వివాహ సంప్రదాయం

      పెళ్ళంటే… తాటాకులతో పందిరి వేయాలి… మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి… అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి… పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ… రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు…. రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం… కొన్ని వేల మంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు…. ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే.

    వివాహం అనగా...    

    పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం అను పదమునకు నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. ఈ ఒప్పందమే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం", "పరినయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్టసుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసిమెలిసి వుందామని, వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.

    శబ్ద ఉత్పత్తి...    

    పెళ్ళి అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నవి. పెళ్ళికి ఇంగ్లీషు భాషలో “మ్యారేజ్” అని అర్ధము. ఆంగ్లభాషలో ‘మ్యారేజి’(marriage) అని అంటారు. ఈ పదం మధ్య ఆంగ్ల పదమైన mariage నుండి ఉత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం marier (పెళ్ళి చేసుకొనుట) నుండి తుదకు లాటిన్ పదమైన marītāre (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు marītāri అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన marīt-us -a, -um అనగా పెళ్ళి సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో భర్త అనే పదం లేదా స్త్రీ రూపంలో “భార్య” అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు. పెళ్ళికి సంబందించిన పదం “matrimony” పాత ఫ్రెంచ్ పదం అయిన matremoine పదం నుండి ఉద్భవించినది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ mātrimōnium అనే లాటిన్ పదం నుండి జనించినది.

    వివాహ ఆవశ్యకత...    

      అవివాహితులుగా ఉండేవారి సంఖ్య నేటి రోజుల్లో ఎక్కువ అవుతున్నది. పెళ్లి చేసుకుని బాధ్యతల్లో కూరుకుపోవడం కన్నా, స్వేచ్ఛగా జీవించడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కాని గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి వివాహం అత్యవసరం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుట్టిన ప్రతి మనిషికీ నలభై రకాల సంస్కార కర్మలు ఉన్నాయి. గౌతముడు, బోధాయనుడు, వశిష్ఠుడు మొదలైన ఋషులు ప్రవచించిన ధర్మసూత్రాలే హిందూధర్మానికి మూలం. మనిషి హిందూ ధర్మశాస్ర్తాల్లో ముఖ్యమైనది మనుస్మృతి.

" సంతుష్టో భార్యాయాభర్తా భర్త్రా భార్యా తథైవచ యస్మిన్నేవ కులోనిత్యం కల్యాణం తత్ర వైధ్రువం" (మను 360)

    ఏ ఇంట్లో అయితే భార్యతో భర్త, భర్తతో భార్య ఎప్పుడూ సంతోషంగా ఉంటారో ఆ ఇల్లు నిత్యకల్యాణంగా వర్ధిల్లుతుంది అని మనుధర్మశాస్త్రంలోని పై శ్లోకం చెబుతుంది.

"న గృహం గృహ మిత్యాహుః గృహిణీ గృహముచ్చతే"

    అంటే ఇల్లు అనేది ఇల్లు కాదు. ఇల్లాలే అసలైన ఇల్లు అని అర్థం. అదేవిధంగా గృహస్థుడు అంటేనే భార్య కలవాడు అని అర్థం. సొంత ఇల్లు కట్టుకున్నప్పటికీ వివాహం కానివాళ్లను గృహస్థులని పిలువరు.

    ఋగ్వేద కాలం నుంచి ఏర్పడిన వివాహ వ్యవస్థ మనిషి జీవితంలోని గృహస్థ్రాశ్రమ దశ ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. గృహస్థుగా మగవాడు ఆచరించాల్సిన కర్మలన్నింటికీ భార్య అవసరం.
మనుస్మృతి ప్రకారం గృహస్థుడంటే సాంగవేదాలను పఠించిన తర్వాత గురువు ఆజ్ఞతో భార్యను విద్యుక్తముగా గ్రహించి ధర్మార్థ కామములను నడుపుచూ పంచ యజ్ఞాలను చేస్తూ రుజువర్తనతో ఉండేవాడు అని అర్థం.
ఉద్వాహం అంటే వధువును ఆమె పుట్టినింటి నుంచి తీసుకుని వెళ్లడం. అదే కాలక్రమంలో వివాహం అనే పదంగా పరిణామం చెందింది.
అందుకే గృహస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించాలనుకునేవాళ్లకు వివాహం అనేది అత్యంత అవసరమైన క్రతువు.

    హిందూ వివాహం...    

    ఒక పవిత్ర కార్యము అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగింది. అయితే 1956లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అంతే కాక హిందూ మత ఆచారానికి గుర్తింపు నివ్వబడింది. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరించడం జరుగుతుంది. హిందూ వివాహపు సరైన గుర్తింపు కోసం మతాచారాలను పాటించడం ప్రధానం. హిందూ వివాహం చెల్లుబాటు అగుటకు ఈ క్రింది ఉదహరించిన పద్ధతులు పాటించాలి.

* వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది.

* వధూవరులకు గతంలోనే వివాహమైన పక్షంలో వారి భర్త లేదా భర్త జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు. ఈ షరతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహాన్ని బహుభార్యత్వం అనే నేరంగా పరిగణిస్తారు.

* వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది.

* వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ" అనే మానసిక వ్యాధికి గురి అయి ఉండరాదు.

* వధూవరుల మధ్య నిషేధించబడిన స్థాయిలలో బంధుత్వం ఉండరాదు. అనగా ఒకరు వారి తల్లి నుండి మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు. అలాగే వధూవరులకు సపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పైస్థాయిలో ఉండరాదు. సోదర-సోదరి, పినతండ్రి‌-మేనమామ, మేనకోడలు-‌కూతురు, మేనత్త-పినతల్లి, ‌మేనల్లుడు-కుమారుడు, సోదరులు-‌సోదరీల సంతానముల మధ్య వివాహం నిషేధించబడింది. ఏ వ్యక్తి అయినా తన సోదరుడి భార్యను విడాకులైన తరువాత కూడా వివాహం ఆడరాదు. అయితే ఏ ప్రాంతములోనైనా, లేదా సామాజిక వర్గంలోనైనా అనాదిగా పాటిస్తూ వచ్చిన ఆచారం రీత్యా నిషిద్ధ స్థాయిలలో బంధుత్వం ఉన్నప్పటికీ వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య గతించిన వ్యక్తి, భర్త గతించిన మహిళను వివాహమాడవచ్చు.

* కేవలం సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఒక దస్తావేజు రాసి నమోదు చేయించినంత మాత్రాన హిందూ వివాహం చెల్లుబాటు కాదు. వివాహానికి సంబంధించిన ఆచార క్రతువులు నిర్వర్తించనిదే ఆ వివాహం సక్రమమైనదిగా గుర్తించలేము. అదే విధంగా హిందూ వివాహాల రిజిష్టర్ లో అసలు వివాహం కార్యక్రమమే జరుపకుండా నమోదు చేసిన వివరాలు ఆ వివాహాన్ని చలామణి చేయవు. అయితే వివాహ కార్యక్రమం పూర్తి అయిన తరువాత హిందూ వివాహ రిజిష్టర్ లో వధూవరులు తమ వివాహ వివరాలను నమోదు చేయవచ్చు. ఈ రిజిష్టర్ లోని నమోదు చేయబడిన అంశాలు వివాహం వాస్తవంగా జరిగినట్లు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇలా నమోదు చేయడం దంపతులిద్దరికీ ఉపయోగకరం.

* ఆంధ్రప్రదేశ్ లో అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 35, మహిళా అభివృద్ధి, బాలలు మరియు వికలాంగుల సంక్షేమ విభాగం తేది.24.09.2003 ద్వారా నిర్దేశించింది. హిందువులు 1955 నాటి హిందూ వివాహ చట్టంలో పేర్కొనబడిన విధానాల ద్వారా మాత్రమే కాక 1954 నాటి ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం వివాహం చేసుకోవచ్చు. అంతేకాక హిందూ మతాచార వివాహాన్ని కూడా ప్రత్యేక వివాహాల చట్టం పరిధిలో నమోదు చేసుకోవచ్చు. ఒక హిందూ మరొక హైందవేతర స్త్రీ పురుషుల మధ్య వివాహం ప్రత్యేక వివాహం చట్ట పరిధిలోకి వస్తుంది. స్త్రీ పురుషులిద్దరు తప్పనిసరిగా హిందువులు అయినపుడు మాత్రమే వారి వివాహం హిందూ వివాహ చట్టంలోని అంశాల ద్వారా నియంత్రించబడుతుంది.

    హిందూ వివాహ సంప్రదాయం...    

* ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక సుసంస్కారములు జరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారుకాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.

    హిందూ మత వివాహ విధానం...    

* హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల (ఇరువురు) తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల జాతక సమ్మేళనములోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు మరియు 20 వింశతి (కూట) వర్గములు అనే వివాహ పొంతనములు చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.

* ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, అందుబాటు, అవసరార్ధం, అవకాశం, ఆర్ధిక స్థితిగతుల, ఆకాంక్ష అయినదనిపించుకునేందుకు, తదితరాల మేరకు సంబంధము కలుపుకొని నిశ్చయించుకుంటున్నారు. ప్రస్తుతము వివాహ సంబంధములు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలోఎక్కువగా ఆకుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.

* జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో, ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్ని పొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభివృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతుంది. క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కడతారు.

    వివాహ పద్దతులేన్ని రకాలు...    

    వివాహం ఎన్ని రకాలు అని ఠక్కున అడిగితే జవాబు చెప్పడం కష్టం. ఒకో ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉండే వేర్వేరు ప్రజల ఆచారాలను బట్టి వివాహం జరిగే తీరు విభిన్నంగా ఉండవచ్చు. కానీ ఏ వివాహమైనా హైందవ స్మృతులలో పేర్కొన్న ఎనిమిది రకాల వివాహాలలో ఒక రీతిని తలపించక మానదు. ఇంతకీ మన స్మృతులలో పేర్కొన్న వివాహాలు ఇవీ...

బ్రహ్మం :- అర్హుడైన వరుడిని ఎంపిక చేసుకుని, తన కుమార్తెని వివాహమాడవలసిందిగా అతడిని కోరి, శాస్త్రబద్ధంగా వివాహం చేయడం బ్రహ్మవివాహం.

దైవం :- యజ్ఞయాగాదులు చేసే సమయంలో, ఆ క్రతువుని నిర్వహిస్తున్న రుత్విజునికి తన కన్యను ఇచ్చి వివాహం చేయడం దైవవివాహం.

అర్షం :– ఒకప్పుడు సంపద అంటే గోసంపదే! అలాంటి రెండు గోవులను స్వీకరించి కూతురిని ఇచ్చి వివాహం చేయడం అర్షవివాహం.

ప్రాజాపత్యం :– ఇకనుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యను కంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్య వివాహం.

అసురం :- కన్యను ఇచ్చి వివాహం చేసేందుకు వీలైనంత కన్యాశుల్కాన్ని దండుకున్న తర్వాతే కూతురిని ఇచ్చి వివాహం చేయడం అసుర వివాహం.

