శ్రీ పెమ్మసాని రాఘవయ్య గారి మెమోరియల్
వైకుంఠ మహాప్రస్థానం

ప్ర‌శాంతం.. చివ‌రి మ‌జిలీ...!

....ఆహ్లాదకరంగా వైకుంఠ మహాప్రస్థానం

....దహన సంస్కారాలకు వచ్చిన వారికి సకల సౌకర్యాలు

....రూ. కోటిన్నరతో కండ్లగుంటలో నిర్మాణం

....ఉద్యానవనంగా తీర్చిదిద్దిన శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు

శ్రీ పెమ్మసాని రాఘవయ్య గారి మెమోరియల్ వైకుంఠ మహాప్రస్థానం

      ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటాడు. సుఖ సంతోషాల మధ్య ఎంత కాలం కొనసాగుతాడో.. ఆటు పోట్ల మధ్య కూడా అంతేకాలం మనిషి మనుగడ సాగిస్తాడు. బాధతో, బాధ్యతతో సమాజంలో బతుకునీడుస్తూ, ఎంతగొప్పగా బతికినా చివరికి కాలే కట్టెకావల్సిందే.. మనిషి బతుకంతా ప్రశాంతంగా ఎప్పుడూ ఉండదు. తెల్లారితే, పొద్దుగూకితే తలమీద వంద బాధ్యతలు.. కాటికిపోతే తప్ప బాధ్యతలు దిగిపోవు. బతికినంత కాలం ఎంతో గొప్పగా గౌరవంగా బతుకుతాం. ప్రాణం వదలగానే ఊరికి ఉత్తరాన ఉన్న మట్టిలో కలిసిపోతాం. ఆ మట్టికి కాస్త గౌరవప్రద స్థానం కల్పించి, దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది, మనిషి చివరి మజిలీ అయినా ప్రశాంతత మధ్య సాగాలన్న లక్ష్యంతో కండ్లగుంట గ్రామంలో “వైకుంఠ మహాప్రస్థానం” ను ప్రశాంత నిలయంగా శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు మార్చి, ఓ స్మృతి వనంలా తీర్చిదిద్దారు.

      “వైకుంఠ మహాప్రస్థానం” లోని లోపలి భాగం, మృతదేహాలు కాల్చే చోటు దహన సంస్కారాలకు వచ్చి వారు విశ్రాంతి తీసుకునే స్థలం అద్భుతంగా నిర్మించారు. 1960 నుండి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు పాలించినా శ్మశాన వాటికలు మనిషి చివరి జీవితానికి ఆనంద నిలయమని గుర్తించినా, ఆ దిశగా పునర్నిర్మించలేక పోయాయి. మన గ్రామంలో శ్మశాన వాటికకు “శ్రీ పెమ్మసాని రాఘవయ్య గారి మెమోరియల్ వైకుంఠ మహాప్రస్థానం” గా నామకరణం చేసి అదే స్థాయిలో నిర్మాణం చేసారు. మన గ్రామంలోని “వైకుంఠ మహాప్రస్థానం” ను ఆదర్శంగా తీసుకుని కులాల వారీగా కూడా గ్రామంలో శ్మశాన వాటికలను స్థలాలు అప్పగిస్తే.. ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసింది. గతంలో వారికున్న పొలాలు, వ్యవసాయ భూముల్లో గుర్తింపుగా సమాధులను, నిర్మించుకునేవారు. అవి కొంత కాలానికి శిథిలమై పోయేవి. ఇప్పుడు అలాగాకుండా “వైకుంఠ మహాప్రస్థానం” లో కేవలం చితికి నిప్పంటించి, ఒక మొక్కను నాటి స్మృతి వనంగా పెంచాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్తే అది శ్మశాన వాటిక అని ఎవరూ గుర్తించలేరు. గతంలో శ్మశాన వాటిక అంటే అక్కడికెందుకులే అన్న ఆలోచన వచ్చేది. ఇప్పుడా పరిస్థితిని శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు దూరం చేసి, మనిషి ప్రాణం విడిచాక ప్రశాంతత ఉండాలని ఆలోచించి, ఈ నూతనత్వానికి రూపుకల్పన తీసుకొచ్చారు. సాధారణ శ్మశానానికి భిన్నంగా కండ్లగుంటలో వైకుంఠ మహాప్రస్థానాన్ని నిర్మించారు. చౌడు భూములలో మురుగుకుంటలాగా ఉన్న ప్రాంతాన్ని అత్యంత వ్యయప్రయాసలతో, చిరునవ్వుతో, సహనంతో, పది అడుగుల లోతులో ప్రతి నిముషానికి ఊరే నీటిని తోడుకుంటూ, లోతైన పూడికలను తీసుకుంటూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని అద్భుత వాటికను ఆవిష్కరించారు. అందమైన స్వాగత తోరణం నుంచి లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడు, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుడు మరియు సత్యహరిశ్చంద్రుని విగ్రహాలు, స్నానాలు చేయడానికి ప్రత్యేక గదులు, వేచి ఉండడానికి విశాలమైన ప్రాంగణం, కాటికాపరికి ప్రత్యేక గది, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని మొక్కలతో, అంత్యక్రియలకు అవసరమైన సకల సదుపాయాలతో పాటు ఇది ప్రేతాత్మల నిలయం కాదు, లయకారుడు పరమశివుడు నివాసమైన సాక్షాత్ కైలాసం అని అనుభూతి కలిగించేలా అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో సకల దేవతామూర్తుల నిలయంగా చేశారు. పచ్చనిచెట్లు, పచ్చిక బయళ్లతో రూపుదిద్దుకున్న ఈ ఆవరణను మొదటిసారి చూసిన వారు ఉద్యానవనం అనుకుంటారు. పచ్చదనానికి తోడు కాళ్లకు మట్టి అంటకుండా సీసీ రహదారులు, పచ్చి మధ్య బండలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

      అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠ మహాప్రస్థానం (శ్మశాన వాటిక) నిర్మించారు. ఇందు కోసం శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు రూ. కోటిన్నర రూపాయలు పైగానే వెచ్చించారు. రెండు దహన పేటికలు, దహన సంస్కారాలు తిలకించేలా విశ్రాంతి మందిరం, చనిపోయిన మూడో రోజు, దశదిన కర్మ రోజు పూజలు చేసేందుకు ఆరాధన స్థలాలు నిర్మించారు. ఖాళీ ప్రదేశంలో వివిధ రకాలైన మొక్కలు నాటి, ఆవరణ అంతా పచ్చిక పెంచారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక స్నానాలు చేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించి, అందులో షవర్లు, కుళాయిలు బిగించారు. దుస్తులు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు విడివిడిగా గదులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారికి ప్రశాంతత కోసం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆడియోలు ఏర్పాటు చేశారు. శ్మశానం చుట్టూ ప్రహరీ నిర్మించారు. నీటి సౌకర్యం కోసం బోరు వేసి, నీరు నిల్వ చేసుకునేందుకు వీలుగా బావిని, ట్యాంకులు నింపేందుకు కరెంటు మోటర్లు కూడా ఏర్పాటు చేసినారు. ఇందులోకి ప్రవేశించగానే శ్మశానంలో ఉన్నామనే భావన రాకుండా ఎటుచూసినా రంగు రంగుల పూల మొక్కలతో రూపుదిద్దారు. ఈ “వైకుంఠ మహాప్రస్థానం” ను సుమారుగా రెండు ఎకరాలలో నిర్మించారు.

జీవిత సాఫల్య పురస్కారం

      జన్మభూమికి సేవ చేయాలనే తలంపు రావడమే చాలా గొప్ప విషయం. ఆ చేసే పని శాశ్వతంగా నిలిచిపోయేదైతే ... ఆ సేవాతత్పరుడు ఇక జనం గుండెల్లో కలకాలం గుర్తుండిపోతాడు. “జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపి గరీయసి” కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అన్న ఆర్యోక్తిని ఆదర్శంగా తీసుకొని సముచిత రీతిలో జన్మభూమి రుణం తీర్చుకున్న శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు ధన్యులు.

      1950వ సంవత్సరంలో శ్రీ పెమ్మసాని రాఘవయ్య, శేషారత్నమ్మ దంపతులకు శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య తృతీయ సంతానంగా కండ్లగుంట గ్రామంలో జన్మించారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్యను అభ్యసించి పట్టభద్రులైనారు. వ్యవసాయం, వ్యాపారం, సమాజసేవ, బంధుమిత్రుల ఆదరణ ఇలా భర్త చేసే ప్రతి కార్యానికి అర్ధాంగి అనే పదానికి నిర్వచనంలా వారి సహధర్మచారిణి శ్రీమతి కొండమ్మ గారు ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులనే కాకుండా ఆదర్శాలను కూడా పంచుకొనే కూతుళ్ళు–అల్లుళ్ళు అయిన సుజాత-బ్రహ్మం, శైలజ-శ్రీనివాసరావు, మాధవి-వెంకన్నచౌదరి అందరూ కలసి ఆదర్శ కుటుంబానికి అర్ధాన్ని చెప్పారు.

