుళ్లిపోయినా, అందులో నీళ్లు లేకపోయినా.. ఏ అశుభమూ జరగదు. నిశ్చింతగా ఉండవచ్చు. కొబ్బరికాయలో పువ్వు వచ్చినంత మాత్రాన కూడా ఏవో అద్భుతాలు జరిగిపోవు.

    తులసి ఎందుకు పూజనీయమైంది...    

      భారతావనిలో ప్రతి ధార్మిక గృహంలోనూ విధిగా తులసి ఆరాధన ఉంటుంది. మన ధార్మిక, పౌరాణికగ్రంథాలలో తులసి వైశిష్ట్యాన్ని వివరించారు. తులసీవనం విరాజిల్లే గృహం తీర్థంతో సమానమని, అక్కడకు యమదూతలు రాలేరని శాస్త్రోక్తి. ఆరోగ్యరీత్యా తులసిలో రోగనిరోధక, రోగనాశక తత్త్వం అధికంగా ఉంటుంది. ఎక్కిళ్లు, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు, విషానికి విరుగుడు వంటి ఔషధ గుణాలు తులసికి ఉన్నట్లు చరకసంహిత చెబుతోంది. ఇన్ని కారణాలుండటం వల్లనే తులసి పూజనీయమైంది.

    గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా...    

      చందన చర్చ భోగప్రదమూ, శుభప్రదమూ, ఆరోగ్యప్రదమూ, ఆహ్లాదకరమూ, అధ్యాత్మికమూ కూడా. ఈ చందన చర్చ భారతీయులకే చెందిన ఒక వైభవం. ఎవరినైనా గౌరవించటానికి చందన చర్చ చేయటం మన సంప్రదాయంలో అంతర్భాగం. పెళ్లిళ్లలో పేరంటాలలో అతిథులను గౌరవించటానికి చందనమలదుతారు వచ్చిన వారందరికి – ఆడ మగ అనే భేదం లేకుండా. స్త్రీలకి మెడ భాగానికి, పురుషులకి అర చేతుల వెనుక భాగానికి మంచి గంధం పూయటం ఈ నాటికీ నిలిచి ఉన్న ఆచారం. అసలు శుభ లేఖ మీద ఉండేదే “మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి” అని. అంటే, నేను చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం. ఎవరినైనా సత్కరించాలన్నా, సన్మానించాలన్నా గంధం పూస్తారు. ఒకప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకు చందనం ఇవ్వకుండ పంపేవారు కాదు.

      షోడశోపచార పూజలో చందనం సమర్పించటం ఒక ఉపచారం. లఘువుగా పంచోపచారాలు చేసినా అందులో గంధం ఉంటుంది. అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించ లేక పోయినా, మంచి గంధం ఒక్కటి సమర్పిస్తే చాలునన్న మాట. శివుడి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారు ఎప్పుడూ చందనపు పూతతో దర్శన మిస్తూ ఉంటారు. అక్షయ తదియ నాడు చందనోత్సవం జరుపుతారు. లలితాదేవి నామాలలో “చందన ద్రవ దిగ్ధాంగీ” అని ఒకటి ఉంది. మొత్తం శరీరమంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి చందనం అంటే అంత ఇష్టం అన్నమాట. అలంకార ప్రియుడైన విష్ణు మూర్తికి చందనం తయారు చేయటానికి పెద్ద వ్యవస్థే ఉంది. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. ఇది మన వంటి కలికాలంలో ఉన్న మనుషులకి మాత్రమే. విష్ణుమూర్తికి చందనం తయారు చేయటానికి ఒక పెద్ద వ్యవస్థే ఉందిట! గంధపు చెక్క అరగదీయగా వచ్చిన గంధం మూలం.

      దానిలో కాలానుగుణంగా మరెన్నో పరిమళ ద్రవ్యాలు చేరుతుంటాయి. అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. అందులో వేసవి కాలం అయితే పచ్చకర్పూరం మొదలైన వాటిని అధికంగా చేర్చుతారు. చలి కాలం అయితే కస్తూరి ఎక్కువగా చేర్చటం ఉంటుంది. పునుగు, జవ్వాది, వట్టి వేళ్ళు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు గంధంలో చేర్చ బడుతూ ఉంటాయి. సందర్భాన్ని పట్టి వీటి పాళ్ళు మారుతూ ఉంటాయి. విష్ణువు ఉపయోగించే చందనం చాలా ప్రత్యేకమైనది, విలక్షణమైనది. తుంబురుని గానాన్ని, వీణా వాదనని మెచ్చిన విష్ణువు అతడిని సత్కరించి ఇచ్చిన హారము, మెరుగు బంగారు వస్త్రము, కన్న నారదునిలో మాత్సర్యాన్ని రగిల్చింది. అతడికి విష్ణుమూర్తి తను ఉపయోగించే చందనం పూయటమే! దానికున్న విశిష్టత మాత్రమే కాదు చందనం పూయటం వెనుక ఉన్న గౌరవం నారదునికీ అసూయ కలగటానికి కారణ మయ్యింది.

      శ్రీ కృష్ణుడు కంసుని ఆహ్వానంపై మథురా నగరంలో ప్రవేశించే సమయంలో అడగగానే లేపనాలిచ్చిన త్రివక్రను వంకర తీర్చి అనుగ్రహించాడు. అప్పుడు కుబ్జ తన గురించి చెప్పుకుంటూ “వినిర్మల లేపన విద్య దాన” అంటుంది. అంటే లేపనాలు తయారు చెయ్యటం ఒక ప్రత్యేకమైన విద్య. ఏదో మొక్కు బడిగా గంధపు చెక్కని అరగదీయటం కాదు.

    హారతి ఎందుకు...    

      ఆలయంలోకి వెళ్లి ఆ దైవాన్ని దర్శించుకున్నా, ఇంట్లోనే ఉండి పూజలు నిర్వహించినా.... హారతి ఇవ్వనిదే మన మనసుకి తృప్తిగా ఉండదు. షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే, పూజ సంపూర్ణం కాదు. మరి ఆ హారతిని ఎందుకు ఇస్తామంటే...

