జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల

      పూర్వం “కండ్లగుంట” గ్రామంలో విద్యాబోధనకై ఏవిధమైన సౌకర్యాలు ఉండేవి కావు. కేవలం ప్రాధమిక పాఠశాల తప్ప వేరేదేదీ ఉండేది కాదు. ఈ స్ధాయిలోనే 1980వ సంవత్సరం వరకూ చాలా మంది తమ చదువులను ముగించుకోవడం జరిగేది. కొద్ది మంది మాత్రమే సమీపంలో ఉండే నగరాలలో తమ ఉన్నతవిద్యనభ్యసించడానికి వెళ్ళేవారు. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించడం ఎంత కష్టమో భావించి, మన వూరిలోనే పైచదువుల కొరకు ఓ పాఠశాలను ఏర్పాటు చేయాలనే తలంపుతో, పాఠశాలను వారి శక్తిమేరకు వీలైనంత ఉన్నతమైన స్ధాయిలో అభివృధ్ది చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. గ్రామపెద్దలు, సంబంధిత రాజకీయ నాయకులతోనూ మరియు ప్రభుత్వ అధికారులతోనూ కలసికట్టుగా కృషిచేసి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను(జెడ్.పి.పి.హెచ్) నెలకొల్పడంలో విజయం సాధించారు. 1982-83 విద్యాసంవత్సరంలో 8వ తరగతిని మొదటి బ్యాచ్ 27 మంది విద్యార్ధులతో ప్రారంభమై, 9వ తరగతి మరియు 10వ తరగతులను కూడా వరుసగా తరువాత సంవత్సరంలలో ప్రవేశపెట్టడం జరిగింది. 1985-86 విద్యా సంవత్సరంలో మొదటి బ్యాచ్ విద్యార్ధులు 10వ తరగతికి జరిగిన బోర్డు పరీక్షలకు హాజరవ్వడం జరిగింది. అందరూ ఆశించినదాని కంటే అధికంగా ఫలితాలను సాధించడంతో పాటూ, విజయం సాధించినవారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.

      ప్రారంభదశలో, హైస్కూలును నాగార్జున సాగర్ కుడి కాలువకు దగ్గరగా ఏర్పాటుచేయడంతో హెడ్ మాస్టారు, ఇతర అధ్యాపకులు పిల్లల రక్షణకై అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అ సమయంలో ఊరి ప్రజలు మరియు వారి తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ప్రాధమిక దశలో పాఠశాలను నడపడానికి ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రులు రాబడిని “కాయద పాటలు” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. అదేవిదంగా ఖరీఫ్ సీజన్ లో విద్యార్ధులు పొలం పనులు చేసి రాబడిని సమకూర్చి, దానిని పాఠశాల అభివృధ్ది కోసం వినియోగించడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధి–విద్యార్ధినిలు మరియు స్కౌట్స్-గైడ్స్ కూడా ప్రజానీకంతో చక్కటి సంబంధాలను పెట్టుకుని, వారిలో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో ఒక చైతన్యాన్ని గొలిపే రీతిలో “జన్మభూమి” అనే కార్యక్రమాల ద్వారా వారిలో అవగాహన పెంచి పాఠశాలను నిర్మించడానికి కృషి చేయడం జరిగింది.

      ఫలితంగా గ్రామంలో పాఠశాల నిర్మాణానికి కాలసిన భూమిని జంపని వారు (సుమారుగా 3.5 ఎకరాలను) శాశ్విత భవనాలు మరియు క్రీడా మైదానాలను నిర్మించుట కొరకు దానం చేయడం జరిగింది. ప్రాధమిక దశలో పాఠశాల అభివృధ్దికై రాజకీయ నాయకులు మరియు గ్రామ పెద్దలు భవనాల నిర్మాణానికి మరియు ఉపాధ్యాయుల నియమాకాలకు, అనుమతులు కొరకు వారందించిన సహకారాలు మరువలేనివి, శాశ్వితంగా నిలిచిపోయేవి. మనగ్రామం అంతగా అభివృధ్ది పొందినది కాకపోయినా, ఉన్నత పాఠశాల భవనాలను, వాటితో పాటుగా మంచి మౌలికసదుపాయాలు కల్పించి విద్యాబోధనకు అనుకూలమైన మరియు సౌకర్యాలున్న పాఠశాలగా తీర్చిదిద్దడంలో కృతకృత్యులైనారు.

