ప్రతిభకు సోపానాలు
    ఏ విద్యార్థికైనా ఈ ఐదూ అవసరం...    

      విద్యాపరంగా అద్భుత ప్రతిభ ఉన్నా విద్యార్థులు నేడు రాణించటం కష్టంగా మారుతోంది. గణితం, సైన్స్‌లలో రాయటంలో అపారంగా ప్రతిభ ఉన్నా అది సమగ్రం కాదు. ఈ పోటీ ప్రపంచంలో ఉన్నతంగా ఎదగాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌గా వ్యవహరించే నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. వీటిని అభ్యర్థుల నుంచి ఆశించే నియామక సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలల విద్యార్థులూ, పట్టభద్రులూ, ఉద్యోగార్థులకూ ఎంతో ముఖ్యమైనవి! కాలంతోపాటు మారుతున్న ప్రపంచంలో నూతనంగా వస్తున్న మార్పులను స్వీకరించటం సాఫ్ట్‌ స్కిల్స్‌ పరిధిలోకే వస్తుంది. నేర్చుకోవాలనే తపన, వాటిని జీవితంలో ఎదుగుదలకు, వివధ రంగాల్లో ఉపయోగించగలిగే నేర్పు ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన అయిదు ప్రధాన నైపుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బృందంలో పని...

      ఉద్యోగం చేసే ప్రాంతంలో సైతం ఇతరుల సహకారం తీసుకోవటం ఉత్తమం. బృందాలుగా ఏర్పడి చేయాల్సిన ప్రాజెక్టుల్లో ఈ నేర్పు ఆవశ్యకం. ఇతరులతో కలసి పనిచేస్తే వారు ఎత్తిచూపే తప్పుల వల్ల మనం మరింతగా మెరుగుపడవచ్చు. అయితే వీటిని సవాళ్లుగా తీసుకోవాలి. ప్రతికూల దృక్పథంతో చూడకూడదు. విమర్శకులు ఉన్నప్పుడే లోపాలను సవరించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఎవరి సాయం లేకుండా నేను పనిచేసుకోగలను అన్న ధీమా ఉండకూడదు. జీవితంలో ఎదగటానికి పరస్పర సహకారం కీలకం. క్రీడలు, విద్యేతర అంశాల్లో ఇది తప్పనిసరి. క్రికెట్‌ మ్యాచ్‌ గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే బాగా ఆడితే సరిపోదు. టీం సభ్యులందరూ ఆడితేనే విజయం సాధిస్తారు. కళాశాల స్థాయి నుంచే ఈ నైపుణ్యాన్ని అలవర్చుకుని, వృద్ధి చేసుకోవాలి.

భావ వ్యక్తీకరణ...

      ఇతరులతో సంభాషణను ఎలా కొనసాగించాలో నేటి యువతకు తెలియదని చాలామంది అంటుంటారు. ప్రశ్నలను అడగటంలోనూ, ఉత్సాహంగా వినటంలో, ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడే విషయంలోనూ వారు విఫలమవుతున్నారని చెబుతుంటారు. విస్తృతంగా వ్యాపించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ప్రపంచంలోని యువతను ఏకం చేస్తున్నాయని కొందరి అభిప్రాయం. అయితే వీటి వల్ల ముఖాముఖి పరిచయాలు, టెలిఫోన్‌ సంభాషణలూ తగ్గిపోయాయని చాలామంది వాదిస్తున్నారు. కళాశాలల్లోని విద్యార్థులు కేవలం తమలో తామే కాకుండా ప్రొఫెసర్లతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. దీని వల్ల వారి నుంచి విలువైన సలహాలను, సూచనలను పొందవచ్చు. ఇవి జీవితంలో ఎదగటానికి ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యం లేకపోతే కళాశాల దశలో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో మెరుగైన ఫలితాలను సాధించలేరు. ఈ లోపం ఉన్నవారు దీన్ని అధిగమించాలంటే అధ్యాపకులతో భొయం లేకుండా మాట్లాడే చొరవ చూపాలి. సబ్జెక్టులో సందేహాలు వస్తే తమ ప్రొఫెసర్లతో సంభాషిస్తూ వాటిని నివృత్తి చేసుకుంటూవుండాలి. ఇంటర్న్‌షిప్‌ సైతం కమ్యూనికేషన్‌ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు చక్కని మార్గం.

సమస్యల పరిష్కారం...

      విద్యార్థులకు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోవటానికి ఇతరుల సహాయం ఎల్లప్పుడూ లభిస్తుందని భావించకూడదు.ఎవరికి వారే సొంతంగా సృజనాత్మకంగా వాటిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నూతన పద్ధతుల్ని నేర్చుకోనివారు, నేర్చుకోవాల్సిన అంశం నుంచి పక్కదారి పట్టినవారు భవిష్యత్తులో వచ్చే ఆపదలను గట్టెక్కటంలో ఇబ్బందులు పడతారు. దీన్ని అధిగమించేందుకు విద్యార్థులు ప్రయోగాత్మక విధానంలో అభ్యసించాలి. ప్రతికూల పరిస్థితులను నూతన విధానాల ద్వారా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తరచుగా చర్చా గోష్ఠులు, సైన్స్‌ ఒలింపియాడ్‌ వంటి వాటిల్లో పాల్గొనాలి.

సమయ పాలన...

      విద్యాభ్యాస సమయంలోనే సమయపాలన చాలా అవసరం. నియమిత వ్యవధిలో జరిగే పరీక్షల్లో దీని ప్రయోజనం అపారం. విద్యా, ఉద్యోగ దశల్లో అధ్యాపకులు్‌ అధికారులు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయటానికి సమయ నిర్వహణ ఆవశ్యకం. సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవటానికి, ప్రాధాన్యం ఆధారంగా పనుల్ని పూర్తిచేయటానికి సమయపాలనను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. ఉద్యోగులు ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను చాకచక్యంగా చక్కని పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాల, కళాశాలల స్థాయి నుంచే వివిధ పనుల బాధ్యతలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌, స్వచ్ఛంద సేవ, ఇతర అవకాశాల వల్ల కూడా పనుల ప్రాధాన్యక్రమం, వాటి నిర్వహణలో సమర్థత, అనుభవం అలవడతాయి.

నాయకత్వ లక్షణాలు...