గాంధర్వం :- పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే అది గాంధర్వ వివాహం.

రాక్షసం :- తన కన్నుపడిన స్త్రీని... ఆమె ఇష్టం కానీ, ఆమె బంధువుల అభీష్టం కానీ లేకుండా బలవంతంగా ఎత్తుకువెళ్లి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం.

పైశాచికం :– నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను మనువాడటం పైశాచిక వివాహం అవుతుంది.

    నిశ్చయ వివాహం...    

    పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని ‘నిశ్చయ వివాహం’ అంటారు. నిశ్చయ వివాహాన్ని ఆంగ్లంలో ఆరేంజ్డ్ మ్యారేజ్ (arranged Marriage) అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని హిందువులు నిశ్చయ వివాహాలను జరిపిస్తున్నారు.

    వధువు...    

    హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతీల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.

    వరుడు...    

    త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.

    బంధుత్వ పర్యటన...    

    బంధువుల పర్యటన అనగా అమ్మాయి కోసం అబ్బాయిని, అలాగే అబ్బాయి కోసం అమ్మాయిని వెతుకుతారు. ఈ విషయంలో ఇరువురు చాలా జాగ్రత్త వహిస్తారు. సంబంధాన్ని తెలిసిన మిత్రుల, బంధువుల, ఆప్తుల నుండి మాత్రమే ఎక్కువగా వెతుకుతారు. కుటుంబనేపథ్యం గురించి, సంప్రదాయాల గురించి, ఆచార-వ్యవహారాల గురించి, ఆస్తిపాస్తుల గురించి ఒకరినొకరు తెలుసుకుంటారు.

    పెళ్ళి చూపులు...    

    హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు, వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యేంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని హిందువులు గాఢంగా నమ్ముతారు, కనుక పెళ్ళి చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వద్ద జరుగును. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లేదా 5 మందితో అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయిని అలంకరణలతో తయారు చేసి అబ్బాయికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి (అమ్మాయికి, అబ్బాయికి) నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడా కుదిరిన పిదప తరువాత అడుగు పడుతుంది. ఈ పెళ్ళిచూపుల కార్యక్రమంలో అమ్మాయిల ఇష్టాలను పెద్దగా పట్టిచ్చుకోరు అని అంటారు. కాని కాలం మారింది, అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చితేనె తరువాత అడుగు పడేది.

    నిశ్చితార్దం మరియు లగ్నపత్రిక...    

    వధూవరుల తారాబలం, చంద్రబలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్తబలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితీ. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో వధూవరుల తల్లిదండ్రుల మధ్య కుదిరిన ఇచ్చిపుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారపద్ధతి". ఈ నిశ్చితార్దం కూడా అమ్మాయి వాళ్ళ ఇంటివద్దనే చేస్తారు, అబ్బాయి తరుపు వారు వారి బంధువులను తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి వారు కూడా వాళ్ళ బంధువులకు చెప్పుకుంటారు. శుభముహూర్తంలో అబ్బాయి తరుపువారు మరియు అమ్మాయి తరుపువారు, వారి తలిదండ్రులు, పురోహితుడు మరియు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని ‘లగ్నపత్రిక’ కార్యక్రమం అంటే పంతులుని పిలిపించి లగ్నపత్రిక రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందాన్నే ‘నిశ్చితార్థం’ అంటారు. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంటలోని అబ్బాయిని పెళ్ళి కుమారుడు అని, అమ్మాయిని పెళ్ళి కుమార్తె అని వ్యవహరిస్తారు. తరువాత 3 లేదా 5 లేదా 7 మంది ముత్తైదువులు ఒక తాంబులంలో దీపారాధన కుంది ఉంచి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని దాని క్రింద ఉండేట్టుగా చేసి మంగళ హారతులు పాడతారు. తరువాత ఆ కార్యక్ర్రామానికి వచ్చిన ప్రతి ఆడవారికి జాకెట్ గుడ్డ లేదా వేరే ఏదైనా ఇస్తారు. అబ్బాయి వాళ్ళ తరుపు వాళ్ళందరికి ఆడపెళ్ళి వారు భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.

    ఆహ్వాన పత్రికలు...    

    లగ్నపత్రికలో నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారివారి కులాచారానుసారంగా ‘ఆహ్వానపత్రిక’లు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు/పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.

    పెళ్ళి పిలుపులు...    

    బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వసాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడప్పుడూ కలిసే బంధువులందరూ కలువగలిగే మంచి సందర్భాలు పెళ్ళిళ్లు. ఆకలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు (కల్యాణమంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోపతాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్ళిలోనూ ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.

    సరంజామా...    

    పెళ్ళి సరంజామా కొనటం అనేది పెళ్ళి వారి ఇండ్లలో అన్నిటికంటే పెద్దపని. పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

    కళ్యాణ మండపము...    

    గృహమద్యమంలో పెళ్లి మండపాన్ని నిర్మించి వివాహం చెయ్యడం సాంప్రదాయం. కాని మారిన మన గృహ నిర్మాణ శైలికి, కాల పరిస్థితికి, ఇంట్లో పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో గుళ్ళలో లేదా ఇతర ప్రదేశాలలో చేస్తున్నారు. కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపం యొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

    యజ్ఞోపవీత ధారణ...    

    ‘యజ్ఞ్‌ ఉపవీత' అను రెండు పదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞార్థము అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీత దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ" శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమ కర్మలన్నింటికి బోధకంగా సూచకంగా ఉంటుంది. కనుక ఆర్యులు వ్రతమయంగా జీవితం గడుపదలంచి దీనిని వ్రతచిహ్నంగా దీక్షాచిహ్నంగా ధరిస్తారని గ్రహించాలి. ఇది మామగారు వేస్తారు కావున ‘శ్వశుర దత్త యజ్ఞోపవీతము’ అంటారు.

    ఈ యజ్ఞోపవీతధారణ ఉపనయన సంస్కారంలో చేయబడుతుంది. ఉపనయన సంస్కారంలో రెండు భాగాలున్నాయి. ఒకటి యజ్ఞోపవీతధారణ, రెండు వేదారంభము (గాయత్రీ మంత్రోపదేశము). బాల్యంలో ఐదవయేటనో ఎనిమిదవయేటనో బాలబాలికలకు ఉపనయనం చేయబడుతుంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి విద్యాబుద్ధులార్జించుటకు తమచెంత చేరిన విద్యార్థినీ విద్యార్థులకు ఉపనయన సమయంలో గురువులు మొదట విద్యాచిహ్నంగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. సత్యవ్రత మంత్రాలతో జీవితం వ్రతమయంగా గడపాలని బోధిస్తారు. పిమ్మట గాయత్రీ మంత్రోపదేశంతో వేదారంభం చేస్తారు. కాబట్టి వ్రతమయంగా జీవితం గడపడానికి యజ్ఞోపవీతం బాహ్యచిహ్నంగా ధరింపబడుతుందనుటలో సందేహంలేదు. అయితే బాహ్యచిహ్నం ధరించినంతమాత్రన శారీరకంగా మానసికంగా ప్రవృత్తిలో మార్పువస్తుందా? యజ్ఞోపవీతధారి ఉత్తముడగునా? అని ప్రశ్నింపవచ్చు. బాహ్యచిహ్నం బాహ్యచిహ్నమే. బాహ్యచిహ్నంలో ఒక విశేష కార్యాచరణకు పురికొల్పు శక్తి ఉండనేరదు. అయితే, ఒక విషయం చూడాలి. యూనివర్సిటీవారు గ్రాడ్యుయేటుకు చిహ్నంగా గౌను ఇస్తారు గదా! ఆ గౌను గ్రాడ్యుయేటు నొనరిస్తుందా? ఒనరించదు. కాని అంతమాత్రాన అది అనావశ్యక మనగలమా? అనజాలము. గ్రాడ్యుయేటు గౌను నాన్ గ్రాడ్యుయేటుల నుండి భేదింపజేస్తుంది. బాలభటుడు దుస్తులు తదితరుల నుండి వానిని వేరుస్తారు. ఇట్లు చిహ్నములన్నీ భేదబోధకములే అవుతాయి. చిహ్నలక్షణమే భేదబోధకత్వం. అట్లే ఆర్యులకు, అనార్యులకు (దస్యులకు) భేదబోధక చిహ్నమే యజ్ఞోపవీతం అవుతుంది. ఇతర చిహ్నాలను ఆదరించినట్లే సమాజం యజ్ఞోపవీతాన్ని కూడ ఆదరించాలి. యజ్ఞోపవీత నియమాలను బోధించి, పాలించి, పాలింపజేసి సమాజం దానిని ఆదరిస్తూఉంటే తప్పకుండా యజ్ఞోపవీతంవల్ లజనులకు (యజ్ఞోపవీతధారులకు) మేలు కలుగుతుంది. యజ్ఞోపవీతధారులు శ్రేష్ఠులు అవుతారు. సందేహం లేదు. అయితే యజ్ఞోపవీతధారులై కూడా కొందరు దృఢసంకల్పంతో దాని నియమాలు పాలించకపోవచ్చు. అట్టి వారికి దాని ప్రయోజనం లభించదు. ఏలయనగా ప్రార్థనలో మొదటి భాగం సంకల్పం మాత్రం చేసి, రెండవ భాగమైన ప్రయత్నం ఆచరణ చేయనిచో (ప్రార్థన పూర్తికాకుండ) ప్రార్థనా ఫలం ఎట్లు సిద్ధిస్తుంది.? రెండుభాగాలు నెరవేర్చిననాడే ప్రార్థన పూర్తవుతుంది. ఫలితం సిద్ధిస్తుంది. ఇది నియమం.

    కన్యా వరణం...    

    వివాహ సంస్కారంలో కన్యా వరణం ప్రధానమైనది. కన్యా వరణ మంటే మంచి లక్షణాలున్న కన్యని నిర్ణయించుకోవటం. దీనిని వరాగమనము అని కూడా అంటారు. వరుడు అలంకరించుకొని మంగళ గీతాలతో, వేద మంత్రాలతో మంచి వాహనాన్ని అధిరోహించి ఆడ పెండ్లి వారింటికి వెడతాడు.

    పూర్వ కాలం వరుడు యోగ్యులైన మిత్రులని తన కోసం మంచి కన్యని వెదికి పెట్టమని తాంబూలం ఇచ్చి అడిగే వాడట. వారు బాగా విచారించి వరునికి అనురూపమైన మంచి లక్షణాలున్న కన్యని నిశ్చయించేవారు. ఈనాడది కన్య పక్షం వారు వరుని వెదకటంగా అన్వయించుకోవచ్చును. లక్షణాల కన్నా ముందు శకునాలు సరి అయినవి ఉండాలని తలచేవారు. అమ్మాయిని చూడటానికి వరుడు కాని, వరుడి బంధువులు కాని వచ్చినప్పుడు ఆ కన్య నిద్ర పోతున్నా, ఇంట్లో లేక పోయినా, ఏ కారణంగానైనా దుఃఖిస్తూ ఉన్నా ఆ సంబంధం కుదుర్చుకోకూడదనే నమ్మకం ఉండేది. గుప్త, ఋషభ, శరభ, వినత, వికట, మండూషిక, ముండ, సాంకరిక, రత, పాలి, మిత్ర, వర్షకరి, నక్షత్ర నామ, నదీనామ, వృక్ష నామ, రేఫము గాని లకారము గాని పేరులో ఉపధ (చివరి దానికి ముందు) గా ఉన్న కన్య వర్జింప దగిన వారుగా చెప్పబడింది.

