మజీదులు

మజీదులు
    మసీదు...    

      ముస్లింలు ప్రవక్త మహమ్మద్ చెప్పిన పద్ధతిలో దేవుడైన అల్లాహ్ను ప్రార్థించే స్థలాలను మసీదులు అంటారు.ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్ (جامع), లేక మస్జిద్ఎజామి అని అంటారు. ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మస్జిద్ లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మస్జిద్ లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్ఎఖుబా మరియు మస్జిద్ఎనబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి.

    వీక్షణం...    

      అరబ్బీ లో మస్జిద్ అనగా సజ్దా (మోకరిల్లడం) చేయు ప్రదేశం. సజ్దా లేక సజద పదానికి మూలం 'సజ్ద్' అనగా మోకరిల్లడం (క్రియ). సాజిద్ (కర్త) అనగా సజ్దా చేయువాడు లేక మోకరిల్లువాడు. 'మస్జూద్' (కర్మ) అనగా సజ్దా చేయించుకొన్నవాడు (అల్లాహ్). 'మస్జిద్' అనగా సజ్దా చేయు ప్రదేశం.

    చరిత్ర...    

      ఇస్లాం ఆవిర్భవించిన మొదటలో మస్జిద్ లు విశాలమైన హాలులలో నిర్వహింపబడేవి. రాను రాను మస్జిద్ ల నిర్మాణశైలిలో ఎత్తైన మీనార్లు చోటు చేసుకొన్నవి. ఇస్లామీయ ప్రథమ 3 మస్జిద్ లు సాదాసీదా మస్జిద్ లు. తరువాతి 1000 సంవత్సరాలకాలంలో నిర్మింపబడిన మస్జిద్ లు ఇస్లామీయ నిర్మాణ శైలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నిర్మాణ శైలులతో మిళితమై నిర్మింపబడినవి.

    మొదటి మస్జిద్...    

      ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం ఆదమ్ ప్రవక్త మక్కా లోని కాబా గృహాన్ని నిర్మించి ప్రథమ మస్జిద్ గా ఉపయోగించారు (ప్రార్థనా విధానం నమాజ్ కంటే భిన్నంగా వుండేది). ఇబ్రాహీం ప్రవక్త తనకాలంలో అల్లాహ్ ఆజ్ఞతో తన కుమారుడైన ఇస్మాయీల్ సహకారంతో కాబాను పునర్నిర్మించారు. మహమ్మదు ప్రవక్త మక్కాలో జీవించినకాలంలో కాబాను పవిత్రంగా భావించి తన అనుయాయులతో నమాజు ప్రార్థనలను నిర్వహించారు. పాగన్ అరబ్బులు కాబాగృహంలో తమ ధార్మిక సంప్రదాయాలను తీర్చుకొనేవారు. కాబాగృహానికి ఆధిపత్యం వహించేవారు ఖురేషులు. ఈ కాబా గృహంలో 360 దేవతావిగ్రహాలుండేవి. మహమ్మదు ప్రవక్త మక్కాపై రక్తరహిత విజయం సాధించిన తరువాత, ఈ విగ్రహాలను తొలగించి ఇదే కాబాగృహానికి "ఏకేశ్వరోపాసక తీర్థయాత్రాకేంద్రం"గా ప్రకటించారు. 1577 లో ఉస్మానియా సామ్రాజ్య ఖలీఫాలు నేటి రూపంలో వున్న కాబా ని తీర్చిదిద్దారు. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేసిన తరువాత, మదీనా నగర పొలిమేరల్లోని ఖుబా గ్రామ ప్రాంతంలో మహమ్మదు ప్రవక్త మరియు అనుచరగణం నమాజ్ ను ఆచరించారు, ఈ ప్రదేశమే ఖుబా. ముస్లింలచే నిర్మింపబడిన పురాతన మస్జిద్ మస్జిద్ఎఖుబా. మదీనాకు హిజ్రత్ చేసిన కొద్ది రోజులలోనే మస్జిద్ఎనబవి నిర్మింపబడింది. ఇందులో నిర్మింపబడిన 'మింబర్' విధానం ప్రపంచంలోని అన్ని మస్జిద్ లలోనూ కాన వస్తుంది. ఈ రోజుల్లో మక్కా లోని మస్జిద్అల్హరామ్, మదీనా లోని మస్జిద్ఎనబవి మరియు జెరూసలేం లోని అల్అఖ్సా మస్జిద్ ముస్లింలకు మూడు ప్రధాన పవిత్ర క్షేత్రాలు.