      బృందంలో పనిచేస్తున్నప్పుడు సభ్యుడిగానే కాదు, కొన్నిసార్లు నాయకుడిగా కూడా ఉండాల్సి రావచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కళాశాలలో కానీ, ఉద్యోగంలో కానీ అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలి. నియామక సంస్థలు ఎప్పుడూ నాయకత్వ పటిమ ఉన్నవారి కోసం వెతుకుతాయి. వీటిని పెంచుకునేందుకు విద్యార్థులు పాఠశాల, కళాశాల స్థాయుల నుంచే ప్రయత్నించాలి. ఆటల్లో కెప్టెన్‌గా అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. విద్యార్థి సంఘాల్లోనూ, విద్యేతర అంశాల్లోనూ చురుకుగా పాల్గొనాలి.

    పదునైన అస్త్రం... పునశ్చరణ!...    

      సంవత్సరమంతా చదివి నేర్చుకున్న విషయాలు కొద్ది గంటల్లోనే రుజువు చేసుకోవాల్సిన కీలకమైన సందర్భం పరీక్షలు. ‘ఎంత నేర్చుకున్నాం’ అనేది ముఖ్యం కాదు. ‘పరీక్షల్లో ఎలా జవాబులు రాశాం!‌ గుర్తించాం’ అనేదే ప్రధానం. పరీక్షాపత్రంలో రాసింది విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంత ముఖ్యమైన సమయంలో సన్నద్ధతను పరీక్షల దిశగా ఎలా మలుపు తిప్పాలో, పునశ్చరణ (రివిజన్‌) తీరు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం!
పరీక్షలు దగ్గరకు వచ్చినపుడు చదువెలా సాగించాలి, మొత్తం పాఠాలు ఆమూలాగ్రం చదవాలా, అక్కడక్కడా చూసుకోవాలా అనేది కూడా ముఖ్యమే. ప్రవర్తనల్లో, ఆలోచనా విధానాల్లో విద్యార్థికీ విద్యార్థికీ వ్యత్యాసాలుంటాయి. ఉదాహరణకు ఒక విద్యార్థి ‘నేను తెలివైన విద్యార్థిని. నేర్చుకున్న విషయాలను మళ్ళీమళ్ళీ చదవాల్సిన అవసరం నాకు లేదు. సాధారణ విద్యార్థులు మాత్రమే అది చెయ్యాలి. నేను కాదు. అలా చేస్తే నాకు బోర్‌ కొడుతుంది’ అని ఆలోచిస్తాడు. మరి కొందరుంటారు. ‘చదివిన విషయాలనూ, నేర్చుకున్న పాఠాలనూ మళ్ళీ చదువుకోవాల్సిందే. అప్పుడే గుర్తుంటుంది. లేకపోతే మరిచిపోవటం మామూలే. అబ్బో! మరి ఇన్ని టాపిక్స్‌ ఉన్నాయే... ఇవన్నీ ఎలా చదివేది? టైం సరిపోదే? మరేం చెయ్యాలి?’... ఇలా ఆలోచిస్తుంటారు. మరింకెన్నో భేదాలు ఉన్నప్పటికీ విద్యార్థుల్లోని ఈ రెండూ మాత్రం ప్రధానమైనవని చెప్పుకోవచ్చు. ఈ రెండు విభిన్నమైన ఆలోచనల్లో ఏది సరైనది? ఏది కాదు? అనే విషయాన్ని పరిశీలిస్తే... రెండిట్లోనూ కొంత నిజం ఉన్నా అపసవ్యమైన తర్కం కూడా ఉంది. ‘చదివిన సబ్జెక్టు మళ్ళీ చదవాలంటే నాకు బోర్‌ కొడుతుంది’ అని ఏమీ చదవకుండా ఉండటం సరి కాదు. అలాగే ‘ప్రతి పాఠాన్నీ ఏ నుంచి జడ్‌ వరకూ మళ్ళీ చదువుతాను. లేకపోతే నాకు గుర్తుండదు’ అనుకోవడమూ సరైన పద్ధతి కాదు.

విద్యాసంవత్సరం ప్రారంభంలో...

      విద్యాసంవత్సరం మొదలైనపుడు విద్యార్థి ప్రతి పాఠాన్నీ చక్కగా చదివి నేర్చుకుంటాడు. దానికి కారణం... అతడికి కావలసినంత సమయం ఉండటమే. అందుకే ప్రతి సబ్జెక్టులోంచీ పాఠాలు ఇదేవిధంగా చదువుతాడు. చదవాలి కూడా. పరీక్షలు దగ్గరపడినప్పుడు ఇలా చదివే వ్యవధి ఎక్కడుంటుంది? అన్ని సబ్జెక్టులూ కవర్‌ చేయకపోతే విద్యార్థి మనసును వ్యాకులత చుట్టేస్తుంది. దానితో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకవేళ ఏమీ చదవకుండా వదిలేసినా ముఖ్యమైన విషయాలు గుర్తుండకపోవచ్చు. పరీక్షహాల్లో అవి గుర్తుకురాని సమస్య ఏర్పడవచ్చు. పర్యవసానం ప్రతికూలమే. ఇలాంటపుడు రాబిన్సన్‌ అనే మనస్తత్వవేత్త సూచించిన SQ3R పద్ధతి ఉపయోగపడుతుంది.

ఏమిటీ విధానం...

