జీవితం ఓ అద్బుతం రండి అద్బుతంగా జీవిద్దాం

      ఈ భూమి పైన సముద్రతీరంలో ఇసుక రేణువులు ఏన్ని ఉన్నాయో, విశ్వంలో అన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయంటారు. వాటిలో ఒక నక్షత్ర మండలానికి చెందిన ఎన్నో సౌర కుటుంబాలలో ఒక సూర్య కుటుంబానికి చెందిన తొమ్మిది గ్రహలలో భూమి అనే గ్రహం పైన మనం జీవిస్తున్నాం.

      సృష్టి, స్థితి, లయం నిరంతర పరిణామం. ఈ పరిణామాల కాలంతో పోలిస్తే ఇక్కడ మనం జీవించే కాలం లిప్తపాటు మాత్రమే. అద్బుతమైన ఈ మానవ జీవితానికి అర్దం మన జీవితాన్ని అర్దవంతంగా జీవించడమే, మనం జీవంతో ఉన్న చివరి క్షణం వరకు జీవితం ఓ వేడుకే.

      ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో మంది జ్ఞానులు, పరిశోధకులు మానవ జీవితాన్ని సుసంపన్నం మరియు ఆనందమయం చేయడానికి ఎన్నో మార్గాలను శోదించి మనకు అందించారు. అటువంటి ఆహర, విహర విజ్ఞానాన్ని సులభంగా ఆచరణ యోగ్యంగా అందించే ప్రయత్నమిది. జీవితంలో ఈ విధానాలను అచరించి ప్రతి మనిషి సంపూర్ణ అరోగ్యాన్ని పొంది, తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చుకోవచ్చు.

    జీవితం...    

      ఈ జీవితం ఎంతో గొప్ప అవకాశం, ఇది ఓకే ఒక్క అవకాశం, మళ్ళీ మళ్ళీ రాదు, గడచిన ప్రతి రోజు జీవితపు ముగింపు రోజుకు తరిగిపొతున్న దూరం. దిన దిన గండం నూరేళ్ళ ఆయుషు అని సామెత. నిన్న రాత్రి ప్రపంచంలో నిద్రించిన వారందరూ ఈ రోజు లేరు మనం ఉన్నామంటే మనకి ఈ రోజు వరంగా ఇవ్వబడింది. ఒక రోజు జీవించడమనే వరం ఎంతో విలువైనదో తెలియాలి అంటే ఒకసారి ఆసుపత్రి వద్దకు వెళ్ళండి. అక్కడి రోగుల దీనమైన చూపులు చూడండి. కనీసం ఒక్క రోజైనా బ్రతికించమని ప్రాదేయపడే ఆత్మీయిలను చూడండి. ప్రాణాలతో వుండి ఆచేతనావస్థలో ఉన్న అభాగ్యులను చూడండి. జీవితం విలువ తెలియాలంటే జీవితపు చివరి రోజు వరకు వేచివుండవద్దు, అప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. ఇప్పుడే జీవితాన్ని జీవిద్దాం. రండి. టి,వి, సోషల్ మీడియాకు ప్రేక్షకులుగా మారటం జీవిత పరమార్దం కాదు.

      ప్రతి మనిషికి ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి వుంది. మీరు, మీ కుటుంబానికో, మీ ఉరికో, దేశానికో, ప్రపంచానికో, ఓ మార్గదర్శి కాగలరు, మీ జీవితం విలువను తెలుసుకునే కొలది మీ హద్దులు చెరిగిపొతాయి. మీరు విశ్వమానవులవుతారు అప్పుడు మీరు మీ ప్రపంచం అంతా అనందమయమవుతుంది. అద్బుతమైన జీవితానికి పునాది సంపూర్ణ ఆరోగ్యం.

    సంపూర్ణ ఆరోగ్యం...    

      శారీరకంగా, మానసికంగా, ఆద్యాత్మికంగా, ఆరోగ్యంగా వుంటేనే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు, సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం ఏదైనా సాదించగలం. వేదకాలం నాటికే మన ౠషులు, ఆహర విహరాదులతో ప్రతి మనిషి దివ్యత్వాన్ని చేరుకోవటానికి, శారీరక, మానసిక, ఆద్యాత్మిక, ఆరోగ్యాన్ని సాదించడానికి కావలసిన నియమావళిని రూపొందించి మనకందించారు. ఈ భూమి మీద ప్రాణి కోటి ఉన్నంతకాలం సర్వకాల సర్వావస్థాలలో ఇవి ఆచరించదగినవి. సత్యం ఎప్పటికి సత్యమే, సత్యమేవ జయతే.

    శారీరక ఆరోగ్యం...   

      శతమానం భవతీ అనే వేదవాక్కుకు అర్థం నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించమని దీవెన. వంద సంవత్సరాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించడం అనే ఆలొచనే నేటి తరానికి ఓ అత్యాశ అనిపిస్తుంది. చిన్నపిల్లలకు కంటి అద్దాలు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మధుమేహం, రక్తపోటు, చేడు కొలెస్ట్రాల్ చాలా సహజం అయిపోయాయి. గుండెపోటు, క్యాన్సర్, థైరాయిడ్, డివిటమిన్ లోపం, రక్తహీనత, సూక్షపోషకాల లేమి, స్పాండిలైటీస్, అష్ట్రియోపారాసిస్, నరాల బలహీనత, పక్షవాతం, రక్తం గడ్డకట్టడం, గ్యాస్ ప్రాబ్లం, ఆజీర్ణం, మైగ్రైన్ మొదలైనవి ఈ రోజులలో సర్వ సాధారణం, మన ఇళ్ళలోనో, మనకి తెలిసినవారి ఇళ్ళలోనో ఇటువంటి వ్యాధులతో మరణించేవారిని లేదా బాధపడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం. ఈ పరిస్థితులలో 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకటం సాద్యమేనా అని సందేహం కలగడం సహజమే. ఎవరికైనా చిరునామా చెప్పాల్సి వస్తే పూర్వం పలానా థియేటర్ వద్దనో, పలానా ఇంటి వద్దనో అని చెప్పేవారు. ఇప్పుడు పలానా ఆసుపత్రి వద్ద అని చెప్పేలా ఆసుపత్రులు ఎక్కువ అవుతున్నాయి. రోగులు ఎక్కువ అవుతున్నారు. ముఖ్యమైన విషయము ఏమిటంటే ఆసుపత్రులు వ్యాధులకు చికిత్స చేయడం, వ్యాధులకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలగుతాయి. ఆరోగ్యాన్ని ఇవ్వవు, ఇవ్వలేవు. ఎందుకంటే ఆరోగ్యం మందులలో లేదు.

    దినచర్య...    

      సరియైన ఆహరపు అలవాట్లు, జీవన శైలితో 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడం అందరికీ సాధ్యమే. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి, ఒక ప్రణాళికా బద్దమైన దినచర్య చాలా ముఖ్యం.

* తెల్లవారు జామున 4:00 నుండి 4:30 గంటల మధ్య సూర్యోదయం కాక ముందే నిద్రలేవడం వలన మెదడులో పిట్యూటరీ గ్లాండ్స్ చురుకుగా వుండి మన శరీరం ఆ రోజు చేయవలసిన విధులను జాగృతం చేస్తుంది.
* నిద్ర లేవగానే చిరునవ్వుతో ఈ రోజు నేను ఆనందంగా గడుపుతాను అనుకోవాలి.
* మంచంపైనే ఒక్క నిముషం పడుకొని, దీర్ఘంగా గాలి తీసుకొని, ఒక పక్కకు తిరిగి మెల్లగా లేవాలి భూమాతకు నమస్కరించి క్రిందకుదిగి, దుప్పట్లు, దిండు సరిచేసుకోవాలి.
* మొఖం కడుక్కోని వేడినీళ్ళతో గార్లింగ్ చేయాలి.
* గోరు వెచ్చని నీటిలో తేనే, నిమ్మకాయ, సబ్జాగింజలు కలుపుకొని త్రాగాలి.
* కాలకృత్యాలు తీర్చుకోవాలి.
* ఉదయపు నడక 45 నిమిషాలు, ఒక కిలో మీటర్ 8 నిమిషాలలో నడిస్తే మంచిది. నడిచే టప్పుడు కాళ్ళు, చేతులు బాగా చాచి నడవాలి.
* యోగా 10 నిమిషాల పాటు కపాళబాతి, 5 నిమిషాలు అనులోమ విలోమ, 5 నిమిషాలు ఓంకారం, 15 నిమిషాలు ధ్యానం చేయాలి.
* సూర్య నమస్కారాలు కనీసం 12 భ్రమణాలు చేయాలి.
* ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల లోపు ఎండలో కనీసం 45 నిమిషాలు పాటు ప్రతి రోజు వుండటం వలన మన శరీరానికి ఎంతో ఉపయోగమైన డి విటమిన్ అందుతుంది.

    నిద్ర...    

      రాత్రి 9 గంటల నుండి 12 గంటల మద్యలో నిద్ర అంటే 1 గంట నిద్రకి 3 గంటల విశ్రాంతితో సమానం, 12 గంటల నుండి 4 గంటల వరకు నిద్ర అంటే 1 గంట నిద్రకి 1 గంట విశ్రాంతితో సమానం, 4 గంటల తరువాత నిద్ర వలన ఉపయోగం లేకపోగా ఆరోగ్యానికి హానికరం.

    నిద్రించేటప్పుడు ఎడమచేతి వైపే పడుకోవాలి...    

మన ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ ఉంటే వాళ్ళు అంటారు, మనం వెల్లకిలా పడుకున్న, బోర్ల పడుకున్న, పక్కకు తిరిగి పడుకోమని, అది కూడా ఎడమ వైపు తిరిగి పడుకోమని .

మనం ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత పడుకుంటాం. మనంతిన్న ఆహారం అరగాలంటే జీర్ణశక్తి మంచిగా ఉండాలి. మన శరీరంలోని శోషరస గ్రంథులతో పాటు జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమము కడుపుకు ఎడమవైపునే ఉంటాయి. మనం తిన్న వ్యర్థాన్ని బయటకొచ్చే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలి. అందుకే ఎడమవైపు పడుకోవటం మంచిదని డాక్టర్ల సలహా ఇస్తున్నారు.

    నిద్ర ఎందుకు... అది దక్కేది ఎలా...    

