మండల ఆదర్శ ప్రాధమిక పాఠశాల

      విద్య అనేది వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి, పురోగతికి పునాది లాంటిదనే భావంతో, అక్షరాస్యతలో అట్టడుగులో ఉన్న గ్రామాన్ని ‘అఆ’ లు దిద్దించాలనే సత్ సంకల్పంతో బడి అనేది చదువుల తల్లి ఒడిగా, జాతి భవితకు గర్భగుడిగా భావించి మన గ్రామంలో ‘మండల పరిషత్ ప్రాధమిక (Z.P) పాఠశాల’ను 1932వ సంవత్సరంలో స్థాపించడం జరిగినది. ఈ పాఠశాలకు R.C No: 55 dated 12-12-1932 UDISE Code No: 28172200701 తో సహవిద్యాలయం (కో-ఎడ్యుకేషన్) గా డీఇఓ, గుంటూరు వారు ఉత్తర్వులు జారీ చేసినారు.

      ఈ ప్రాధమిక పాఠశాలనే 'చిన స్కూలు' అని కూడా అంటారు. ఈ పాఠశాల కండ్లగుంట గ్రామంలో దినదినాభివృద్ధి చెందుతూ ఏంతో మంది ఆణిముత్యాలను వెలికితీసింది. ఇక విద్య విషయంలో మన గ్రామం ఎప్పుడూ చుట్టుపక్కల గ్రామాలకి అందనంత ఎత్తులో ఉండి అందరికి ఆదర్శంగా ఇప్పటికీ నిలుస్తుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి చేరి విద్యనభ్యశించారు. పాఠశాల అభివృద్ధి క్రమంలో నడిపించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎందరో కలరు. పూర్వ విద్యార్థులు చెప్పిన ప్రకారం హనుమయ్య గారు ( గొల్ల పంతులు), ముక్తేశ్వరరావు గారు, వీరయ్య గారు, బద్ధుల రాఘవయ్య గాఋ దగ్గర నుంచి వారసత్వంగా విల్సన్ బలసుందరం గారు, కనకయ్య గారు, కనకమ్మ గారు, శ్లీవరాజు గారు, నేటి ఉపాధ్యాయులు సూరిబాబు గారి వరకు నిరంతరం కృషి చేయుచున్నారు. వీరందరి కృషికి వెన్నుదన్నుగా నిలిచిన సహోపాధ్యాయులు కూడా ఈ అభివృద్ధి పథంలో ముఖ్యపాత్రలు అన్న విషయం మరిచిపోకూడదు.

      పాఠశాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నదని చెప్పుటకు ఎంతో గర్విస్తున్నాము. నవ్యాంధ్ర తోలి సభాపతి శ్రీ కోడెల శివప్రసాదరావు గారు ఈ పాఠశాల విద్యార్ధి అని చెప్పుటకు సంతోషిస్తున్నాము. అలానే గాలి సుబ్బారావు, రావెల సత్యనారాయణ గారు, పోసాని వెంకటేశ్వర్లు గారు, మరెందరో ఉన్నత విద్యనభ్యసించిన ప్రముఖులు అక్షరాలను నేర్చుకున్నది ఈ పాఠశాలలోనే.

      పాఠశాలలో ఓనమాలు దిద్దుకున్న విద్యార్ధులు వారు అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత పాఠశాలను మరిచిపోలేదు. పాఠశాల అభివృద్ధి కమిటీగా ఏర్పడి శాశ్వితనిధి క్రింద రూ. 2,56,000/- లను సమకూర్చినారు. అలానే సీతారామ భజన భక్త సమాజంవారు ప్రతి సంవత్సరం 5వ తరగతిలో ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్ధులకు గోడగడియారాలు బహుమతిగా అందిస్తున్నారు. పాఠశాలకు రావెల సత్యనారాయణ గారు రూ. లక్ష ను విరాళంగా ఇచ్చినారు. . మన పాఠశాలను గమనించిన ఇతరులు కూడా పాఠశాలకు ఎంతో కొంత సహాయసహకారాలు అందించుచున్నారు. హైదరాబాదుకు చెందిన యంత ఫౌండేషన్ వారు 40 బెంచీలు ఏర్పాటు చేసినారు. పూర్వ విద్యార్ధి శ్రీ యాళ్ల శ్రీనివాస శేషసాయి గారు కంప్యూటర్, శ్రీ పోతుగుంట సుబ్బారావు గారు విద్యుత్ మోటర్, శ్రీ పడగండ్ల నాగాబ్రహ్మచారి స్పీకర్ పోడియంను బహూకరించారు. ఎన్నో ఏళ్లగా అపరిశ్క్రుతంగా ఉన్న పాఠశాల పూర్వ విద్యార్ధి శ్రీ కండ్లగుంట శ్రీనివాసరావు గారు రూ. 50,000/- ఖర్చుతో పూర్తి చేసి రెండువైపులా గేట్లను ఏర్పాటు చేసి పాఠశాలకు ఒక కొత్తదనం కలిగించినారు.

      ఒక ప్రాధమిక పాఠశాల ప్రతి సంవత్సరం నిర్విరామముగా ఒక పండుగ వాతావరణంలో వార్షికోత్సవ వేడుకలు జరుపుకొనుట ఈ పాఠశాల మరొక విశేషం. ఇంకొక ముఖ్య విశేషం మా పాఠశాల పూర్వ విద్యార్ధిని చి. చండ్ర గౌతమి తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి వెళ్లిందని తెలియజేయడానికి గర్విస్తున్నాం. మన గ్రామంలో వయసు మళ్ళిన వృద్ధులు కూడా దినపత్రిక చదవగలరు. అంటే దీన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు, మన గ్రామం విద్యకి పూర్వతరాల నుండి ఎంత ప్రాధాన్యతనిస్తూ వస్తుందో. ఈ పాఠశాల విద్యా సంవత్సరం నుండి “ఆదర్శ ప్రాధమిక పాఠశాల” గా రూపుదిద్దుకొన్నది. పాఠశాలను అభివృద్ధి పథములో నడిపించడానికి ఐదుగురు ఉపాధ్యాయులు కృషి చేయుచున్నారు.