      ఈ పద్ధతి ‘మళ్ళీ చదివితే నాకు బోర్‌ కొడుతుంది’ అనే విద్యార్థులకు చక్కగా సరిపోతుంది. ఈ పద్ధతిలో మొదటిది ఎస్‌. అంటే సర్వే. ఇక్కడ విద్యార్థి మొత్తం అధ్యాయం (చాప్టర్‌) చదవకుండా దాన్ని ‘సర్వే’ చేస్తాడు. అలా చేసి దాని సారాంశం (సమ్మరీ) తెలుసుకుంటాడు. ఒకవేళ ఆ చాప్టర్‌ మొదట్లోనే ఈ సారాంశం ఉంటే మరీ మంచిది. దాన్నే చదువుతాడు. మొత్తం అధ్యాయం సర్వే చేసిన తర్వాత చాప్టర్‌లోని సైడ్‌ హెడింగ్స్‌పై ఒక ప్రశ్నను రూపొందించుకుంటాడు. ఉదాహరణకు ‘హైడ్రొజన్‌ నిర్వచనం’ ఉంటే ఆ నిర్వచనం ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు? అనే ప్రశ్నను తయారుచేసుకుంటాడు. తర్వాత మూడు ఆర్‌లు ఉన్నాయి కదా? అందులో మొదటి ఆర్‌ అంటే ‘రీడ్‌’ (చదవడం). రెండో ఆర్‌ ‘రిసైట్‌’, మూడోది ‘రివ్యూ’. మొదటి ఆర్‌ అంటే రీడ్‌ కదా? సైడ్‌ హెడింగ్‌పై ఏ ప్రశ్నను ‘ఫ్రేమ్‌’ చేసుకుంటాడో దానికి జవాబు ఇస్తున్నట్లుగా చదువుతాడు. సైడ్‌ హెడింగ్స్‌ అంతా అయిపోయిన తర్వాత రెండో ఆర్‌ రిసైట్‌ తీసుకుంటాడు. మూడో ఆర్‌కు పోకుండా ఆ సైడ్‌ హెడింగ్‌ను మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటాడు. ఏదైనా విషయాన్ని మర్చిపోతే ఒకసారి ఆ విషయాన్ని మళ్ళీ చదువుకుంటాడు. ఇదేవిధంగా అన్ని సైడ్‌ హెడింగ్స్‌ అయిపోయాక అప్పుడు మూడో ఆర్‌ రివ్యూను తీసుకుంటాడు. మొత్తం అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడమని అర్థం. ఈ విధంగా చదవడం వల్ల మొత్తం అధ్యాయం కవర్‌ చేసినా ‘మళ్ళీ చదివాను’ అన్న భావన విద్యార్థికి రాదు. అందుకే బోర్‌ ఫీల్‌ కాడు. పైగా అన్ని విషయాలూ గుర్తుంటాయి. ఇక రెండో కోవకు చెందినవారి గురించి మాట్లాడ్డానికి ముందు మనం ‘మెమరీ ట్రేసెస్‌’ గురించి తెలుసుకోవాలి. మనం ఏదైనా నేర్చుకుంటే ఆ విషయం ఆ వ్యక్తి మస్తిష్కంలో నిల్వ ఉంటుందని న్యూరో సైకాలజిస్టుల అభిప్రాయం. ఇలా మెమరీ భద్రపరిచివుండటమే మెమరీ ట్రేసెస్‌. ఇది చెక్కుచెదరకుండా ఉన్నంతవరకూ జ్ఞాపకశక్తి కూడా అదేరకంగా చక్కగా ఉంటుంది. ఒకవేళ మెమరీ ట్రేసెస్‌ మలిగిపోతే మెమరీ కూడా చెదిరిపోతుంది. ఈ రెండో రకానికి చెందిన విద్యార్థులు ఎస్‌క్యూ త్రీ ఆర్‌తో పాటు ముఖ్యమైన విషయాలు చూసుకుంటే మేలు. అప్పుడు మెమరీ ట్రేసెస్‌ కూడా చెక్కుచెదరకుండా ఉండి, విషయాలను చక్కగా గుర్తుంచుకోగలుగుతారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ‘నేను చక్కగా రాయాలి’ అనే తపన, ప్రేరణ ఎంతో ముఖ్యం. ఈ తపనే విద్యార్థిని అందలాలు ఎక్కించగలుగుతుంది. జీవితంలో రాకెట్లా ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది!

    పోటీకి కాల పరీక్ష!...    

      పోటీ పరీక్షార్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసేవాటిలో సమయం చాలా ముఖ్యమైనది. దీన్నెలా ప్రణాళికాబద్ధం చేసి, సద్వినియోగం చేసుకోవాలి? సంవత్సరం నిష్క్రమిస్తూ మరొక సంవత్సర కాలం మన చేతిలోకి వస్తున్న తరుణంలో ఈ అవలోకనం ప్రయోజనకరం!
      పోటీ పరీక్షార్థులు విజయం కోసం తపిస్తుంటారు. సివిల్‌ సర్వీసెస్‌ నుంచి రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షల వరకూ, జేఈఈ నుంచి ఎంసెట్‌ వరకూ, జాతీయబ్యాంకు పరీక్షల నుంచి స్థానిక కోర్టుల సిబ్బంది వరకూ... ఏ పోటీ పరీక్షలోనైనా విజయానికి అంతిమంగా ఏది కేంద్ర బిందువు అవుతుంది? పరిశీలిస్తే... సిలబస్‌, స్టడీ మెటీరియల్‌, పరీక్షా పత్రాల సరళి... ఇలా అన్నింటినీ మించిన ఒక అంశం ప్రధానంగా గోచరిస్తుంది. అదే కాలం,‌ సమయం! తెలివితేటలున్న అభ్యర్థులు కూడా పోటీ పరీక్ష రాసేసి పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చి, జయాపజయాల స్వీయ విశ్లేషణ చేసుకుంటున్న తరుణంలో ‘సన్నద్ధతకు సమయం సరిపోలేదు. లేకపోతే ఇంకా బాగా రాసేవాణ్ణి’ అంటూ పశ్చాత్తాపపడతారు. ఏళ్ల తరబడి దీక్షతో చదివిన అభ్యర్థి కూడా ఎంత ముందునుంచి చదివినా చివరి వారం సమయం సర్దుబాటు కాలేకపోవడం వల్ల అనుకున్నంతగా పరీక్షలో ప్రతిభ చూపలేకపోయాననుకుంటాడు. మొత్తం మీద అభ్యర్థులందరూ తమ గెలుపు ఓటములను సమయానికే ముడి పెడతారు. మరి ఇంత విలువైనది కాలం!
      ‘మీరు జీవితాన్ని ప్రేమించేవారైతే... కాలాన్ని వృథా చేయవద్దు. కాలం అనే ఇటుకలతో నిర్మించేదే జీవిత సౌధం’ అంటాడు యువతరం ఆరాధ్య నటుడు బ్రూస్‌ లీ. ఈ మాటలు నూటికి నూరుపాళ్ళూ పోటీ పరీక్షలకు వర్తిస్తాయి. పోటీ పరీక్షల రైలు... కాలం అనే పట్టాల పైనే పరుగెడుతుంది. ఇదే ప్రధాన ముడిసరుకు. అందుకే ఇంతటి విలువైన కాలాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ఇందుకు ఏడు సోపానాలున్నాయి.

సమయ ప్రణాళిక...

      ఇది పోటీ పరీక్షార్థి లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఒక పోటీ పరీక్షలో గెలిచేందుకు స్వల్పకాల లక్ష్యంతో ఉన్నాడా? లేక దీర్ఘకాలం లక్ష్యంగా నిర్దేశించుకున్నాడా? అన్నది ముఖ్యం. పరీక్ష ప్రకటన వెలువడిన అనంతరం పరీక్షకు ఉండే కేవలం రెండు మూడు నెలల సమయంలో విజయం వైపు గురిపెట్టే అభ్యర్థి ప్రణాళిక ఒకలా ఉంటే, మూడు సంవత్సరాల సమయంలో సివిల్స్‌ కొండను ఢీకొనాలన్న దీర్ఘకాల లక్ష్యంతో మరొక అభ్యర్థి ఉంటాడు. పోటీ పరీక్షార్థి లక్ష్యాన్ని గమనంలో ఉంచుకొని ఈ సమయ ప్రణాళిక జరగాలి.