      నిద్ర భగవంతుడు మనిషికిచ్చిన ముఖ్యమైన వరాల్లో ఒకటి. అలిసిపోయిన శరీరాన్ని, మనసుని సేద తీర్చి మరునాడు మళ్ళీ తాజాగా కార్యక్రమాలు చేపట్టగల శక్తినిస్తుంది నిద్ర. బాధలని, కష్టాలని మరచిపోవటం, లేక పోతే గుర్తు చేసుకోకుండా ఉండగలగటం నిద్ర వల్ల జరుగుతుంది. మనిషి ఆహారం లేక పోయినా ఉండగలడేమో కానీ నిద్ర లేకపోతే మాత్రం ఉండలేడు. అయితే పక్కమీద పడుకున్న వారందరూ నిద్రపోయి, దాని ఫలితాన్ని పూర్తిగా పొందుతున్నారా? నిద్ర లేచే సరికి వారి శరీరం తేలికగా ఉంటోందా? అన్నది ప్రశ్నార్థకమే! పసి పి‌ల్లలుగా ఉన్నప్పుడు ఆదమరచి హాయిగా పడుకున్న మనిషి ఎదిగిన కొద్ది నిద్ర సుఖానికి దూరం అవుతున్నాడన్నది అందరికి తెలిసిన సత్యం. ఎన్నో వ్యాధులకిదే కారణం. మరెన్నో వ్యాధులకిది లక్షణం కూడా. దీనిని సరి చేసుకుంటే ఆరోగ్యం చాలా వరకు బాగున్నట్టే. అందుకే మన పెద్దలు హాయిగా నిద్ర పోవటానికి కొన్ని పద్ధతులని సూచించారు.

      పసి పిల్లలకి ఎంత నిద్ర పోతే అంత మంచిది. ఎదుగుతున్న పిల్లలు కూడా కొంచెం ఎక్కువే నిద్ర పోవాలి. ఆరోగ్యవంతుడైన ఎదిగిన మనిషికి అంటే యవ్వనం నుండి ప్రౌఢ దశ వరకు సుమారుగా ఆరు నుండి ఏడు గంటల నిద్ర సరిపోతుంది. చదువుకునే పిల్లలు, ఎక్కువగా ఆటలు ఆడే వారు, వ్యాయామం చేసేవారు, అధికంగా మెదడుతో పని చేసేవారు, వ్యాధుల నుండి కోలుకుంటున్న వారి విషయంలో నిద్రపోయే సమయంలో మార్పు ఉంటుంది. వ్యక్తి గతంగా కూడా మార్పులు ఉండవచ్చు. ఎంత సేపు పడుకున్నా అలసట తీరక పోవటం, పడుకోగానే నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టదేమోననే భయం నిరంతరం వెంటాడుతూ ఉండటం, పట్టినది కలత నిద్ర కావటం, పీడ కలలు రావటం మొదలైన సమస్యలు తరచుగా చూస్తూ ఉంటాం. ఏదో తీవ్రమైన వ్యాధి ఉంటే తప్ప ఇటువంటి వాటిని అధిగమించే ఉపాయాలను ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దలు పాటింపచేసేవారు కొద్ది రోజుల క్రితం వరకు. చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది – తమ చిన్నతనంలో పెందలాడే రాత్రి భోజన కార్యక్రమాలని పూర్తి చేయటం, ఆ తరువాత ఇంటిల్లి పాది కూర్చుని ముచ్చటలాడుకోవటం, కాలకృత్యాల అవసరం ఉంటే తీర్చుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, (చలి కాలం అయితే వేడి నీళ్ళతో) మంచి నీళ్ళు తాగి, పక్క మీద కూర్చున్న తరువాత కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి పడుకోవటం. చిన్న పిల్లలు నిద్ర రావటం లేదంటే నాయనమ్మలో, తాతలో చక్కని కథలు (భయానకమైనవి కావు సుమా) చెప్పేవారు. లేదంటే వారికి నచ్చే దేవుడి పాటలో, భజనలో వినిపించేవారు.

      ఈ కాలంలో ఈ పద్ధతి చాదస్తంగా కనిపించవచ్చు. కానీ ఆలోచిస్తే ఎంత శాస్త్రీయమో అర్థమవుతుంది. అప్పట్లో రేడియోలు, టీ.వీ లు లేవు కనుక అలా సాగింది అంటారు. అది ఒక కారణం కావచ్చు. మన ఆరోగ్యం కోసం కొన్ని పద్ధతులని పాటించలేమా? మన ఆరోగ్యానికన్న అవి ముఖ్యమా? పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే రాత్రి భోజనం త్వరగా చేయటం అలవాటు చేసుకున్నారు. మనం కొత్తగా మానివేశాం. నిద్రపోయే సమయానికి తిన్న ఆహారం మూడు వంతులకు పైగా అరిగి ఉండాలని ఆయుర్వేదం చెపుతోంది. అప్పుడు ప్రాణశక్తి జీర్ణవ్యవస్థ వైపుకి ఎక్కువగా వెళ్ళే పని ఉండదు కనుక మిగిలిన అవయవాలకి విశ్రాంతి నివ్వటంలో నిమగ్నమౌతుంది. కడుపు బరువుగా ఉంటే పీడ కలలు వస్తాయి. పీడ కలలు రాకుండా ఉండాలంటే నిద్ర పోయే సమయానికి చాలా ముందుగా భోజనం చెయ్యటం ఒక్కటే మార్గం.

      కాళ్ళు కడుక్కోవటం అనే మాటని పెద్ద వాళ్ళు కాలకృత్యాలకి వెళ్ళి రావటం అనే అర్థంలోనే ఉపయోగించేవారు. ఎందుకంటే, లఘు శంక తీర్చుకున్న ప్రతిసారి కూడా కాళ్ళు కడుక్కోవటం వారి అలవాటు. దానినే పిల్లలకి చిన్నతనం నుండి అలవాటు చేసేవారు. అది శుచి కోసం అంటే పట్టించుకోరని, అలా చెయ్యక పోవటం దరిద్రం అనేవారు. కాలకృత్యాల తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోమని ఇప్పుడు వైద్యులు చెవినిల్లు కట్టుకొని పోరుతున్నారు కదా! దానిని ఊహ తెలిసినప్పటి నుండి ప్రవర్తనలో భాగంగా చేయటం జరిగింది. కాళ్ళు కడుక్కోవటం వల్ల బయట నుండి వచ్చే సూక్ష్మ క్రిములు పోతాయి. శుభ్రత ఎప్పుడైనా, ఎక్కడైనా కోరుకోదగినదే కదా! నిద్ర మధ్యలో ఒకటికో రెంటికో లేవటంవల్ల నిద్రా భంగం అవుతుంది. ఒక సారి లేస్తే తిరిగి నిద్ర పట్టక పోవచ్చు. కనుక అటువంటి ఇబ్బంది కలగకుండా అవసరాలను ముందే తీర్చుకునే అలవాటు ఎంత మంచిదో చూడండి!

      నిద్ర మధ్యలో మెలకువ రావటానికి మరొక కారణం కూడా ఉంది. అది దాహం. నిద్ర పోతున్నప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. ఉన్న నీరు ఖర్చు అయిపోతుంది. అప్పుడప్పుడు ఎవరో పీక నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. నిజానికి అది దాహం. గుర్తించే లోపు ఎంతో బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిని తప్పించటానికే నిద్ర పోబోయే ముందు కడుపునిండ నీళ్ళు తాగటం అలవాటు చేసుకోమన్నారు. అప్పుడు నిద్ర మధ్యలో లేవటం, బాధ పడటం ఉండవు.

      నిద్రకు ఉపక్రమించటానికి ముందు ఎటువంటి ఆలోచనలతో ఉంటే నిద్రలో కూడా మనసు ఆ ఆలోచనల ప్రభావంలోనే ఉంటుంది. కనుక నిద్రలోకి జారుకొనే ముందు మంచి ఆలోచనలతో ఉండటం మంచిది. దానితో మన ప్రయత్నం లేకుండానే మనసు రాత్రంతా సానుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వేళ కలలు వచ్చినా ఆహ్లాదకరమైనవే వస్తాయి. మనసుని మరింత ప్రశాంతంగా ఉంచగలిగితే కలలు కూడా రాని గాఢనిద్ర పడుతుంది. అటువంటి నిద్ర కొన్ని గంటలైనా చాలు. అందుకే మనసుకి ప్రశాంతత, భద్రతా భావం కలిగించే సద్గ్రంధాలని చదవటం కాని, వినటం కాని చెయ్యమనేవారు. పెద్దలే భయపడే భీతావహమైన దృశ్యాలతో, భయంకరమైన కథలతో ఉన్న టీ.వీ. సీరియల్స్, సినిమాలు చూస్తూ పడుకుంటున్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా! రాత్రంతా ఒత్తిడికి లోనైన మనస్సుతో ఉన్న పిల్లల మానసికస్థితి ఎంత అలజడికి లోనవుతుందో ఈనాటి పిల్లల ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. పిల్లలు, యువతరం పాడై పోయారు, పెద్దలమాట వినటం లేదు, సంఘ విద్రోహక శక్తులుగా మారుతున్నారు అని వాపోతుంటారు ముందు తరం వారు. కాని పిల్లలకు మానసిక విశ్రాంతిని, భద్రతా భావాన్ని కలిగిస్తున్నామా అని ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంది.

      ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ పడుకోవటం అలవాటయితే ఆనిద్ర సుఖమే వేరు. ఆస్తికులైన పాశ్చాత్యులు ఈ నాటికీ పడుకోబోయే ముందు తప్పక ప్రార్థన చేస్తారు. మనం ఎందుకు మానేశాం? లయ కారకుడైన శివుని తలచుకుని నిద్ర కుపక్రమించటం మన సంప్రదాయం. సుఖనిద్రకోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన పెద్దలు చెప్పిన సూచనలను పాటించి ప్రయోజనం ఉంటుందేమో ప్రాయత్నించి చూద్దామా?

      ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర పోయేప్పుడు పడుకునే దిశ, భంగిమ కూడా సహకరిస్తాయి. తూర్పు పడమరలుగా ఎటువైపు తల పెట్టుకున్నా సమస్య లేదు. ఉత్తర దక్షిణాలుగా పడుకునేప్పుడు తల దక్షిణ దిక్కుగా పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే భూమి ఒక అయస్కాంతం కదా! దాని ఉత్తర ధ్రువం మనకి దక్షిణం వైపుగా ఉంటుంది. మనిషి వెన్నెముక పై భాగం ఉత్తర ధ్రువం. దిగువ భాగం దక్షిణ ధ్రువం. పడుకున్నప్పుడు దానితో సంవదించి ఉంటే భూమి నుండి వచ్చే శక్తిని గ్రహించటానికి వీలవుతుంది. వ్యతిరేక దిశ అయితే సమ ధృవాలు ఒక దాని పక్కకి మరొకటి వస్తే ఏమవుతుందో తెలుసుగా! నిద్ర పోయే సమయంలో కూడా శక్తిని సముపార్జించుకునే చక్కని పద్ధతిని దర్శించి ఇచ్చిన మన ఋషులకు ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటే సరిపోతాయి?