    ఉత్తమ వంశంలో జన్మించింది, సంప్రదాయం శీలం ఉన్నది, శుభ లక్షణాలు కలిగినది, ఆరోగ్య వంతురాలు అయిన కన్యను ఇటువంటి లక్షణాలే ఉన్న వరుడికి ఎంతో నేర్పరితనంతో ఎంపిక చేయాలి. ఆనాటి వారు ఈ ఎంపికకి వధూవరుల పరస్పర నయనోల్లాసం, మనస్తృప్తి ప్రధానమైన ప్రమాణంగా గ్రహించే వారు. ఇంకా కన్య లక్షణాలను మన శాస్త్రాలు మరి కొన్ని చెప్పాయి. ఆమె సాముద్రికాది లక్షణాలు ఉన్నది, దేహ పుష్టి ఉన్నది, అన్న దమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నది, అన్నదమ్ముల వరుస ఉన్న పురుషుల కుటుంబాలలో పుట్టనిది, సగోత్రము కానిది, సోదరి, తల్లి, కూతురు వరుస కానిది........ పది సంవత్సరాలు నిండనిది అయిన కన్యను ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వ్యవహారం ఈ తీరులో జరగటం లేదు. నిజానికి అవసరం లేదేమో! ఆ కాలంలో కూడా ఇది అనవసరం అని హరదత్తుడనేముని అభిప్రాయపడ్డాడు. బ్రాహ్మ దైవవివాహాలలో ఈ కన్యావరణ పద్దతి అక్కర లేదని ఆర్ష, ఆసుర వివాహాలలో కావాలని హరదత్త మహర్షి అభిప్రాయం. కన్యను నిశ్చయించుకొన్న తరువాత వరుడు బంధు మిత్రులతో కలిసి ఆడ పెండ్లి వారింటికి తరలి వెడతాడు.

    స్నాతకం...    

    స్నాతకం అంటే బ్రహ్మచర్యాన్ని వీడడం. గురుకులంలో బ్రహ్మచర్యాశ్రమాన్ని కష్టపడి దీక్షతో విద్యలన్నీ అభ్యసించి గృహస్దాశ్రమంలో ప్రవేశించమని గురువు ఆదేశించిన తరువాత స్నాతకవ్రతము చేసి గురుకులం నుండి గృహమునకు పంపించును. అన్ని దీక్షలను వదిలేసి క్షురకర్మ చేయించుకుని వేడినీళ్ళతో స్నానం చేసినవాడు స్నాతుడవుతాడు. అది ఈ వ్రతంలో ముఖ్యక్రియ కాబట్టి దీనికి స్నాతక వ్రతమని పేరు. ఇట్టి స్నాతక వ్రతములు పెళ్ళికుమారుని ఇంటిలోగాని, కళ్యాణ మండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు. ఇది పెళ్ళికి మొదటి మెట్టు. తైత్తిరీయోపనిషత్తు స్నాతకునికి గురువు చేయవలసిన ఉపదేశాన్ని ఇలా పేర్కొంటున్నది.

‘వేదమనుచ్యచర్యో అంతేవసినమను శాస్తిసత్యంవడ ధర్మం చరస్వాద్యాయానమ ప్రమద్’

వేదాధ్యయనం పూర్తి చేయించి గురువు శిష్యుణ్ణి ఇలా శాసిస్తున్నాడు. సత్యం మాట్లాడు. ధర్మాన్ని ఆచరించు. నేను నేర్పిన విద్యను తిరిగి అధ్యయనం చేయడంలో అశ్రద్ధ చేయకు. ఆచార్యునికి ఇష్టమైన గురు దక్షిణను సమర్పించి నీ వరకు వచ్చిన మానవ సంతతి అనే దారాన్ని తెంపి వేయకు. అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి యోగ్యమైన సంతానాన్ని, విజ్ఞానాన్ని ఉపదేశించి విద్య సంతతిని కూడా పెంపొందించు. అయితే ఈ గృహస్థాశ్రమ నిర్వహణ చాల కష్టమైంది. ఎన్నో భ్రమలు, పొరబాట్లు రావడానికి అవకాశం ఉంది. కనుక నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో పొరబడకు. అభ్యుదయ సాధనలో పొరబడకు. వేదాన్ని అధ్యయనం చెయ్యడంలోను లేక జ్ఞానాన్ని సంపాదించడంలోనూ ఇతరులకు వేదాన్ని నేర్పడంలోనూ లేక ఇతరులకు విజ్ఞానాన్ని ఉపదేశించడంలోను ఏమరుపాటు పడకు.

‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’

తల్లిని దైవంగా అర్చించు. తండ్రిని దైవంగా ఆరాధించు. గురువునుదైవంగా గౌరవించు. అతిథిని దైవంగా ఆదరించు.

‘యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాని అస్మాకగుం సుచరితాని తాని త్వయా ఉపాస్యానినో ఇతరాని’

మంచి పనులను, మహనీయులు చెప్పిన వాటిని ఆచరించు. చెడ్డ పనుల జోలికి పోవద్దు. మేము ఆచరిస్తున్న మంచి పనులను నీవు కూడా ఆచరణలో పెట్టు. ఇతరమైన వాటి జోలికి పోవద్దు. మన దగ్గరికి శ్రేయోభిలాషులు, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే బ్రాహ్మణులు వస్తే వాళ్ళను ఆహ్వానించి ఆతిధ్యమిచ్చి ఆదరించు. ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వు, ఆశ్రద్ధతో ఇవ్వద్దు. నీ సిరి సంపదలకు తగినట్లు దానం చెయ్యి. అయ్యో! ఇంతే ఇవ్వగలుగుతున్నానే అని సిగ్గు పడుతూ ఇవ్వు, భయపడుతూ ఇవ్వు, తీసుకొనే వ్యక్తిలో భగవంతుణ్ణి చూస్తూ ఇవ్వు. నీవు చేసే సత్కార్యాలలో గానీ, నీ నడవడిని గురించి గానీ సందేహాలు కలిగినప్పుడు నీతో పాటు దార్మిక జీవనాన్ని గడుపుతూ సమభావన కలిగి భగవద్భక్తితో, ధర్మబద్ధమైన కోరికలతో, ఇతరులలో తప్పులు కనపడినప్పుడు, వాళ్ళను నిందించాల్సి వచ్చినప్పుడు కూడా సమభావనతో దైవహ్బక్తితో ధార్మికమైన అభిలాషలతో ఏ లోపం లేకుండా చక్కని వివేకంతో ప్రతి విషయాన్ని విమర్శించి ఒక నిర్ణయానికి రాగల బ్రహ్మజ్ఞానులైన పెద్దలు, ఆ పరిస్ధితులలో ఎలా ప్రవర్తించారో తెలుసుకొని నీవుకూడా అలాగే ప్రవర్తించు. ఇదే మా ఆదేశం. ఇదే మా ఉపదేశం. ఇదే వేదసారభూతమైన ఉపనిషత్. ఇదే మా అనుశాసనం. ఇలాగే సాధన చెయ్యి. ఇలాగే సంస్కారాన్ని పెంచుకొంటూ మళ్ళీ మళ్ళీ సాధన చెయ్యి.

    ఆహా! ఎంత చక్కటి ఉపదేశం. ప్రాచీన భారతదేశంలో బ్రహ్మచర్యాన్ని చక్కగా పూర్తిచేసి విద్యలను సంపాదించి పెండ్లి చేసుకొని గృహస్దుగా మారి ఈ సమాజసేవకు అంకితమయ్యే అంతేవసికి గురువు చేసే ఉపదేశమిది. అతడి బ్రతుకుకు ఆచార్యుడు వేసే బంగారు బాట ఇది. విద్యా బుద్ధులతో నీటి నియమాలతో, భక్తీ విశ్వాసాలతో, సేవ సంస్కారాలతో తన శిష్యుణ్ణి తీర్చిదిద్ది ఈ సమాజానికి అంకితం చేస్తున్నాడు గురువు స్నాతకోత్సవంలో. ఒక్కసారి ఆలోచిచండి.! భారతీయ సంస్కృతీ ఎంత ఉదాత్తమైన విలువలతో నిండి ఉన్నదో!

    స్నాతక సమయంలో ఆచార్యుడు అందించిన ఉపదేశంలో "ఇంత వరకూ నీ వంశస్దులు మంచి సంతానాన్ని సమాజసేవ కోసం అందిస్తూ వచ్చారు. భావి జీవితాన్ని భాసురంగా తీర్చిదిద్దుకొని ఇతరులకు సేవ చేసే విజ్ఞానాన్ని సంపాదించావు కాబట్టి నీ వరకు వచ్చిన ఈ సంతాన లతను త్రెంచివేయకుండా నీ పితృల రుణాన్ని తీర్చుకోవడానికి మంచి సంతానాన్ని పొందాలి. అందుకోసమే గృహస్దాశ్రమాన్ని స్వీకరించు! అనే మాటలకు కట్టుబడి ఆయన అనుమతిని తీసుకొంటాడు. స్నాతకుడు ఆ తరువాత గురు దక్షిణతో పాటు ఆవు, దూడ, ఎద్దు మొదలగు వాటిని ఆయనకు సమర్పించి అప్పటినుంచి ఒక సంవత్సరం వ్రతదీక్షలో ఉంటాడు.

    కాశీ యాత్ర...    

    కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధుమిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు.

    ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది, మేనమామతాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధుమిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

    మంగళ స్నానాలు...    

    పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెలతెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లితండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.

    అంకురార్పణం...    

    స్నాతకం ఇంట్లో చేసుకున్న నాడే, అంతకు ముందుగా ‘పెళ్ళికొడుకు’ ను చేసే తంతు జరుగుతుంది. అదే విధంగా, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" అంటారు. పెళ్ళి కూతురు మట్టి కుండలలో కొండలనుండి తెచ్చిన మట్టితో నింపి తొమ్మిది రకాల గింజలు వేస్తారు. అది మనిషి పుట్టుకకు అనుకరణ.

    కొత్నాలు...    