సమయ సమీక్ష...

      పోటీ పరీక్షల విషయంలో ఇది రెండు రకాలుగా జరగాలి. గమ్యం చేరేందుకు ప్రణాళిక ఎంతవరకు ఉపయోగపడుతుందన్న తొలి సమీక్ష ఒకసారీ, ప్రణాళికలో కొంతశాతం ముందుకు వెళ్ళిన తర్వాత సమయ సద్వినియోగం పురోగతిని మరొకసారీ పునస్సమీక్షించుకోవాలి. దీనివల్ల ఎన్నో లోపాలు బయటకొస్తాయి. సమయం ఎక్కడ వృథా అవుతున్నదీ అవగతం అవుతుంది. మిగిలిన సమయాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుంది.

ప్రాథమ్యాల గుర్తింపు...

      పోటీ పరీక్షల్లో సమయ వినియోగానికి ప్రాథమ్యాల నిర్దేశన కీలకం. పోటీ పరీక్షల విజయానికి ఉపకరించే దశలను ప్రాధాన్యక్రమంలో అమలు చేయాల్సి ఉంటుంది. సిలబస్‌ అవలోకన, గత ప్రశ్నపత్రాల అనుసంధానం, అధ్యయన పుస్తకాల సేకరణ, అవసరమైతే శిక్షణ, తొలి పఠనం, మలి పఠనం, స్వీయ విశ్లేషణ మదింపు, తప్పొప్పుల సవరణ, అంతిమ సన్నద్ధత... ఇలా వివిధ దశలను ఏ సమయంలో ఏది అవలంబించాలో ప్రాథమ్యాలను నిర్ణయించుకోవాలి. దాన్ని అనుసరించి నడవాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాలను సమయానికి అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధత జరగకపోతే రైలు పట్టాలు తప్పినట్టే!

కాల ప్రణాళిక రూపకల్పన...

      పోటీ పరీక్షలకు అందరూ చదువుతారు కానీ కొందరే లక్ష్యం చేరతారు. విజయం సొంతం చేసుకున్నవారిలో దాదాపు అందరూ తమ గెలుపును తాము రూపొందించుకున్న టైమ్‌టేబుల్‌కి అనుసంధానిస్తారు. ఉద్యోగ నియామక ప్రకటన నుంచి పరీక్ష తేదీ వరకూ ఒక కాల ప్రణాళిక, అంతకంటే ముందు ఆ పోటీ పరీక్షకు నిర్దేశించిన సబ్జెక్టులను ఏ సమయంలో దేన్ని పూర్తిచేయాలన్న నిర్దిష్ట కాల ప్రణాళిక, చివరగా ఈ సబ్జెక్టులపై స్వీయ్‌ బాహ్య పరీక్షలలో పాల్గొని పోటీలో తానెక్కడ నిలబడుతున్నానన్న వాస్తవాన్ని ముందే తెలుసుకోవడం వంటివి ముఖ్యం. ఈ వివిధ ఘట్టాలను ఎప్పుడు ఏది పూర్తిచేయాలన్నా కాల ప్రణాళిక (టైమ్‌ షెడ్యూల్‌) ఉండాలి.

సమంజస కాలవ్యవధి...

      చాలామంది పోటీ పరీక్షార్థులు అనుసరించని, కొద్దిమంది మాత్రం ఆశ్రయించి విజయం సాధించే ఉపకరణం స్వీయ మదింపు. సమయాన్ని అత్యంత ప్రభావవంతంగావినియోగించేందుకు ఉపకరించే సోపానం. సన్నద్ధత మధ్యలోనో, సన్నద్ధత పూర్తవుతున్న దశలోనో స్వీయ పరీక్షలు రాయడం ద్వారా సన్నద్ధతలో లోపాలు, జ్ఞాపకశక్తి సమస్యలు, విషయధారణకు సమస్యలు బయటకొస్తాయి. వీటిని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కాల ప్రణాళిక రూపకల్పన...

      ఒక ఒలింపిక్స్‌ క్రీడలకూ మరొక ఒలింపిక్స్‌ ఆటలకూ మధ్య నాలుగేళ్ళ వ్యవధి ఉంటుంది. తదుపరి ఒలింపిక్స్‌ ఎప్పుడు జరుగుతుందో నాలుగేళ్ల కిందటే నిర్ణయమైపోతుంది. దీనిబట్టి క్రీడాకారులు తమ నైపుణ్యాలు, సామర్థ్యాలకు పదును పెట్టుకుంటారు. గత ఒలింపిక్స్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఈ నాలుగేళ్ళ వ్యవధిలో వచ్చే వివిధ స్థాయి పోటీలలో పాల్గొని తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటుంటారు. సరిగ్గా పోటీ పరీక్షలు ఇంతే. అందరికంటే అత్యంత ప్రతిభావంతులనే ఎంపిక చేసుకునే ప్రక్రియ. ఇందుకు నిర్ణయించుకునే కాల వ్యవధి సమంజసంగా ఉండాలి. మరీ దీర్ఘకాలం ఉంటే స్ఫూర్తి సన్నగిల్లుతుంది. అలా అని మరీ స్వల్ప వ్యవధి అయితే ఒత్తిడి విజయావకాశాలను మూసివేస్తుంది. అందుకే నిర్దిష్టమైన, సమంజసమైన కాల ప్రణాళిక అవసరం.

శిక్షణతో అనుసంధానం...

      మిత్రులతో కలిసి తర్ఫీదు్‌ బయటి సంస్థలో శిక్షణ... పరీక్ష దిశగా చేసే ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. అంతేగానీ శిక్షణే మొత్తం ప్రయాణం కారాదు. పరీక్షా లక్ష్య ఛేదనకు నిర్దేశించుకున్న సంపూర్ణ, సమగ్ర కాల ప్రణాళికలో శిక్షణను ఒక అంతర్భాగంగా చూసి ఆ దశను సమర్థంగా వినియోగించుకోవాలి. ఆపై తదుపరి దశవైపు ప్రయాణం సాగించాలి. అంతేతప్ప శిక్షణే సర్వస్వం అనుకుంటే విజయావకాశాలు పరిమితమవుతాయి.
ఈ ఏడు సోపానాలూ పోటీ పరీక్షల విజయ సంహాసనాన్ని చేరేందుకు ఉపకరిస్తాయి. అయితే వాటికి ప్రాతిపదిక కాలమే. సమయ పునాదులపై ఈ సోపానాలు నిర్మించుకోవాలి. ఇందుకు మీకు ఎల్లప్పుడూ లభించే సమయం ముడిసరుకు. ఈ ముడిసరుకుకు మీరేమీ చెల్లించనవసరంలేదు. సమయం ఉచితంగా లభిస్తుంది. కానీ సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుంది.