    నిద్ర లేవటం (మేలుకొనటం)...    

      నిద్ర లేచిన తీరుని బట్టి ఆ రోజు ఎలా గడుస్తుందో స్థూలంగా చెప్పవచ్చునట. ఇది మానసిక స్థితికి సంబంధించినది. మనస్సు ఆహ్లాదంగా ఉంటే ఆనాటి పనులన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నది అందరికి అనుభవంలో ఉన్నదే. పని తీరు మానసిక స్థితి మీద ఆధార పడి ఉంటుంది. తీరుని బట్టి ఫలితం ఉంటుంది.

      ఒక మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి పనిలోనూ పాటించ వలసిన పద్ధతులని మన పెద్దలు అనుభవంతో చెప్పారు. అవి శాస్త్రీయమైనవి మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనవి. కాలం పెట్టిన పరీక్షలకి నిలిచినవి. అయితే కాల క్రమంలో కొన్నింటి వెనుక ఉన్న శాస్త్రీయతను నిరూపించలేకపోవచ్చు. దానికి కారణం కాలక్రమంలో ఒక పద్ధతిని పాటిస్తూ పోవటం అలవాటయ్యి, ప్రశ్నించటం మరచి పోయి, అడగటం తప్పు అనే భ్రమలో పడిపోవటం. దాని వల్ల కొన్ని ఆచారాలు పాటించటం వెనుక ఉన్న శాస్త్రీయత మరుగున పడిపోయింది. వాటిని వెలికి తీయ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉపయోగం తెలిస్తే యువతరం శ్రద్ధగా పాటిస్తుంది. అటువంటి వాటిలో ప్రథమమైనది నిద్ర లేవటం.

      నిద్ర లేవటానికి కూడా ఎప్పుడు? ఎలా? అని నిర్దేశించే ఒక పద్ధతి ఉన్నది, దానికొక సహేతుకమైన కారణం కూడా ఉంది అంటే ఆశ్చర్యం కలగ వచ్చు. కానీ ఉన్నది అని పెద్దలు దర్శించారు.

      ఒక మనిషికి మంచి ఆరోగ్యం కావాలంటే సుర్యోదయానికన్న కనీసం ఒక జాము ముందుగా లేవాలి. దానినే బ్రాహ్మీ ముహూర్తమని అంటారు. అంటే సూర్యోదయ సమయానికి కాలకృత్యాదికాలు పూర్తి అయి ప్రార్థనకి సిద్ధంగా ఉండటం జరుగుతుంది. తూర్పున సూర్యుడు ఉదయించే సమయానికి మనిషిలోని జీవ ప్రజ్ఞ చైతన్యవంతమౌతుంది. ఆ సమయంలో పడుకొని ఉంటే జీవప్రజ్ఞ వికసనం ఎలా జరుగుతుంది? కనుక అంతకు ముందుగానే లేచి, సిద్ధంగా ఉండటం సంప్రదాయం. అప్పుడు బుద్ధి పూర్తిగా వికసిస్తుంది. కనుక మంచి తెలివి తేటలు, బుద్ధి వికాసం, మేథా సంపద కావాలనుకునే వారికి ఎప్పుడు నిద్ర లేవాలో అర్థమయినట్టే కదా!

      నిద్ర లేవటం కూడ ఒక పద్ధతిలో ఉండాలట! గాఢంగా నిద్రిస్తున్నవారు కంగారుగా లేచినట్లైతే అయోమయంగా ఉంటుంది. తనెవరో కూడా గుర్తు ఉండకపోవచ్చు కొన్నిసార్లు. అందుకే నెమ్మదిగా నిద్ర లేపాలని చెపుతారు. తనెవరో గుర్తు చెయ్యటం కూడా అవసరమనిపిస్తుంది. యాగ సంరక్షణ కోసం తన వెంట తీసుకొని వెడుతున్న శ్రీ రామ చంద్ర మూర్తిని విశ్వామిత్రుడు

      “కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే!
ఉత్తిష్ఠ నర శార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!!”

      అని ఎంత చక్కగా నిద్ర మేల్కొలిపాడో అందరెరిగినదే! అంత నెమ్మదిగా, అంత మృదువుగా ఉండాలి నిద్రలేపటం, లేవటం. అది ఆరోగ్యానికి మంచిది.

      సాధారణంగా మానవులు పడుకుని నిద్ర పోతారు. అప్పుడు రక్త నాళాలు, నాడులు భూమికి సమాంతరంగా ఉంటాయి. రక్త ప్రసరణ చాలా తేలికగా జరిగి పోతూ ఉంటుంది. నిద్ర లేవగానే మనిషి కూర్చున్నా, నిలుచున్నా భూమికి లంబ కోణంలో ఉంటాడు. రక్త ప్రసరణ దిశ మారుతుంది గనుక గుండే పని తీరులో మార్పు ఉంటుంది. మార్పు సహజమే అయినా హఠాత్తుగా జరగటం వల్ల కంగారు, అయోమయం వంటివి కలగవచ్చు. వీలైతే వాటిని తప్పించి, గుండె పని సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా! అందుకే నిద్ర నుండి మెలకువ రాగానే వెంటనే మంచం మీద నుండి లేవవద్దు అంటారు. ఒక ప్రక్కకి తిరిగి కొన్ని క్షణాలుండి, అటు ప్రక్కగా లేవాలట. ఆ తరువాత కొద్ది సేపు మంచం మీద కాళ్ళు క్రిందికి పెట్టి, పాదాలు నేలకి ఆనించి కళ్ళు మూసుకుని కూర్చోవాలట. నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి నిలబడాలట. ఎందుకంటే ఈ వ్యవధానంలో గుండె రక్తాన్ని సమాంతర దిశలో కాక పైకి క్రిందికి ప్రసరించటానికి తగినట్టు పని చేయటం మొదలు పెడుతుంది. గుండెపై వత్తిడి తగ్గుతుంది. ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనలు చేసిన సర్వేక్షణ ఒక దానిలో తేలిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిద్ర నుండి హఠాత్తుగా లేచే అలవాటున్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువట! కనుక నిద్ర లేచిన వెంటనే మంచం దిగి నిలబడ వద్దని వారి సూచన.

      ఇలా చెపితే వినాలనిపించదు. అందుకే మన పెద్దలు నిద్ర లేచే పద్ధతిని ఒక సంప్రదాయంగా, ఒక ఆచారంగా అలవాటు చేశారు. మెలకువ రాగానే ప్రక్క మీదనే లేచి కూర్చోవాలి. రెండు అర చేతులను ఒక దానితో మరొక దానిని రుద్ది, గోరువెచ్చగా అయిన పిమ్మట కళ్ల మీద ఉంచుకొని, కొద్ది సేపటి తర్వాత

“కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ
కర మూలేతు గోవిందః ప్రాభాతే కర దర్శనం”

అంటూ కళ్ళు తెరచి అర చేతులని చూడాలి. అప్పుడు

“సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే
విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శమ్ క్షమస్వ మే”

అంటూ భూదేవికి నమస్కరించి నెమ్మదిగా కాళ్ళు క్రింద పెట్టాలి. ఆరోగ్య సూత్రంతో పాటు ప్రకృతి పట్ల భక్తిని కూడా జోడించటం ఉంది ఈ సంప్రదాయంలో. అర చేతులకు స్వస్థత నిచ్చే గుణం ఉంది. కళ్ళు మామూలుగా మూసుకున్న దానికన్న అర చేతులతో మూసుకుంటే ఎంతో హాయిగా ఉండటం అందరికి అనుభవంలో ఉన్నదే . కనుకనే కంటికి సుఖం కలగటం కోసం అర చేతులతో కప్పుకుని సమస్త ప్రపంచం మన చేతులలో అంటే చేతలలో ఉందని ప్రతి ఉదయం గుర్తు చేసుకోవటమే ఇది. అంతే కాదు ఒక్క సారిగా కళ్ళు తెరిచి వెలుగుని చూడటం కూడా కంటి చూపుకి అంత మంచిది కాదు. ఈ పద్ధతి అలవాటయితే ఒక వేళ ఎప్పుడైనా సూర్య కాంతి బాగా వచ్చినాక నిద్ర లేచినా ఇబ్బంది ఉండదు.

    బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటటా...    

      ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ ‘బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!

      సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 - 4:30 AM ని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.

* ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.
* మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే ‘తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం ‘వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ ‘వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.
* ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.
* ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.
* గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలావచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే ‘థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి!

    నీరు ...    

      మన శరీరంలో 90 శాతం, భూమి మీద 90 శాతం నీరు వుంటుంది. నీరు ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. నీరు జీవనాధారం. ఎప్పుడు త్రాగినా గోరు వెచ్చని నీరు త్రాగాలి. అవసరమైన మేరకే త్రాగాలి. భోజనం చేసేటప్పుడు కేవలం నోరు తడుపుకోవడానికే త్రాగాలి, భోజనానికి ముందు 30 నిమిషాలు తిన్న తరువాత 30 నిమిషాలు నీరు త్రాగరాదు. నీటిని కేవలం స్టీలు బాటిల్స్, గ్లాసులలొ మాత్రమే త్రాగాలి. నిల్వ వుంచాలి అంటే ఎట్టి పరిస్థుతులలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు, అవి క్యాన్సర్ కారకం. మినరల్ వాటర్(ఆర్.ఓ) ను అసలు త్రాగవద్దు. అందులో మన శరీరానికి కావలసిన లవణాలు ఏమి వుండవు. యాసిడ్ తో సమానం, మన రక్తాన్ని , ఎసిడిక్ గా మార్చి మన ఎముకలు పెళుసు బారేలా చేస్తాయి. మినరల్ వాటర్(ఆర్. ఓ) బదులు యు.వి. వాటర్ ఫిల్టర్ వాడుకుంటే మంచిది. మినరల్ వాటర్ ప్రత్యామ్నాయం లేనివారు ఆ నీటిలో కొంచెం సైందవ లవణం, కొంచెం పసుపు కలిపి తాగాలి. మనం చేసే పనిని బట్టి సుమారుగా రోజు మొత్తంలో 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవచ్చు.

    నిద్రలేవగానే నీళ్ళేందుకు త్రాగాలి...    

      పగలంతా అలసి, సొలసి సాయంత్రం ఇల్లు చేరి సేదతీరి నిదురిస్తాము. ఆ తర్వాత మన శరీరంలో అవయవాలన్నీ మనతో పాటు విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటాయి. ఉదయం మనం అయితే లేస్తాము. కానీ శరీరంలోని అవయవాలు ఇంకా మగతగానే ఉంటాయి. వాటిని ఉత్తేజ పరచాలంటే ఘన పదార్ధంతో ప్రారంభించకూడదు. గోరు వెచ్చటి నీతితో మన దినచర్య ప్రారంభిస్తే శరీరంలో అవయవాలు కూడా మనతో పాటే ఉత్సాహంగా పనిచేస్తాయి. ఉదయం లేవగానే నీరు త్రాగడం వలన జీర్నవ్యవస్తాకి ఎంతో మేలు.