    రెండు బుట్టలతో ధాన్యము వధూవరుల ఎదుట పెట్టి, ముత్తైదువులు దంచి ఆ ఊకను వధూవరుల నెత్తి మీద పల్లెరములలో చెరుగుతారు. తరువాత తలలకు చమురు పెడతారు. తరువాత వేరే బట్టలు కడతారు. మధుపర్కాలను చాకలికి వేసి, తొందరగా ఆరవేసి తీసుకువచ్చే ఏర్పాటు చెస్తారు. కొత్నాలు దంచిన రోకళ్ళతో ముత్తైదువులు వధూవరుల నాభిస్థానమునందు తాకించవలెను. దీనివలన ఉదర రోగములు నసింపబడునని పెద్దలు చెప్పుదురు. వివాహ సమయంలో కాళ్ళగోళ్ళు ఆచారములో ఉన్నది. గోళ్ళు పంటితో కొరుకుట దురాచారము. ఆయుధంతో తీయుట సదాచారము. గోతిలో విషముండునని వాటిని తొలగించేదరు.

    నీలలోహిత ధారణ..    

    దేవేంద్రునికి ప్రియపత్ని అయిన ఓ ఇంద్రాణి! నీకు నమస్కారము. నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి ‘నీలలోహితే........... బధ్యతే’ అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.

    ఆడ పెళ్ళివారిచ్చేవి...    

    సాధారణంగా ఆడ పెళ్ళివారిచ్చేవి విధిగా ఇవ్వాల్సినవి :- స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధుపర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెంబిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి వరుడికి పెట్టాల్సిన బట్టలు ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్షర్ట్ లు లాంటివి, వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ వ్రతమప్పుడు వధూవరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకుఅత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె. సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులుఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగసున్నిపిండి, కిలోంబావు పసుపుఅందులో సగం కుంకుమ, చీరెధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు ముఖ్యమైనవి.

    మగ పెళ్ళివారిచ్చేవి...    

    సాధారణంగా మగ పెళ్ళివారిచ్చేవి విధిగా ఇవ్వాల్సినవి :- స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలుఇతర చీరెలు, నగలుఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరెతండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

    శుభిక (భాశికం)...    

    హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక కారణాలు, శాస్త్రీయమైన దృక్పథాలు దాగివున్నాయి. ఈ భాశికమునకు వేదములో ఈ విధముగా చెప్పబడింది. "శుభికేసిర ఆరోహ శోభయన్తీ ముఖం మమ ముఖగుం హిమమశోభాయ భూయాగుం సంచభాగం కురు”. ఓ భాశికమా! మా సిరముననాడు ఉంది భాసించుము. నా యొక్క ముఖమునకు, మాకు హిమవంతుని వంటి చల్లదనమును, మంచి ఐశ్వర్యమును ఇమ్ము. ఈ మంత్రమును కార్యాన్తమందు మంగళ హారతి నందు చెప్పుచున్నారు. పెళ్లిలో వధువరులకు నుదుటన బాసికం కడుతారు.

    మనిషి శరీరంలో 72వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి. ఈ 14 నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు మరీ ముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడి వైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటాయి. ఈ రెండూ కలిసేది ముఖంలోని నుదుటి మధ్య భాగం. ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో వుంటుంది. దీనిని దివ్యచక్షవు అని రుషులు అంటుంటారు. ఈ దివ్యచక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా వుండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారు. బాసికం అర్ధచంద్రాకారంలో కానీ, త్రిభుజాకారంలో కాని వుంటుంది.

    వరాగమనం...    

    సుముహూర్తం నిశ్చయమైన తరువాత ముందుగా వరుడు బంధుమిత్రులతో కలిసి మంగళగీత వాద్యాలతో, శుభ శకునాలతో కన్యాదాత ఇచ్చిన విడిది ఇంటికి తరలి వెళ్ళడమే వరాగమనం అంటారు. అతని వెంట పెద్దలు, బ్రాహ్మణులు, ముత్తైదువులు, బంధువులు, మిత్రులు కూడా బయలుదేరి వెడతారు.

    విడిది మర్యాదలు...    

    మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్ళి వారు, "ఎదురుకోలు" పలికే ఆచారం సరదాగా సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండుగుడ్డలు, వేడినీళ్లు లాంటివి) ముందు భాగంలో (హాలులో) పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడపెళ్ళి వారు. మేళతాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామగారు, వారి సమీపబంధువులు ఎదురుకోలులో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకుకి బావమరిదితో కాళ్ళు కడిగిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీపలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన.

    గౌరీ పూజ...    

    ఒక వైపు వధువు గౌరీపూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వరపూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి, పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పార్వతిదేవి శివుని అర్ధనారీశ్వరానికి ప్రతీక. పవిత్రతకు పెళ్లి కూతురు ప్రతీక. పెళ్ళి కూతురు మొగుడితో సుఖ, సంతోషాలతో ఉండాలని మనస-వాచా-కర్మణ (మనసు, శరీరము) కలవాలని పెళ్ళి కూతురితో పూజ చేస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టుదిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వరపూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడపెళ్ళి వారువారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వానిస్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించుకోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యాదాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్ళివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారంసాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యాదాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది.

    మధుపర్కం...    

    హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. పెరుగు, తేనే, సమంగా కలిపి ఒక కంచు పాత్రలో పోసి దానిపై కంచు మూత పెట్టి దారాలతో గట్టిగా బంధిస్తారు. దీనినే ‘మధుపర్కం’ అంటారు. కొందరు దీనిలో నెయ్యి కలపాలని ఇంకొందరు దీనిలో అటుకులు కూడా కలపాలని కూడా చెబుతారు. ఈ మధుపర్కం ప్రధానంగా చేసే పూజ కాబట్టి దీనికి మధుపర్కపూజ అని పేరు వచ్చింది. కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

    గోత్ర-ప్రవరలు...    

    గోత్రం అనగా వంశం. ప్రవర అనగా ఆవంశ మూలపురుషుల కూటం. వరుడు కన్యా అన్వేషణ చేయమని అడిగిన తరువాత కొందరు పెద్దలు వెళ్లి కన్యా దాతకు వరుని వంశాన్ని గురించి వివరించి చెప్పడాన్ని ఇక్కడ గోత్ర-ప్రవరలు చెప్పడం అంటారు.

    అంటే వరుని ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో కన్యా దాతకి తెలియజేసి కన్య ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో తెలిసికొని "మీ కన్యను మా వరునికి ధర్మ, సంతాన, సంపద కోసం ఇవ్వండి" అని అడగడమే ఇక్కడ ప్రధానాంశం. ఆడపిల్లలు తక్కువగా ఉండే రోజులలో ఆడపిల్ల పుట్టడంతోనే సంబంధాలు కలుపుకోవాలని ఆలోచనలు ఉండేవి. అందువల్లనే పిల్లవాడి తరఫు వాళ్ళు వెళ్లి "పిల్లనివ్వండి అని అడగవలసి వచ్చేది". ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. "మీకు ఏమి కావాలన్నా ఇస్తాం. మా పిల్లను చేసుకొంటారా అని కన్యాదాత బ్రతిమాలే రోజులలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మారులు ప్రవర చెప్పడం జరుగుతుంది. ధర్మ కార్యముల నిమిత్తం సంతానం, నిమిత్తం ఇటువంటి వరునకు, ఇటువంటి కన్యను కోరుతున్నాము అని అర్ధము. వ్రునీద్వం అని కన్యాదాత పలుకవలెను. కన్యాదాత అలాగే మా కన్యను ఇస్తాను అని మూడు మారులు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. ‘క్రుతార్దాః వయం ఇతి వరాయ వేదయేయు:’ అని చెప్పెదరు. అనగా నీకు కన్యను వేదకుటలో మేము క్రుతార్దులమైతిమి అని మధ్యవర్తులైన పెద్దలు వచ్చి తమ నిర్ణయాన్ని వరునకు తెలియజేస్తారు. ఇప్పుడు పెండ్లిలోనే దీనిని జరుపుతున్నారు. ఈనాడు సంబంధ నిశ్చయానికి ముందు వరకూ జరిగే సంప్రదింపుల కార్యక్రమమే ఇది.

    ధర్మప్రజాసంపత్యర్ధం స్త్రియం ఉద్వాహే అని వరుడు అనవలెను ధర్మ కార్య నిమిత్తం, సంతాన నిమిత్తం, సంపదను వృద్ధి చేసే నిమిత్తం ఈ స్త్రీని పెండ్లి ఆడుచున్నాను అని వివాహాంగాభూతమైన ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని సంకల్పం చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ అయిన తరువాత కన్యాదాత కన్యాదానము నిమిత్తము మహాసంకల్పం పాటించవలెను.

    మహాసంకల్పం...    

    మనము ప్రతి పని చేసేటప్పుడు కరిష్యే అనడాన్న్ని ‘సంకల్పం’ అంటారు. మానవ జీవితంలో వివాహమనేది ఒక ముఖ్యమైన సంస్కారం కాబట్టి, కన్యను ఇచ్చే తరానికి పది తరాలు వెనుక, పది తరాలు ముందు వరకు కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారు. కావున ఇక్కడ చేసే సంకల్పం చాలా విలక్షణమైనదిగా చెప్పబడింది. కనుకనే దీనిని ‘మహాసంకల్పం’ అంటారు. మహాసంకల్పం విశ్వస్వరూపాన్ని చక్కగా వివరిస్తున్నది. ఇందులో ఖగోళస్ధితి చక్కగా వివరించబడింది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్తద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, దశారన్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భారత వర్షం భారత ఖండంలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నదీ కన్యాదాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్ధం గడువగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పములలో శ్వేత వరాహకల్పంలో, పద్నాలుగు మన్వంతరములలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహా యుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా తిది రోజున ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మినారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషిత ఐన ఈ కన్యను దానం చేస్తున్నాను.

    ఈ కన్యాదానం వలన నాకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలి. అగ్నిస్తోమ, వాజపెయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలి. నాకు వెనుక, ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలి అని కన్యాదాత సంకల్పం చేస్తాడు. వివాహ సమయంలో చేసే మహా సంకల్పంలో మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మహాకాలంలో, మహావిశ్వంలో మానవుడు ఎంత చిన్నవాడో అర్ధం చేసుకోవడానికి అహంకారాన్ని తగ్గించుకొని వినయవిధేయతలు పెంచుకొని కర్తవ్య పరాయనుడై ధర్మానికి కట్టుబడి ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

    కాళ్లు కడగడం...    

    గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒక రకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని, సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడా ఈ వేడుకలో ఉందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద, వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, "ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని పాడిపంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. పెళ్లి కొడుకు కాళ్ళు కడిగినప్పుడు ముందు కుడికాలును తరువాత ఎడమ కాలును ఇంద్రుని అంశంగా భావించి కడగాలి. తరువాత రెండు పాదాలను కలిపి కడగాలి. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు. వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీనారాయణ స్వరూపులు"గా భావిస్తారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి సామర్థ్యాలు అనంతమని, అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని చెప్తారు. మానవుడి మేథస్సు ఊహించనలవి కాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్నచిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారుమూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసేదే మహాసంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

    సమీక్షణం...    

    వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడదాన్నే ‘సమీక్షణం’ లేక నిరీక్షణం అంటారు. కలయన వేదికపైన వధువు తూర్పుముఖంగా కూర్చుంటుంది. వరుడు పశ్చిమముఖంగా కూర్చుంటాడు. వీరిద్దరి మధ్యా అడ్డుగా తెల్లటి తేరా సెల్లాను పట్టుకుంటారు. శుభ ముహూర్త కాలంలో వరుడు వధువు కనుబొమ్మల మధ్య అలక్ష్మీ తొలగుటకై దర్భలతో తుడిచి వధూవరులు ఒకరినొకరు వీక్షించుతను సమీక్షణం అంటారు. ఈ సమీక్షణ కార్యక్రమమును కులాచారమును బట్టి ఆచరించెదరు.

    సుముహూర్తం (జీలకర్ర, బెల్లం)...    

    పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించబడుతుంది. ఈ సుముహూర్త కాలములో మంగలాష్టకములు, చూర్నికను, పతించవలెను. ఇందు జీలకర్ర, బెల్లం కలిపి నూరిన మిశ్రమాన్ని వధూవరుల శిరస్సుపై పరస్పరము ఉంచుకొనుట ఆచారముగా వచ్చుచున్నది. ఇలా చేయుటలో విశేషం ఈ క్రింది శ్లోకంలో చెప్పబడుతోంది.

"జరానో ప్రాప్యతే యస్మాత్ మంగళం శుభ కర్మసు"

ఈ జీలకర్ర ముసలితనం రాకుండా చేస్తుంది. కనుక శుభ కర్మల యందు మంగళకరమైనది. ఇది జరా ప్రతిబంధకము, సౌభాగ్య ద్రవ్యము, యౌవనాన్ని పోషిస్తుంది. కనుకనే దీనిని శిష్టులు కూడా పోషిస్తున్నారు. జీలకర్ర బెల్లం కలిపి చేసిన ముద్దలో ఒక రకమైన పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఉంటాయి. మన తలమీద ఒకానొక స్థలం మీద ఆ ముద్ద పెడితే నిద్రాణావస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకొని సహస్రార చక్రం గుండా ఆగ్న చక్రం గుండా (ఈ స్థలంలో మన ఆధ్యాత్మిక మేల్కొపే స్థలం). భృకుటి( రెండు కళ్ల మధ్య ఉన్న స్థలం) ద్వారా ఉత్తేజితం అవుతుంది. ఆ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకే రకమైన మెదడులో ఆలోచనలు కలిగి సంసార జీవితం మీద మంచి అభిప్రాయంతో ఒకే బాటలో నడుస్తారు. ఈ కార్యక్రమము నందు ఈ క్రింది మంత్రము చదువుతారు.

“అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే!ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!!

ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!

జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!”

    కన్యాదానం...    

    వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. సంతానార్ధం, త్రిధర్మ రక్షణార్ధం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో యజ్ఞాలకి, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో నాలుగు దానాలు మరింత విశిష్టమైనవి. అవి కన్యాదానం, గోదానం, భూదానం మరియు విద్యాదానం. వీటిని చతుర్విధ దానాలంటారు.

    భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో గల అన్ని హక్కులనూ దానం పుచ్చుకున్నవారికి ఇచ్చి వేస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు. ఇంకొకరికి ఇవ్వవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి భిన్నమైనది. వధువు యొక్క సర్వబాధ్యతలను మరి ఒకరికి బదిలీ చేయడానికి, కన్యాదాన ఉద్దేశ్యం ఇంత దాకా ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం, అన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు. ఇకపై ఆమె భర్తకు, అత్తవారింటికి మార్చబడతాయి. వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం. దాన్ని దైవసాక్షిగా, అగ్నిసాక్షిగా, మనస్సాక్షిగా అంగీకరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. ఇవి వధూవరులకి కాదు, వారి కుటుంబీకులకు వర్తిస్తుంది.

    కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సాహకాలూ అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సంసిద్ధపరుస్తుంది. భరోసా కల్పిస్తుంది. ధైర్యస్థైర్యాలనిస్తుంది. వరుని కాళ్ళు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తూ, నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను. నా పితరులు తరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరింపబడిన ఈ కన్యను ధర్మ, కామార్ధ సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలం కలిగిన, బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను, అంటూ చతుర్ధీవిభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు.

    సాక్షాత్ విష్ణుస్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దానం చేయడు కన్యాదాత. వరుడి దగ్గిర నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. మరి ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టిని, తన ఇంటి మహారాణిని, కన్యాదాత అంత సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు అడుగుతాడు.

* నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకూడదు అని అడిగితే, వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మమునందు ఈమెను అతిక్రమించనని ప్రమాణం చేస్తాడు.

* అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో, ఇక ముందు సంపాదించబోయెదానికి ఈవిడ సర్వాధికారిణి. ఒప్పుకుంటావా? అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.

* నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయే గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి. అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు అనగానే, దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.

    అప్పుడు ఒక మహాద్భుతమైన కన్యాదాన ఘట్టం జరుగుతుంది. ముందుగా విష్ణుస్వరూపుడిగా ఉన్న వరుడు ఎదురుపడితే, మరి ఆయన ఆతిధ్యం ఇవ్వాలంటే అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా!. దీనికంటే ముందు కన్యాదాత, వరుడు వివాహవేదికకు వచ్చే ముందే ఒక ఆసనం ఏర్పాటు చెయ్యాలి. అది దర్భాసనం అయి ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి వచ్చి నీ ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా! మరి దర్భాసనాన్ని మించిన ఉచితాసనం ఏముంటుంది కనక. అందుకని కన్యాదాత తప్పక దానిని ఏర్పాటు చేసుకోవాలి.

    కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందుగా కుడికాలుని ఉంచితే, తనకు కాబోయే మామగారు, అత్తగారు మరచెంబుతో సన్నటి ధారతో నీటిని పోస్తుంటే, మామగారు బహుజాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలను కడుగుతాడు. అలాగే, దాని తరువాత ఎడమ పాదాన్ని ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే ప్రీతితో కడుగుతాడు. మామగారు, అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా, వింతగా, వంక చూడడం కాదు, వరుడు చెయ్యాల్సింది. తనకంటే వయసులో పెద్దాయన తన కాళ్ళు కడుగుతున్నాడు. తాను చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. కాబట్టి, ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి (మయి, మయి, యశోమాయి) అని. బ్రహ్మగార్ని అడిగితే ఆయన చెబుతాడు. ఈ విషయం వరుడి తండ్రి చెప్పుకోవాలి. కన్యాదాత చెప్పుకోలేడు కదా... బాబూ! నేను నీ కాళ్ళు కడుగుతుంటే నువ్వు అలా మెడ వేళ్ళాడేసి చూడటం కాదు, ఇది చదువుకో అని చెబితే తనను తాను పోగుడుకున్నట్లు అవుతుంది అని తండ్రి చెప్పుకోవాలి. నీ పుణ్యం ఎగిరిపోతుందిరా... నువ్వు ఇది చదువుకో అని, లేకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు చెప్పాలి. మనకి ఇవేమీ అఖ్ఖర్లేదు, అల్లరి తప్ప. అలా అల్లుడి కాళ్ళు కడిగిన తరువాత కన్యని సాలంక్రుతకన్యాదానం చేస్తారు. ఏమి పెట్టినా, పెట్టకపోయినా ఆడపిల్లకి సాధ్యమైనంతవరకు కన్యాదానం సమయంలో వడ్డాణము, చెవికి తాటంకాలు, ముక్కుపుడక పెట్టి కన్యాదానం చెయ్యాలి.

    మరి, అందరి ఆడపిల్లల తండ్రులకి అంత ఆర్ధిక పరమైన శక్తి ఉండదు కదా! మన సనాతన ధర్మము, శాస్త్రము ఎంతో ఉత్తమమైనటువంటివి. నీవు ఊరంతా అప్పులు చేసి ఇవన్నీ పెట్టాల్సిందే అని చెప్పదు. మనకి తరుణోపాయం తెలియచేస్తుంది. పైగా, కన్యాదానం అనేది చాలా పెద్ద దానం. అందుకే కదా ఆడపిల్లలు లేనివారు కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్ళూరేది. అందుకే కన్యాదానంకంటే ముందు కన్యాదాత దశదానాలు చెయ్యాలి. మరి అంత శక్తి లేనివారు కన్యాదానం చేసే ముందు వధువు చేతిలో పూర్ణఫలం, కొబ్బరిబోండాం పెడతారు. దానిమీద గుమ్మడిపండు, దానిపైన మంచి గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేస్తే, కన్యాదాత దశదానాలు చేసి సాలంక్రుతకన్యాదానం చేసినట్లే. ఈ పూర్ణ ఫలంతో ఉన్న అమ్మాయి చేతిని అబ్బాయి దోసిట్లో పెట్టి సన్నటి నీటి ధారతో ప్రక్కన భార్య పోస్తుండగా కన్యాదాత కన్యాదానం చేస్తాడు. సామాన్యంగా భార్య, భర్తకి ఎడమ చేతి ప్రక్కన కూర్చుంటుంది. కాని, కొన్ని విశేష క్రతువులు చేసేటప్పుడు భార్యాస్థానం మారిపోతుంది. ఆవిడ ఆ సమయంలో కుడివైపుకి వస్తుంది. ఇలా కన్యాదానం జరుగుతుంది. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.

"కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !!

అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం "ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: "సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు పంచభూతాల, సర్వదేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడివైన నీకు, ధర్మార్థకామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) వరుడి చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

    స్వర్ణ జలాభిమంత్రం...    

    ఈ సమయంలో వధువు పాపిట పైన దర్భాలతో చేసిన చుట్టను ఉంచి దాని మధ్యలో బందికాడి రంధ్రం గుండా బంగారంపై నుండి మంత్ర జలములు పోస్తారు. ఇలా చేయడం వలన అమ్మాయికి ఉండే అనారోగ్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం.

    యోక్త్ర బంధనం...    

    పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి నడుం చుట్టు ఒక తాడులాంటి ధర్బ (ఒక విధమైన గడ్డి) తో అగ్ని దేవుణ్ణి స్మరిస్తూ కడతాడు. ఈ విధంగా కట్టడాన్నే ‘యోక్త్ర బంధనం’ అంటారు. మనం ఒక కష్టమైన పని మొదలుపెట్టినప్పుడు నడుం చుట్టూ గుడ్డ చుట్టూకుంటాం. దాని వల్ల వెన్నుపూసకి అదనపు బలం ఇస్తుంది. ఇది 24 అంగుళాల పొడవు ఉంటుంది. దీన్ని నడుముకు కడతారు. ఉల్ముఖుడు అనే రాక్షసుని పీడ నివారణార్థం దీన్నికడతారు. అదే విధంగా పెళ్లి అయిన తరువాత అదనపు బాధ్యతలు వస్తాయి, కనుక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి తోడునీడగా ఉంటానని చెప్పడం.