      హారతిని సాధారణంగా కర్పూరంతోనే ఇస్తాము. ఈ కర్పూరం అనేది సంస్కృత పదం. కర్పూరానికి ఉన్న విశిష్ట లక్షణాలే. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. వేదకాలం నుంచీ మన జీవన విధానంలో ఇమిడిపోయిన పదార్థం.

      ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడు ధ్వజస్తంభానికి మొక్కుతూ, ప్రదక్షిణలు చేస్తూ, భగవన్నామస్మరణను సాగిస్తూ... చివరికి గర్భాలయాన్ని చేరుకుంటాడు. ఆ గర్భాలయంలోని దైవం నూనెదీపాల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తే, అతని మనసులో ఏదో ఒక మూల అసంతృప్తి కలగడం సహజం. హారతి ప్రకాశంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దేదీప్యమానంగా చూసే అవకాశం కలుగుతుంది. అప్పటివరకూ భగవద్దర్శనం కోసం తపించిపోయిన మనసు సేద తీరుతుంది. ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కసారి ఆ భగవంతుని చూపించండి అని భక్తులు అడగడం, పూజారిగారు హారతిని వెలిగించి వలయాకారంగా తిప్పుతూ ఆ మూర్తిని దర్శింపచేయడం జరుగుతుంటుంది.

      గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. ఈ తేమతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇక కర్పూరం వెలిగిస్తే... దుర్గంధం అన్న మాట ఎక్కడిది.

      ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతటి సాంకేతికత ఎక్కడిది! దానిని పూర్తిగా కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.

      భగవంతునికి అందించిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.

      హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. అదే సమయంలో మనం కళ్లు మూసుకుని హారతిని అద్దుకుంటూ ఉంటాము. అంటే మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా... ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.

      చివరగా.... కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండు సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది మన పెద్దల అభిలాష కాబోలు. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ... జీవించినంతకాలమూ జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం కావచ్చు. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

    ఇష్టదైవానికి ఏ పండు నైవేద్యంగా పెడితే ఏ ఫలితం వస్తుంది...    

* ఆపిల్ నైవేధ్యమా పెడితే.... తొందరగా మనం శ్రీమంతులం అవుతాము. అదే కాకుండా మనం డబ్బు సంపాదించాలి అని చేసే పనులు సంకల్పం విజయవంతం అయి, ధనవంతులు అవుతారు. అలాగే వారికి దారిద్ర్యం తోలిగిపోతుంది.

* అరటిపండు గుజ్జుని నైవేద్యంగా పెడితే....ఎప్పటి నుండి తీరని అప్పుల బాధలను, దానికి సంబందించిన బాధలు చికాకులు తొలిగిపోయి మనశ్శాంతిగా ఉంటారు.

* అరటిపండునే నైవేద్యంగా పెడితే... మీ కోరికలు తొందరగా తీరుతాయి.

* కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే... అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అంతేకాక చెయ్యాలని సంకల్పించిన పనులు ఎక్కడ ఆటంకాలు రావు, పైగా తొందరగా పూర్తవుతాయి.

* సపోటా పండ్లని నైవేధంగా పెడితే....ఏదైనా పని మొదలుపెడితే అది మంచి పని అయినా సరే విజయం కాకపోతే....ఈ నైవేద్యం పెట్టండి మీ పనులు విజయవంతం అవడమే కాకుండా ఊహించని లాభాలు వస్తాయి.

    పారిజాత పూలతో పూజ చేయవచ్చా...    

      కొంతమంది పారిజాత పూలతో పూజ చేయకూడదని, భగవంతునికి ఇష్టం లేని పూలని అంటారు. తెలిసి తెలియక చేసిన ప్రసంగాలని పట్టించుకోనక్కర్లేదు. పారిజాత పూలతో భగవంతునికి ప్రీతికరంగా పూజ చేయొచ్చు.

    ప్రదక్షిణ ఎందుకు...    

      ఇంట్లో పూజ అంతా అయినాక ప్రదక్షిణం చేయటం అలవాటు. “ఆత్మ ప్రదక్షిణ నమస్కారం” అంటాం దీనిని. దేవాలయానికి వెళ్లినప్పుడు దైవ దర్శనానికి ముందుగా ప్రదక్షిణం చేస్తాం. మామూలుగా మూడు మార్లు గుడి చుట్టూ తిరుగుతారు. తరువాతనే గుడి లోపలికి ప్రవేశించటం ఉంటుంది. దర్శనము, పూజాదికాలు అయిన తరువాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. తన చుట్టూ తానే గిర్రున కుడి వైపుగా తిరగటం ఆత్మ ప్రదక్షిణం. దీనిని నమస్కారం అని అంటున్నాం. నమస్కార ముద్రతో గుడి చుట్టూ తిరిగితే మాత్రం ప్రదక్షిణం అని మాత్రమే అనటం జరుగుతోంది.

      ప్రదక్షిణం అంటే కుడి వైపుగా కదలటం. సూటిగా వెళ్తే ముందుకి కదలటం జరుగుతుంది. ఒక వైపు కదలకుండా ఒక వైపు మాత్రమే కదిలితే కదలిక సరళ రేఖలో కాక వృత్తాకారంగా ఉంటుంది. ఆ వృత్తానికి కేంద్రంగా ఎడమ ప్రక్కని ఉంచి కుడి ప్రక్కని మాత్రమే కదిపితే అది ప్రదక్షిణం అవుతుంది. ఇలా చెయ్య వలసిన అవసరం ఏమిటి? స్థిరంగా ఉన్న వస్తువులో శక్తి అంతర్నిహితంగ, నిద్రాణంగా ఉంటుంది. కదిలితే చలన శక్తిగా వ్యక్తమౌతుంది. గుండ్రంగా తిరగటం వల్ల వస్తువు శక్తివంత మౌతుంది. పిల్లలు ఆడుకొనే బొంగరమే ప్రత్యక్ష నిదర్శనం. కదలనప్పుడు దానికేమాత్రం శక్తి ఉన్నట్టు కనపడదు. దానిని గుండ్రంగ తిప్పి వేస్తే ఆ వేగానికి భూమిని చీల్చుకుంటూ రంధ్రం చేయగలదు. వర్తులంగా అంటే గుండ్రంగా తిరగటం వల్ల అయస్కాంత శక్తిని పుంజుకోవటం జరుగుతుంది.