మస్తిష్కంలో ముద్రలు...

      సమయం, మస్తిష్కం ఈ రెండూ గొప్ప విజయాలను సాధించి పెడతాయి. కాలాన్ని మచ్చిక చేసుకొని దానికి కళ్ళెం వేయండి ఆపై మీకు అది సలాంగిరి చేస్తుంది. అది మీ నియంత్రణ తప్పితే అదే మీపై ఎక్కి స్వారీ చేస్తుంది. ఈ సందర్భంలో రష్యన్‌ మానసిక శాస్త్రవేత్త పావ్‌లోవ్‌ చేసిన ప్రయోగాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. పావ్‌లోవ్‌ ఒక గదిలో కుక్కను కట్టేసి రోజూ కచ్చితంగా ఒక సమయానికి వచ్చి ఒక గంట మోగించేవాడు. ఆపై కుక్క ఎదురుగా మాంసం ముక్క పెట్టేవాడు. వెంటనే దానిని అందుకొని కుక్క తినేది. ఇలా రోజూ చేస్తుంటే కుక్కకి గది తలుపులు తెరుచుకొని గంట మోగింది అంటే తనకు ఆహారం నోటి ముందుకు వస్తుందని అర్థమై దాని నోట్లో లాలాజలం వూరేది. కొద్దిరోజులకు పావ్‌లోవ్‌ గది తలుపులు తెరచినా, గంట మోగించినా మాంసం ముక్క లేకపోయినా సరే కుక్క నోట్లో లాలాజలం వూరడం గమనించాడు. దీనినే ఆయన ‘కండిషనింగ్‌’ అన్నాడు. గంట మోగడం ద్వారా కుక్క మెదడుకు ఆహారం వస్తుందన్న సంకేతం వెళ్ళి నిక్షిప్తమైపోయింది. అందుకే ఆ తర్వాత ఆహారం లేకపోయినా కుక్క నోట్లో లాలాజలం వచ్చింది. సరిగ్గా ఈ చిట్కాను అభ్యర్థులు తమ విజయానికి ఉపకరణంలా వినియోగించుకోవచ్చు. నిర్దేశించుకున్న టైమ్‌టేబుల్‌ ప్రకారం నిర్దిష్ట వేళకు నిద్రలేవడం, పుస్తక పఠనం, శిక్షణకు హాజరు కావడం వంటివి జరగడం వల్ల మస్తిష్కంలో ముద్రలు పడి కొంతకాలానికి అలవాటుగా మారి క్రమశిక్షణ అలవడుతుంది. రోజువారీ సన్నద్ధతలో కూడా అభ్యర్థి శారీరక స్థితిని బట్టి ప్రణాళిక వేసుకోవాలి. రాత్రివేళ త్వరగా నిద్రకు ఉపక్రమించేవారయితే బలవంతాన పుస్తకాల ముందు కూర్చోకూడదు. దానికంటే తెల్లవారుఝామున లేవడం మంచిది. సన్నద్ధతను స్వల్పకాల సెషన్‌లా విభజించుకోవాలి. అంటే మొత్తం రోజులో 10 గంటలు చదివేలా ప్రణాళిక వేసుకుంటే రెండు గంటలకు ఒక సెషన్‌లా వర్గీకరించుకొని ఆపై పావుగంట విరామం ఇవ్వడంవల్ల ధారణ శక్తి (జ్ఞాపకం ఉండటం) 30 శాతం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

    ఒత్తిడి ఇలా దూరం!...    

      విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమైన పరీక్షల తరుణం వచ్చేసింది. వార్షిక, ప్రవేశపరీక్షల దగ్గర్నుంచీ ఉద్యోగ నియామక పోటీపరీక్షల పరీక్షలవరకూ అన్నీ వరుస కడుతున్నాయి. ఈ సమయంలో సగటు విద్యార్థినీ, అభ్యర్థినీ పీడించే సమస్య ఒత్తిడి! ఇది మితిమీరకుండా, దాని దుష్పరిణామాల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం!

      జీవితంలో అభివృద్ధీ, ప్రతిష్ఠా పరీక్షల ఫలితాలతో ముడిపడి ఉంటున్నాయి. నిజానికి వీటిలో విజయాలు సాధించలేనివారంతా జీవితంలో వెనుకబడుతున్నారని చెప్పడానికి వీల్లేదు. అయినా పరీక్షల్లో విజయం మన జీవిత గమనాన్ని సాఫీగా, తక్కువ ఒడిదుడుకులతో కొనసాగేలా చేస్తుంది. మంచి మార్కులూ, ర్యాంకులూ తెచ్చుకుంటే మరింత సులువుగా, త్వరగా జీవిత లక్ష్యాలను సాధించగలుగుతామనడంలో సందేహం లేదు. అందుకే పరీక్షలంటే ఎంతో కొంతో, అధికంగానో ఒత్తిడి వస్తుంది.

మానసిక సంసిద్ధతే కీలకం...

      చదువుకు సంబంధించిన ప్రధాన సాధనం మనసు. మానసిక సంసిద్ధత ఉంటేనే బుద్ధినీ, నైపుణ్యాలనూ సద్వినియోగం చేయడం సాధ్యమవుతుంది. మానసిక సంసిద్ధత అంటే పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై మనసులో స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవటం. రాసే పరీక్షల్లో నూటికి నూరు తెచ్చుకోవాలని ఆశించాలి. దానికోసం గరిష్ఠంగా ప్రయత్నం చేయాలి. అయితే ఫలితాల మీద అంచనా మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. విద్యార్థి తన బలాలూ, అవకాశాలను బట్టి ఎలంటి మార్కులూ, ర్యాంకులో రాగలవనేదానిపై ఒక వాస్తవిక అంచనా ఉండాలి. అందరూ మొదటి ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యం కాదు. జీవితంలో దీర్ఘకాలిక విజయాల దృష్టితో చూసినపుడు ఒక పరీక్షలో మార్కులు కొద్దిగా ఎక్కువ తక్కువలైనా కొంపలు మునిగిపోవు. వాస్తవానికి దగ్గరగా లేని అంచనాలు అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. దీన్ని విద్యార్థులూ, తల్లిదండ్రులూ గమనించాలి.