    మంగళ సూత్రధారణ...    

    వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. ‘సూత్రం’ అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అనగ ధరించడం అని. పెళ్లి కూతురి మెడలో రెండు మాంగల్యాలు పెళ్లి కొడుకు కడతాడు. ఒకటి పెళ్లి కూతురు తరుపునుండి, మరొకటి పెళ్లి కొడుకు తరపు నుండి, మాంగల్యంకి రెండు బిళ్ళలు వేలాడుతూంటాయి. ఈ మాంగల్యం రక్షణ, నమ్మకానికి, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. మూడూ ముళ్లు వేస్తాడు. అవి స్తూల శరీర(భౌతిక శరీరం), సూక్ష్మ శరీర(పరబ్రహ్మ), కారణ శరీర(ఆత్మ) కి ప్రతిరూపాలు. మనస, వాచ, కర్మణ (నమ్మడం,చెప్పడం,చేయడం) కి ప్రత్రిరూపాలు కూడా. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!! ”

మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు.

    తలంబ్రాలు...    

    మాంగళ్యధారణ అనంతరం అత్యంత కోలాహలంగా ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూవరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని, ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాలు (అక్షతలు) తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది, 'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలంబ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రథమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు, బియ్యం, నెయ్యి, ఆవుపాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. ఇది చూడడానికి చాలా వేడుకగా కనపడుతుంది. పెండ్లికి వచ్చిన బందుమిత్రులంతా వివాహంలో ఏ ఘట్టాన్ని చూసినా, చూడకపోయినా దీనిని మాత్రం చూడకుండా ఉండరు. తెలుగుదేశంలో ఈ సందర్భంలో ప్రత్యేకమైన సన్నాయి వాద్యం కూడా వినబడుతుంది. వీటన్నింటితో పాటు ఇక్కడ జరిగే క్రియా క్రమంలో చెప్పే మంత్రాలలో చాలా విశిష్టత కనబడుతుంది. ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

“ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!!”

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. నాలుగవసారి మంత్రాలు లేకుండానే తలంబ్రాలు పోసుకొంటారు. మాకు కావలసిన సిరిసంపదలు సంమృద్ధిగా ఉండాలి. మాకు కీర్తి ప్రతిష్తలు సంమృద్ధిగా ఉండాలి. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది.

    బ్రహ్మముడి...    

    వివాహంలో భార్యా భర్తల వస్త్రములకు బ్రహ్మ ముడులు అను పేరుతొ ముడులు వేస్తారు. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావము ఉంది. ఈ అర్ధమును స్ఫురిమ్పజేయు మంత్రమునే "గ్రందిం గ్రద్నాటి ఆశిష ఎవాస్యాం పరిగ్రుహ్నాతి" అను శృతిచే పాటిస్తారు. తరువాత బ్రహ్మముడి సదక్షినా ఫల తాంబూలములను వధూవరుల చేలాంచలములకు కట్టి ఆ రెండు కోణాలను కలిపి ఈ క్రింది అనువాకాన్ని చెప్పుచూ ముడి వెయ్యాలి. ‘యోగాక్షేమస్య ..... ఆశిశామే వైతామాశాస్తే బ్రహ్మగ్రంది ముహూర్తః సుముహూర్తః అస్తు’. పాణిగ్రహనాన్గామగుట చేత మా ఇద్దరి సంరక్షణ నిమిత్తం రక్షలను కట్టుచున్నాను. వరుని చేతికి ఈ మంత్రం చెబుతూ పురోహితుడు కడతాడు. తరువాత వరుడు వధువు వామ హస్తమునకు కడతాడు.

‘బృహత్సామ ................... సగరేన రక్షా వద్వా వామకరే బధ్నాతి’

ఇకనుంచి, ఇరువురు కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు"గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు. వివాహం వల్ల భార్యా భర్తలు కలిసి మెలసి ఒకరికొకరు తోడుగా ఉండాలని సమాజం ఆశిస్తుంది. వివాహం నిలబడటానికి భార్యాభర్తలు ఒకరి నుండి మరోకరు వేరు కారాదు. భార్యాభర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైన, పుణ్యక్షేత్రమైన, మోక్షమైన, వనవాసమైన భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి, ఉండాలి. భార్యాభర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా, ఎన్ని మనస్పర్ధలు ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేని విధంగా ఉండాలని, అలా ఉంచుకోవాలని గోరంత స్థలము ఏర్పడినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి స్థలము ఏర్పరచుకుంటారని ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని స్త్రీకి భార్యే సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు. "అంటే రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చటం".

    రక్షాబంధనం...    

    కంకణాలు కట్టడాన్నే రక్షాబంధనం అంటారు. భౌతికమైన ఉపద్రవాల నుంచి రక్షణ కోసం, పురుడు, మైల మొదలైనవి సోకకుండా ఉండడంకోసం, కార్య నిర్వహణ దీక్ష కోసం కంకణాన్ని కడతారు. వరుడికి కుడిచేతికి, వధువుకి ఎడమ చేతికి కంకణం కట్టాలి. జరగబోయే పాణి గ్రహణానికి ఇది అంగం. వివాహంలో మంగళప్రదమైన ఈ కంకణం వధూవరుల రక్షణ కోసం ఉద్దేసింపబడుచున్నది. ఈ కంకణాన్ని నాలుగవ రోజు రాత్రి తిరిగి ఇప్పివేయాలి.

    అంగుళీకాలు తీయడం...    

    ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.

    ప్రధాన హోమం...    

    అనగా పవిత్రమైన అగ్ని. హోమం (అగ్ని) మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది. పురోహితుడు నూతన దంపతులతో హోమంలో ఉబ్బిన బియ్యం వేయిస్తారు. ఇలా చేయడం ద్వారా వధువు వరుని ఎక్కువ కాలం జీవించాలని పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. పుట్టింటివారు, మెట్టింటి వారు కలిసి ఉండాలని హోమం చుట్టూ మూడు సార్లు వధూవరులు ఉబ్బిన బియ్యం వేస్తూ ప్రార్ధిస్తారు. హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరిగుతారు. ఈ ఏడు అడుగులు పెళ్లి ఏడు పెళ్లి ప్రమాణాలకి సూచిక. * ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటాం, * ఇద్దరం ధైర్యంతో, శక్తితో గుండె నింపుకొని అన్ని అవసరాలని తీర్చుకుంటాం,* ఇద్దరం కలిసి కుటుంబ సుఖం కోసం, సంఘం వర్ధిల్లడం కోసం పాటుపడతాం, * కష్టసుఖాలలో కలిసి ఉంటాం, * కలిసి మంచి బుద్ధులు వచ్చేటట్టు పిల్లల్ని పెంచుతాం, * ఇద్దరం కలిసి సుఖ,శాంతి కోసం పాటుపడతాం. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం, * జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటాం.

    సప్తపది...    

    వివాహంలో సప్తపది ముఖ్యమైన ఘట్టము. ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువుము. నీవు నడిచేటప్పుడు మొదటి అడుగులో శ్రీ మహా విష్ణువు, అన్నమును, రెండవ అడుగులో బలమును, మూడవ అడుగులో ఉత్తమ కర్మమునూ, నాల్గవ అడుగులో కర్మ ఫలమునూ, ఐదవ అడుగులో పశు సంమ్రుద్ధినీ, ఆరవ అడుగులో రుతు సంపత్తినీ, ఏడవ అడుగులో యజ్న సాధకులైనా హోత ప్రశాస్తా, బ్రాహ్మనాచ్చంసి, పోత, నిషా, అచ్చాలూక , అగ్నేద్ధ్రులనే ఏడుగురు రిత్విక్కులనూ ప్రసాదిన్చుగాక అని అర్ధమిచ్చే మంత్రమును పటించవలెను.

    వధువును అగ్నికి ఉత్తరమునకు కుడి కాలితో అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరమునకుగానీ, ఏడు మంత్రములచేత ఏడు అడుగులు నడిపించి అడుగులో "సఖా సప్త పదా భావ" మొదలు ఏహిసూనృతే వరకూ చాతుస్వరముతో వరుడు జపము చేయవలెను. హోమములకు ముందు అగ్నికిని బ్రహ్మగారికిని ప్రదక్షిణం చేసి, మునుపటి వలె ఉత్తర వరుడుగా కూర్చుని వధువు తనను తగిలి ఉండగా మంత్ర పూతముగా 16 హోమములు చేయవలెను. నీవు నాతో ఏడడుగులు నడచుట వలన మన ఉభయులకు మైత్రి సిద్ధించింది. నిన్ను నేను విడువను. నన్ను నీవు విడువకు. మనము అన్యోన్య ప్రేమతో అనుకూలమైన మనస్సు, సమానమైన దాంపత్యము కలవారమై విధి విహితమైన కార్యముల యందు సమానమైన ఆలోచనలు కలిగి ఒకే మనస్సు కలవారమై ధర్మ కార్యములు చేస్తూ చరింతుము గాక! నేను సామవేదము వలె, నీవు ఋగ్వేదము వలె, అవినాభావ సంబంధము గల వారము అగుదుము గాక! అంటే ఋక్కులను విడిచి సామం, సామమును విడిచి రుక్కు ఉండనట్లే మనం కూడా ఆకారము విడిచి ఆకారము ఉండకుండుము గాక!

    నేను స్వర్గము వంటి వాడిని, నీవు భూమి వంటి దానవు. అనగా భూమి ఆధారం. స్వర్గం ఆదేయం. ఆధార, ఆదేయములకు కూడ అవినాభావ సంబంధము ఉన్నది.

    నేను రేతస్సును ఉంచువాడను. నీవు ఆ రేతస్సును గ్రహించుదానావు. నేను మనస్సు వంటి దానను . నీవు వాక్కు వంటి దానవు. మనోవాక్కులకు కూడా అవినాభావ సంబంధము ఉన్నది. కనుక మనమిద్దరమూ అవినాభావ సంబంధముగాలవారమై అన్యోన్యానురాగాముతో సంచరింతుము గాక! ఓ ! సత్య వాక్కులు గల దానా! నీవు నాచే చేయబడు ధర్మకార్యములందు అనుకూలముగా సంచరిస్తూ ఉత్తమమైన ఆచరణ భోగభాగ్యములు గల సంతానము పొందుటకై నా సమీపమునకు రమ్ము. వదూవరులకు అన్యోన్యము, సఖ్యమును చేకూర్చుటకు ఈ ప్రకరణము చెప్పబడినట్లు తోస్తోంది. ఈ విషయం వ్యాకరణ శాస్త్రంలో సాప్తపదీనం సఖ్యం అని చెప్పబడింది. అనగా ఏడు పరములచే స్నేహం పొందుతారని నిర్వచనం చేయబడింది.