      వందల సంవత్సరాలుగా మురుగుకుంటో, మరుగుదొడ్డో, స్మశానమో గుర్తుపట్టలేనంతగా ఉండి, మనిషి చనిపోయినప్పుడు కనీసం నలుగురు మనుషులు పాడె మోసుకెళ్ళడానికి కూడా జాగా లేకుండా ఉండేది. సాటి మనిషి చనిపోయినపుడు కర్మకాండలు జరుపుకోవడానికి సరైన స్మశాన వాటిక లేక ఆత్మీయులు, స్నేహితులు, మన గ్రామానికి వచ్చిన బంధువులు ఎంతో ఇబ్బందికర పరిస్థితులలో స్మశాన వైరాగ్యంలా ఆ కాసేపు కనీస సౌకర్యాలు ఉంటే బావుంటుంది అనుకునేవారు.

      “ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు” అన్నట్లు, “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అన్న మహాకవి శ్రీశ్రీ ప్రేరణగా “వైకుంఠ మహాప్రస్థానం” నిర్మాణానికి 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా...” ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో తమ సంకల్పాన్ని ప్రకటించినారు.

      బతికినంత కాలం ఎంతో గొప్పగా గౌరవంగా బతుకుతాం. ప్రాణం వదలగానే ఊరికి ఉత్తరాన ఉన్న మట్టిలో కలిసిపోతాం. ఆ మట్టికి కాస్త గౌరవప్రద స్థానం కల్పించి, దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది, మనిషి చివరి మజిలీ కూడా గౌరవప్రదంగా ఉండాలనే అద్భుత తలంపునకు మూల కారకులు పెమ్మసాని బ్రహ్మయ్య గారు. చివరి దశలో ఇక్కడ నుండి ప్రశాంతంగా మరొక జన్మలోకి ప్రవేశించడానికి ఆత్మ క్షోభించేది. మన ఊరిలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మను సుఖసంతోషాలతో మరొక జన్మలోకి ప్రవేశింపజేయాలనే తలంపుతో ఈ “వైకుంఠ మహాప్రస్థానం” నిర్మించడానికి పూనుకొన్నారు.

      ఆత్మ అనంత శక్తినిస్తుంది. ఆత్మ శాశ్వతమైనది, చావు పుట్టుకలు లేనిది. పని చెయ్యాలనే కోరిక (ఇచ్ఛ), పనిచేసే విధానం (జ్ఞానం), పని (క్రియ) – ఈ మూడు ఆత్మ స్వరూపాలే. ఇలాంటి ఆత్మను సుఖసంతోషాలతో మరొక జన్మలోకి ఈ “వైకుంఠ మహాప్రస్థానం” ద్వారా సాగనంపాలనే తలంపుతో ఓ బృహత్కార్యానికి బ్రహ్మయ్య నడుం బిగించారు. చౌడు భూములలో మురుగుకుంటలాగా ఉన్న ప్రాంతాన్ని అత్యంత వ్యయప్రయాసలతో, చిరునవ్వుతో, సహనంతో, పది అడుగుల లోతులో ప్రతి నిముషానికి ఊరే నీటిని తోడుకుంటూ, లోతైన పూడికలను తీసుకుంటూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని అద్భుత వాటికను ఆవిష్కరించారు. అందమైన స్వాగత తోరణం నుంచి లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడు, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుడు మరియు సత్యహరిశ్చంద్రుని విగ్రహాలు, స్నానాలు చేయడానికి ప్రత్యేక గదులు, వేచి ఉండడానికి విశాలమైన ప్రాంగణం, కాటికాపరికి ప్రత్యేక గది, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని మొక్కలతో, అంత్యక్రియలకు అవసరమైన సకల సదుపాయాలతో పాటు ఇది ప్రేతాత్మల నిలయం కాదు, లయకారుడు పరమశివుడు నివాసమైన సాక్షాత్ కైలాసం అని అనుభూతి కలిగించేలా అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో సకల దేవతామూర్తుల నిలయంగా చేశారు.

