మండల ప్రజా పరిషత్ (ఎఎ) పాఠశాల

      కదిలేదీ.. కదిలించేది.. పెనుతుపాను సృష్టించేది.. అక్షరం. ఆ అక్షరాలతో అక్షరాస్యతలో అట్టడుగులో ఉన్న గ్రామాన్ని ‘అఆ’ లు దిద్దించాలనే సత్ సంకల్పంతో మన గ్రామంలో ‘మండల పరిషత్ ప్రాధమిక (ఆదివాసీ ఆంధ్ర) పాఠశాల’ను 1918వ సంవత్సరంలో S.C కాలనీలో స్థాపించడం జరిగినది. ఈ పాఠశాల గుర్తింపుకై R.C No: 28 dated 18-01-1918 UDISE Code No: 28172200702 నంబరుతో సహవిద్యాలయం(కో-ఎడ్యుకేషన్)గా డీఇఓ, గుంటూరు వారు ఉత్తర్వులు జారీ చేసినారు.

      చాలా పురాతనమైన పాఠశాల. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాల. ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడ ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. పాఠశాల నుండే ఎందరో చదువుకుని ఉన్నత స్థాయిలోకి వచ్చారు. ఈ పాఠశాల ఎంతోమంది మేధావులను సమాజానికి అందించింది. విద్యారంగంలో వాసికెక్కిన గ్రామం. ఇప్పటికి ఉపాద్యాయులు అంకితభావంతో భోదిస్తుండడంతో విద్యార్ధులు రాణిస్తున్నారు. ఈ పాఠశాల హరిజనవాడలోఉంది.

      ప్రస్తుతం ప్రాధమిక పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల సంఖ్య:- బాలురు: 45, బాలికలు: 40. మొత్తం: 85.

      ప్రస్తుతం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల(S.C)లో చదువుచున్న విద్యార్థుల సంఖ్య:- బాలురు: 39, బాలికలు: 43. మొత్తం: 82.

      శిక్షణకు కొత్త ఒరవడి!

      మానవ వనరుల్ని సృజన శక్తులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాల్సిన సరస్వతీ నిలయాలు పసికందులకు లాలనగా విద్యాగంధం అద్ది, క్రమశిక్షణ నేర్పాలి.

      నేటి బాలలే రేపటి పౌరులు. వారు సక్రమంగా విద్యాబుద్ధులు నేర్చి సమర్థ మానవ వనరులుగా అవతరిస్తేనే జాతికి కలిమి, బలిమి కాగలుగుతారు. బాలబాలికలందరికీ సజావుగా ప్రాథమిక విద్య సమకూరితే జాతికి ఆర్థికాభ్యున్నతి ఒనగూడుతుందన్న ప్రపంచబ్యాంకు ఉద్బోధలో అంతరార్థమదే.

      పోటీతత్వాన్ని, జీవితంపట్ల సదవగాహనను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధన విధివిధానాల్ని ప్రామాణీకరించాలి. ప్రాథమిక విద్యే వ్యక్తి వికాసాన్ని విరబూయించే ప్రక్రియకు అంటుకడుతుంది. అంతటి కీలక దశలో భారీగా ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. గురుపీఠాలు అధిష్ఠిస్తున్నవారిలో అయిదోవంతు మందికి తగిన శిక్షణ అన్నదే లేదు. సిబ్బంది కొరత మూలాన పనిభారం పెరిగి బెత్తం పదునెక్కి పునాదులూ గుల్లబారుతున్నాయి. ఈ కంతలన్నింటినీ వడివడిగా పూడ్చి నాణ్యమైన బోధనకు బాటలు పరిస్తేనే, బాలభారతం తేరుకుంటుంది!