వ్యూహ నిర్థారణ...

      లక్ష్యం ఒక్కటైనా దాన్ని చేరుకునే మార్గాలు చాలా ఉంటాయి. విద్యార్థి తనకు అనుకూలమైన మార్గం ఎంచుకోవాలి. అలా చేరుకోవాలంటే... బలాలూ, బలహీనతలూ, అవకాశాలూ, సవాళ్ళను అంచనా వేసుకోవాలి. బలాలను సద్వినియోగం చేసుకునేలా, బలహీనతల నష్టం కనిష్ఠం చేసేలా, అవకాశాలను గరిష్ఠం చేసేలా, సవాళ్ళను ఎదుర్కొనేలా ప్రణాళిక ఉండాలి. మంచి ప్రణాళికకు విశ్లేషణే మూలం.

నిరుత్సాహం వద్దు...

      మనకు మంచి సంకల్పం, మెరుగైన ప్రణాళిక ఉన్నంతమాత్రాన ఎప్పుడూ అత్యధిక సామర్థ్యంతో పనిచేయడం కుదరదు. ఒక్కోరోజు ఎక్కువగా చదువుతాం. అది ఒక్కోరోజు మందకొడిగా సాగవచ్చు. చదువు సాగని రోజున విసుగు, చికాకు, నిరుత్సాహం సహజం. ఇలాంటి సమయాల్లోనే సరైన మానసిక సంసిద్ధత ఉపయోగపడుతుంది.

భయాన్ని వదలండి...

      పరీక్షలనగానే విద్యార్థులకు రకరకాల భయాలు తలెత్తుతూ ఉంటాయి. చదివిన ప్రశ్నలు పరీక్షలో రావేమో, వచ్చినవాటిని రాయటం మర్చిపోతానేమో, సిలబస్‌ అంతా కవర్‌ చేయడానికి సమయం సరిపోదేమో, పేపర్లు కఠినంగా దిద్దుతారేమో అని లేనిపోని ఆలోచనలు చేస్తుంటారు. వీటిలో కొన్ని అర్థం లేనివీ, కొన్ని మన పరిధిలో లేనివీ, అనవసరమైనవీ. ఈ భయాలు మన బుర్రను సరిగా పనిచేయనియ్యవు. వాటిని తొలగించుకుంటేనే బుర్ర మామూలుకన్నా చురుకుగా పనిచేస్తుంది. వ్యర్థమైన ఆలోచనలకు దూరంగా ఉండి, సన్నద్ధత మీద పూర్తి దృష్టిపెట్టడం అవసరం.

అనుకూల సమయాలు...

      రాత్రి ఎక్కువసేపు మెలకువ ఉండటం అలవాటైతే ఇంకో అరగంట మెలకువగా ఉండి చదువుకోవాలి. అప్పుడే కష్టమైన సబ్జెక్టు చదివేందుకు ప్రణాళిక వేసుకోవాలి. వచ్చిన సమాధానం రాసి చూసుకుంటే బాగా గుర్తుంటుంది. కష్టమని భావించే ప్రశ్నలను రాసేందుకు సమయం కేటాయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పునశ్చరణ ఏ తీరు...

      పరీక్షలకు తయారవటంలో పఠనంతో పాటు పునశ్చరణ (రివిజన్‌) చాలా ముఖ్యమని మనకు తెలుసు. రివిజన్‌ చేయడానికీ, చూడకుండా అప్పజెప్పడానికీ తేడా ఉంది. పునశ్చరణ అనేది మన జ్ఞాపకానికి పరీక్ష కాదు. జ్ఞాపకాలను తాజాపరుచుకునేందుకు చేసే పని. కాబట్టి కచ్చితంగా చూసి చదవాలి. మొదటిసారి ఏ పుస్తకంలో చదవామో చివరివరకూ అదే పుస్తకంలో చదవటం మేలు. ప్రతిసారీ పుస్తకం మార్చి చదివితే ప్రయోజనం తక్కువగా ఉంటుంది.

ఏకాగ్రతా రహస్యం...

      ఏకాగ్రత అంటే చేసే పనిమీద మనసు లగ్నం కావటం. చదివేటప్పుడు వేరే ఆలోచనలు మనసులోకి వస్తూవుంటే ప్రయోజనం పూర్తిగా పొందలేము. అంతరాయాలు లేకుండా చూసుకోవడం అసాధ్యం కాబట్టి అంతరాయాలనూ, వాటి ప్రభావాన్నీ అతి తక్కువగా ఉండేలా చూసుకోవడమే ఏకాగ్రతా రహస్యం. కచ్చితంగా అనుకున్న పని చేయాలన్న సంకల్పం ఏకాగ్రతకు మూలం. చేయాల్సిన, చేయగలిగిన పని మీద దృష్టి ఉంచడం మానేసి చేయలేకపోయిన పనుల గురించీ, వృథా అయిన కాలం గురించీ ఆందోళన చెందడం వల్ల ఏకాగ్రత కుదరదు. ధ్యానం్‌ప్రార్థన మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తుంది. అనవసర ఆందోళనను తగ్గించి ఏకాగ్రతకు తోడ్పడుతుంది.

చదివినవే... కానీ మర్చిపోతున్నా!...

      రవి తెలివైన విద్యార్థి. పరీక్షలన్నింటిలోనూ అతనికి మంచి మార్కులే వస్తాయి. వార్షిక పరీక్షలు దగ్గరపడినప్పటి నుంచి అతనిలో వ్యాకులత మొదలైంది. గతంలో చదివినవేవీ అతనికి ఈమధ్య జ్ఞాపకం రావడం లేదు. సిలబస్‌ చాలాసార్లు పునశ్చరణ చేసిందే అయినా తాను ఆ అంశాలను ఎందుకలా మర్చిపోతున్నదీ అతనికి బోధపడటం లేదు. సరళకు ప్రతిదానికీ కంగారు పడడం అలవాటు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయగానే ఆమె ఆలోచనలన్నీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పరీక్షలో ఎలా రాయగలనో అన్న ఆందోళన ఆమెలో ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ మధ్య కళ్లు తిరిగిపడిపోతోంది. పరీక్షలంటే ఎవరికైనా భయం సహజంగానే ఉంటుంది. జీవితానికి అతిముఖ్యమైన అంశంలో విజయం సాధించడానికీ, సమాయత్తం కావడానికీ ఒత్తిడి ఉండడం సహజం. ఒత్తిడిని పూర్తిగా తీసివేయడం కుదరదు. కానీ దాన్ని నియంత్రించుకోవచ్చు. నిజానికి కొంత ఒత్తిడి అవసరం కూడా. అందుకే యూజ్‌ఫుల్‌ స్ట్రెస్‌, డిస్ట్రెస్‌ అని రెండు రకాలుంటాయి. పోటీతత్త్వం పెరగడానికీ, విజయం సాధించాలనే తపన పెరగడానికీ ప్రయోజనాత్మక ఒత్తిడి దోహదం చేస్తుంది. ఒత్తిడి గురించిన అవగాహనే అది దూరం కావడానికి ఉపయోగపడుతుంది.