    ప్రార్థనలు...    

      మస్జిద్ లు ప్రముఖంగా ప్రార్థనల కొరకు నిర్మింప బడతాయి. ప్రార్థనలు (సలాహ్ లేదా నమాజ్) ప్రతిదినం ఐదు సార్లు ఆచరిస్తారు. అనగా సూర్యోదయాత్పూర్వం నుండి సూర్యాస్తమయం తరువాత గూడా మస్జిద్ లు ప్రార్థనల కొరకు తెరవబడివుంటాయి. సామూహిక ప్రార్థనలు అధిక ప్రాధాన్యతలు గలవి. ఈ సామూహిక ప్రార్థనా కేంద్రాలే మస్జిద్ లు. ముస్లింలు సలాహ్ ఆచరిస్తున్నారు.

      రోజువారి ఐదు పూటల నమాజ్ కాక 'శుక్రవారపు ప్రత్యేక నమాజ్', రంజాన్ మాసంలో 'తరావీయ్ నమాజ్', షబ్ఎఖద్ర్, షబ్ఎబరాత్, షబ్ఎమేరాజ్ ల నమాజ్ లు కూడా సామూహికంగా మస్జిద్ లలో ఆచరిస్తారు. ముస్లింలు మరణించినపుడు, ఖనన సంస్కారాలకు ముందు సలాతుల్ జనాజా (జనాజా నమాజ్) ఆచరిస్తారు, ఇది కూడా మస్జిద్ లలోనే సామూహికంగా ఆచరిస్తారు. సూర్య చంద్ర గ్రహణాల సమయాలలో కూడా మస్జిద్ లలో "సలాతుల్ఖుసుఫ్" సామూహిక ప్రార్థనలు ఆచరిస్తారు. ఈద్ లైన ఈదుల్ఫిత్ర్ మరియు ఈదుల్అజ్ హా దినాలలో కూడా ఈద్ ప్రార్థనలు మస్జిద్ లలో ఆచరిస్తారు.

    రంజాన్ పర్వాలు...    

      రంజాన్ నెల భక్తులకు పుణ్యకాయ్రాలు చేసేందుకు చక్కటి నెల. సౌమ్ (రోజా) ఉపవాస దీక్షలు, ఉపవాసం దీర్చే ఇఫ్తార్ లు, ఐదు పూటల నమాజులు. సెహర్ లూ, ఏతెకాఫ్ దీక్షలూ, సలాత్అల్తరావీహ్, ఖురాన్ పఠనమూ, షబ్ఎఖద్ర్ నమాజ్ లూ, వీటన్నిటికీ కేంద్రాలు ఈ మస్జిద్ లు.

    దానధర్మాలు...    

      ఇస్లాం ఐదు మూలస్థంభాలలో నాలుగవదైనటువంటి జకాత్ రంజాన్ నెలలోనే ఇస్తారు. సాథారణంగా జకాత్ పంచేవారు పంచుటకు (జకాత్ డబ్బు మస్జిద్ కు ఇవ్వకూడదు, నిషేధం.) మరియు స్వీకరించేవారు స్వీకరించుటకు మస్జిద్ లకు వెళతారు. మస్జిద్ లు ఇలాంటి దానధర్మాలకు నిలయాలు. జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని పారద్రోలడం.

    మీనార్ లు...    