      ఈ ప్రక్రియకి భూమి, గ్రహాలే నిదర్శనం. ఈ తిరగటం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తన చుట్టూ తాను తిరగటం. రెండవది సూర్యుని చుట్టూ తిరగటం. దానితో రెండు రకాలైన అయస్కాంత శక్తులు వస్తాయి. సూర్యుడికి గ్రహాలకి ఉన్న పరస్పర ఆకర్షణా శక్తి కారణంగా అవి అంతరిక్షంలో చెల్లాచెదరు కాకుండా తమ తమ నిర్దిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయన్నది అందరకూ తెలిసిన విషయమే. వాటికి ఆ ఆకర్షణ శక్తి రావటానికి తమ చుట్టూ తాము తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటమే కారణమని కూడా అందరకూ తెలిసినదే. సూర్యుని చుట్టూ తిరగటం వల్ల సౌరశక్తి కారణంగా గ్రహాలు శక్తివంతాలవుతున్నాయి. తమ చుట్టూ తాము తిరగటం వల్ల తమలోని శక్తిని ప్రచోదనం చెయ్యటం లేక ఉత్తేజ పరచటం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భ్రమణం (Rotation) అని, సూర్యుని చుట్టూ తిరగటాన్ని పరిభ్రమణం(Revolution) అని అంటారు.

      భూమి ఏ విధంగా నయితే శక్తిని పొందుతోందో అదే విధంగా భూమిపై జీవిస్తున్న మానవుడు కూడా భ్రమణం, పరిభ్రమణం చేస్తే శక్తిమంతుడవుతాడు. ప్రతి మనిషి లోనూ దైవశక్తి అంతర్లీనంగా ఉంటుంది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది. దానిని కేంద్ర బిందువుగా చేసుకుని గిరగిరా తిరగటం వల్ల అయస్కాంత శక్తి కలుగుతుంది. ఏదైనా వస్తువుని దూరంగా గిరవాటు వేయటానికి చేతిని గుండ్రంగా తిప్పి వేస్తారు. అప్పుడది చాలా వేగంగా చాలా దూరం వెళ్ళ గలుగుతుంది మామూలుగా వేసినప్పటికన్న, తన చుట్టూ తాను తిరిగితే అలవాటు లేని వారికి శక్తిని తట్టుకోలేక కళ్ళు తిరగటం చూస్తూనే ఉంటాం.

      ప్రదక్షిణంలో తనకన్న ఎక్కువ శక్తి గల దాని చుట్టూ తిరగటం ద్వారా శక్తి మంతులు కావటం ఉంటుంది. గ్రహాలన్ని శక్తికి నిధానమైన సూర్యుని చుట్టూ తిరిగి శక్తిని పొందుతాయి . అలాగే మనిషి దైవం చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణం చేసి తనలో దైవీ శక్తిని పెంపొందించుకుంటాడు. దేవాలయంలో గర్భగుడి, ధ్వజ స్తంభాల చుట్టూ ఉంటుంది ప్రదక్షిణం. అరుణా చలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు. దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు. ఇంద్రయాగం మాన్పించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో స్పష్టమే కదా! అలాగే పెద్దలకి ప్రదక్షిణ చేయటం కూడా మేలు కలిగిస్తుంది. తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే ఎంతటి ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుందో గణపతి కథ మనకి తెలియచేస్తుంది.

      సాధారణంగా మూడు మారులు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. మూడు సంఖ్య సత్త్వ రాజస్తమోగుణాలని, భూర్భువస్సువర్లోకాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది. మామూలుగా ప్రదక్షిణం చేసేప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే చేస్తారు. గబగబా నడవటం కాక పాదానికి పాదం తగిలే విధంగా చూసి, చూసి అడుగులు వేస్తూ ప్రదక్షిణం చేస్తారు మొక్కు ఉన్నవారు. ప్రదక్షిణం చేసేప్పుడు మనస్సు దేవుడి మీద నిమగ్నం చేసి ధ్యానం చేస్తూనో ఆ ధ్యానం కుదరటానికి జపమో, స్తోత్రమో చేస్తూనో ఉంటారు. ఇవి మామూలు అయితే, తిరుపతిలో కనిపించే విశిష్టమైన ప్రదక్షిణం అంగ ప్రదక్షిణం. తడి బట్టలతో నేల మీద సాష్టాంగ పడి గుడి చుట్టూ దొరలటం. ఇది తమంతట తాము చెయ్యటం చాలా కష్టం. ఒకరు నేల మీద సాష్టాంగ పది ఉంటే మరొకరు వారిని దొర్లిస్తూ ఉంటారు. ఇది కష్టమైనదే. అంతకు మించిన ఎంతటి కష్టం ఆస్వామి వారికి తొలగించి ఉంటాడో మరి! ప్రదక్షిణం చేసే సమయంలో ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు గాని ఒక శ్లోకం చెప్పటం అలవాటయింది. పూజ ప్రారంభంలో ఇష్ట దైవాన్ని తనలో ఆవాహన చేసుకుని, పవిత్ర భావంతో పూజ అంతా పూర్తి చేసుకొని దైవ స్వరూపంగ పరిణమించిన సమయంలో “పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ” అంటే నాలో దైవం ఆవాహన అయితే నేను పాపిని, ఇప్పటి వరకు నేను చేసిన పూజ పాప కర్మ, నా ఆత్మ పాపంతో నిండి ఉంది ( పూజ చేస్తున్నంత సేపు నా అంతరాత్మలో దైవ భావన ఉంది ), నేను పుట్టింది పాపం నుండి ( ఆ పాపం నేను చేసిన పనుల ఫలమా? పుట్టుకకి కారణ మైన తల్లిదండ్రులా?) అని చెప్పటం ఎంత సమంజసం? ఇది కొన్ని ప్రభావాల కారణంగా మధ్య కాలంలో వచ్చి చేరింది. మనని శక్తి మంతులుగా చేయటానికి పెద్దలు ఏర్పాటు చేసిన ప్రదక్షిణం అనే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి ఉపయోగించటం సరైనదేనా? ఏం చెయ్యాలన్నది మన విజ్ఞత మీద ఆధార పడి ఉంది.