    ఇక్కడ పద శబ్దానికి మాటలకూ, అడుగులకూ కూడా అర్ధం ఉంది. ఇక్కడ వదూవరులకు ప్రాధమిక స్నేహంలో సిగ్గుచేత ఏడు మాటలు సంభాషించడం అసంభవం కనుక ఏడడుగులు నడిపించుట చేత సఖ్యం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో స్నేహం కోసం ఈ సప్తపది చెప్పబడింది. సాధారణంగా మనకు ఎన్నడూ పరిచయం లేని వారితో ఏవో ఏడు మాటలు మాట్లాడడం చేత స్నేహం కలుగుతోంది

    సప్తపది అంటే ? ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఏడు పసుపు కొమ్ములు వరుసగా వాటి మీద ఉంచి, వాటిపై మొదలైన ఏడు మంత్రములచేత క్రమంగా ఆవలనుండి పాదము చేత ఏడడుగులు వేయించడం సప్తపది. ఇదీ గాక వివాహంలో వధూవరులు పెండ్లి గ్రహాన్నుండి విడిదిలోనికి పోవునప్పుడు విడిది గృహం నుంచి పెండ్లి గృహానికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం దగ్గర స్త్రీలు వారిని లోనికి పోకుండా నిరోధించి వరునిచే వధువు పేరు, వదువుచే వరుని పేరు చెప్పించిన తరువాత లోనికి పంపుతారు. ఇది ఆపాతతః కేవలం లౌకికముగానూ, గతానుగతికంగానూ వస్తూ ఉన్న ఆచారంగా కనబడుతుందే కాని, శృతి మూలకం కాదని తోచవచ్చు. కానీ ఈ ఆచారానికి మూల భూతములైన, శ్రుతి స్మ్రుతులను పరికిస్తే మన సంస్కారాలు గూడంగా ఆచరణలో ఉన్నాయని తెలుస్తోంది. వివాహ సంస్కారం ధర్మార్ధ కామ రూపములైన మూడు పురుషార్ధములకే ఏర్పడింది. ఈ మూడు పురుషార్ధములు కూడా భార్యాభర్తల స్నేహం మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత సప్తపది మొదలుకొని స్నేహం సంపాదకములైన మంత్రజపాదులు విహితమై ఉన్నాయి. వివాహంలో తలుపుల దగ్గర పరస్పరం వారి పేర్లు చెప్పడం స్నేహం కోసమని స్పష్టమైంది. వ్యాకరణ శాస్త్రంలో వివాహానంతరం కలత్రం పేరు చెప్పకూడదని ఉంది. "ఆత్మా నామ గురోర్నామ నామాతి క్రుపనస్యచ శ్రేయస్కామో న గృహ్నీయాత్ జ్యేష్టాపత్య కలత్రయొహ్" వివాహంలో శేషహోమ పర్యంతం సఖ్యతకోరకు చెప్పవలెనని పెద్దలంటున్నారు.

    పాణి గ్రహణం...    

    దీని అర్థం ఒకరి చేయిని ఒకరు పట్టుకోవడం. ఇది చాలా ముఖ్యమైనది. పురోహితులు ఈ కార్యక్రమాన్ని పుణ్యకాలంలో చేయిస్తారు. నాలుగు మంత్రాలతో వరుడు వధువు చేతిని తన చేతిలోకి తీసుకోవడం అగ్ని సమక్షంలో జరుగుతుంది. అంటే అగ్ని సాక్షిగా జరుగుతుంది. మంచి సంతానం కోసం, విధి విహితమైన కర్మలను నిర్వర్తించడం కోసం పాణిగ్రహణం చేస్తున్నానని వధువు అనడం ఈ మంత్రాల ఆంతర్యం. పెళ్లి కూతురు కుడి చేయి వేళ్లని శంఖం ఆకారంలో ముడిచి పెళ్లి కొడుకు అదే విధంగా పెట్టి పెళ్ళి కూతురు వేళ్లని పట్టుకుంటాడు. పెళ్లి కూతురు చేయి పైకి పెళ్లి కొడుకు చేయి కిందకి ఉండేటట్టుగా పట్టుకుంటారు. పెళ్లి కొడుకు కింది విధంగా ప్రార్ధన చేయాలి. అర్ధాంగి! ఈ రోజు నీ చేయిని అందరి ముందు పట్టుకున్న. నీతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పిల్లలను కనిపెంచాలని తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. లక్ష్మీ దేవి కటాక్షంతో నిన్ను, మన పిల్లల్ని గుడ్డ, బట్ట, తిండి, చదువు, ఐశ్వర్యం, సంతోషంతో ఉంచాలని ఆ తల్లిని ప్రార్ధిస్తున్నా. నేను అందరి ముందు నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నా. వాయు దేవుడు అన్ని దిక్కులు వెళ్లి అందరికి బంగారం పంచాలని, అగ్ని దేవుడు అందరి ఆహారం సమకూర్చాలని, నీవు నన్ను సర్వదా సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాను. కేవలం స్త్రీ సంతానాన్ని మాత్రమే కోరుతుంటే వరుడు వధువు వేళ్లు మాత్రమే పట్టుకునేవాడు. ఇప్పుడు ఈ ఆచారాలను పాటించేవారు అరుదు.

    మెట్టెలు ధారణ...    

    కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగాథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. సౌభాగ్యవతులైన స్త్రీలకు ఈ మట్టెలు సౌభాగ్య అలంకారములైనవి. హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వివాహం జరిగిన దగ్గర్నుంచి మంగళసూత్రంతో పాటుగా, కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి.ఇంతకీ కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు. వీటి వెనుక ఏవన్నా అంతరార్థాలు ఉన్నాయా అంటే కొన్ని కారణాలు కనిపించకపోవు...

వెండితోనే ఎందుకు?

    బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము భాగం నుంచి కిందకి ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదన్నది ఒక నమ్మకం. ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్వుద్వాహకత చాలా ఎక్కువ. తద్వారా భూమికీ, శరీరానికీ మధ్య ఒక అనుసంధానంగా కాలిమట్టె పనిచేస్తుందనీ... ధరిత్రి మీద నుంచి వెలువడే శక్తి తరంగాలను శరీరానికి అందచేస్తుందని నమ్మకం.

రెండో వేలికే ఎందుకు?

    మన శరీరంలోని నాడులన్నీ చేతులు, కాలి వేళ్లల్లో కేంద్రీకృతమయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. కాబట్టి మన చేతులు, కాళ్లలోని ఒకో ప్రాంతం మీదా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒకో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చునంటారు. అలా కాలికి ఉండే రెండో వేలి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. తద్వారా రుతుసంబంధమైన సమస్యలు, సంతానం కలగడంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.

పెళ్లి తరువాతే ఎందుకు?

    స్త్రీకి వివాహం అయ్యిందని తెలిపేందుకు కాలి మెట్టెలు ఒక చిహ్నం. ఆమెను తల్లిగా భావించాలనీ, ఆమెతో మర్యాదగా మెలగాలనీ ఒక సూచన. పైగా కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయినా కూడా ఆమె సోదరులు ఎవరన్నా జీవించే ఉంటే రెండు మట్టెలలో ఒకటే తీసివేసే సంప్రదాయం ఉంది. ఆమెకు రక్షగా ఇంకా ఆమె సోదరుల ఉన్నారన్న హెచ్చరిక ఇందులో కనిపిస్తుంది.

భారతీయులలోనే ఎందుకు?

    హైందవ సంప్రదాయంలో వేల ఏళ్లుగా మట్టెలు ధరించే ఆచారం కొనసాగుతోంది. వైదిక సాహిత్యంలో దీని ప్రస్తావన లేకపోయినా, పురాణాలలో మాత్రం మట్టెల గురించిన ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంది. ఇలా మట్టెలు ధరించే అలవాటు ఈజిప్టు వంటి ఇతర ప్రాచీన సంస్కృతుల దగ్గర్నుంచీ నేటి పాశ్చత్య దేశాల వరకూ కనిపించినా... అవి అలంకారం కోసమే కానీ సౌభాగ్యానికో, ఆరోగ్యానికో ఉపయోగించడం తక్కువే! అయితే రోజురోజుకీ నాడీవ్యవస్థకూ, కాలివేళ్లకూ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ‘Magnetic Toe rings’ పేరుతో రకరకాల మట్టెలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కానీ అలాంటి ప్రచారం ఏదీ అవసరం లేకుండానే వివాహ ఆచారంలో భాగంగా భారతీయ స్త్రీలు తరతరాలుగా మట్టెలను ధరిస్తూనే వస్తున్నారు.

    సన్నికల్లు తొక్కడం...    

    పెళ్లి కూతురి ఎడమ బొటను పేలుని పట్టుకొని సన్నికల్లు మీద పెళ్లి కొడుకు పెట్టిస్తాడు. పక్కనే అగ్ని జ్వలిస్తూంటుంది. ఆ సమయంలోని మంత్రాలర్ధం "ఈ రాయిని ఎక్కు. మన మెదడుని రాయిలా జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి చలించక స్థిరంగా ఉందాం" అని ప్రమాణం చేస్తారు. సన్ని కల్లు పొత్రం ఒకటి లేకపొతే రెండోది పని చెయ్యదు, పెళ్ళికూతురి కాలికి మెట్టెలు అప్పుడే పెట్టిస్తారు వరుడి చేత, అలా పెట్టించి సప్తపది హోమం చుట్టు వెయించి, వరుడు వధువు మెడలో నల్ల పూసలు కడతాడు. ఒకరికొకరు సన్ని కల్లు పొత్రంలా కలిసి ఉండాలని దీని సంకేతం. రుబ్బురోలు పెద్దగా ఉంటుంది, ఇంకా శివ స్వరూపం, దాన్ని మోసుకు రావటం కష్టం కనుక సన్ని కల్లు మీద చెయించరు మనవాళ్ళు. ఇది కూడా ఒక సాక్షంగా తీసుకుంటారు, అగ్నిని తీసుకున్నట్టు. తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మెట్టెలు (సిల్వర్ రింగులు) కాళ్ల వేళ్లకి పెడతాడు. తరువాత పంతులు అరుంధతి (మహర్షి వశిష్టుని భార్య) నక్షత్రాన్ని చూపిస్తూ అరుంధతి తల్లి పవిత్రత గురించి చెప్పి అలా ఆదర్శ గృహిణిలా ఉండమని అరుంధతి దీవెనలు వధూవరులు తీసుకుంటారు.

    లాజా హోమం...    

