శ్రీ రావెల సైదయ్య హనుమాయమ్మ గార్ల కళ్యాణమండపం

పెళ్ళంటే.. ఓ జ్ఞాపకం.. ఓ తీపి గుర్తు.. ఓ వైభవం...!

....సకల సౌకర్యాలతో.. సర్వాంగ సుందరంగా.. కళ్యాణమండపం

....వంటశాల.. భోజన సామాగ్రి.. ఉచిత మంచినీరు

....వాటన్నింటి పూర్తి నిర్వహణ బాధ్యత

....రూ. కోటిన్నరతో కండ్లగుంటలో నిర్మాణం

....అత్యంత విశాలమైనా కళ్యాణమండపంగా తీర్చిదిద్దిన

                    .... శ్రీ రావెల సత్యనారాయణ గారు

శ్రీ రావెల సైదయ్య హనుమాయమ్మ గార్ల కళ్యాణమండపం

      ఈ వైభవం శాశ్వతం కావాలి! కొన్ని చరిత్రలో ఎంతో మనోహరంగా, నిరంతరం పారే సెలయేరులా ముందుకు సాగివెళుతూ ఉంటాయి. ఈ సెలయేటి ప్రయాణంలో ఎన్నో ఎదురవుతుంటాయి. పచ్చని ప్రకృతిలోని భాగమైన పంటపొలాలు, పూలతోటలు, ఆనందంతో ఉప్పొంగే నేల తల్లితో పాటు, మధ్యమధ్యలో కాస్తంత రాయిరప్ప కూడా ఎదురుకావటం తప్పదు. అయినా ఆ సెలయేరు ఇవన్నీ లెక్కచేయక వడివడిగా సాగుతూ ఉంటుంది. ఈ ప్రయాణానికి అన్నీ విజయాలే, ఆగని అందమైన కథలే. సేవాతత్పరతలో పునీతుడైన శ్రీ రావెల సత్యనారాయణ గారు”... మానవ సేవయే మాధవ సేవ అంటారు. భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా శ్రమిస్తాడు, శ్రమించి తీరాలి. ధనం సంపాదిస్తాడు, కారణం సంపాయించి తీరాలి. ఎంత సంపాదించారన్నది వారి వారి ప్రాప్తాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటాయి. అందరికి ఇది సహజం. కాని ఈ సందర్భంలో అంచనాలు వేయవలసిన అంశం: ఒక వ్యక్తి తాను సంపాదించుకున్న డబ్బు ఏ మేరకు తన చుట్టూ ఉన్న సమాజం కోసం వినియోగించారు? ఈ ప్రశ్నలకు లభించే జవాబు ఆ వ్యక్తి సంస్కారాన్ని, సౌశీల్యాన్ని నిరూపిస్తాయి. ఈ మహోన్నత మానవతకు శ్రీ రావెల సత్యనారాయణ గారు ఓ అందమైన సాక్షి. ఆయన న్యాయంగా సంపాదించటం ఆయన సాధించిన ఘన విజయం. అంతకంటే తన దగ్గర పనిచేసేవారి ఆకలిని, అవసరాలను అంచనాలు వేయగలిగిన అద్భుత మేధావి. అదే వరసలో తనకు ఈ సంపదను ప్రసాదించిన సమాజాన్ని కూడా ఆదుకోవాలన్న ఆయన భావం, లక్ష్యం.

      గృహమద్యమంలో పెళ్లి మండపాన్ని నిర్మించి వివాహం చెయ్యడం సాంప్రదాయం. కాని మారిన మన గృహ నిర్మాణ శైలికి, కాల పరిస్థితికి, ఇంట్లో పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో గుళ్ళలో లేదా ఇతర ప్రదేశాలలో చేస్తున్నాం. గత కొంతకాలంగా రోడ్లపైనే పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ ప్రజలు పెళ్లిళ్లు నిర్వహించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. వివాహాలు చేసుకునేందుకు సరైన ఖాళీస్థలం లేక ఇబ్బందులు పడుతున్న మన కండ్లగుంట గ్రామ వాసుల కల నెరవేర్చాలనే సంకల్పంతో కళ్యాణమండపానికి కావలసినంత స్థలం దానం చేయడమే కాకుండా అన్ని వసుతులతో నిర్మించిన కళ్యాణమండపం వల్ల పెళ్లిళ్ల నిర్వహణకు సౌలభ్యం కలిగింది. కళ్యాణమండపంతో పేదల పెళ్ళిలకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంలో ఇంటి వద్ద పెళ్లి చేసినా టెంట్లు, కుర్చీలు, వంటసామాగ్రికి కనీసం రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఇక ప్రైవేటు వాటికి వెళ్లాలంటే రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. కానీ సాధారణ రుసుం రూ.5 వేల చెల్లిస్తే చాలు అన్ని సౌకర్యాలు, సామాగ్రిని అందజేసి వసతులను కల్పిస్తున్నారు. మన గ్రామ ప్రజల వివాహా, శుభకార్యాలకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పక తప్పదు.