    ఔషధ గుణాలున్న పంచామృతం...    

      ఏ శుభ కార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాం. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతాలు వుంటాయి. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటుగా పంచామృతాన్ని కూడా మనం స్వీకరిస్తాము. కొన్ని దోషాలకు నివారణగా పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

పంచామృతం అంటే....

చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగును, స్వచ్ఛమైన నేయిని, తేనెను, చక్కెరను ఆవు పాలలో కలుపుతారు. భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!

ఆవుపాలు :- ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవుపాలు తల్లి పాలతో సమానమైనవి, శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలలో ఏవిధంగా అయితే కాల్షియం అత్యధికంగా వుంటుందో ఆవు పాలలో కూడా కాల్షియం ఎక్కువగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకుల పెరుగుదలకు అవసరం. అందుకే, ఆ విషయంలో పాలు నిజంగానే అమృతంలాగా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ 'ఎ' కూడా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.

పెరుగు :- పెరుగుకు ఎన్నో ఔషధ విలువలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణతత్వం వున్న వారికి పెరుగు అత్యద్భుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయంపూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయంపూట గుడికి వెళ్ళి పెరుగుతో కూడిన పంచామృతం తీసుకోవడం ఈ విధంగా చూసినా మంచిదే!

నెయ్యి :- మేధాశక్తిని పెంచడంలో నెయ్యికి అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన, నెయ్యితో వేయించిన ఆహారపదార్థాలు (జీడి పప్పు వంటివి) పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మసౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో 'ఎ' విటమిన్ వుంటుంది.

తేనె :- కొన్ని వేల ఏళ్ల నుంచీ కూడా తేనెను పోషకాహారంగానూ మానవులు ఉపయోగిస్తున్నారు. తేనె సూక్ష్మజీవులతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. జీర్ణకోశానికి తేనె మేలు చేస్తుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఈ అయిదింటి కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది.

    తీర్ధాన్ని మూడు సార్లు తీసుకుంటారెందుకు...    

      ‘మనసా వాచా కర్మన..’ ఈ మూడు గుణాలను కలిపి త్రికరణ శుద్ధి అని అంటారు. తోలి తీర్ధము శరీరశుద్ది, శుచికీ....రెండో తీర్ధం ధర్మ, న్యాయ ప్రవర్తనకూ....మూడవ తీర్ధము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. ఆలయానికి వెళ్లినపుడు త్రికరణ శుద్ధిగా వ్యవహరించాలి. మనసు, వాక్కు, చేసేపని దైవంపై లగ్నం చేయాలి. మాట చేత భగవంతుడిని కీర్తించాలి. చేసే పని కూడా ఆధ్యాత్మికమైనదై ఉండాలి. ఈ మూడు కర్తవ్యాలను బోధించడానికి మూడుసార్లు తీర్థం ఇస్తుంటారు. భగవంతుడ్ని దర్శించి తీసుకునే తెర్దంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉంటాయి. శ్రీ గంధం, తులసి, పచ్చ కర్పూరమూ, కేసరి మొదలగు వాటిని భగవంతుడి తీర్ధంలో కలుపుతారు. ఈ తీర్ధంలో క్రిమి సంహరకంతో పాటు, రోగ నివారక గుణం కలగి ఉంటుంది. అందుకే భగవంతుడ్ని దర్శించక తీర్ధం తీసుకుంటే ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది.

సమస్త పాప శమనం విష్ణుపాదోదకం శుభమ్||

మరో కారణం ధర్మార్థకామమోక్షాలలో.. మోక్షం ఆధ్యాత్మిక సాధన ద్వారా సిద్ధిస్తుంది. ధర్మార్థకామాలు భగవంతుడి ప్రసాదితాలు. దేవుడు ఈ మూడుఫలాలను భక్తులకు పరిపూర్ణంగా కటాక్షించాలని తీర్థం మూడుసార్లు ఇస్తారు.

అకాల మృత్యుహరణం సర్వవ్యాది నివారణమ్||

    తీర్ధం సేవించిన తర్వాత చేతిని తలకు రాసుకోవచ్చా...    

      తీర్ధం తీసుకోవడానికి చేతిని గోకర్ణభంగిమలో ఉంచి తీసుకుంటాము. ఆపై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము. అలా చేయడం తగదు. తీర్ధం పంచామృతంతో చేస్తారు. అందులో తేనే, పంచదార వంటివి జుట్టుకి మంచివి కాదు. అలాగే తులసీనీరు తీసుకున్న తలపై రాసుకోకూడదు. తీర్ధం తీసుకోవడం వలన చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఏ తీర్ధం తీసుకున్న చేతిని సాదారణ నీతితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలిని ఉంది.

    శంఖముతో పోస్తేనే తీర్ధమా...    

      శంఖాల్లో దక్షిణావర్త శంఖము శ్రేష్టమైనది. శంఖము లక్ష్మి స్వరూపము. శంఖము కాల్షియంకు సంబందించినది, దాని ద్వారా తీర్ధము పుచ్చుకుంటే అనేక వ్యాధులు మటుమాయం అవుతాయి. అలాగే భగవంతునికి తీర్ధ పూజ చేయుటకూ, అభిషేకించుటకు లక్ష్మికే అధికారం. కాన శంఖం ద్వారానే తీర్ధమూ, అభిషేఖము చేస్తారు.

    గుడిలో శఠారి (శఠగోపం) ఎందుకు పెడతారు...    