గంగాజలంలో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి...

      హిమాలయాలలో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో చైతన్య శక్తినిచ్చే శక్తి దాగి వుంటుంది. కలరా, అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు. అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

    రాగి పాత్రలోని నీళ్లు తాగండి...    

      ‘ఈకోలీ’ అనే బ్యాక్టీరియా ఫుడ్‌పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నీళ్లను రాగిబిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది. క్రిములతో పోరాడుతుంది. అందుకే చాలా అధ్యయనాలు గదుల్లో ఏదో ఒక వస్తువుని రాగితో చేయించి పెట్టుకోమని సూచిస్తున్నాయి. అలా ఉన్నా క్రిములతో పోరాడుతుందీ లోహం. ‌రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అరుగుదల సక్రమంగా ఉంటుంది. రాగి బిందెలో నీళ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి. శరీరంలో నిల్వ ఉన్న హానికారక కొవ్వులకు ఈ లోహం పెద్దశత్రువు మరి! ‌రాగిలో ఉండే పలు రకాల పోషకాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ, ఏకాగ్రత చాలా బాగుంటాయి. చదువుకునే చిన్నారులకు ఈ నీళ్లు ఇవ్వడం ఎంతో మంచిది. ‌ఇది యాంటీ ఏజింగ్‌ కారకం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో రాగి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించి.. కొత్త వాటిని పునర్నిర్మించడానికి తోడ్పడుతుంది. ‌ఈ లోహంతో చేసిన బిందెలో నీళ్లు తాగడం వల్ల ఎముకలు దృఢపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల సంబంధ సమస్యలున్నవారు తాగితే ఉపశమనంగా ఉంటుంది. ‌రాగి పాత్రల్లో నీళ్లను క్రమం తప్పకుండా తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా రాగి బిందెలో నీళ్లు తీసుకుంటే ఎంతో మంచిది. ‌శరీరంలో రాగి లోపిస్తే... థైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అధిగమించాలంటే రాగి చెంబులో నీళ్లు తాగాలి. థైరాయిడ్‌ గ్రంథులు కూడా ఉత్తేజితమై సమస్యలు దరిచేరవు.

    స్నానం...    

      గోరువెచ్చని నీటితో స్నానం మంచిది. మనం వాడే సబ్బులు, షాంపూలు, పౌడర్లు, స్ప్రేలు, క్రీముల వలన రకకకాల కెమికల్స్ మన శరీరంలోకి నేరుగా ప్రవేశించి రకరకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. కావున సున్నిపిండి, కుంకుళ్ళు, షీకా కాయ మొదలగు సాంప్రదాయ పద్దతులను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు తలస్నానం చేయగలిగితే మంచిది. స్నానం చేసేటప్పుడు పుణ్యనదులను, సుందరమైన కొలనులను ఉహించుకోంటూ పరిశుబ్రంగా చేయాలి.

    పూజ...    

      ప్రతి వ్యక్తి కనీసం 20 నిముషాల సేపు ఇంట్లో వారి వారి విధానంలో పూజ చేసుకోవాలి. పూజ మనసుని ప్రక్షాళన చేస్తుంది. మీకు ఆరోజు కార్యక్రమంలో భగవంతుని ఆశీస్సులుంటాయనే ధైర్యం వుంటుంది. మంచి భావనలో ప్రారంబమయ్యే రోజు మంచిగానే వుంటుంది.

    ఆహారం...    

      అమృత ఆహారం:- మొలకెత్తించిన పెసర్లు, దానిమ్మ గింజలు, నల్లని ఎండు ద్రాక్ష (30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టినవి), కొబ్బరి, అంజురా, రాత్రిపూట నానపెట్టిన బాదం పొట్టు ఓలచినవి (మనిషికి 6 చొప్పున ) వీటిని బాగా కలుపుకొని ఇంట్లో అందరూ 4 చెంచాలు చొప్పున బాగా నమిలి తినాలి. ఇది మీకు కావలసిన ప్రొటీన్ ఓమేగా ప్యాటీ యాసిడ్, ఎంజైములు, యాంటీ ఆక్సిడింట్స్ మీకందిస్తాయి.

    రాగి జావ...    

      ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత నివారణకు సంజీవని రాగి జావ ప్రతి రోజు కనీసం 1 గ్లాసు త్రాగాలి.

రాగి జావ తయారీ:-

      రాగుల్ని సుద్ది చేసి మొలకెత్తించాలి. వాటిని నీడలో ఆరబెట్టి, ఒక కేజీకి 100 గ్రాముల చొప్పున సగ్గుబియ్యం, బార్లి గింజలు కలిపి మర పట్టించుకోవాలి. నీళ్ళు కాగబెట్టి, ఉండలు చుట్టకుండా రాగి పిండిని కలుపుకోవాలి. ప్రతిసారి సాయంత్రం పూట తయారు చేసుకొని ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఆరనిచ్చి, కొన్ని మెంతులు కలుపుకొని ఈ జావని ఉదయం పూట మజ్జిగతో కలుపుకొని త్రాగాలి.

    అమృత ఆహారం ఎందుకు...    

      ఎన్నో రకాల రుగ్మతలతో బాధపడుతున్న నేటి తరాన్ని నిసితంగా గమనిస్తున్న శాస్త్రవేత్తలు, మనషుల డి.ఎన్.ఎ తో సమానమైన బరాంగ్ టాన్ అనే జంతువుని పరిశీలించినప్పుడు ఎన్నో ఆశ్యరకరమైన విషయాలు తేలుసుకున్నారు.

      * బరాంగ్ టాన్ దాదాపు 300 కిలోల బరువు వుంటుంది.100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తుంది. దానికి ఎటువంటి జబ్బులు లేవు. కారణం ఏంటంటే బరాంగ్ టాన్ కేవలం ఆకులు, పండ్లు, దుంపలను మాత్రమే తింటుంది. పూర్తిగా శాఖాహరి, దానికి కావలసినంతే తింటుంది. శరీరానికి కావల్సినంత శ్రమ వుంటుంది. రోజు తగినంత సమయం ఎండలో వుంటుంది. మానవ శరీరం శాఖాహరం తీసుకోవడానికి నిర్దేసించబడింది. తగినంత సూర్యరశ్మి శారీరక శ్రమ శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుతుంది. మనం ఏదైనా పదార్దాన్ని వుడికించి తిన్నప్పుడు అది ఆమ్ల గుణం కలిగి వుంటుంది. ఒక మనిషి ఆరోగ్యం అతని రక్తం యొక్క, క్షార, ఆమ్ల గుణాలని బట్టి నిర్ణయమవుతుంది , రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఉడికించవలసినవి తప్పితే (ధాన్యం మొదలగునవి) మిగిలిన వాటిని వీలైనంత పచ్చిగా తినటం మంచిది. అమృత ఆహారం ఒక చక్కని, తేలికపాటి తయారీ విధానం అమృతాహారం సంవత్సరం పాటు ప్రతి రోజు మూడు పూటలా మూడు గ్లాసులు తీసుకోంటే శరీరంలో ప్రతి అణువు చైతన్యమవుతుంది. ఎటువంటి వ్యాధులు దరిచేరవు, ఉన్న వ్యాధులు కూడా నయం అవుతాయి. కారణమేమిటంటే మన శరీరంలో ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చనిపోతాయి, అంతే కొత్తవి పుడుతాయి అమృతాహారంలో వున్న క్లోరోపిల్, మన రక్తాన్ని న్యూట్రల్ చేస్తుంది, కొత్త కణాలు చైతన్యంగా వుండేటట్లు చేస్తుంది. కేవలం అమృతాహారంతో ఎన్నో మొండి జబ్బుల బారినుండి బయట పడిన వారెందరో వున్నారు. అమృత ఆహరం మన శరీరానికి అత్యంత అవసరమైన దివ్యఔషదం.

    అమృత ఆహారం తయారీ...    

      బీట్ రూట్1 ( సుగర్ వ్యాధి వున్న వారికి బీట్ రూట్ వద్దు), పుదీనా- 2 కట్టలు, కొత్తిమీర-2 కట్టలు, మెంతి-1కట్ట, వేళ్ళను తీసివేసి బాగా కడిగి పెస్ఠులాగా అయ్యేలా మిక్సీ వేసుకోవాలి, గోరువెచ్చని నీరు, నిమ్మకాయ, కొంచెం సైంధవ లవణం కలుపుకొని రోజుకు 3 సార్లు త్రాగాలి.

    విహారం...    

      కుటుంబ సభ్యులందరూ కలసి కూర్చుని ఉదయపు ఆహారం తీసుకోవచ్చు. ఇంటి నుండి బయటకు వెళ్ళిన తరువాత మనం చేసే పనిని శ్రద్ద, ఆశక్తులతో క్రమశిక్షణగా చేయాలి. ఎవరైన 30 నిమిషాలకు మించి ఒకేచొట కూర్చోరాదు 30 నిమిషాల తరువాత కొంచెం 10 అడుగులు అటూఇటూ వెళ్ళి మళ్ళీ కూర్చొవాలి. బయటకు వెళ్ళిన వారు, కాసేపు పుస్తక పఠనం, స్నేహితులతో మాటలు, ఇంటి పనులు చేసుకొవచ్చు.

    భోజన యజ్ఞం...    

      భోజన ప్రారంభంలో శరీరంలోని ఐదు రకాల వాయువుల్ని ఉద్దేశించి ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా... అంటూ ఐదు ఆహుతులుగా కొన్ని మెతుకులు నోట్లో వేసుకుంటారు. ఆ తర్వాత అదే భావనతో భోజనం చేయాలని అర్థం. ఇలా భోజనం చేసినవాడికి యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పారు.

      సృష్టి ఏర్పడిన విధానాన్ని ఇలా చెప్పారు. చైతన్య రూపమైన పరమాత్మ నుంచి మొదట ఆకాశం ఏర్పడింది. దాని నుంచి వాయువులు, వాయువులే తేజోరూపంలో (అగ్నిరూపంలో) మారాయి. అది మళ్లీ జలంగా పరిణామం చెందింది. దాని నుంచి పృథ్వి వచ్చింది. అందులో చెట్లుచేమలు జన్మించాయి. ఇవి ఆహారం కావడం వల్ల వీటి నుంచి వివిధ ప్రాణులు వచ్చాయి. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కావాల్సిన అగ్నితత్వం అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్‌ వల్ల దేహంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సిన వేడి పుడుతుందని సైన్సు ద్వారా కూడా తెలుసుకుంటున్నాం.

