సీతారామలక్ష్మణ హనుమంతో సమేత రామాలయము

    మా గ్రామంలోని రాములోరి గుడికి అతిపురాతనమైన చరిత్ర ఉన్నది. ఈ ఆలయాన్ని నరసరావుపేట జమీందారుల ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేసినారు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి గ్రామ కరణంగారు ధర్మకర్తగా ఉన్నారు. తదుపరి వారు మేము జరపలేమని చెప్పియున్నారు. అప్పుడు గ్రామంలో గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని, ఎవరు పాట ఎక్కువ పాడితే వారు దేవాలయమునకు ధర్మకర్తగా చేసేలాగా నిర్ణయం చేసినారు. రాములోరి గుడి ఆలనాపాలనా వ్యవహారాలన్నీ మేము చూస్తామంటూ గుంటుపల్లి వంశస్తులు ముందుకు వచ్చి, ధర్మకర్తలుగా ఉండటానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో రాములోరి గుడి బాధ్యతలను గుంటుపల్లి వంశస్తులుకు అప్పగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాములోరి గుడి ఆలనాపాలనా వ్యవహారాలన్నీ... వారే అజమాయిషీగా ఉంటూ ఎంతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది ప్రత్యేకంగా ప్రస్తావించదగిన విశేషమే. సదరు దేవాలయానికి నిత్య ధూప, దీప నైవేద్యాలు చేయడానికి పూజారి గార్కి చాగల్లు గ్రామంలో కొంత భూమిని ఇచ్చియున్నారు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో దేవాలయ ఉత్సవంలు జరుపుట కొరకు కొంత మాన్యం ఇచ్చినారు మరియు సదరు దేవాలయ భజంత్రీలకు చాకిరి నిమిత్తం కొంత భూమిని ఇచ్చియున్నారు.

    గ్రామంలో ప్రసిద్ధిచెందిన ఈ గుడి కాలక్రమేణా శిధిలమైపోవడం మొదలైంది. గోడలు పగుళ్లుబారాయి... ఆవరణలోనూ, చుట్టుపక్కలా చెట్టూ చేమా పెరిగిపోయాయి. గుళ్లొ ఫ్లొరింగ్‌, చుట్టూ గోడలు పాడైపోయినాయి. రంగులు వెలిసిపోయాయి. భక్తులు రావడం తగ్గింది. నిత్యపూజలతో కళకళలాడిన గుడికాస్తా పాడుబడినట్లయింది. ఇదంతా కళ్లారాచూసిన గుంటుపల్లి వంశస్తులు మనసు ఎంతో కలత చెందింది. ఓ రోజు పూజారితో మాట్లాడారు. పరిసరాల్ని బాగు చేసి ఫోరింగ్‌ సరిచేయడం, గుడికి సరిగా రంగులు వేయించడం వంటివెన్నో చేయాల్సి ఉందని అర్థమైంది. ఆ రోజు అదే విషయాన్ని గుంటుపల్లి వంశస్తులందరూ సమావేశమై ‘గుడి బాగు చేయడం కాదు, గుడినే పునఃనిర్మిద్దాం’ అంటూ అందరూ అనుకున్నారు. దీనిని ఎలాగైనా పునఃనిర్మించాలనే పట్టుదలతో గ్రామస్థులు, ముఖ్యంగా గుంటుపల్లి వంశస్తులు నిర్ణయించారు. గ్రామస్థులు, ప్రవాసాంధ్రులు వారి శక్తిమేరకు విరాళాలందించినారు. గ్రామంలోని ప్రధాన వీధిలో కోటి రూపాయల వ్యయంతో రాములోరి గుడి నిర్మాణాన్ని పునఃనిర్మించారు. ఈ ప్రాచీన ఆలయ ప్రదేశంలో ఏకశిలపై “శ్రీ సీతా, లక్ష్మణ, హనుమతో సమేతుడై హిమాంక స్థిత జానకీ పరివేష్టితుడై” ఉన్న స్వామివార్ల మూలవిరాట్టు విగ్రహాలనే శాస్త్రోక్తంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాల నడుమ, ఆలయప్రతిష్ఠతోపాటు, ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. భద్రాచలం అడవుల నుంచి ధ్వజస్తంబానికి కావలసిన చెట్టును తీసుకొచ్చారు. భద్రాచలం అడవుల నుంచి తీసుకొనివచ్చిన ధ్వజస్తంబాన్ని అదే సమయంలో ఆలయం ఎదుట జీవధ్వజస్థంభ ప్రతిష్ఠ చేసినారు. నూతన ఆలయంలో గర్భగుడి, ఆలయమండపం, ఆంజనేయస్వామి, ప్రవేశమార్గంలో సీతారామ కల్యాణ ఘట్టాలతో పాటు, ఆలయం చుట్టూ దేవతా ప్రతిమలు చెక్కిన ప్రహరీ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు హోమాలు, విశేషపూజలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించినారు. ఈ మహోత్సవాన్ని దర్శించుటకు స్థానికులేగాక, ఇతర గ్రామాలనుండి కూడా భక్తులు భక్తులు వేలాదిగా తరలివచ్చినారు.

    శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సీతారామ కల్యాణం... రమణీయం, కమనీయం.. జానకమ్మ, రామయ్యల కల్యాణంలో తలంబ్రాల వేడుక మరీ అద్భుతం. జగదానందకారకుడైన రాముడి కల్యాణానికి భక్తితత్పరులైన ఊరి మహిళలు రామనామస్మరణతో తలంబ్రాలను ఎంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎంతో ఓపికతో. అంతకు మించిన భక్తితో.. తలంబ్రాలను కల్యాణానికి సిద్ధం చేస్తారు. కన్నులపండువగా జరిగే కల్యాణానికి గుంటుపల్లి వంశస్తుల తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి.. కల్యాణ వైభోగమే.. రామయ్య పెళ్లికొడుకాయనే..’ తదితర పాటలతో మారుమోగుతాయి. శ్రీరామ నవమి రోజున పల్లె పండుగ కళను సంతరించుకుంటుంది. కల్యాణం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం జరుపుతారు. ఆ తర్వాత.. కళ్యాణమూర్తులను పల్లకీలో ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, విద్వాంసుల మంగళవాయిద్యాలు, అశేష భక్తకోటి జయజయధ్వానాల మధ్య.. కల్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొస్తారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఆలయ ప్రాంగణంలోని కల్యాణవేదికపై ధ్రువమూర్తులైన స్వామి వారిని, అమ్మవారిని అధిష్ఠింపజేసి శైవసంప్రదాయ రీతిలో విఘ్నేశ్వర పూజతో కల్యాణ తంతును ఆరంభింస్తారు. తిరువారాధన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపించి మండపాన్ని శుద్ధిగావిస్తారు. ఎదురెదురుగా కూర్చోబెట్టి కన్యావరణలు జరుపుతారు. మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరుపుతారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పోదకస్నానం తర్వాత వరపూజ నిర్వహిస్తారు. ఆభరణాలను ధరింపజేస్తారు. అర్చకస్వాములు తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి ఆలయ ధర్మకర్తలు నివేదించిన నూతన పట్టువస్తాలతో పాటు బంగారు ఆభరణాలతో సీతమ్మవారిని, శ్రీరామచంద్రుడిని చూడముచ్చటగా అలంకరించి వస్ర్తాలంకరణ చేస్తారు. ఆ తరువాత ఇరువురికీ వేర్వేరుగా మంగళాష్టకం చదువుతారు. అభిజిల్లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ మూర్తుల శిరస్సుపై ఉంచుతారు. ఆలయ ధర్మకర్తలు తయారు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ మరియు ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిర్వహిస్తారు. భాగవోత్తముల ఆశీర్వచనంతో లోక పర్యాంతాన్ని, విశ్వ సృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశాన్ని తెలుపుతూ సంకల్పం చెప్పి కన్యా దాన ఘట్టాన్ని ముగిస్తారు. కళ్యాణం తరువాత రోజున ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపంలో శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకిస్తారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు.

    సంక్రాంతి పర్వదినం సందర్భంగా సీతారాముల వార్ల ఉత్సవమూర్తులను ముందుగా ఆలయ వేదికపై ఉంచి అర్చకులు పుష్ప పల్లికీ సేవతో ప్రారంభించి మంగళ వాయిద్యాల నడుమ విశేషపూజలు నిర్వహించి, బండి మీద ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి అశేషాజనవాహిని నడుమ గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఇచ్చట స్వామి వారు భక్తుల కొంగు బంగారమై వెలుగొందుతున్నాడు.

    ఈ ఆలయానికి చెందిన శ్రీ సీతారామాంజనేయ భజన భక్త సమాజ బృందం 1950సంవత్సరంలో గ్రామ ప్రధాన వీధులలో తెల్లవారుజామున తిరుగుతూ “శ్రీరామ నామస్మరణ”తోనే గ్రామంలో తెల్లవారే లాగా రాములోరి పరమ పవిత్ర భక్తుడు శ్రీ గుంటుపల్లి కనకయ్య గారిచే గ్రామ సంకీర్తన కార్యక్రమం ప్రారంబించబడినది. ఈవిధంగా నిర్వహించడం ఈదేవస్థానం యొక్క ఆనవాయితీ. అవిచ్ఛన్నముగా భక్తులచేత కొనసాగబడుట ఈ గ్రామమునకు గర్వకారణం.

ఈ దేవాలయమునకు వంశపారంపర్య ధర్మకర్తలుగా శ్రీ గుంటుపల్లి సుబ్బయ్య, గుంటుపల్లి కనకయ్య, గుంటుపల్లి తిరుపతిస్వామి గార్లు మరియు వారి వంశకులు వ్యవహరిస్తున్నారు.