జీవిత సాఫల్య పురస్కారం

      జన్మభూమికి సేవ చేయాలనే తలంపు రావడమే చాలా గొప్ప విషయం. ఆ చేసే పని శాశ్వతంగా నిలిచిపోయేదైతే... ఆ సేవాతత్పరుడు ఇక జనం గుండెల్లో కలకాలం గుర్తుండిపోతాడు. “దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడ గేయానికి నిలువుటద్దం “శ్రీ రావెల సత్యనారాయణ గారు” చెరగని చిరునవ్వుతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహామనిషి.

      1955వ సంవత్సరంలో శ్రీ రావెల సైదయ్య, హనుమాయమ్మ గార్ల దంపతులకు శ్రీ రావెల సత్యనారాయణ గారు ద్వితీయ సంతానంగా కండ్లగుంట గ్రామంలో జన్మించారు. శ్రీ రావెల సైదయ్యగారు గ్రామ మునుసుబుగా గ్రామస్తులందర్ని కలుపుకొని, ఒప్పించి, ఎంతో సహనంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవారు. తండ్రి సహనాన్ని, సహృదయాన్ని వారసత్వంగా పొందిన వీరు ఉన్నత విద్యను అభ్యసించి పట్టభద్రులైనారు.

      శ్రీ రావెల సత్యనారాయణగారి జీవన ప్రస్థానంలో, ఆయన చేసే ప్రతి పనిలో, వారి సహధర్మచారిణి శ్రీమతి చంద్రావతి మరియు వారి కుమారుడు జ్ఞానకోటేశ్వరరావు, కోడలు శరణ్య, కుమార్తెలు-అల్లుళ్ళు మాధవి-శ్రీనివాసరావు, కల్పన-సతీష్ గార్లు తోడుగా ఉన్నారు. చేసే సహాయం గుప్తంగా చేయడం ఆయన నైజం. హైమా డెయిరీ, తిరుమల డెయిరీ, తిరుమల ఇంజినీరింగ్ కాలేజ్, జ్యోతిర్మయి టెక్స్ టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ సహా వ్వవస్థాపకుడుగా మన ఊరి నుంచి దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన ఈ మహామనీషి మన ఊరివారికే కాకుండా ఎందరికో ఉపాధిని కల్పించారు. మన గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పాలు, పెరుగు, మంచినీళ్ళు ఉచితంగా కుల-మత-రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరికి అందిస్తున్నారు. తన దానగుణంతో ఆర్ధిక సహాయం కోసం వచ్చిన వారందరికీ కాదనకుండా ఎందరో జీవితాలు నిలబడడానికి చేయూతనందిస్తున్నారు. ఆధ్యాత్మిక భావంతో గ్రామశివాలయాన్ని పునఃరుద్దరించడంతో గ్రామాభివృద్దికి ప్రత్యక్షంగా శ్రీకారం చుట్టిన వీరు, అందరికి మంచి ఆరోగ్యం మంచినీళ్లతోనే అనే భావంతో శుద్ధమైన మంచినీళ్ళ కేంద్రాన్ని తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటుచేసి ఊరందరి దాహార్తిని తీరుస్తూ, ప్రతినెల దానికయ్యే ఖర్చులను, వేతనాలను సమకూరుస్తున్నారు.

      ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అంటే అంత గొప్పగా, పవిత్రంగా ఈకార్యం జరుగుతుందని అర్ధం. కాని నేడు ఉన్న పరిస్థితుల్లో ఆకాశమంత పందిరి.. నేలంతా విందు చేసే పరిస్థితులు లేవు. ఇంటి ముందు ఎదో చిన్న పందిరేసి, ఏ ఫంక్షన్ హోటల్ లోనో విందు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైనది. స్థలాభావం, ఇతర సమస్యలు ఇందుకు ప్రధాన కారణం. పెళ్ళంటే ఓ జ్ఞాపకం. ఓ తీపిగుర్తు. దాన్ని “గుర్తుండిపోయే జ్ఞాపకం”గా చేసేందుకు 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా..” ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కళ్యాణమండపం పునఃనిర్మాణ బాధ్యత నాదే అని ప్రకటించి, సిమెంటు స్త్రక్చర్ గా ఉన్న మండపాన్ని గేటులు, కిటికీలు, ఫాన్లు, విద్యుత్తులైటులు, రంగులు, డైనింగ్ హాలుకు కావలసిన సామాను, వంటగది, పసందైన వంటకాలను తయారు చేసుకొనుటకు వంటసామగ్రితో సహా సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో అత్యంత విశాలమైన కళ్యాణమండపానికి కావలసినంత స్థలం దానం చేయడమే కాకుండా, నేతిచెంబు, పెళ్లి పీటలు లాంటి ప్రతి చిన్న అవసరాన్ని గుర్తించి ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో పునఃనిర్మించారు.

      వ్యాపార పనులలో తీరిక లేకున్నా, వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గ్రామంలోని ప్రతి పేదవాడు శుభాకార్యాన్ని అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని జరుపుకొనుటకు కావలసిన సకల సౌకర్యాలను సమకూర్చారు. బయట సరుకులు మాత్రమే తెచ్చుకుంటే చాలు, మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనేంత అద్భుతమైన సౌకర్యాలతో మీరు గ్రామానికి అంకితం చేసిన కళ్యాణమండపం కండ్లగుంటకు లభించిన గొప్ప ఆస్థి. ఇది గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. మన గ్రామ ప్రజలందరికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకొనుటకు వేదికగా మీరు నిర్మించిన గ్రామ కచేరి మన గ్రామానికి అంకితమిచ్చిన మరో మణిహారం.

      మీ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, చిరునవ్వు, సేవాతత్పరత ఎందరికో స్ఫూర్తిదాయకం. స్వయంకృషితో ఎంత ఎత్తుకు ఎదిగినా, మీ మూలాలను గుర్తుంచుకొని జన్మభూమిపై మీరు చూపిస్తున్న వాత్సల్యానికి మన పల్లె తల్లి పులకిస్తుంది. ఊరి కోసం సుసంపన్నమైన మనసుతో మీ సంపదలో మీ బిడ్డలతో పాటు ఊరికి కూడా భాగమిచ్చిన మీరే మా “శ్రీమంతుడు”.

      మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి మనసున్న మనిషిగా మీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. మనం వివాహానంతరం మన ఇంట్లో జరుపుకొనే సత్యనారాయణస్వామి వ్రతంలోనే సత్యనారాయణ గారి పేరు దాగుంది. ఇది ఆ భగవంతుని దైవాజ్ఞలాగా మీరు మన గ్రామానికి కళ్యాణమండపం పునఃనిర్మించారు. ఇక్కడ వివాహం చేసుకున్న ఏ జంటా ‘సత్యనారాయణ’ గారిని మరువదు. కండ్లగుంట ముద్దుబిడ్డలైన మిమ్మల్ని ఏనాటికి మరువదు ఈ గడ్డ.

      మీరు సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యములతో నిండు నూరేళ్లు జీవించాలని మీ యశస్సు ఆచంద్రార్కం నిలవాలని మన పల్లెలో ప్రతి హృదయం ఆశీర్వదిస్తుంది, ఆకాంక్షిస్తుంది. మన పల్లె తల్లి ఆయనను నిండు మనసుతో దీవిస్తుంది. కండ్లగుంట గ్రామనికి మీరే “శ్రీమంతుడు” గా ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్న ఓ ధన్యజీవి చంద్రుడికో నూలుపోగులా మీకు మీము అందిస్తున్న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోండి.

ఇట్లు

కండ్లగుంట గ్రామ ప్రజలు

    చిత్రమాలిక    
    వీడియోలు