      యజ్ఞంలో ఆహుతులు వేస్తూంటాం. మనం పీల్చుకునే వాయువే శరీరంలో అనేక రూపాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇదే అగ్ని రూపంగా కూడా మారి అన్నాన్ని జీర్ణం చేస్తుంది. యజ్ఞ సమయంలో అగ్నిలో ఎలా ఆహుతుల్ని వేస్తామో.. అలాగే మన శరీరంలోని అగ్నులకు ఆహుతులు వేయడమే భోజన విధానం. ఈ భావనతో భోజనం చేసే వ్యక్తి ఆవురావురుమంటూ పొట్ట నింపుకోవడానికి కాక తనలోని పరమాత్మ స్వరూపానికి ఆహుతి రూపంలో అన్నం అర్పిస్తున్నాను అనుకుంటూ భోజనం చేస్తాడు

      మనిషి తన జీవిత కాలంలో తినే అన్నం కొన్ని వేల టన్నులు ఉండవచ్చు. దీన్నంతా మన కడుపులోని జఠరాగ్ని జీర్ణం చేస్తోంది. అగ్నికి అనలం అని మరొక పేరు. అనలం అంటే అలం అనే భావన, చాలు అనే మాట లేనిది అని అర్థం. ఎంత వేసినా దహిస్తూనే ఉంటుంది. అందుకే యోగశాస్త్రంలో భోజనానికి చాలా నియమాలు చెప్పారు. కడుపులో సగభాగమే అన్నంతో నింపాలని, పాతిక భాగం నీటితో నింపాలని.. మిగిలిన పాతిక భాగం ఖాళీగా వదిలేయాలని యోగశాస్త్రం చెబుతుంది. ఆకలి అనే రోగానికి ఔషధంగా భోజనాన్ని తీసుకోవాలని చెప్పారు. అన్నమే ఆరోగ్యం.. అంటే రోగాలు లేని స్థితి, అన్నమే రోగం, అదే ప్రాణం, అదే మృత్యువు, అదే ముసలితనం అని వేదమంత్రం. మనం తిన్న ఆహారమే వీటన్నింటికీ కారణమని అర్థం. అతిథులకు, జంతువులకు అన్నాన్ని తప్పకుండా ఇవ్వాలనేది ఒక నియమం. దీన్నే అతిథి యజ్ఞం, భూత యజ్ఞం అన్నారు. గృహస్థు తప్పక ఈ రెండింటినీ చేయాలని చెప్పారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాణికి ఆహారమివ్వడం, అతిథికి భోజనం పెట్టడం అనే నియమాన్ని ఇప్పటికీ కొందరు పాటించడం చూడగలం.

    భోజనం...    

      భోజనం 12 గంటలు నుండి 1 గంటలు లోపు తీసుకుంటే మంచిది. భోజనం తయారు చేయడం అనేది భగవంతుడికి నైవేద్యం పెట్టడంతో సమానం. భోజనాన్ని శుచిగా స్నానంచేసి అగ్నికి నమస్కరించి తినేవారంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలని ప్రార్దించి చేయాలి.

* వంట చేసేటప్పుడు శబ్దాలు చాలా ప్రమాదం.
* వంటకు కేవలం స్టీలు పాత్రలను వాడాలి.
* దగ్గరుండి కలుపుకుంటూ తక్కువ మంటపై వంట చేయాలి.
* ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులనే వాడాలి.
* సైందవ లవణం 80 రకాల సూక్ష్మపోషకాలను కలిగి వుంటుంది. కావున సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడాలి.
* గానుగ బట్టిన కొబ్బరి, కుసుమ, నువ్వుల నూనే శ్రేయస్కరం.
* కారం మితంగా వాడుకోవాలి, చింతపండు పులుసు వద్దు, నిమ్మకాయ వాడుకోవాలి.
* అన్నం కోసం చాలా తక్కువగా పాలిష్ బియ్యాన్ని గాని, కొర్ర బియ్యాన్ని గాని వాడుకోవాలి. అన్నం వండేటప్పుడు గంజి వార్చాలి.
* రైస్ కుక్కర్ లలో, అల్యూమినియం పాత్రలలో వంట చేయరాదు. 99 శాతం గ్యాస్ సమస్యలకు ఇవే కారణం.
* భోజనంలో జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు మొదలగు వాటిని పిండి చేయించి మల్టిగ్రేన్ రొట్టెలు తయారు చేసుకోవచ్చు.
* కూరలు ఆకుకూర పప్పు, మిక్సిడ్ కూరగాయల కూరలు ఆవిరి మీద ఉడికి మాములుగా తాలింపు వేసుకొని తినాలి.
* పెరుగుతో పాటు సలాడ్ లాగ అన్ని పచ్చి కూరగాయలు, పసుపు, సైంధవ లవణంలో ఉల్లిగడ్డ ముక్కలలో తాలింపు చేసి తింటె మంచిది.
* మొదట ముద్దలో కరివేపాకు, జీలకర్ర, సైంధవ లవణం, అవిశలు, నువ్వులు, కొబ్బరి కలిపి పొడి లాగా చేసుకొని ప్రతి రోజు తినాలి. మన శరీరానికి కావలసిన ఒమేగా 369 ప్యాటి యాసిడ్ ఈ విధంగా అందుతాయి.
* భోజనం చేసేటప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొని తినాలి.
* భోజనం అనంతరం పప్పాయి ముక్కలు (6 చిన్నవి ) తీసుకుంటే ఆహరం సరిగా పచనమవుతుంది.
* భోంచేసిన తరువాత తమలపాకు, సున్నం, సోంపు కలిపి తీసుకొంటే తిన్న ఆహరం ఒంట బట్టి శక్తినిస్తుంది.
* పెరుగు బదులుగా జీలకర్ర మజ్జిగ వీలైనన్ని సార్లు తాగవచ్చు.
* భోజనం తరువాత 10 నిమిషాల నడక మంచిది.
* సాయంత్రం 4 గంటల సమయంలో కొన్ని పండ్లు, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది, ప్రతి రోజు ప్రతి ఒక్కరు పైనాపిల్ జ్యూస్ 1 గ్లాస్ తప్పనిసరిగా తీసుకోవాలి.( పైనాపిల్, పప్పాయి, దానిమ్మ సూపర్ ఫ్రూట్స్)
* కలబంద గుజ్జు పైపొర తీసివేసి తెల్లగా వున్న దానిని బాగా కడిగి వీలైనప్పుడల్లా తీసుకొంటే శరీరానికి సంజీవిని లాగా పనిచేస్తుంది.
* నిమ్మకాయని ముక్కలుగా కోసి కేవలం సైంధవ లవణం మరియు పసుపులో ఊరబెట్టి రోజు ఒక ముక్క తీసుకొవడం చాలా మంచిది.
      సాయంత్రం 6 గంటలకు స్నానం, పూజ, 7 గంటలకు ఏదైనా అల్పాహారం, మల్టీగ్రేన్ రొట్టె, కూర తీసుకుంటే చాలు. భోజనం తరువాత కాసేపు నడక, కుటుంబ సభ్యులతో సంభాషణ అనంతరం 9 గంటలకు నిద్రపోవాలి.

    ఆహారం తీసుకొనెటప్పుదు తీసుకోవలిసిన జాగ్రత్తలు...    

      భోజనానికి ముందు ఆమ్లగుణం గల దానిమ్మ తింటే అజీర్ణం బాధ ఉండదు. పుల్లని పెరుగు అస్సలు తినకూడదు. మినుమలతో చేసిన పదార్దాలు తిన్న తర్వాత పాలు త్రాగాకూడదు. తినే పదార్దాలను ఎక్కువ సార్లు వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు. ఇలా తినడం వల్ల గ్యాస్ పెరిగి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. తినే ఆహారాన్ని నిలబడి, కాళ్లుచాపి, నడుస్తూ, మాట్లాడుతూ అస్సలు తినకూడదు.

    అరటి ఆకులో భోజనం మంచిదా...    

      భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరటిఆకులలో భోజనం చేయడం పరిపాటి. దీనికి ఒక సంప్రదాయంగా పాటిస్తారు. అరటిఆకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి .. తదితర వంటకాలను వడ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించడం అసాధ్యం. అయితే అరటి ఆకుపైనే ఎందుకు వడ్డిస్తారంటే ఈ అరటి ఆకులు విషాహారాన్ని, కలుషిత ఆహారాన్ని గ్రహిస్తాయి. విషాహారాన్ని ఆకుపై వేసిన వెంటనే నల్లగా మారుతుంది. దీంతో ఆహారంలో విషం కలిపినట్టు తెలిసిపోతుంది. దీంతో పాటు అరటిఆకులు అనేక పోషకాలను కలిగివుంటాయి. మనం తీసుకునే ఆహారంతో కలిసి మన శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఇడ్లీలు, కొన్ని రకాల నాన్ వెజ్ వంటలను అరటి ఆకుల్లో వండుతారు. అన్ని విటమిన్లు అందడంతో శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఇది పర్యావరణహితంగా కూడా వుంటుంది. దీంతో సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వుంటాయి. అరటి ఆకుల్లో పాలిఫ్లెనొల్స్ వుంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగివుంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలను వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. వీటిని భుజించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.

    జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే...   

      మనదేశంలో చాలమంది తల్లులు పసిపిల్లలకు పాలు పట్టిన అనంతరం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు. ఇందుకు సంబంధించిన వృత్తాంతం పురాణగ్రంథాల్లో వుంది. పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వీరు మాయా రూప విద్యలు తెలిసినవారు. దారిన వెళ్లే బాటసారులను పిలిచి భోజనం పెట్టేవారు. భోజనానికి ముందు వాతాపిని ఇల్వలుడు మేకగా మార్చేవాడు. మేకను చంపి దానితో వంటలు తయారు చేసి అతిథులకు వడ్డించేవాడు. అనంతరం వాతాపిని బయటకు రమ్మని పిలిచేవాడు. కడుపులో వున్న వాతాపి వారి కడుపులను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. దీంతో అతిథులు చనిపోయేవారు. ఇదే పద్దతిలో వాతాపి, ఇల్వలుడు అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. చనిపోయిన వారి నుంచి సంపదలను చోరీ చేసి దాచిపెట్టేవారు. ఇలా దోచుకున్న సంపదలు భారీగా పెరిగిపోయాయి. ఒక రోజున ఆ మార్గంలో అగస్త్య మహాముని వస్తున్నాడు. అతని గురించి తెలియని వారు తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. అందుకు మహర్షి అంగీకరించాడు.

      భోజనం అనంతరం ఇల్వలుడు యథావిధిగా వాతాపి బయటకు రా అనబోయాడు. వీరి మాయోపాయాల్ని ముందుగానే పసిగట్టిన అగస్త్యుడు తన కడుపును నిమురుకుంటూ ‘‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’’ అన్నాడు. దీంతో మహర్షి వాక్కుతో వాతాపి జీర్ణమయిపోయాడు. మహర్షి మహిమకు భీతిల్లిన ఇల్వలుడు శరణుకోరాడు. ఇలా అనేకమంది అమాయకులను కబళించిన రాక్షసుల బెడదను అగస్త్య మహాముని తొలగించాడు. అందుకనే మన పెద్దలు అప్పుడప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు.

    భోజనాన్ని ఎలా తీసుకోవాలి...    

      ఆచమనం చేసిన తర్వాత తీసుకోవాలి. అన్నంనకు నమస్కరించాలి. ఆహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండినవారిని అభినందించాలి. అప్పుడే బలాన్ని, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది. భోజనం మధ్యలో లేవటం, మాట్లాడటం తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు.

      పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి. ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమి మిగాల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధములను ముందుగానే వద్దనాలి.

    నీటిని, పాలను, మజ్జిగను ఏ సమయంలో త్రాగాలి...    

      ఉదయం లేవగానే అనగా తెల్లవారుజామున నీటిని, రాత్రిపూట పాలను, మధ్యాహ్నం భోజనం చేశాక మజ్జిగ త్రాగాలి. అలాగే బోజన సమయంలో మంచినీటిని కుడివైపు ఉంచుకోవాలి. భోజనం చేస్తున్నంత సేపు ముద్ద ముద్దకి నీరుని త్రాగరాదు. మొత్తం భోజనంలో నీరు ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే తీసుకోవాలి.

    భోజనము చేస్తునప్పుడు ఎన్ని నీళ్ళు త్రాగాలి ...    

      ఈ విషయము ఆయుర్వేదంలో చెప్పబడిఉంది. భోజనము ప్రారంభించిన దగ్గర్నుంచి పూర్తి అయ్యెవరకు అరగ్లాసు మాత్రమే త్రాగాలి. భోజనం అయ్యాక ఓ గంట తరువాత ఓ గ్లాసు ఆపై త్రాగాలి. ముద్దముద్దకీ మధ్యలో నీరు త్రాగితే శరీరంలోకి వెళ్ళిన ఆహారం సాంబారులో తేలే ముక్కల్లా జీర్ణం కాక మలబద్దక సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయి.

    ఎక్కిళ్లు ఆగాలంటే...    

      ఎక్కిళ్లు వస్తుంటే అవి ఆగడానికి ప్రయత్నపూర్వకంగా కాసేపు ఊపిరి బిగబట్టాలి. అయితే అది శ్వాసక్రియను ఆపేంత కాకూడదు. కాసేపటి తర్వాత శ్వాస తీసుకుని, మరోసారి బిగబట్టాలి. ఇలా కాసేపు చేస్తే ఎక్కిళ్లు ఆగుతాయి. గబగబా ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఒక రెండు నిమిషాల పాటు ఇలా చేయాలి. ఎక్కిళ్లు ఆగాక మళ్లీ మామూలుగా ఊపిరి తీసుకోవాలి.

      మోకాలిని ఛాతీ వరకు తీసుకుని దాన్ని కాసేపు ఛాతీకి ఆనించి ఉంచాలి. అకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయి. అయితే అది అంత మంచిది కాదు. కాబట్టి ఎక్కిళ్ల మీదనుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాలి.

    పెరుగుతో ఆరోగ్యానికి ఎంతో మేలు...    

      మనం రోజూ ఆహారంలో చివరకు పెరుగుతో తింటాము. కానీ వాటి వల్ల ఉపయోగాలు ఎంటో చాలా మందికి తెలియదు. పెరుగుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనే శక్తి ఉంది. అంటే మనం రోజూ తినే అన్నంలో పెరుగు కలుపుకుని తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే పెరుగు అంటే ఇష్టపడని వారు కూరల్లో, స్వీట్లలో తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. పెరుగు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధకశక్తిని కూడా మెరుగు పరచడంతో పాటు రక్తపోటు ముప్పు నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే పెరుగు.. పాలతో తయారైనప్పటికీ పాల కన్నా ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది కాబట్టి.. మన బాడీలో ఎముకలకు, పళ్ళకు బాలాన్ని చేకూర్చుతుంది. అజీర్ణంతో బాధపడుతున్నా లేక కడుపులో ఇతర సమస్యలున్న పెరుగుతు తింటే జీర్ణ వ్యవస్థ చక్కబడుతుంది. అదేవిధంగా పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు, వివిధ ఎంజైములు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పెరుగు మన జుట్టుకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసైరా మాడుకు, జుట్టుకు పెరుగు రాసి అరగంట పాటు ఉంచితే జుట్టు మృదువుగా ఉంటుంది. చుండ్రును దరి చేరనివ్వదు.

    నేల మీద కూర్చుని తింటే...    

      ఎత్తయిన ప్రదేశంలో నోటికి దగ్గరగా కుర్చొని తినటం ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం పోతుంది. క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది. భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారం కటిక నేలమీద కూర్చోకుండా చాప, పట్ట వంటింది వేసుకొని, ఇంటిల్లపాదీ గుండ్రగా కుర్చొని మధ్యలో ఆహార పదార్దాలు పెట్టుకొని భోజనం చేస్తె కనీసం యాబై శాతం వ్యాధులను అరికట్టవచ్చు.

      ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...

* భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
* కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!
* చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.
* నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.
* తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
* నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.

    చేతులతో తినడం అనాగరికమా...    

      భారతీయులు ఆహారం తినే విధానం చూసి పాశ్చాత్యులకి ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఫోర్కులూ, స్పూన్లూ లేకుండా వీళ్లు ఒట్టి చేతులతో ఎలా తింటారబ్బా అనుకుంటారు. అలా చేతులతో ఆహారం తీసుకోవడాన్ని అనాగరికంగా పరిగణించేవాళ్లు కూడా లేకపోలేదు. ఆహారాన్ని వేళ్లతో తినడం అనాగరికత కాదు సరికదా ఆరోగ్యమేనని చెప్పేందుకు ఒకటి కాదు వంద కారణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని…

* భారతీయుల ఆహారం చప్పిడిగా ఉండదు. ఉప్పు, పులుపు, కారాలతోపాటు మసాలాలు దండిగా ఉంటాయి. వీటికి లోహం తగలగానే రుచిలో తప్పకుండా మార్పు వచ్చేస్తుంది. అంతేకాదు! ఆహారపదార్థాలలో ఉన్న నూనె, ఉప్పు లోహంతో చేసిన స్పూన్లతో కలిసినప్పుడు ప్రతిచర్య ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేనా! నోట్లోకి రుచికరమైన ఆహారంతో పాటు స్పూను కూడా ప్రవేశించినప్పుడు కమ్మటి రుచి కాస్తా కటువుగా మారిపోతుంది.
* ఆయుర్వేదం ప్రకారం మన శరీరం పంచభూతాల సమూహం. మన చేతికి ఉండే అయిదు వేళ్లలో ప్రతి ఒక్క వేలిలో ఒకో తత్వం ప్రస్ఫుటంగా ఉంటుంది. బొటనవేలిలో అగ్నితత్వం, చూపుడు వేలులో వాయుతత్వం, మధ్యవేలిలో ఆకాశం, ఉంగరం వేలిన పృథ్వి, చిటికెన వేలిన జలతత్వం ఉంటాయట. ఈ అయిదు వేళ్ల స్పర్శా తగిలినప్పుడు ఆహారంలోని జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
* స్పూన్లు, ఫోర్కులని ఎంతగా కడిగినా అవి శుభ్రంగా ఉన్నాయని చెప్పలేము. వేడివేడి నీళ్లలో నిరంతరం ఉంచితే తప్ప అవి క్రిముల నుంచి దూరంగా ఉన్నాయన్న నమ్మకం కలగదు. కానీ శుభ్రంగా కడుక్కున్న చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సూక్ష్మక్రిములూ మన జీర్ణాశయంలోకి చేరకుండా చూడగలం.
* వేళ్లతో తినడంలో కనిపించని వ్యాయామం ఇమిడి ఉంటుంది. అన్నాన్ని దగ్గరకి తీసుకోవడం, వేర్వేరు పదార్థాలను కలుపుకోవడం, ముద్దలుగా చేసుకోవడం మొదలుకొని ముద్దని నోట్లోకి చేర్చడం వరకూ ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. దీని వల్ల అరచేతిలోనూ, వేళ్లలోనూ రక్తప్రసరణ మెరుగవుతుంది.
* చేతి వేళ్లకి ఉండే స్పర్శజ్ఞానం వల్ల ఆహారం ఎంత ఉష్ణోగ్రతలో ఉందో తెలియడమే కాదు… దానికి మరింత రుచిని, తినడంలోని తృప్తిని అందిస్తుంది. ఆహారాన్ని తీసుకున్న చేతివేళ్లు పెదాలకి తగలగానే, ఆ స్పర్శకి నోట్లో లాలాజలం త్వరగా ఊరుతుందట.
* భారతీయుల ఆహారం అంటే బ్రెడ్డూ, సాండ్‌విచ్‌లు మాత్రమే కాదు. రోజుకో వంటకం చేసుకున్నా జీవితాంతం తరిగిపోని పాకశాస్త్రం మన సొంతం. వీటిలో ఎక్కువ శాతం వంటకాలు వేళ్లతో తినడానికి మాత్రమే సౌకర్యంగా ఉంటాయి. అందుకే ఎన్ని పరికరాలను వాడినా, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా… చేతి వేలుని మించిన ప్రత్యామ్నాయం దొరకదు. పరికరాలతో తినే ఆహారం యాంత్రికంగానే ఉంటుంది!
* భారతీయులు వంటలను యాంత్రికంగా చేసుకోరు. ఏదో ఆకలి తీరడానికన్నట్లుగా కాకుండా తమ వంటకాలు రుచిగా, వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటారు. అవి పంచేంద్రియాలనూ తృప్తి పరచాలనుకుంటారు. అందుకే మన వంటకాలు కమ్మటి వాసనతో, కంటికి ఇంపుగా ఉంటాయి. వాటికి స్పర్శ కూడా తోడైతేనే పరిపూర్ణత! చేతులతో తినడం ద్వారా ఆ పరిపూర్ణతని సాధిస్తాం.

    ఘుమఘుమలాడే తాంబూలం...    

      భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు తాంబూలం లేని భోజనం ఉండేది కాదు. సర్వ సామాన్యంగా ధనిక బీద భేదం లేకుండా అందరు తాంబూల సేవనం చేసేవారు. షడ్రసోపేతమైన భోజనానికి ఘుమ ఘుమ లాడే తాంబూలం కొసమెరుపు. భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే, పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు, సోంపు ధట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్యజీవితంలో భాగం చేశారు మన పెద్దలు. అది శాస్త్రం అంగీకరించిన కొద్ది పాటి మత్తు కలిగించే పదార్థం. ఆ మత్తు ఆహ్లాదం కలిగించటం వరకు మాత్రమే పరిమితం. దేవుడికి చేసే షోడశోపచార పూజలో తాంబూలం ఒక సేవ. ఆ సందర్భంలోనే తాంబూలంలో ఉండవలసిన పదార్థాలను పేర్కొనటం జరిగింది. “పూగీఫల సకర్పూరై ర్నాగవల్లీ దలైర్యుతమ్ ముక్తా చూర్ణ సమయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్.” తాంబూలంలో నాగవల్లి అంటే తమలపాకు, కర్పూరంతో కూడిన వక్కలు, ముత్య భస్మంతో చేసిన సున్నం ముఖ్యాంగాలు. అటుపై ఎవరి శక్తి ననుసరించి వారు సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవచ్చు. ముఖ్యంగా యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, పుదీనా [పిప్పరమింట్ పువ్వు(మింట్)], కొబ్బరి తురుము, గుల్ఖన్, సోంప్ మొదలైనవి కూడా రుచి కోసం చేర్చుతుంటారు. పూర్వం కైరవళ్లు, కాచు, శొంఠిపొడి, మొదలైన వాటిని కూడా చేర్చేవారట. ఇంకా వెండి బంగారు రేకులను కూడా తాంబూలానికి చేర్చుతారు ధనవంతులు. మామూలు సున్నానికి మారుగా ముత్యభస్మమో, పగడ భస్మమో, వాడే అలవాటు ప్రాచీనులకి ఉండేది.

      అన్నిసమయాలలో అందరూ వేసుకొనేది ఒకే రకమైన తాంబూలం కాదు. ఉదయం భోజనం ముందు, భోజనం తరువాత,సాయం సమయం, రాత్రి నిదురించే ముందు,… ఇలా ఒకొక్కప్పుడు ఒక్కొక్క రకం. వీలుని బట్టి ఎన్ని సుగంధ ద్రవ్యాలనైనా చేర్చవచ్చు. ఈ రోజుల్లో పుగాకు కూడా చేర్చుతున్నారు. కానీ మౌలికంగా తాంబూలంలో ఉండేవి మాత్రం తమలపాకులు, వక్క, సున్నం. తమలపాకు తీగకి నాగవల్లి అనే పేరుంది. ఆకు పాము పడగలాగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. స్వర్గం నుండి వచ్చిన తీగ అవటం వల్ల నాకవల్లి అనే పేరు సార్థకమై, కాలక్రమంలో నాకవల్లి నాగవల్లి అయిందట! పాము విషాన్నిహరించగల శక్తి తమలపాకుకి ఉన్నదట. ఇంకా ఎన్నో రకాలైన విషాలను కూడా హరించగల ఔషధీగుణాలు తమలపాకుకి ఉన్నాయట. తమలపాకు జీర్ణశక్తిని పెంచి, శరీర ఉష్ణోగ్రతని పెంచి, జలుబుని, శ్లేష్మాన్ని, వాతాన్ని హరిస్తుంది. అందుకే చిన్న పిల్లలకి జలుబు చేస్తే తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తారు. సున్నం శరీరంలో కాల్షియం సరిగా ఉండేట్టు చూస్తుంది. ఎముకలు, దంతాలు అరిగిపోకుండా ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లులు, బాలెంతలు, తప్పనిసరిగా తాంబూలం వేసుకోవాలంటారు. సున్నం నేరుగా తీసుకున్న దానికన్న తమలపాకు రసంతో కలిపి తీసుకుంటే కాల్షియం వంటపడుతుంది. వక్క ఈ రెండిటినీ అనుసంధానం చేస్తుంది. అంతే! విడిగా తింటే మాత్రం రక్తహీనత కలిగిస్తుందంటారు. ఈ విషయంలో వండిన వక్క కన్నా పచ్చి వక్క నయం.

      నిత్య జీవితంలోనే కాదు ఆచార వ్యవహారాల్లో కూడా తాంబూలానికి ప్రముఖ స్థానముంది. తాంబూలం ఇవ్వటం గౌరవ చిహ్నం. ఇంటికి వచ్చినవారికి, శుభకార్యాలకి ఆహూతులైన వారికి, తాంబూలమిచ్చి గౌరవించటం భారతీయ సంప్రదాయం. అందుకే వివాహాహ్వాన పత్రికలో ‘మదర్పిత చందన తాంబూలములు స్వీకరించి' అని వ్రాస్తారు. పేరంటానికి వెడితే ఇచ్చేదానిని తాంబూలమనే అంటారు. అందులో పట్టు వస్త్రాలు, బంగారు నగలు ఉన్నా సరే! అది తాంబూలమే! ఎవరికైనా పెద్ద పని అప్పచెప్పినప్పుడు కూడా తాంబూలమిచ్చే సంప్రదాయం ఉండేది. రాజులు యుద్ధానికి వెడుతున్న సేనానాయకులకు తాంబూలమిచ్చి పంపేవారు. అది అత్యున్నత గౌరవానికి సంకేతం. ఇరు పక్షాల మధ్య ఒప్పదం కుదిరితే తాంబూలాలు మార్చుకునేవారు. రెండు రాజ్యాల మధ్య సంధి కుదిరినా, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినా, అమ్మకాలు కొనుగోళ్లకి బేరం కుదిరినా, పెళ్లి సంబంధాలు నిశ్చయమైనా తాంబూలాలు మార్చుకోటం భారతీయ సంప్రదాయం. మిగిలిన సందర్భాలలో ఈ అలవాటు లుప్తమైనా వివాహాల విషయంలో మిగిలి ఉంది. పెళ్లి సంబంధం కుదిరి పరస్పరం అంగీకరించారనటానికి నిశ్చయ తాంబూలాలు తీసుకోటం అనే ఆచారం ఇంకా మిగిలే ఉంది. ఇలా తాంబూలం అనేది ఎప్పటినుంచో మన జీవనవిధానం లో మమేకమైయిన సంప్రదాయం అని చెప్పచ్చు.

    చేయకూడనవి...    

* గోధుమ పిండిలో కాని, గోధుములలో కాని గ్లూటెన్ వుంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు. గోధుములను బ్రడ్ గా తినవచ్చు.
* ఎటువంటి తీపి పదార్దమైన ఆరోగ్యానికి హాని చేస్తుంది.
* పాలు 6 సంవత్సరాలు దాటినవారు తీసుకోరాదు. పాలలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ జీర్ణం చేసే ఏంజైము 6 సంవత్సరాలు వయస్సు తరువాత వుండదు.

    అరటిపండు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా...    

      అరటి ఒక చెట్టులా కనిపించే ఔషదం. వాస్తవానికి అరటి ఒక చెట్టులా కనిపిస్తుంది కానీ ఇది ఒక మూలిక. అరటి పండు ఆరోగ్యానికి ఒక ఆయుర్వేద ఔషదంలా పనిచేస్తుంది. వివిధ రకాల రోగాలనుంచి కాపాడుతుంది.

      అరటిలో నీటి శాతం కంటే మన పదార్థ శాతం ఎక్కువ ఉంటుంది. కాగా, 150 గ్రాముల మేక మాంసం, సగానికి కోసిన కోడిగుడ్డు, 400 గ్రాముల ఆవుపాలలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తారు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరుగుతున్న చిన్న పిల్లలకు, వృద్ధులకు, రోగులకు ఇది సరైన ఆహారం. ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. అరటి పండుపై ఉన్న తొక్కలు మనకు సూక్ష్మక్రిముల నుంచి, విషవ్యాధుల నుంచి రక్షక కవచంగా పనిచేస్తుంది. మధుమేహ రోగులు మాత్రం ఇతర పిండి పదార్థాలను తినడం తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరం లేదు.

      కాగా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి శారీరకావసరాలకు రోజు సుమారు 1600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ బలాన్ని దృష్టిలో పెట్టుకుని అరటిపండు తినొచ్చు. అయితే.. ఒక్క అరటి పండులో సుమారు 100 కేలరీల శక్తి ఉంటుంది. కొవ్వు పదార్థ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. దీనిలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ లో వాడకూడదు. బీపీ, ఒత్తిడిని తగ్గిస్తుంది దీనిలో ఉన్న పొటాషియం. పట్టి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినది మలబద్దకాన్ని అల్సర్ల బారి నుంచి కాపాడుతుంది. డయేరియాను తగ్గించడంలో అరటి పండు ఎంతో ఉపయోగపడుతుంది.

    మునక్కాయతో లాభాలెన్నో...    

      రసం, సాంబారులోనే కాదు...మునక్కాయ కూర వండుకున్నా ఆ రుచి మరి దేనికీ సాటి రాదు. మరి పోషకాలో అంటారా? విలువైన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్లు అందిస్తుంది మునగ. మరి వాటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో చూద్దామా.

      మునగలో అధికంగా లభించే క్యాల్షియం, ఇనుము.. ఇతర విటమిన్లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. పిల్లలు మునగను కూరలా తిన్నా, సూప్‌రూపంలో తాగినా.. ఎముకలు గట్టిగా మారతాయి.

      ‌రక్త శుద్ధికి... మునగలో ఉండే గింజలూ, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి. మునగ యాంటీబయాటిక్‌ కారకంగానూ పనిచేస్తుంది. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహం సమస్య చాలామటుకూ నియంత్రణలో ఉంటుంది. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల్ని అదుపు చేస్తుంది మునగ.

      ‌‌గర్భిణులకు మంచిది... గర్భం దాల్చినప్పుడు మునగను తీసుకోవడం వల్ల ప్రసవానికి ముందు, తరవాత వచ్చే సమస్యల్ని చాలామటుకూ తగ్గించుకోవచ్చు. మునగ తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తుంది. ఆకుల్లోనూ, మునగ పూలల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విటమిన్‌-సి ని కూడా శరీరానికి అందిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. అంతేనా శరీరానికి హాని చేసే ఫ్రీ రాఢికల్స్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.

    చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో...    

      మనం ఆవాలు వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వంటకాలలో మనం వాటిని వాడుతూ ఉంటాం. చిన్నగా ఉండే ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ ను గుర్తించి నాశనం చేస్తుంది. అయితే ఇవి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. అంతేకాక ఆవాలు మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

    వాటి ప్రయోజనాలను ఏంటో చూద్దాం...    