      తదుపరి కాలంలో మన కండ్లగుంట గ్రామంలోని పాఠశాల మన గ్రామానికి, చాగల్లు, చీమలమర్ర్రి, దేచవరం మరియు రూపెనగుంట్ల గ్రామాలకు కూడా ఓ విద్యాకేంద్రంగా భాసిల్లుచున్నది. వీరిలో చదువుకున్న విద్యార్ధులందరూ కూడా విజయవంతంగా మంచి విద్యాబుద్దులను గడించుకున్నవారే. అలాగే అనేకమంది ఔత్సాహికులు, యువనేతలు కూడా ఈ పాఠశాలనుండి గర్వంగా చెప్పుకోతగ్గ స్ధాయిలో విద్యనభ్యసించిన వారే. కండ్లగుంట విద్యార్ధులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల విస్తరించుకుని ఉన్నారు. అలాగే వారు వివిధ రంగాలలో అంటే వైద్యులగానూ, వ్యవసాయశాస్త్రవేత్తలగానూ, విద్యావేత్తలగానూ, సాఫ్టవేర్ మరియు హార్డ్ వేర్ ఇంజినీర్లగానూ, న్యాయవాదులగానూ, రాజకీయవేత్తలగానూ, విలేఖరులగానూ, ఉపాధ్యాయులుగానూ, పోలీస్ శాఖలో ఉద్యోగులగానూ, వ్యాపార వేత్తలుగానూ, ప్రచార మాధ్యమాలలోనూ మరియు ఫిల్మ్ రంగంలోనూ రాణిస్తున్నారు. కష్టపడి పనిచేసే స్వభావం గల మనవూరి నైజం వారి ఆర్ధిక స్ధితిని మెరుగు పరచి, అనేక చోట్ల, ముఖ్యంగా హైదరాబాద్, నర్సరావుపేట మరియు ఇతర రాష్ట్రాలలోనూ, దేశాలలోనూ కూడా స్ధిరంగా నిలదొక్కుకునేటట్లు చేసింది.

      మన పాఠశాల చదివిన విద్యార్ధులు ప్రతిష్టాత్మకమైన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, "నాసా" నిర్వహించిన స్పేస్ సెట్లిమెంట్ డిసైన్ కాంటెస్ట్-2014 పోటీలలో అసాధారణ ప్రతిభ కనబరచినారు. గ్రేడ్-12 విభాగంలో, వీరిద్దరూ (షేక్ జరీనా మరియు చండ్ర గౌతమి), ఇద్దరు తమ తోటి విద్యార్దినులతో కలిసి, రూపొందించిన "మిన్వారా ప్రాజెక్టు" కు మూడవ బహుమతి పొందినారు. ఈ అంశంపై వీరు పంపిన నివేదికకు మెచ్చిన నాసా అధికారులు, 2014, మే నెలలో 14 నుండి 18 వరకూ, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో నిర్వహించే 33వ అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకు ఈ విద్యార్ధునులిద్దరూ, అష్టకష్టాలకోర్చి, లాస్ ఏంజెల్స్ కు చేరుకొని, తమ ప్రాజెక్టు నివేదికను సవివరంగా నాసా శాస్త్రవేత్తలకు విపులీకరించినారు. అంతరిక్షంలో మానవమనుగడ సాధ్యమేనని తమ ప్రాజెక్టు ద్వారా వివరించినారు. వారి ఆలోచనలకు ముచ్చటపడ్డ నాసా శాస్త్రవేత్తలు, మరెన్నో విలువైన అంశాలను వీరితో చర్చించినారు.

      1995-96 సంవత్సరంలో ఈ పాఠశాల యొక్క విద్యార్ధుల సంఖ్య 600గా నమోదైనది. ప్రస్తుతం మన గ్రామాలలో చాలావరకు నగరాల్లో ఉండే కార్పోరేట్ పాఠశాలల వైపు ఆకర్షితులవుతున్నారు. ఫీజుల రూపంలో గ్రామాల ఆదాయంలో యాభైశాతం వరకు ఈ కార్పోరేట్ పాఠశాలలకు చెల్లించబడుతోంది. మన కండ్లకుంట గ్రామంలో ఉన్న పాఠశాలలో 90-95 శాతం విద్యార్ధులు మధ్యతరగతికి చెందినవారు మరియు మధ్యతరగతి కంటే తక్కువ కుటుంబాలకు చెందిన వారై ఉన్నారు. పాఠశాల యాజమాన్యాలవారిచ్చిన తాజా సమాచారం ప్రకారం 20 శాతం ఇతర కులాలకు చెందినవారూ, 50 శాతం వెనుకబడిన కులాల విద్యా ర్ధులు కాగా, మిగిలిన 30 శాతం వారు షె.కులాలకూ, షె.తెగలకు చెందిన వారై ఉన్నారు. ఈమధ్య కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాన్ని చెప్పుకోతగ్గ స్ధాయిలో మెరుగుపరచింది. అయితే, విద్య యొక్క నాణ్యత తరచుగా అలాగే అధమస్ధాయిలోనే ఉండిపోతోంది.