      శఠారి గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు దేవతలను తాకేందుకు వీలుండదు కాబట్టి తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయపూజారి శఠారిని తీసుకొచ్చి భక్తుల తలకు తగిలించడం ఆచారంగా వస్తోంది. శఠులు అంటే మోసగాళ్లు అని అర్థం. అరి అంటే శత్రువు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలకు తాకించడం ద్వారా వారిలోని చెడు తలంపులు, ద్రోహబుద్ధులు నశించి సత్ప్రవర్తన అలవడుతుందనేది ఈ సంప్రదాయం వెనుక అంతరార్థం.

      మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దైవ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వున్న పూజారిగారు మన శిరస్సు మీద భగవంతుడి పాదముద్రలు వున్న శఠగోపాన్ని వుంచుతారు. అలా మన శిరస్సు మీద ఆ శఠగోపాన్ని వుంచిన ఆ క్షణంలో మనం సర్వ అహంకారాలను పరిత్యజించి వినయంగా తల వంచుతాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ చర్య మనలో అసంకల్పితంగానే జరుగుతుంది. మనం దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కోసారి పూజారి గారు వేరే పనిలో వుంటే ఆయనని అడిగి మరీ మనం శఠగోపం శిరస్సు మీద వుంచుకుంటాం. ఇంతకీ దైవ దర్శనం అయిన తర్వాత శిరస్సు మీద శఠగోపం ధరించడం తప్పనిసరా? అవును.. నిజంగానే తప్పనిసరి.. శిరస్సు మీద శఠగోపం ధరించడం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడి పాదాలను మన శిరస్సు మీద ధరించడం తప్ప మరొకటి కాదు. అంతటి భాగ్యాన్ని కాదనుకుని మనం దేవాలయం నుంచి బయటకు రావడం ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోవడమే కదా! ఎందరో దేవతలు పూజించిన పాదాలను మన శిరస్సు మీద ధరించడం కంటే భాగ్యం మరొకటి వుంటుందా? మన శత్రువులు ఎవరైనా మన పాదాలు పట్టుకుంటే మనం వాళ్లని క్షమిస్తాం. అవసరమైతే వాళ్ళకి సహాయం చేస్తాం. మరి భగవంతుడిని ఎంతో ఆరాధించే మనం ఆయన పాదముద్రలను కూడా మన శిరస్సు మీద ధరిస్తే ఆయన మనమీద ఎంత వాత్సల్యం చూపిస్తాడో ఒక్కసారి ఆలోచించండి.

      దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థ ప్రసాదాలతోపాటు శఠగోపం కూడా తప్పకుండా తీసుకోవాలి. కొంతమందికి శఠగోపాన్ని తీసుకోవాలని వున్నా, పూజారి గారికి దక్షిణ ఇవ్వకపోతే బాగోదన్న ఉద్దేశంతో శఠగోపం తీసుకోకుండానే వచ్చేస్తుంటారు. అయితే దక్షిణలాంటి ‘చిల్లర’ విషయాలను పట్టించుకోకుండా మనం తప్పకుండా శఠగోపం తీసుకోవాలి. శఠగోపం తీసుకోవడం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి విషయం. శఠగోపంని రాగి, కంచు, వెండితో తయారుచేస్తారు. వాటిపైన విష్ణుపాదాలుంటాయి. శఠగోపాన్ని శిరస్సు మీద వుంచుకున్నప్పుడు మన శరీరంలో అధికంగా వున్న ఉన్న విద్యుత్‌ శఠగోపంలోని లోహంలోంచి బయటకి వెళ్ళిపోతుంది. అందువల్ల మనలో వున్న అధికంగా వున్న ఆవేశం, ఆందోళన తగ్గుతాయి. అందువల్ల ఈసారి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శఠగోపాన్ని శిరోధార్యంగా స్వీకరిద్దాం.

    ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు...    

      ఆవు సమస్త సృష్టిలోకి పవిత్రమైనది. సకల దేవతలకి నివాస స్థలము. అందుకే పూజల్లో, వ్రతాల్లో, యజ్ఞాల్లో ఆవుపాలు, పెరుగు, నెయ్యి వాడతారు. ఆవుపాలంటే సమస్త దేవతలను మన శుభకార్యానికి పిలిచినట్టె. అందుకే వారి ఆహ్వానానికి చిహ్నమే ఆవుపాల వాడకం.

    మన సంస్కృతిలో తాంబూలం...    

      ప్రపంచంలోనే అత్యంత పురాతన మతమైన హిందూసంస్కృతి ఎక్కువగా ప్రకృతిని పూజించటం, ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.

      ఉగాది పండుగ వేపచెట్టు, సంక్రాంతి పండుగ ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం, అలాగే వినాయక చవితి అంటే నానా విధ ఫల, పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు.

      హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్లకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. అంతే కాదు ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తోంది.

      అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం వున్నప్పటికీ, ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు, వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.

      ఆధ్యాత్మిక సబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్, సి విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

      ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే పని చేస్తాయి. సున్నం, ఇతర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం అది శరీరానికి హానికరంగా మారుతుంది.

    పూజలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు...    

      పుష్పాలకు గల ఆకర్షణ శక్తి వల్ల అవి వాతావరణంలోని దైవిక శక్తుల తరంగాలను తమలో ఐక్యం చేసుకుంటాయి. అలా ఐక్యం చేసుకున్న దైవిక శక్తికి తమలోని సువాసనను జోడించి, పరిసర ప్రాంతాలను అవి పవిత్రంగా మార్చుతాయి. వాటిని దైవానికి సమర్పించినప్పుడు వాటిలోని పుప్పొడి కోశం దైవంలోని శక్తిని గ్రహించి, ఆ శక్తిని సుగంధ పరిమళాలనిచ్చే ప్రాణవాయువు రూపంలో తిరిగి బయటకు ప్రసరింపచేస్తుంది. శాస్త్రపరంగా చెప్పాలంటే పుష్పాలు మనలోని వ్యతిరేక భావనలను సానుకూలంగా మార్చి, మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. అందుకే పూజలో పుష్పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

    ఆలయంలో ఇలా చేయాలా....    