      క్యాన్సర్ నివారిణి: ఆవాల్లో ఉన్న గ్లూకోసినొలేట్స్, మైక్రోసినల్స్, ఫైటో కెమికల్స్ క్యాన్సర్ లెస్ ను రాకుండా నివారిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను సైతం తగ్గిస్తుంది. ఆవాలులో దాగివున్న రాగి, ఇనుము, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు ఉండటం వల్ల రక్తపోటు, మెనోపాజ్ ఉపశమన చికిత్సలో సహాయపడతాయి.

      అయితే ఆవాల నుంచి ఆవాల నుంచి తీసిన జుట్టు బాగా పెరుగుతుంది. ఎందుకంటే అందులో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది కాబట్టీ. ఈ నూనే చుండ్రు బారి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

      అదేవిధంగా ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగిస్తుంది. ఆ సమయంలో ఆవాలు తగిన రీతిలో తీసుకుంటే వాటి ఫలితం బాగుంటుంది. మంచిగా పనిచేస్తుంది. అంతే కాకుండా కండరాల నొప్పి తగ్గిస్తుంది. తీవ్ర జరం నుంచి కూడా విముక్తిని చేస్తుంది.

      ఆస్తమాను కూడా నివారిస్తుంది. అయితే రకరకాల కారణాలవల్ల ఊపిరితిత్తుల్లో అవలంబక కఫం అనేది పేరుకుపోతుంటుంది. ఆవాలు వాటిని కరిగించి వెలుపలకు వచ్చే విధంగా చేస్తాయ. కఫం, వాతం కారణంగా వచ్చే జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నమోనియాల్లో ఆవాలు బాగా పనిచేస్తాయి. ఇవి ఆస్తమా రోగులకు చాలా ఉపయోగపడతాయి. శ్వాస కోశ సమస్యలను నుంచి కూడా విముక్తి చేస్తుంది ఆవాలు. శ్వాస సాధారణంగా ఆవాలు శ్వాసక్రియ రద్దీ సమస్యల ఉపశమనానికి సహాయపడుతుంది. ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదేవిధంగా ఆవాలు వ్యాధి నిరోధకతను పెంచుతుంది. వీటిలో ఉండే కొన్ని పోషకాలు వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధ పడుతున్నవారికి ఆవాలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అవాలులో ఉండే సెలీనియం మరియు మెగ్నీషియం కంటెంట్ ఈ సమస్య నుంచి వారికి ఉపశమనం కలిగించటానికి సహాయపడతాయి.

      ఆవాలులో ఉండే పైబర్.. ఆహార జీర్ణ క్రియను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. ఆవాలలో మ్యూసిలేజ్ అనే ఒక చిక్కటి పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను పెంపొందిస్తుంది. నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజుకు ఒక టీ స్పూన్ ఆవపిండిని తీసుకోవడం ద్వారా మలబద్దకానికి దూరంగా ఉండొచ్చు.

      ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా ఆవాలు పోరాడుతుంది. మొటిమలు తగ్గించడానికి కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారిన తర్వాత ఆ నూనె వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు ఈ నూనెను నీటితో కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

    ఉసిరి వల్ల ఎన్నో ఉపయోగాలు...    

      ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరికాయలో యాపిక్ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఉరిసి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. అలాగే దానిమ్మకాయతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో ఉన్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో మనకు లభించదు. వంద గ్రాముల ఉసిరిలో 900 మిల్లీ గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.

    ఉసిరితో కలిగే ఉపయోగాలు...    

      మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

    ఒక్క లవంగం..వంద రకాల జబ్బులకు విరుగుడు...    

* లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.
* దగ్గుకు సహజమైనా మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
* ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.
* తేనె, కొన్ని లవంగాల నూనెను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
* లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
* తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
* లవంగాలను పొడిచేసి నీళ్ళలో తడిపి ఈముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
* మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.
* 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.
* క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

    ముల్లంగితో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...    

      ముల్లంగిలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాటి వల్ల ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

      ముందుగా మనం సన్నగా తరిగిన నాలుగు ముల్లంగి ముక్కలలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తింటే మల బద్దకం, అజీర్తి, కడుపునొప్పి ఆకలి వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ముల్లంగి ఆకులను నూరి రసం తీసుకుని రోజుకు ఒక కప్పు చొప్పున 15 రోజులు తాగుతే మూత్రకోశ వ్యాధులు నుంచి బయటపడతారు. అలాగే ముల్లంగిని మెత్తగా దంచి ఒక కప్పు రసంలో సమానంగా తేనె కలిపి రోజుకు మూసార్లు తాగితే దగ్గు తగ్గుతుంది. అదే విధంగా ఒక స్పూన్ ముల్లంగి గింజలను ఆవు పాలలో వేసి బాగా వేడి చేసి ప్రతిరోజు రాత్రి తాగాలి. ఇలా నెల రోజుల పాటు తాగితే పురుషులలో శ్రీఘ్ర స్కలనం సమస్య తగ్గుతుంది. ఒక కప్పు ముల్లంగి రసంలో మరో కప్పు ఆవాల నూనె కలిపి కాస్త వేడి చేయాలి. తర్వాత ఈ తైలాన్ని గోరు వచ్చగా చేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా 56 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ముల్లంగి విత్తనాలను నిమ్మరసంలో కలిపి పలుచగా చర్మంపై పూస్తే చాలు దురదలు, దద్దుర్లు వెంటనే తగ్గిపోతాయి.

    మానసిక ఆరోగ్యం ...    

      మానసిక ఆరోగ్యం అంటే ఆనందం, ఆనందం మన ఉన్న స్థితిని బట్టికాక, మన మానసికస్థితిని బట్టి నిర్ణయింపబడుతుంది. డబ్బు, అందం, హోదా అత్మానందాన్ని ఇవ్వలేవు అని ఎన్నోసార్లు నిరూపించబడింది. ఒక మనిషి ఏలా జీవించాలి అంటే జగద్గురువు శ్రీకృష్ణుడు మనకు మంచి ఉదాహరణ. ఆయన చెరసాలలో జన్మించాడు. పుట్టినపురుటిగుడ్డుగా వెచ్చగా అమ్మ ఒడిలో వుండల్సినవాడు తుపాను రాత్రి వేరే అమ్మ దగ్గరకు ప్రయాణం అయ్యాడు. తల్లిదండ్రులను, గురువులను, సోదరులను గౌరవించాడు. తను వారి కన్నా గొప్పవాడైనా గొప్పతనమంతా వారికే ఆపాదించాడు, స్నేహితులను ఆదరించాడు, ఎన్నోసార్లు హత్యాప్రయత్నం జరిగినా విజ్ఞతతో తప్పించుకోవటమేకాక వారిని కూదా ఉద్దరించాడు. ప్రకృతి, పశువులు, సామాన్య జనం, భాందవ్యాలు, జీవన మధురిమలను, సంగీతాన్ని ఆస్వాదిస్తూ, చిరునవ్వు చెరగనివ్వకుండా, ధర్మం ఎంతో బలహీనంగా వున్నా దాని పక్ష్యాన నిలబడి గెలిపించాడు. కేవలం నిమిత్తంగా ఉండి, యుద్దం చేయమలసి వచ్చినా ప్రశాంతంగా చిరునవ్వుతో చేశాడు. అందరూ నావాడే శ్రీకృష్ణుడు అనుకునేలా ప్రవర్తించాడు. ఇంతకన్నా మానవాళికి జీవితపాఠం ఏమి వుంటుంది. మనం బావుండాలంటే ముందు జీవిత పరమార్దాన్ని అర్దం చేసుకోవాలి.

      ఓ ఎండుటాకు, చౌడునేలను సారవంతం చేస్తుంది. ఓ వానపాము భూమిని బంగారం చేస్తుంది. ఓకోడి మనల్ని నిద్రలేపుతుంది. ఓ వానచుక్క జీవం పొస్తుంది. ఓ ఇంద్ర ధనస్సు ఓ పుష్పపరిణామం మనల్ని మైమరిపించేస్తాయి. సూర్య భగవానుడు సృష్టి కార్యానికి ప్రత్యక్ష్య సాక్షి అయన చూస్తున్నాడు అనే ఎరుకతో మన బాద్యతలను నిర్వర్తించాలి. గాందీ, వివేకానంద, మథర్ థెరిసా, కలాం ఏమి ఆశంచకుండా జీవితం విశ్వరూపాన్ని చూపారు, ఇంకా ఎందరో చూపుతున్నారు.

      మంచి పుస్తకాలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల భాందవ్యాలు అవసరం, ఈ సమాజం పట్ల మనకు బాద్యత వుంది. ఏమి చేయగలం అని ఆలోచించాలి. మన వలన ఈ ప్రపంచంలో ఏదో ఒక మార్పురావాలి, మన ఆనందాని రిమోట్ ఎవరి చేతిలో వుండడు. ఒక కవి అన్నట్లు మన మస్టిష్కం ఓ ఆరణ్యం అందులో ఆలోచనల రూపంలో ఎన్నో క్రూరమృగాలు తిరుగుతూ వుంటాయి, బుద్ది వాటికి కాపలా కాస్తూ వుంటుంది. బుద్ది నిద్ర పోయినపుడు ఆమృగాలు సమాజంపై పడి విద్వంసం చేస్తాయి. అందుకని బుద్దిని ఎప్పుడు జాగురుకతతో వుంచుకోవాలి.

      ప్రతిరోజు కొంత నేర్చూకోవాలి, కొపం, బద్దకం, విసుగు, ఈర్ష్య, ఆహంకారం వదిలివేయాలి, అన్ని జీవులలో పరమాత్మని దర్శంచాలి, మనకి నచ్చడం, నచ్చక పోవడంలో ప్రపంచాన్ని చూడకూడదు, జీవితం ఓ వేడుకులా వుండాలి, మనం వున్న చోట సంతోషం చిందులు వేయాలి, భగవంతుడు మనం అడిగినవి ఇవ్వడు, మనకు కావలసినవి ఇస్తాడు అని గ్రహించాలి, జీవితంలో పరిణామాలను అంగీకరించాలి, మార్చలేని దాని గురించి ఆలోచన వ్యర్దం, మార్చగలిగే దాన్ని మార్చాలి. జీవితం ఒక అవకాశం, పరిస్థితులు ఎలా వున్నా పండుగలాగా బ్రతుకు సాగించాలి. ప్రతిరోజు రకరకాల పరిస్థితులలో మన ప్రమేయం సాగాలి, అలాంటప్పుడు ఏదైనా అనుకోనిది జరిగితే నాకే ఎందుకు అని బాధపడే కన్నా దాన్ని అంగీకరించి ముందుకు సాగిపొవాలి. ప్రతి చిన్ని విషయాన్ని ఆస్వాదించాలి. శాంతి, సహనం, చిరునవ్వు, మానసిక ఆనందాన్ని ఇచ్చి అనేక రకాల రుగ్మతలను దూరం చేస్తాయి.