    వధూవరుల చేత పేలాలతో హోమం చేయిస్తారు. లాజలంటే వరిపేలాలు. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘ సుమంగళిగా వుండాలని కోరుతూ వధువు ఈ హోమం చేస్తుంది. వధువు తన దోసిలిని వరుని దోసిలిలో ఉంచగా, వధువు తల్లి వరిపేలాలున్న ఒకచేటతో వారి వెనుక నిలబడి ఉంటుంది. వధువు యొక్క సోదరుడు పేలాలను తన దోసిలి నిండా తీసుకొని వారిద్దరి దోసిళ్ళలో పోస్తాడు. ఆపేలాలపై నేయి చిలకరించి వాటిని అగ్నిలో పోస్తూ…

శ్లో: ఇయం నార్యుపబ్రూతే కుల్పాన్యావ వంతికా దీర్ఘాయురస్తు మే పతిర్జీవాతు శరదశ్శతగ్గుస్వాహా

“నా భర్త శతాయుర్దాయము కలవాడు కావలెనని” అని వధువు అగ్నిహోత్రుని ప్రార్ధిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ వరుడు “అగ్నిహోత్రుడు, ఈ వధువు దీర్ఘాయువు కలదిగాను తేజస్వినిగాను చేసి నాకు సమర్పించెను” అని అంటాడు. లాజహోమం వేళ వధువు తోడబుట్టిన వాడు వధూవరులతో పాటు పెండ్లిపీటపై అగ్ని సముఖాన ఆసీనుడై తన సోదరి దోసిట్లో పేలాలు ఉంచుతూ ‘‘అమ్మాయీ! పెళ్ళి చేసి నిన్ను పంపేస్తున్నామని బాధపడకు. నా జీవిత పర్యంతం నీకు కష్టసుఖాల్లో నేను నీకు బాసటగా వుంటాను.’’ అని మంత్రం చదువుతూ ఆమె చేత పేలాలు అగ్నిలో హోమం చేయిస్తాడు. వరుడు బావమరిదికి నూతన వస్త్రాలు బహుకరించి సన్మానిస్తాడు. దీన్ని లాజ కట్నం అంటారు.

    స్థాళీపాకం...    

    వివాహములో జరిగే అన్ని లోటుపాట్లకు సర్వప్రాయశ్చిత్తార్ధం చక్కని ఫలమునిచ్చుటకు వధూవరుల అభ్యుదయార్ధము ‘స్థాళీపాకం’ నిర్వహిస్తారు. మన వివాహంలో 'స్థాళీపాకం'లో ఒక మంత్రాన్ని భర్త భార్యతో చెప్తాడు. ఆమె రెండు చేతులూ పట్టుకుని 'నాకు నీ ద్వారా పదిమంది సంతానాన్ని యివ్వు (ఎందుకు? ఈ సమాజ ధర్మాన్ని కాపాడడానికి) నేను నీకు పదకొండో సంతానాన్ని అవుతాను' అని. వధువు ఒక చిన్న కొత్త గిన్నెలో బియ్యం, నీళ్ళు పోసి అగ్నిహోత్రంలో వండి, హోమం కొరకు సిద్ధం చేస్తుంది. ఈ హోమ ద్రవ్యాన్ని చరువు అంటారు. దీనిని కొద్దికొద్దిగా చేతితో హోమసాధనమగు దర్విలోకి తీసుకొని, నెయ్యి అభీకరించి రెండు పర్యాయములు వరుడు హోమం చేస్తాడు.

శ్లో: అగ్నయే స్వాహా అగ్న ఇదం న మమ అగ్నయే స్విష్టకృతే స్వాహా అగ్నయే స్విష్టకృత ఇదంనమమ

“ఇదంనమమ” అనగా “నేను సమర్పించిన ఈ ద్రవ్యము ఇకపై నాది కాదు” అని భావన చేయాలి. ఇలా భావన చేయడం వలన మానవుని త్యాగస్వరూపునిగా తీర్చిదిద్ది మోక్ష సాధనకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సమయంలో వధువుకు ఆమె అత్తమామలు కుంకుమబొట్టు పెట్టి, నూతన వస్త్రములు, పళ్ళు తాంబూలం ఇచ్చి ఆశీర్వదించుతారు.

    నాగవళ్లి...    

    వివాహంలో ఆఖరున వధూవరుల అభ్యుదయం కోసం జరిగే తంతు నాకబలి. దీనినే నాగవల్లి అని కూడా అంటారు. దేవతలకు చేసే పూజ. రంగవల్లికలు వేసి దానిపై వధూవరులు ఇద్దరూ కూర్చొని అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, రుద్రుడు, విష్ణువు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలలను ప్రార్ధిస్తారు. ఒక వైపు ఉప్పు ఏనుగు ఒక వైపు పప్పు ఏనుగును వేసి అలంకరిస్తారు. ఇప్పుడే వధువుకు అత్తమామలు నగలు పెడతారు. ఒక సిల్క్ ఉయ్యాల తయారు చేసి దానిలో చందనం కర్ర ముక్క, పండిన అరటి పండు(లేక మామిడి పండు) మరియు పసుపు ఒక పళ్లెంలో ఉంచుతారు. పండిన పండు ఆరోగ్యవంతమైన, పసుపు పవిత్రమైన, చందనం స్వయం సుగంధమైన అందరికి మంచిని పంచే మంచి పిల్లలు కలగాలని ఈ కార్యక్రమం చేస్తారు. దీని తరువాత ఒక సన్నని(ద్వారం) బిందెలో ఉంగరం వేసి పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురుని ఒకే సారి చేయి పెట్టి ఎవరు ఉంగరం ముందు తీస్తారో చిన్న సరదా పోటి కార్యక్రమం పెడతారు.

    సదస్యం...    

    సదస్యం అంటే ఆశీర్వచనం. ఇక్కడ వేద పండితులు వేద పఠన చేసి, దంపతులను ఆశీర్వదిస్తారు. వారికి యధోచిత సత్కారం చెయ్యాలి. దీనినే మహాదాశీర్వచనం అని కూడా అంటారు.

    నల్లపూసలు కట్టడం...    

    మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముఖ్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము. పెళ్లైందన్న గుర్తుతో పాటు అంగరంగ వైబోగంగా జరిగిన తమ వివాహం గురించి, తమ సంసారిక సుఖజీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుందని ఓ నమ్మకం. ప్రతి మాట చేష్ట చేష్ట తనదని శ్రీ ఒప్పుకున్నందుకు నిదర్శనంగా చెబుతారు. ఏమైనా బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించటం వల్ల ఓ ప్రత్యేక అందం స్రీకి వస్తుందనటంలో సందేహం లేదు.

    అరుంధతి దర్శనం...    

    ముందు అరంధతీ నక్షత్రం కనిపించేది రాత్రి పూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం, చివర వశిష్టుడి, వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. దీని వెనుక ఒక కథ ఉంది. అరుంధతీ దేవి మహా పతివ్రత. అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా, వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహాదేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వేషమూ వెయ్యగలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేకపోయింది. అందుకనే మహా పతివ్రత అయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వదూవరులకి సప్తపది అయిన తరువాత చూపించపడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ఆవిడకి ఇచ్చిన వరము.

    అప్పగింతలు-గృహ ప్రవేశం...    

    కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది, ఉద్వేగభరితమైంది. సాధారణంగా పెళ్ళి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్ళికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు. అప్పగింతల ముందర "వడికట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాపబాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లు అనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు. ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంటతడి పెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి అక్కడినుంచి పెళ్ళికొడుకు ఇంటికి మారుతుంది. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

    పెళ్లి కూతురుకి నడుం చుట్టు కట్టిన దర్బా ని తొలగించడం...    

    పెళ్లి కూతురు క్రింది విధంగా ప్రార్ధనలు చేస్తు దర్బని తొలగిస్తుంది. ఈ వరుని కట్టిన పరమేశ్వరుడు ఇచ్చిన దర్బని తొలగిస్తు నిన్ను నాతో సుఖసంతోషాలను పంచుకుంటు బ్రహ్మ లోకం చేరుదాం. నేను అనుమతి ఇస్తున్న నీకు ఆ దర్బ లేకుండ నాతో సుఖంగా ఉండవచ్చు అని.

    వధూవరుల సహపంక్తి భోజనము...    

"మాత్రా సహా ఉపనయనే వివాహే భార్యయా సహా

అన్యత్ర సహా భుక్తిస్చేత్ పతిత్యం ప్రాప్నుయాత్ నర:

    విందువినోదాలు...    

    పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.

    కంకణ విమోచనం...    

    వధు గృహప్రవేశం చేసాక గణపతి పూజ పుణ్యాహం చేయించి కంకణాలు తెసేయాలి. ఇక్కడితో వివాహం క్రతువు సమాప్తం.

    శ్లోకం...    

జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః

న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కున్ద ప్రసూనాయితాః

స్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాః

ముక్తా: తా: శుభదాభవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః

శ్రీరామ వైవాహికాః శ్రీరామ వివాహోత్సవ సంబందిన్యఃముక్తాః ముక్తా మనయః భవతాం శుభాదాః శుభ ఫల ప్రదాః భవంతు. భూయసురితి ఆశీర్వాద్. నను ముక్తానాం అచేతనత్వాట్ కదం వా శుభాఫల ప్రదాత్రుత్వం? ( మయా ఉచ్యతే సమాధానం) ఇత్యాకాన్క్షాయాం, అంతః సౌజ్ఞాభావంటి ఏతాః సుఖాదిషు సమన్వితః. ఇతి విష్ణు పురాణ ప్రామాన్యాట్ ముక్తానాం అచేతనత్వం సిద్ధ్యతి తాదృశ ముక్తా మనయః కేద్రుస ఇతి ఆకాన్క్షాయాం జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మ రాగాయితః, జానక్యాః జనకస్య అపత్యం స్త్రీ జానకీ ,సీతా మహాలక్ష్మీరితి అర్ధ్.రాఘవత్వే భావేత్సీతా రుక్మిణీ క్రిష్ణజన్మని ఇతి విష్ణు పురాణ ప్రామాన్యాట్ మహాలక్ష్మీరిత్యర్ధ్.తస్యాః కమలామలాంజలి పుటే అమలంచ తాత అంజలి పుతంచ అమలాంజలి పుటం కమలవాట్ అమలాంజలి పుటం,కమలవాట్ అమలాంజలి పుటం కమలామలాంజలి పుటం తస్మిన్ నిక్షిప్తః యః ముక్తామనయ్ పద్మరాగాయితాఃంపద్మరాగ మనయ్ ఇవ ఆచరింత్య్ పునః కేద్రుష ఇత్యాకాన్క్షాయాం , న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుండా ప్ర్సూనాయితః, రాఘవ మస్తకేంస్రేరమచన్ద్రమోర్తెహ్ శిరసి న్యస్తః నిక్షిప్తా మనయ్ విలసత్కుండా ప్రసూనాయితః వికసన్ మల్లికా కుసుమానీవ ఆచరంత్య్ పునఃకేద్రుస ఇతి ఆకాన్క్షాయాం స్రస్తాశ్యామల కాయకాంటి కలితాయః ఇంద్రనీలాయితః శ్యామల కాయకాంటి కలితః నీలమేఘ శరీరస్య శ్రీరమ కాంత్యా కలితః మిలితః మనయ్, ఇంద్రనీలాయితఃంఇంద్రనీలమనయ్ ఇవ ఆచరంత్య్ ముక్తా మనయ్ భవతాం ఆయురారోగ్య ఐశ్వర్యాది రూపమంగళం దిశతు ఇతి ఆశీర్వాద్.

శుభం భూయాత్

మంగళం మహత్

శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ: