పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం

      ఈ గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం 1980లో గ్రామ ప్రజల సమష్టి కృషితో స్థాపించబడింది. ఈ సంఘం 35 సంవత్సరాలుగా, లాభాలబాటలో పయనించుచున్నది. అప్పటినుండి రైతులకు అన్నివిధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏటా క్రమం తప్పకుండా డివిడెండు అందజేస్తున్నది. అప్పట్లో గ్రామం నడిబొడ్డున 4 సెంట్ల స్థలాన్ని కొని అందులో రూ.3.5 లక్షలతో భవనాన్ని నిర్మించారు. అందులోని సగబాగాన్ని సెంట్రల్ బ్యాంకుకి అద్దెకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాలకేంద్రంలో 430 మంది సభ్యులుగా ఉన్నారు. రోజువారీ పాలసేకరణ 700 లీటర్లకు చేరినది. ఈ డెయిరీకి పాలు పోసే రైతులకు అదనపు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్యూటరు ద్వారా వెన్నశాతం రీడింగు, పాల పరిమాణం నిర్ధారణ చేస్తున్నారు. నెలకు మూడుసార్లు చెల్లింపులు చేస్తున్నారు. ఉత్తమమైన నిర్వహణ ద్వారా పశుపోషకులకు చాలా మేలు జరుగుచున్నది. పశువుల భీమా పథకం అమలు చేస్తున్నారు. పశువుల దాణా వగైరాలు ప్రభుత్వ ధరలకే అందించుచున్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించుచున్నారు. పశువులకు సమతుల్యాహారం అందించడంలో సహాయపడుచున్నారు. దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై మరియు పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. శాస్త్రీయ పద్ధతులలో పశుపోషణకై అవగాహన సదస్సులు నిర్వహించుచున్నారు. గ్రామంలోని ఈ పాలకేంద్రం, జిల్లాలోనే ఉత్తమ కేంద్రాలలో ఒకటిగా పేరుపొందినది.

    పాల ఉత్పత్తికి పచ్చిమేతే మేలు...    

      పాల ఉత్పత్తికి పచ్చిమేతే మేలంటారు. పాడి రైతులు ప్రతి లీటరు పాల ఉత్పత్తికి 60 నుంచి 70 శాతం మేత, దాణా మీద ఖర్చు చేస్తుంటారు. కొన్ని మెళకువలు పాటిస్తే ఈ ఖర్చు తగ్గించుకునే వీలుంటుంది. పత్తి గింజల చెక్క, సోయా చిక్కుడు గింజలచెక్క, కొబ్బరి పిండి, పాడి పశువుల మేతలోవాడితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. పశువు బరువును బట్టి మేతను నిర్ణయించాలి. ధాన్యపు జాతి లేదా చిక్కుడు జాతి పచ్చిమేతను మేపడం వల్ల బర్రెలు / ఆవుల్లో రోజుకు 6 లీటర్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాణా మిశ్రమం పెట్టనవసరం లేదు. ఒక్కో బర్రెకు రోజువారీ రూ.35 నుంచి 40 రూపాయల లోపు వ్యయం చేస్తే సరిపోతుంది. పచ్చిమేత లేనప్పుడే దాణా మిశ్రమం అవసరమవుతుంది. వరిగడ్డి, దాణాతో ఒక్కో బర్రె మేతకు రూ.42 వరకు ఆదా చేసుకున్నవాళ్లు అవుతారు. పాడి పశువులకు రోజువారీ మేత కోసం దాణా కంటే పచ్చిమేతకు ప్రాధాన్యమివ్వడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పోషకాలు ఎక్కువగా అందుతాయి. దీనిలో కూడా ధాన్యపు పంటల పచ్చిమేత కన్నా చిక్కుడు జాతి పచ్చిమేతలు వేయడం మంచిది.

    పశువుల్లో ఆమ్లా అజీర్తి...    

      పశువులు పిండి పదార్థాలు కలిగిన దాణా లేదా మిగిలిపోయిన అన్నం వంటివి తిన్నప్పుడు ఆమ్లా అజీర్తి సంభవిస్తుంది. సాధారణ పశువుల పెద్ద పొట్టలో ఉండే సూక్ష్మజీవులు పిండి పదార్థా లు, పీచు పదార్థాలను విచ్చిన్నం చేసి, ఫాటి ఆసిడ్లను(క్రొవ్వులోనున్న ఆమ్లము) ఉత్పత్తి చేస్తాయి. ఇవే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కానీ పీచు పదార్థాలు తక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పు డు ఈ ప్రక్రియ విఫలమై నెమరువేయడం మందగిస్తుంది. ఈ క్రమంలో పేడలో గాలిబుడగల వంటివి గమనించవచ్చు. పశువు నీరసంగా ఉంటుంది. కొన్నిరోజులకు బరువు కోల్పోతుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే స్థానిక పశువైద్యులను సంప్రదించి ఆక్సైడ్, సోడియం బైటోనైట్ లేదా సున్నం నీళ్లు పశువులకు తాగించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.