      స్వర్గపురికి దారి అన్నట్లు మీరు నిర్మించిన మహాప్రాకారం అద్భుతం, ఆశ్చర్యం. రాకాసి కంప, జమ్ము తప్ప మరే చెట్టు బతికి బట్టకట్టలేని చౌడుభూమిలో సుమారు ఐదు వేల మొక్కలను అతివృష్టి, అనావృష్టిలను తట్టుకొని ప్రతి మొక్కను స్పృశించి, నీరందించి బీడుభూముల్లో నందనవనాన్ని సృష్టించిన మీకృషి “నభూతోః నభవిష్యత్ః”.

      ప్రతినిత్యం వ్యక్తిగతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ వ్యాపారాలని, వ్యాపకాలని, కుటుంబాన్ని మరిచి మహాప్రస్థానం స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ, అన్ని పనుల్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేయించారు. మన ఊరిలో నభూతో నభవిష్యతి అనేలాగా ఓ అద్భుతమైన “వైకుంఠ మహాప్రస్థానం”ను దేశంలోని ప్రతి గ్రామం స్ఫూర్తి పొందేలాగా నిర్మించి, మన గ్రామానికి అంకితం చేశారు.

      ప్రతి జీవికి బ్రహ్మరాతే విధిరాత. మన తలరాతను బట్టే చావు పుట్టుకలు ఉంటాయి. బ్రహ్మ మనకు జన్మనిస్తే.. ‘మరణం’ అనే ప్రక్రియ గౌరవప్రదం చేసేందుకు ‘వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక’ ద్వారా ఈ ‘బ్రహ్మయ్య’ కండ్లగుంట పాలిట ‘విదాత’ అయ్యారు.

      మీరు, మీ కుటుంబసభ్యులు కలకాలం సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యములతో నిండు నూరేళ్లు జీవించాలని మీ యశస్సు ఆచంద్రార్కం నిలవాలని మన పల్లెలో ప్రతి హృదయం ఆశీర్వదిస్తుంది, ఆకాంక్షిస్తుంది. మన పల్లె తల్లి ఆయనను నిండు మనసుతో దీవిస్తుంది.

      ఊరికి దక్షిణాన ఎదురునడవడానికి శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని, ఉత్తరాన వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటికను నిర్మించి కండ్లగుంట గ్రామ చరిత్రలో మీరే “స్ఫూర్తిప్రదాత” అనేవిధంగా ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్న ఓ ధన్యజీవి చంద్రుడికో నూలుపోగులా మీకు మీము అందిస్తున్న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోండి.

ఇట్లు

కండ్లగుంట గ్రామ ప్రజలు

    చనిపోయినవారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు...    

      దీని వెనుక ఎంతో గొప్ప అర్థముంది. ‘నేనెంతో ధనం సంపాదించాను. ఒక్క పైసా కూడా తీసుకెళ్లటం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. ధర్మంగా, న్యాయంగా జీవిస్తూ, పదిమందికీ సాయం చేసి పోవటమే అసలైన మానవ ధర్మం. కాబట్టి మీరైనా స్వార్ధ చింతనలకు దూరంగా ఉండి, పదిమందికీ మేలు చెయ్యండి’ అని చనిపోయిన వ్యక్తి మిగిలినవారికి సందేశమిస్తున్నాడని చెబుతున్నట్టు తెలియజేయడానికి కనిపెట్టిందే ఈ చర్య.

    అవసాన దశలో తులసి తీర్థమెందుకు పోస్తారు...    

      విష్ణుమూర్తి పాదాల చెంత ఉంటుంది కాబట్టి తులసి మహోన్నతమైనది, పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. దానివల్లే తులసికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం మనం. ఈ విషయాన్ని పక్కన పెడితే... తులసి కొన్ని వందల అనారోగ్యాలను మటుమాయం చేస్తుంది.

    అందుకే అవసాన దశలో నోటిలో తులసి తీర్థం పోస్తారు. అది జీవి శరీరంలో వేడి రగిల్చి, శరీరాన్ని చల్లబడకుండా చేసి, మరికొంత కాలం బతికేలా చేసే అవకాశం ఉంది. అందుకే అలా చేస్తారు.

    యమపురి దారి ఎలా ఉంటుంది...    

      మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళతారు. దారి అంత ఎగుడుదిగుడులు, ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపులోనే నీరుంటుంది. త్రాగబోతే చేతికి అందదు. మేహమేఘాలు నిరంతరం వర్షిస్తుంటాయి. అయితే అవి వర్షించేది నీరు కాదు రక్తాన్ని. అలా పదిహేడు రోజుల పాటు జీవించినపుడు చేసిన పాపాలను తలచుకొని వాపోతుంటాడు జీవుడు. ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.