      ఎక్కడికి వెళ్ళినా రాని మనశ్శాంతి దేవాలయానికి వెళితే వస్తుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆలయాల్లో ప్రతిష్ఠ సమయంలో వేసే యంత్రాలు, చేసే యజ్ఞాల వల్ల చాలా మటుకు శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఆ తరువాత కూడా నిత్యం చేసే జపాలు, అభిషేకాలు, అష్టోత్తరాలు వీటన్నిటి వల్ల కూడా ఆ ప్రదేశమంతా ఒక శక్తి కేంద్రంగా విలసిల్లుతూ ఉంటుంది. అలాంటి పవిత్ర ప్రదేశాలు కావటం వల్లే అక్కడికి వెళ్ళిన వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది.

      మరి అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే ఇంకా మంచిది కదా. ముందుగా ఆలయానికి కాలి నడకన వెళితే తప్పనిసరిగా కాళ్ళు కడుగుకుని గాని లోపలికి వెళ్ళకూడదు. లోపలి వెళ్ళిన తరువాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలా చేసేటప్పుడు ద్వజస్థంభానికి, గర్భగుడికి మధ్య నుంచి వెళ్ళకూడదు. ద్వజస్థంభం చుట్టూ తిరిగి చేస్తేనే ప్రదక్షిణ పరిపూర్ణం అయినట్టు. దేముడిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఇక గుడి లోపలికి వెళ్ళిన తరువాత ఎప్పుడూ దేముడికి ఎదురుగా నిలబడకూడదు. పక్కగా నిలబడి నమస్కరించాలి. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు శబ్ధం చేయకుండా తీసుకోవాలి. తీర్థం పుచ్చుకున్నకా ఆ చేతిని తలపై రాసుకోకూడదు. ఎందుకంటే మన తలపై పెట్టే శటారి మీద దేముడి పాదాలు ఉంటాయి, ఆ శటారి సాక్షాత్తు దేముడి పాదాలతో సమానం. అలాంటి దేముడి పాదాలకి మనం ఎంగిలి చేసిన చెయ్యి అంటుకుంటుంది కాబట్టి తీర్థం పుచ్చుకున్న చెయ్యి తలపై రాసుకోకూడదు. అలాగే ప్రసాదాన్ని కింద పడకుండా తినాలి.

      దర్శనం అయ్యాకా చాలా మంది గుడిలో ఉన్న పురోహితులకి దణ్ణం పెడతారు. అలా పెడితే దేముడిని అవమానించినట్టే అవుతుంది. అంత పెద్ద పరమాత్ముడు మన కళ్ళ ముందు ఉండగా మనవమాత్రులైన వారికి దణ్ణం పెట్టటం ఆయనని కించపరచినట్టే అవుతుంది కదా. ఆలయంలో కూర్చునేటప్పుడు మన వెనక భాగం దేముడి వైపు కూర్చోకూడదు. ఆలయంలో కూర్చునప్పుడు దైవ సంబంధమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఆలయ ప్రాంగణంలో దేవతలు నివాసం ఉంటారు. నిరంతరం దైవప్రార్ధనలో ఉండేవాళ్ళని మనం విసిగించటం ఎంతవరకు సబబో ఆలోచించండి.

      దేముడికి దణ్ణం పెట్టేటప్పుడు ఒక చేత్తో ఎప్పుడూ దణ్ణం పెట్టకూడదు. రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకోవాలి. అలాగే శాలువా గాని, కంబళిలాంటిది గాని కప్పుకుని దేముడిని దర్శించకూడదు. అలాగే తలపై టోపీ పెట్టుకుని గుడిలోకి వెళ్ళకూడదు. గుడిలో పూసిన పువ్వులను కోసి మళ్లీ గుడిలో దేముడికే పెట్టమని ఇవ్వకూడదు. అలాగే గుడిలో పూవులని ఇంట్లో పూజకి ఉపయోగించకూడదు. ఆలయ మండపంలో భోజనం చేయకూడదు. తిన్న ప్రసాదం పోట్లాలని అక్కడే పారేయకూడదు.

      దేముడికి హారతి ఇచ్చి మనకి చూపించినప్పుడు దానిని కళ్ళకి అద్దుకోకూడదు. అలాగే పిల్లలకి కూడా అద్దకూడదు. వీలయినంత వరకు ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులకి, బిచ్చగాళ్ళకి అన్నదానం చెయ్యటం మంచిది. ఇలా భగవంతుడిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైనట్టు ఉంటూ అతని అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి.

    ఏ రోజు ఏ దైవాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుంది...    

      కొంతమంది భక్తులు ఏ రోజు ఏ దైవానికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిస్తే కచ్చితంగా అదే చేసి త్వరగా ఫలితాన్ని పొందాలని అనుకుంటారు. అటువంటి వారికోసమే అన్నట్లు శివ మహాపురణంలో పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబందించిన విషయాలు ఉన్నాయి. దేవతల ప్రీతీ కోసం ఐదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమరాదనలు అనేవే అయిదు విధాలు. పూజలు మనకున్న ఏడు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కో దేవతకు చేయాల్సి ఉంటుంది.

ఆదివారం :- ఆదివారం అధిత్యుడికి, ఇతర దేవతలకు, వేద పండితులకు పూజించాలి. ఆదిత్య పూజ వాళ్ళ నేత్ర రోగం, శిరో రోగం, కుష్ఠు రోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒకరోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను అనుసరించి పూజించాలి. దీని వలన సుర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం :- సోమవారం సంపద కోరుకునేవాడు లక్ష్మిదేవని ఆరాధించాలి. ఆరోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం :- రోగాలు తగ్గటం కోసం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్ధాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం :- పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం :- గురువారం ఆయుష్షుని, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్ధాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం :- శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆరోజున పూజానంతరం వేదపండితుల తృప్తికోసం షడ్రుచులకోసం కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలని బహుకరించాలి.

శనివారం :- శనివారం రుద్రాది దేవతలా ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలని అనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపినా అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయడం వలన పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు.