సాధారణంగా, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సంవత్సరమంతా చక్కగా చదివినా ఆందోళన చెందుతూ ఉంటారు.
మార్కులు సరిగా రాకపోతే ఎలా?
చదివిన ప్రశ్నలు రాకపోతే ఎలా?
మంచి మార్కులు రాకపోతే అమ్మానాన్నా ఏమంటారో?
స్నేహితుల మధ్య పరువు పోతుందేమో!
ఈ తరహా ఆలోచనల భారం విద్యార్థుల మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. రాత్రీ పగలూ పరీక్షల గురించే ఆలోచించడం వల్ల విశ్రాంతి దొరకదు. విపరీతమైన ఒత్తిడి మధ్య పనిచేయడం, చదవడం ప్రమాదకరం. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
నీళ్ళ గ్లాసు
ఒత్తిడి గురించి చెప్పేటప్పుడు బెలూన్‌, రబ్బర్‌ బ్యాండ్‌ ఉదాహరణలు చెబుతారు. స్థాయికి మించి బెలూన్‌లో గాలి కొట్టినా, రబ్బర్‌ బ్యాండ్‌ను సాగదీసినా అవి రెండూ పాడైపోతాయి. ఒత్తిడి వల్ల కలిగే అనర్థం అలా ఉంటుంది.
మరి ఒత్తిడిని తట్టుకోవడానికి ఏం చేయాలనే దానికి నీళ్ళ గ్లాసు ఉదాహరణను చెపుతారు.
ఒక గ్లాసులో నీళ్లు పోయండి. ఒక చేత్తో గ్లాసు పట్టుకుని చేయి సాచి నిలబెట్టి ఉంచండి. కొద్దిసేపు గడిచేసరికి మీ చేయి లాగుతూ ఉంటుంది. అలాగే మరికొద్దిసేపు పట్టుకునేసరికి గ్లాసు జారిపోయే స్థితి వస్తుంది. అటువంటి క్షణంలో గ్లాసును మరోచేతికి మార్చుకుని చూడండి.
ఇంకా చాలాసేపు నీళ్లగ్లాసు పట్టుకోగలుగుతారు. ఒత్తిడి కూడా ఇటువంటిదే. అధ్యాయం నుంచి అధ్యాయానికీ, సబ్జెక్టు నుంచి సబ్జెక్టుకూ మారితే ఒత్తిడి పల్చబడుతుంది.
ఏయే రకమైన సమస్యలు?
ఒత్తిడి మూలంగా విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా కొన్ని సమస్యలేర్పడతాయి.
*‌ ఆలోచనాశక్తి తగ్గుతుంది. చిన్నచిన్న సమస్యలను సైతం సులువుగా పరిష్కరించుకోలేరు.
* ‌విశ్లేషణాశక్తి కోల్పోతారు.
* ‌జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. బాగా తెలిసిన ప్రశ్నలక్కూడా జవాబులు మరిచిపోతారు.
* చదవడానికి కూర్చున్నప్పుడు ఏకాగ్రత కుదరదు. చదువుపై కాకుండా ఇతర విషయాలపై దృష్టి మరలుతుంది.
*‌ గుండె వేగం పెరుగుతుంది.
* ‌కండరాల నొప్పులు వస్తాయి.
* ‌గ్యాస్ట్రిక్‌ సమస్యలొస్తాయి. ఆకలి తగ్గిపోతుంది.
*‌ నిద్రపట్టదు. ప్రతి విషయానికీ చికాకు, కోపం పెరుగుతాయి.
ఈ విద్యార్థులు పరీక్షహాల్లో ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే....
*‌ పరీక్షాపత్రం చూడగానే మెదడు శూన్యమవుతుంది. తికమకకు గురవుతారు.
* ‌కొన్ని ప్రశ్నలకే సమాధానాలు రాయగలుగుతారు.
‌* పరీక్షహాల్లో కళ్లు తిరిగిపడిపోవచ్చు.
*‌ ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడాలంటే...
*‌ అదేపనిగా పరీక్షల గురించి ఆలోచించడం మానేయాలి.
*‌ పరీక్షల సన్నద్ధతకు చక్కటి ప్రణాళిక రచించుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో ఏమేం చదవాలో నిశ్చయించుకోవాలి.
*‌ ఏకబిగిన గంటలు గంటలు చదవాలని ప్రయత్నించకూడదు. ప్రతి గంటకూ 10 నిమిషాలో, 15 నిమిషాలో విశ్రాంతి తీసుకోవాలి.
*‌ తగిన బృందంతో కలిపి చేసే గ్రూప్‌ స్టడీ వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. ఇతరుల భావాలు మనకు అర్థమవుతాయి. సందేహాలు నివారణమవుతాయి. ఆత్మవిశ్వాసం వస్తుంది. సానుకూల దృక్పథం పెరుగుతుంది.
* ‌రోజూ ఆరు నుంచి ఏడుగంటల పాటు నిద్ర తప్పనిసరి. అర్థరాత్రి దాటే వరకూ మేలుకొని చదవటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. పగటిపూట వీలుంటే అరగంట నిద్రపోవాలి. ఒత్తిడి నుంచి వూరటనిచ్చేందుకు నిద్ర, వ్యాయామం చాలా ఉపయోగిస్తాయి.
*‌ తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సమృద్ధిగా నీరు తాగాలి. ఉదయం అల్పాహారం తీసుకోవడం మరిచిపోకూడదు.
*‌ అప్పుడప్పుడూ శ్రావ్యమైన సంగీతం వినాలి.
*‌తేలికపాటి వ్యాయామం అవసరం. యోగా, ధ్యానం వంటివి చేయాలి.
*‌ మార్కెట్లో రిలాక్సేషన్‌ మెలకువలు నేర్పించే సీడీలు దొరుకుతున్నాయి. వాటి సహాయంతో చక్కగా రిలాక్స్‌ అవ్వొచ్చు.
విజువలైజేషన్‌ టెక్నిక్‌
ఈ కిటుకును రోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పాటించండి. దీనివల్ల మూడు నాలుగు గంటల పాటు నిద్రపోయినంత విశ్రాంతి కలుగుతుంది.
*‌ మీకు ఎవరూ అంతరాయం కలిగించని గదిలో రిలాక్స్‌ అవడానికి సిద్ధం అవండి.
*‌ గదిలో దోమలు లేకుండా ఉండాలి. వెలుతురు వుండాలి. చక్కగా సన్నగా గాలి వీస్తుండాలి.
* బెడ్‌/చాపపై కానీ, ఈజీచైర్‌లో కానీ వెల్లకిలా పడుకోవాలి.
* కళ్లు మూసుకోండి. బాగా గాలి పీల్చండి. కొద్దిసెకన్లు శ్వాస నిలిపి మళ్లీ నిదానంగా గాలి వదలండి.
* 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కపెట్టండి.
*‌ సంఖ్యలు పూర్తయ్యేలోపు మీరు పూర్తి విశ్రాంతి పొందుతున్నట్లుగా వూహించండి.
* మీకు ఇష్టమైన ఓ ప్రకృతి దృశ్యాన్ని వూహించాలి. ఉదయించే సూర్యుణ్ణి మనసులో వూహించుకోండి
* పది నిమిషాల పాటు సుందర ప్రకృతి మధ్య మీరు గడుపుతున్నట్లుగా భావించండి.
* 10 నుంచి 1 వరకు అంకెలు లెక్కపెడుతూ కళ్ళు తెరవండి.
* భోజనం చేసిన వెంటనే ఈ అభ్యాసాన్ని చేయవద్దు. ఇరవై నిమిషాలకు మించి కొనసాగించవద్దు.
తేలికపాటి అభ్యాసం
కాగితంపై ఒక గీత గీయండి. స్కేల్లో మాదిరిగా 1 నుంచి 10 వరసగా అంకెలు వేయండి. ప్రస్తుతం మీ ఒత్తిడి ఎంత ఉందో రేటింగ్‌ ఇచ్చుకోండి.
రిలాక్సేషన్‌ టెక్నిక్‌ ముందు
1 2 3 4 5 6 7 8 9 10
కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి.
మళ్లీస్కేలుపై మీలోని ఒత్తిడిని రేటింగ్‌ ఇచ్చుకోండి.
రిలాక్సేషన్‌ టెక్నిక్‌ తరువాత
1 2 3 4 5 6 7 8 9 10
ఈ కిటుకు ఉపయోగించడానికి ముందు లేదా సాధారణ విశ్రాంతికి ముందు కంటే తరువాత రేటింగ్‌ తగ్గిందా?
అయితే మీరు చక్కగా విశ్రాంతి పొందుతున్నారు.
రేటింగ్‌ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు మరింత విశ్రాంతి అవసరం.
పరీక్షలు భవిష్యత్తుకు ముఖ్యమే గానీ, వాటిని జీవన్మరణ సమస్యగా చూడటం మానేయాలి. పరీక్షలు పెట్టేది విద్యార్థులకు ఏమి వచ్చో నిరూపించుకునే అవకాశం ఇవ్వడానికి. అంతేకానీ విద్యార్థులకు ఏం రాదో నిరూపించటం కోసం కాదు. ఈ స్పష్టత కలిగివుండటం పరీక్ష సంబంధిత ఆందోళలన్నిటికీ విరుగుడు మంత్రం. ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం, నిద్ర... ఈ నాలుగూ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మంచి సాధనాలని గుర్తుంచుకోవాలి. పరీక్షాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు బాగా సమాధానం రాయడం/కచ్చితమైన జవాబు గుర్తించడం ఒక్కటే విజయ సాధనకు ఏకైక మార్గం!