      మస్జిద్ కు వుండే ఒక సాధారణ లక్షణం మీనార్ వుండడం. మీనార్లు ఎత్తుగాను, నిటారుగాను, నాజూకైన నిర్మాణ హంగును కలిగి వుంటుంది. మస్జిద్ ల ఎత్తును బట్టి మీనర్ల ఎత్తుగూడా పెరుగుతుంది. ప్రారంభకాలపు మస్జిద్ లకు మీనార్లు వుండేవిగావు. తరువాతకాలంలో ఈ మీనార్లు ముఅజ్జిన్లు అజాన్ పలుకుటకు ఉపయేగించేవారు. మీనార్లు మస్జిద్ ల హుందాతనాన్ని కూడా చాటేవి. అతి ఎత్తైన మీనారు మొరాకో (అరబ్బీ:మరాఖష్) లోని కాసాబ్లాంకా లోగల హసన్ ఏఏ మస్జిద్లో గలదు.

    గుంబద్ లు (గుమ్మటాలు) ...    

      ఈ గుంబద్లు లేక డూమ్ లు, ప్రార్థనాహాలుల మధ్య ప్రదేశంలో నిర్మింపబడి వుంటాయి. ఈ గుంబద్ లు ఆకాశం మరియు స్వర్గానికి చిహ్నం. సమయానుసారంగఅ ఈ గుంబద్ ల ఆకారం మరియు సైజు పెరుగుతూ వచ్చింది. సాధారణంగా ఈ గుంబద్ లు అర్ధగోళాకారంలోనుంటాయి. మొఘలుల కాలంలో ఈ గుంబద్ లను 'ఉల్లిపాయ' ఆకారంలో నిర్మించారు. ఈలాంటి గుంబద్ లు, దక్షిణాసియా, పర్షియా మరియు భారతదేశంలో కానవస్తాయి. కొన్ని మస్జిద్ లలో ఒకటి కంటే ఎక్కువ గుంబద్ లు కనిపిస్తాయి. ఈ గుంబద్ ల నిర్మాణాలకు కారణం ఇంకోటుంది, ఇమామ్ తన వాణిని వినిపించునపుడు శబ్దతరంగాలు పరావర్తనం చెంది శబ్దం అధికమగుటకు అవకాశము గలదు.

    ప్రార్థనా హాలు...    

ప్రార్థనా హాలుకు ఇంకో పేరు ముసల్లా, ఇందులో ఏలాంటి ఫర్నిచరు వుండదు; కారణం నమాజు ఆచరణా పద్ధతికి ఇవి అనానుకూలం. మస్జిద్ లలో ఇస్లామీయ లిపీ కళాకృతులు ప్రముఖంగా కానవస్తాయి, సాధారణంగా ఖురాన్ సూక్తులు. సాధారణంగా మస్జిద్ లో ప్రవేశద్వారానికి వ్యతిరేక దిశలో ఖిబ్లా వుంటుంది. మస్జిద్ ఖిబ్లా గోడ కాబా వైపున వుంటుంది. నమాజీలు ఖిబ్లా వైపు తిరిగి వరుసక్రమంలో నిలుస్తారు. మిహ్రాబ్ ఖిబ్లా గోడవైపున వుంటుంది. శుక్రవారపు నమాజులో 'ఖతీబ్' (ఖుత్బా ఇచ్చువాడు లేక ప్రసంగీకుడు) మింబర్ పై నిలబడి ఖుత్బా ఇస్తాడు.

    వజూ సౌకర్యాలు...    

      వజూ అనగా నమాజ్ ఆచరించడాని ముందు ముఖం, కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కొని, నమాజ్ కొరకు శారీరక శుభ్రతా పరంగా తయారుకావడం. మస్జిద్ లలో వజూ కొరకు 'వజూ ఖానా'లు, నీటికొలను రూపంలోనూ, కొళాయిల రూపంలోని లేదా ఇతర విధాలుగా నీటిసౌకర్యాన్ని కలిగి వుంటాయి. మస్జిద్ లలో చెప్పులు ధరించి వెళ్ళడం నిషేధం, వీటిని వదులుటకు మస్జిద్ ప్రాంగణాలలో ప్రత్యేక స్థలాల ఏర్పాట్లు వుంటాయి.

    నిర్దేశాలు మరియు సూత్రాలు...    

