రక్షిత మంచినీటి సౌకర్యం

      ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దాదాపుగా 21రోజుల వరకు బ్రతకగలడు, కానీ ఒక వ్యక్తి నీరు లేకుండా ఒక వారానికి మించి బ్రతగలేడని శాస్తాలు చెప్తున్నాయి. మనిషి శరీరం కనీసం 60 శాతం నీటితో నిండి ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మానవాళికి నీరు ఎంత అవసరమో. మన గ్రామ ప్రజలందరికి కూడా శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో శ్రీ రావెల సత్యనారాయణ గారు వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే మన గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఇళ్లకు నీటి సరఫరా చేసే పథకం’ సఫలీకృతం కాలేదు. మరలా గ్రామ ప్రజలు కాలువ లేదా బావుల నుండే మంచినీరు తెచ్చుకోవాల్సి వచ్చేది. కొన్ని సార్లు వర్షాకాలంలో ఈ కాలువ లేదా బావి నీరు కలుషితం అవడంచేత, ఆ నీటిని తాగి మన గ్రామస్తులు చాలమంది అంటువ్యాధుల బారినపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్తోమత ఉన్న చాలా కుటుంబాల వాళ్ళు ముందు జాగ్రత్తగా అంటువ్యాధులను బారిన పడకుండా ఉండేందుకు మినరల్ వాటర్ క్యానుల నీటిని రూ.5/- నుండి రూ.50/- వరకు ఖర్చుచేసి కొనుగోలు చేసేవారు. స్తోమతలేని నిరుపేదలు కలుషిత నీరు త్రాగి రోగాల బారిన పడేవారు. కానీ ఈ మినరల్ వాటర్ నీటిని ఎలా, ఎంతవరకు శుద్ధి చేసారో మనకు తెలియదు. అందుకే గ్రామప్రజలందరికీ మంచి ఆరోగ్యం మంచినీళ్లతోనే అనే భావంతో శుద్ధమైన మంచినీళ్ళను అందించాలనే సత్ సంకల్పంతో బొడ్డురాయి ఎదురుగా తమ స్వంత స్థలంలో శ్రీ రావెల సత్యనారాయణ గారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం "రావెల సైదయ్య, హనుమాయమ్మ గార్ల ఉచిత మంచినీటి పథకం"ను, తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఊరందరి దాహార్తిని తీరుస్తూ, ప్రతినెల దానికయ్యే పూర్తి నిర్వహణ ఖర్చులను మరియు వేతనాలను సమకూరుస్తున్నారు.

      కండ్లగుంట గ్రామ వినాయకుడి గుడి వద్ద 'కోడెల సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌' ద్వారా స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీమతి పరిటాల సునీత, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జి.వి.వి. అంజనేయుల గార్ల చేతుల మీదుగా 2015, సెప్టెంబర్-23న గ్రామంలో స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, కోడెల సంజీవయ్య, డాక్టర్‌ కోడెల సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసి, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించినారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాల వారికి స్వచ్ఛమైన, శుద్ధిచేసిన 20 లీటర్ల మంచినీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. ఈ పథకానికి కావలసిన షెడ్డు, యంత్ర పరికరాలను, AMG India International సహకారంతో సుమారు ఏడు లక్షలు రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్ని సమకూర్చినారు.