    విజేతగా ఎలా నిలవాలి!...    

      కార్యసాధనకు ఎన్నో సంకల్పిస్తాం. వాటిలో కొన్ని నెరవేరతాయి. మరికొన్ని కార్యరూపం ధరించవు. నెరవేరని సంకల్పాలు చిరాకు కలిగిస్తాయి. అందువల్ల సంకల్పసిద్ధికి అడుగు ముందుకుపడదు. అటువంటి అనుభవం పలువురికి ఎదురవుతుంటుంది. అసామాన్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. సంకల్పించిన కార్యం నెరవేరేవరకు విశ్రమించరు. అపజయాల్ని వారు విజయాలకు సోపానాలుగా మలచుకుంటారు. అనుకున్న కార్యం మంచిదైనప్పుడే, ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. స్వార్థప్రయోజనాల కోసం వెంపర్లాడేవారిని కార్యసాధకులనరు. వారి వల్ల సమాజానికి ఒరిగేదీ ఉండదు. ఆ కార్యజయం లోకానికి కంటకంగా మారే ప్రమాదమూ ఉంది. అనుకూలత ఉన్నప్పుడు, కార్యసాధన సులభసాధ్యమవుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే, కార్యసాధకుడి శక్తిసామర్థ్యాలు లోకానికి వెల్లడవుతాయి. జీవితాల్లో ఎదురయ్యే పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారాల్ని సామాన్యులు ఆ పాత్రల పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. శత్రువును సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని కైవసం చేసుకోవడంలోని ధీరత్వం గురించి, లోకానికి మార్గదర్శనం చేస్తుంది.
      అబ్దుల్‌ కలామ్‌ జీవితచరిత్ర కార్యసాధకులకు కరదీపిక. కృషి వల్ల ఒక సామాన్యుడు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చో నిరూపించిన గ్రంథమది. శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, సామాజికవాది, అభ్యుదయ రైతు ఎవరికైనా కార్యసాధన క్రమంలో ఒడుదొడుకులు, అపజయాలు ఎదురుకావచ్చు. అనుకున్న పనిని ఎప్పటికైనా పూర్తిచేయగలనన్న ప్రగాఢ విశ్వాసమే కార్యసఫలతకు పునాది!
      విఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ తొలిరోజుల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిరాశచెందని తత్వం, అలసట ఎరుగని ఆయన ప్రయత్నమే అనేక ఉపకరణాల సృష్టికి మూలమయ్యాయి. జీవితంలో ఎంత ప్రేరణఉన్నా, ఎంతో స్వేదం చిందిస్తేనే విజయం వరిస్తుందనడానికి ఆయన జీవితమూ ఓ ఉదాహరణ.కార్యసాధకులవిజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలియువత. జీవితంలోఎదిగే ప్రయత్నం కొనసాగిస్తే, ప్రతి వ్యక్తీ కాగలడొక విజేత!