    ఏ దేవుడ్ని దర్శించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి…    

      సరస్వతి దేవిని, శ్రీ మహాలక్ష్మిని, మహేశ్వరుడ్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు తెల్లటి దుస్తులు ధరించాలి. పార్వతి దేవిని, ఆమె పుత్రుడు అయిన వినాయకుడ్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎరుపు బట్టలు ధరించాలి. శ్రీ మహావిష్ణు రూపాలైన శ్రీరామ, శ్రీ కృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేతప్పుడు మంగళకరమగు పసుపు దుస్తులు ధరించాలి.

    దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే ఎందుకు విడవాలి...    

      పాదరక్షలు లేకుండా పవిత్ర స్థలాల్లోకి ప్రవేశించాలని హిందూ సంప్రదాయం తెలుపుతుంది. గుడి ప్రాంగణాన్నిమనం పవిత్రంగా భావిస్తాం. గుడిలో తీవ్రమైన అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది. గుడి నేలభాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి మన శరీరంలో ప్రవహించడం ఆరోగ్యప్రదం. కావుననే పాదరక్షలు లేకుండా శుభ్రమైన పాదాలతో దేవాలయంలోకి ప్రవేశం చేయాలని చెప్పబడింది. అలాగే దేవాలయం ముంగిట ఔషాద మరియు పూలమొక్కలు ఉంటాయి. అవి అనుకూల శక్తి వ్యక్తం చేస్తుంటాయి. అలాగే విగ్రహాన్ని అభిషేకించబడిన జలం నేలపై పడి పవిత్రతను హేచ్చిస్తుంది. కావున అలాంటి నేలపై్‌అరుగుపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి ప్రభావానికి గురి అవుతాడు.

      అలాగే పాదరక్షలు లేకుండా ఉండడం వల్ల గర్వ అహంభావాలు తొలగివుంటాయి. అలా ఒక వ్యక్తి యొక్క మానసిక వ్యక్తిత్వం వికాసవంతం అవుతుంది. ఆధునిక చికిత్స తెలిపే అయస్కాంత చికిత్స దేవాలయంలో సహజంగానే చోటు చేసుకుంటుంది.

    గుడి వెనుక భాగాన్ని మొక్కుతారెందుకు...    

      గుడిలో మూలవిరాట్టుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. అందుకే భక్తులు తమ డబ్బు, శ్రమ వెచ్చించి భగవంతుని దర్శనానికి వస్తుంటారు. ఆ మంత్ర శక్తి వలనే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది.

    సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి ...    

      మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.

    దేవాలయంలోని దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ప్రార్ధన చేయరాదా...    

      పిల్లలు దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఉంటే పక్కకు జరిగి నిలబడమని పెద్దలు మందలిస్తారు. అనేక దేవాలయాలలో ఈ సమస్య లేకుండా ఉండేలా విగ్రహానికి ఎదురు భాగంలో ఇనుప కంచెను నిర్మిస్తారు. విగ్రహాన్ని సూటిగా కాకుండా కాస్త ఎడంగా కుడివైపునకు కానీ, ఎడమవైపునకు కానీ నిలబడి దేవుడిని చూస్తూ ప్రార్థించవచ్చు. సూటిగా దేవుడి దృష్టి పడేలాకాక ౩౦ డిగ్రీలు పక్కగా చేతులు జోడించి నిలబడి ప్రార్ధనలు చేయాలి.

      దేవతా విగ్రహం నుండి వెలువడే దైవకృపా శక్తి సర్పగతిలో తరంగాలుగా ప్రవహిస్తూ భక్తుడిని చేరుతుంది. కాబట్టి విగ్రహం దగ్గర ఉన్నప్పుడు చేతులు జోడించి ఉంచి కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా దైవధ్యానంలో మునిగి ఉండాలి. అలా చేతులు జోడించి ఉండటం వల్ల మెదడు నుండి ప్రాణశక్తి కలిగివుంటుంది. కాబట్టి అలా నమస్కారం పెట్టి ఉంచడం ద్వారా శారీరిక బలం, బుద్ధిబలం మరియు ఆత్మవిశ్వాసం పొందుతారు. మానవదేహం సూటిగా దైవ విగ్రహం నుండి వెలువడుతున్న దివ్యకిరణాలను భరించలేదు. అందుకే విగ్రహానికి సూటీగా ప్రార్ధన చేయరాదని చెప్పబడింది.

    ప్రసాదం గురించి కొన్ని నిజాలు...    

      ఎవరైనా ‘గుడికి వెళ్లొచ్చాం’ అంటే ‘ప్రసాదం ఏదీ?’ అని టక్కున అడుగుతాం. ప్రసాదం కోసమే గుడికి వెళ్లేవాళ్లు కూడా కొందరుంటారు. ప్రసాదం అంటే రుచికరమైన ఆహార పదార్థమే కాదు.. అదొక విశిష్టమైన దైవ పదార్థం. హిందూ సంప్రదాయం ప్రకారం దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. హిందూమతంలో ఈ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ప్రసాదం గురించి కొన్ని నిజాలు :-

* పవిత్రమైన ఆహార పదార్థాన్ని దేవుడి ముందు ఉంచడం ద్వారా అది అమృతంగా మారి ప్రసాదం అవుతుంది.

* ప్రసాదం దైవ భక్తిని పెంపొందించడంతో పాటు మానవుడిని పవిత్రతతో ఉంచుతుంది.

* ప్రసాదం మనిషిలోని ప్రతికూల స్పందనలను పారదోలి సానుకూల స్పందనలను కలిగిస్తుంది.

* పవిత్రమైన ప్రసాదాన్ని నలుగురికీ పంచడం ద్వారా ఇతరులతో సత్సంబంధాలు మెరుగవుతాయి.

* ఎలాంటి పూజా కార్యక్రమమైనా ప్రసాదం లేకుండా పూర్తి అవదు.

* దేవుడికి ఏం నివేదించాలో తెలియనప్పుడు ఒక చిన్నపండును ఉంచినా అది ప్రసాదంగా మారుతుంది.