      మస్జిద్ లు ఇస్లామీయ సంప్రదాయాల నిలయాలు, ఇందు అనేక నిర్దేశాలు సూత్రాలూ గలవు, ఇవన్నియూ అల్లాహ్ను ప్రార్థించి అతన్ని ప్రసన్నుడిని చేసుకొనుటకొరకే. మస్జిద్ లో పాదరక్షలు ధరించిరావడం ప్రపంచంలోని అన్ని మస్జిద్ లలోనూ నిషేధం. మరికొన్ని నిర్దేశాలు.

    ఇమామ్ నియామకం...    

      మస్జిద్ లో ప్రార్థనల నిర్వహణకు ఇమామ్ అవసరం. అతడు తర్ఫీదు పొందినవాడైయుండుట నియమం. ఈ ఇమామ్ ధార్మికవిషయాలలో అధికారికంగా వ్యవహరిస్తాడు. మస్జిద్ లు వివిధదేశాలలో వివిధ విధంగా మస్జిద్ లనిర్మాణాలు జరుగుతాయి. ఇస్లామిక్ దేశాలలో ప్రభుత్వాలు వీటిని నిర్మిస్తాయి. మన దేశంలో వీటిని ప్రభుత్వాలు నిర్మించవు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, చందాలు సేకరించి వీటి నిర్మాణాలు చేయిస్తారు. కాని వీటి నియంత్రణ మాత్రం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. మస్జిద్, మదరసాల నిర్మాణాలకు ప్రభుత్వాల అనుమతి అవసరం చేయబడాలి. ఎక్కడైనా ప్రజలు వీటిని నిర్మింప దలిస్తే ప్రభుత్వాలు వీటికొరకు ఉదారంగా అనుమతులు ఇవ్వాలి. వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో పకడ్బందీగా వీటి నిర్వహణ ఉంచాలి. ఇమామ్ ల నియామకాధికారం స్థానిక మస్జిద్ ల కమిటీల చేతుల్లోనే వుంటుంది. వీటిని వక్ఫ్ బోర్డు చేతుల్లోకి మార్చాలి.

    పరిశుభ్రత...    

      మస్జిద్ లలో పరిశుభ్రత చాలా అవసరం. వజూ అందులోని భాగమే. పాదరక్షలు బయటనే వుంచవలెను. నమాజ్ కు వచ్చు భక్తులు చక్కటి పరిశుభ్రత పాటిస్తారు.

    ధారణ...    

      ఇస్లాం పరస్పర గౌరవాన్ని ప్రకటించే బట్టలు, శరీరాన్ని కప్పివుంచే ధారణల కొరకు నిర్దేశిస్తుంది. శరీరాన్ని బహిర్గతంచేయడం షైతాన్ పనిగా చెబుతుంది. మస్జిద్ కు వచ్చువారు శుభ్రమైన బట్టలు ధరిస్తారు, శరీరపు ఆకృతులు బగిర్గతం చేసే బట్టలు నిషేధం. బిగుతైన బట్టలు ధరించడం నగ్నత్వంతో సమానమని నిర్దేశిస్తుంది. పురుషులు లూజైన బట్టలు ధరించాలి, తమ మోజేతివరకు బట్టలు ధరించాలి. స్త్రీలు హిజాబ్ ధరించడం నియమం.

    ధ్యానం...    

      మస్జిద్ లు ప్రార్థనా గృహాలు, ఇక్కడ శబ్దాలు నిషేధం, ప్రార్థనలు ధ్యానంతో ఆరంభమయి ధ్యానంతోనే అంతమౌతాయి. బిగ్గరగా మాట్లాడడం, ఇతరుల ధ్యానాన్ని భంగం చేయడం తగదు. మస్జిద్ ల యందు గోడలపై ఏలాంటి ఆకృతులు వుండవు, ఇస్లామీయ లిపీకళాకృతులు అవీ ఖురాన్ సూక్తులు వుంటాయి కావున ధ్యానభంగం కలిగే స్థితులే వుండవు, మిగతా ధ్యానవిషయాలు భక్తులపైనే ఆధారపడి వుంటాయి