    బ్రహ్మ కపాలంపోయి పిండప్రదానం చేసివచ్చినవారు తద్దినం పెట్టనక్కరలేదంటారు నిజమేనా...    

      పూర్వం తీర్ధయాత్రలకు వృద్ధాప్యంలో నడిచి వెళ్ళేవారు. కాశికి పోయినా, కాటికి పోయినా సమానమన్న సామెత అందుకే పుట్టింది. ఈనాడు కారులు, రైళ్ళమీద పసిపిల్లలు కూడా పదిసార్లు వెళ్లివస్తున్నారు. ఇక మాసికాలు, తద్దినాలు, పిండప్రదానాల వెనుక అర్ధం, పరమార్ధం ఉన్నాయి. చనిపోయిన జీవుడు తన సంస్కారాలకు అనుకూలమైన వ్యక్తి గర్భవాసంలో ప్రవేశించడానికి వెతుకుతూ ఉంటాడు. కొడుకులను తల్లిదండ్రుల సంస్కారాలు ఉంటాయి కనుక తమ గర్భవాసంలో ప్రవేశించాడానికి పిండప్రదానం చేస్తారు. పిండ మంటే శరీరమే. కనుక తాము పిల్లలనుకనే వయసువారైతే పిండప్రదానం చేయడం తప్పదు.

    మరణించిన వారి పేరు ముందు స్వర్గీయ అని రాస్తారెందుకు...    

      జన్మలో చేసిన పనులని బట్టి మరణించిన జీవి స్వర్గ, నరకాలకి వెళతారు. ఈ మనవ నిత్య జీవిత కర్మలలో ఎవ్వరూ స్వర్గానికి పోయే అవకాశము లేదు. అలాగే చనిపోయిన వారి గూర్చి ఏ ఆశబ్ధదోశము వాడిన మాహాపాపం. అంతటి పాపం అంటకుండా ఉండేందుకు స్వర్గీయ అని సంభోదిస్తారు.

    పితృకర్మలు ఎందుకు చేయాలి...    

      నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మన కనీస మానవత్వము. వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి. ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే..

      దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి.. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.

      వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.

      పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

      మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి. మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.

      ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీ కి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.

      పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.

      పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.

    శ్రాద్దం పెట్టే ప్రదేశం ఎలా ఎంచుకోవాలి...    

      దక్షిణ దిశా పల్లంగా ఉండేలా చూసుకోవాలి. పరిశ్రమైన ప్రదేశంలో, ఎవ్వరూ లేని ప్రదేశంలో చూసుకొని గోవు పేడతో అలకాలి. పరిసరాల్లో గడ్డి లేకుండా చూసుకోవాలి. శ్రాద్ధం గృహంలో పెడితే ఎనిమిది రెట్లు ఫలం అధికము. పుణ్యక్షేత్రాలలో, తీర్ధల్లో చెయ్యాలనుకుంటే కురుక్షేత్రంలోనూ, గయలోనూ, గంగా తీర ప్రాంతముల్లోనూ, సరస్వతీ తీర్ధములోనూ, ప్రభాస తీర్ధమూ, పుష్కర క్షేత్రము సర్వశ్రేష్టమైనవి.ఒక వంశంలో ఒకబిడ్డ జన్మించిందీ అంటే ఆ వంశస్తులకీ, ఆ జీవికీ మధ్య వున్న బలీయమైన బంధమే దానికి కారణం, ఆ బిడ్డపై పూర్వీకుల ప్రభావం చాలా వుంటుంది. అందుకే తాను జీవించినంతకాలమూ వారి బంధం అలా కొనసాగుతుంది. వాళ్లు మరణించిన తరువాత కూడా కొంతకాలం ఆ ప్రభావం ఉంటుంది. మరణించిన జీవుడు సంవత్సరం పాటు ఊర్థ్వలోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో కూడా ఆ జీవుడి దృష్టి తన వారిపై ఉంటుంది. కనుక తమ వంశస్థులు, పుత్రపౌత్రాదులు చేసే శ్రాద్ధకర్మలు తర్పణాలు విడుదల వలనా ఊర్థ్వలోకంలోని పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశస్థులను, పుత్రపౌత్రాదులను ఆశీర్వదిస్తారు.

    అమావాస్యకు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలా...    