* ఏ రకమైన ఆహార పదార్థాలూ లేనప్పుడు తులసినీళ్లే ప్రసాదం. పైగా అది అమృతం కూడా..

* ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని ఆరగించడం ద్వారా మనిషి దృక్పథం మంచి వైపు మళ్లుతుంది.యి.

* ప్రసాదాన్ని కొంతమంది ఔషధంగా భావిస్తారు. ప్రసాదం తీసుకోవడం వల్లే వ్యాధులు నయం అయ్యాయి అని భావించేవాళ్లు కూడా ఉన్నారు.

* ఎలాంటి ఆహార పదార్థాన్నైనా దేవుడికి నివేదించి తినడం ద్వారా అందులో ఒకవేళ చెడు ఉన్నా అది హరించుకుపోతుందని భక్తుల నమ్మకం.

    పరమాన్నం ...    

పరమాన్నం :-అమ్మవారికి పాయసాన్నప్రియ అని పేరు. కాబట్టి ఆవు లేదా గేదెపాలలో బెల్లం వేసి చేసే పరమాన్నం ప్రధాన నైవేద్యం.

విశిష్టత :- పరమాన్నంలో ఉపయోగించే ప్రతి దినుసూ బలవర్థకమే. బెల్లంతో ఐరన్‌, పాలతో క్యాల్షియం శరీరానికి సమృద్ధిగా అందుతాయి.

కుడుములు లేదా చలివిడి ఉండ్రాళ్లు విశిష్టత :- గర్భ దోషాలు హరించి గర్భం దాల్చే అవకాశాలు మెరుగుపరుస్తుంది.

కొబ్బరికాయలు విశిష్టత :- కొబ్బరి బలవర్ధకమైన ఆహారం.

పళ్లు-ఫలాలు విశిష్టత :- వ్రతంనాడు ప్రధానంగా అరటి పళ్లు నైవేద్యంగా తింటారు. అరటి పళ్లు తక్షణ శక్తినిస్తాయి.

వడపప్పు-శనగలు విశిష్టత:- పప్పు దినుసులన్నీ శక్తిస్థావరాలే! వీటి ద్వారా శరీరానికి మాంసకృత్తులు అందుతాయి.

పరమాన్నం విశిష్టత :- ఉగ్రతను తగ్గిస్తుంది. పానకంలోని బెల్లం ద్వారా ఐరన్‌, ఖనిజ లవణాలు శరీరానికి మంచిని చేస్తాయి.

    తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు...    

      ధర్మశాస్త్రాల ప్రకారం... మనం చేసే సర్వకర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దానివల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులమవుతాం. ఈ ఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయ్యింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే... ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తాం అని దేవునికి మాటివ్వడమన్నమాట!

    దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి...    

      దేవాలయం పవిత్రప్రదేశం. ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి. భగవంతుని దర్శనం పూర్తికాగానే ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది సంప్రదాయం. మనం అనేక సమస్యలతో సతమతమవుతుంటాం. మానసిక ప్రశాంతత కోసం పరంధామున్ని దర్శనం చేసుకున్న అనంతరం కాసేపు కూర్చొని భగవంతుని ఆరాధన గానీ ప్రసాదం స్వీకరణ గానీ చేయాలి. ఆ సమయంలో మన మనస్సులో ఆ దివ్యమంగళ స్వరూపమే దర్శనమిస్తుంటుంది. స్వామివారిని చూసిన అలౌకిక ఆనందం మిగులుతుంది. మనసు ఇతర ప్రాపంచిక అంశాలపైకి వెళ్లకుండా దైవంపైనే కేంద్రీకరిస్తుంది. అందుకనే క్యూలో నిలబడి భగవంతుని దర్శనం చేసుకున్న అనంతరం కాసేపు గుడిలో కూర్చోవాలి.

    పూజలో రాగిపాత్రలను ఎందుకు వాడుతారు...    

      దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది. కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి. ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు. కొంత కాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు. తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శనచక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది. శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తకోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. మానవజీవితం బంధనాలమయంగా ఉంటుంది. అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు. కానీ సకలా చరాచర జగత్తు ఆ స్వామి సృష్టేనని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు. నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ గుడాకేశుని కథ. మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

    పుస్తకాలను ఎందుకు సరస్వతి రూపంగా భావిస్తాం...    

      పుస్తకాలు, గ్రంథాలు,పేపర్లు... ఇలా సమాచారాన్ని, బోధన గురించి వివరించేవాటిని మనం పవిత్రంగా పరిగణిస్తాం. చదువులకు తల్లి సరస్వతి దేవి. ఆమె కటాక్షం వుంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు. గ్రంథపఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది. అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతి స్వరూపంగా భావిస్తాం. అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం. భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. ‘విద్య వినయేన శోభతే’ అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా వుండాలని దీని భావం. అలాంటివారికి వినయం మరింత శోభనిస్తుంది. అందుకనే సరస్వతి స్వరూపమైన పుస్తకాలను కాలితో తాకకూడదు.

సరస్వతి నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా

    చివరిగా ...    

      వేల సంవత్సరాల నాడు రుషులూ, మునులూ తాము తపించి, ఆచరించి, అనుభవంలోకి తెచ్చుకున్న ఎన్నో విషయాలనూ, విశేషాలనూ భగవంతుడికి దగ్గరగా బతికేందుకంటూ ఇలా పొందుపరిచి మనకందించారు. ఇందులో ఏది ఎందుకు చేయాలీ, అన్న ఆలోచన ఎలా ఉన్నా... మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు వెళ్లే స్వచ్ఛతను అందిస్తాయివి. అంతేకాదు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్నీ, మనసును అదుపులో ఉంచుకునే చాకచక్యాన్నీ, మనల్ని మనం గమనించుకుంటూ బతికే నైపుణ్యాన్నీ దోసిటపట్టే పట్టునిస్తాయి. అలాంటి స్థిరమైన మనసుతో, మనమీద మనకు అదుపుతో, ప్రశాంతంగా జీవిస్తే... ‘శతమానం భవతి’ అనే వేదవాక్కు ఫలించదంటారా!