      మన శ్రేయస్సును కోరుకునేవారు పితృదేవతలు. సూర్యోదయ, సూర్యాస్తమయం పితృదేవతలకు వేరుగా వుంటాయి. కృష్ణపక్ష అష్టమి తిథి మధ్యలో వారికి సూర్యుడు ఉదయిస్తాడు. శుక్లపక్ష అష్టమి నాడు అస్తమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే అమావాస్యకు సమయం వారికి మధ్యాహ్న సమయవుతుంది. పితృదేవతల గురించిన పూర్తి వివరాలను విష్ణుపురాణం ప్రధమఖండం వెల్లడిస్తోంది. ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. పిండాలు పెట్టలేని స్ధితిలో వున్నవారు కనీసం నీరు వదలాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో గడపవైపు తిరిగి నమస్కరించాలి. పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారు. మొదటి మూడు గణాల దేవతలు అమూర్తులుగా అంటే వారికి ఎలాంటి ఆకారాలు వుండవు. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయి. భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధ దాతకు సుఖ, సంతోషాలను ఇస్తుంటాయి. దీంతో పాటూ శ్రాద్ధ దాతకు సంబంధించిన తాత, ముత్తాత, తండ్రి ఏలోకంలో వున్నా పితృదేవతలు వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మనకు తెలిసి పితృదేవతలంటే తాత, తండ్రి అనుకుంటారు. అయితే దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు వుంటారని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. పితృదేవతలు తృప్తిగా వున్నంత కాలం యావత్ విశ్వం సుభిక్షంగా వుంటుంది. అందుకనే విధిగా పితృదేవతలకు ఈ కార్యక్రమం చేయాలి.

    భవిష్యత్తును సూచించే కాకి అరుపులు.... ఇంటిపై కాకి పదే పదే అరిస్తే...    

      మన పూర్వీకులు మనుషుల జీవితం మరణం కాకితో ముడిపడినట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్మకం చాలామందిలో ఉంది. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని కూడా చెబుతుంటారు. కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని, ఇంట్లో కాకి అరిచినా కొన్ని ప్రదేశాలపై వాలినా కాకి తాకినా.. తన్నినా.. అది కొన్ని జరగబోయే అంశాలకు సూచికాలని కొన్ని నమ్మకాలు ఉన్నాయి.

      ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు కాకి వచ్చి, గట్టిగా అరిచి, వెళ్లిపోయిందంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో, వాళ్లు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఒకవేళ కాకి తన నోట్లో రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే, మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని మంచి జరగబోతోందని సంకేతం.

      ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా అది ఎవరిపైన అయినా పడితే... అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం అది మరణానికి సంకేతం. ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే, ఆ వ్యక్తి కాస్తా అనారోగ్యానికి గురవుతారని సంకేతం. గుంపులు గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి, అరుస్తూ ఉంటే... ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్లో అరిస్తే.. అది అశుభ వార్తకి సంకేతం.

      అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం. ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్లు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే.. ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది. ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే.. ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది.

    శునకాలు ఏడిస్తే.. మరణాలు సంభవిస్తాయా... యమధర్మరాజు రాకకు సంకేతమా...    

      అశుభ సంకేతాలను, ప్రకృతీ వైపరీత్యాలను పశుపక్ష్యాదులు, మూగజీవులు సులభంగా గ్రహిస్తాయి. అలాంటి మూగజీవుల్లో ఒకటైన శునకం.. పెంపుడు జంతువు. ఇంకా విశ్వాసానికి మారుపేరు. అలాంటి శునకం రాత్రిపూట లేదా పగటి పూట మూలిగితే.. లేదా ఏడ్చినట్లైతే మరణాలు సంభవిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శునకాలు ఇలా చేయడం యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావించాలని వారు చెప్తున్నారు.

      ప్రకృతిని, భగవంతుడి ఉనికి గ్రహించే శక్తి మానవుల్లో అంతగా ఉండదని.. అదే మూగజీవుల్లో ఆ శక్తి దాగివుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా శునకాలకు దివ్య, దుష్టశక్తులు కనిపిస్తాయట. ఇక పశుపక్ష్యాదుల్లోనూ అతీత శక్తులుంటాయని.. మనిషి గుర్తించలేని ఎన్నో విషయాలను అవి గ్రహిస్తాయట. శునకాలకు ఏడ్వడం.. అరుస్తూ వుండటం, మూలగడం వంటివి చేస్తే అశుభ సంకేతమని భావించాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

    చిత్రమాలిక    
    వీడియోలు