      ఈ లోపాలను సరిదిద్దడానికి మరియు మన పిల్లల చదువులను ఆంగ్ల మాధ్యమంలో సి.బి.ఎస్.ఇ.(కేంద్రీయ) మరియు రాష్ట్ర సిలబస్ లలో విద్యార్ధులు నేర్చుకోవడానికి, నైపుణ్యాన్ని వృధ్దిచేసే మరియు మెరుగుపరిచే విద్యాసంబంధితం కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. అనేక రకాలైన వివక్షతలను లేక అసమానతలను అంటే గ్రామీణ-పట్టణ, ధనిక-పేద మరియు కులాల-మతాల, లింగవివక్షత వ్యత్యాసాలు మొదలైనవాటిని తావులేకుండా, నాణ్యతతో కూడిన విద్యను, సమానమైన అవకాశాల్ని కల్పించవలచిన అవసరం ఎంతైనా ఉంది.

      అందుచేత, వినూత్నమైన బోధనా పద్ధతులు మరియు విధానాలతో మన పాఠశాల విద్యావిధానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. డిజిటల్ తరగతి గదులు మరియు స్మార్ట్ తరగతులు, చిన్న సమూహాలతో విద్యాభోధనను వంటపట్టించుకుంటూ నేర్చుకొనే విధానాలు, సహకారయుతమైన బోధనను నేర్చుకోవడం, జీవితనైపుణ్యాల సంబంధిత కార్యక్రమాలు, సంభాషణా విధివిధానాలను మెరుగు పరచుకోవడం కొరకు ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో తర్ఫీదు, ఆలాగే ధ్యానం మరియు యోగా సాధనకు అవకాశాలను కల్పించడం వంటివి కూడా ఏర్పాటు చేయడం జరగాలి. మన పాఠశాలకొరకు, పూర్తిస్ధాయి కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబోరేటరీ, క్రీడలను నిర్వహించడానికి అనువైన కోర్టులు వగైరాలను కూడా ఏర్పాటు చేయవలసి వుంది. శాంతిని, సౌభ్రాతృత్వాన్ని మరియు ఆరోగ్యకరమైన పరిసరాల్నీ కలిగించడానికి “గౌతమబుధ్ధుని” విగ్రహాన్ని కూడా ప్రతిష్టించ వలచిన అవసరం ఎంతైనా ఉంది.

      మాతృభూమిపై ఉన్న ప్రేమా, ఆదరణ గ్రామానికి సౌభాగ్యాన్ని, సౌహార్త్రత చేకూరుతుంది. కండ్లగుంట గ్రామంలో జెడ్.పి.పి.హెచ్.పాఠశాల అభివృధ్ది కోసం ప్రవాసభారతీయులు (ఎన్.ఆర్.ఐ.) తమవంతు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నారు .

      విద్యార్ధులకు ప్రతిభతో పాటూ మంచి నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తేవడానికి, సాధించవలసిన విజయాల కొరకు మనమందరం చేయిచేయి కలిపి, అద్బుతమైన ఫలితాలను ఈ తరానికి మరియు మున్ముందు తరాలకి అందివ్వాలనే సహృదయంతో, మంచి గుణంతో ఈ మన పాఠశాలను నవీకరించే కార్యక్రమాన్ని ప్ర్రారంభిద్దాం.

      ఇందుకు అవసరమైన ఆర్దిక సహాయాన్ని మన పాఠశాల పూర్వ విద్యార్దుల మరిము విద్యార్ధినులు నుంచి కోరుచున్నాము. మరల ఇన్ని సంవత్సరాల తర్వాత దేవాలయంలాంటి పాఠశాలకు సేవ చేసుకోగల బంగారం లాంటి ఈ అవకాశం లభించడం ఒక అదృష్టం. ఎంతో ఉన్నతమైన ఆలోచన గలవారికి ఇటువంటి అదృష్టం దక్కుతుంది. దయాళువులైన వారు ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలి. పాఠశాల ఆధునీకరణకు మీ వంతు సాయం చేయండి. మన భావితరాలవారికి ఈ పాఠశాల ద్వారా మంచి చదువుల వారసత్వాన్ని అందిద్దాం. ఇందుకు మీ సహాయ సహకారాలను అందించండి. “సేవ, దయ, దాన” గుణాల ద్వారా మీ జీవితాన్నిపుణ్యప్రదం చేసుకోండి. మీ యొక్క సహృదయంతో, దయా గుణంతో, మంచి జ్ఞానంతో, శాంతియుత భావంతో మన పాఠశాలను ఓ ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దడానికి మనమందరం చేయీచేయీ కలిపి ముందుకు నడుద్దాం.

      మన గ్రామాన్ని మరియు మన పాఠశాలను కూడా ఒక ఆదర్శవంతమైన నమూనాగా చేయాలనేదే మన కల. మన కలలను సాకారం చేసుకోవడానికి మరియు మన ముందు తరాలవారికి కూడా నాణ్యతతోకూడిన విద్యను అందించడానికి వీలుగా ఈక్రింద చూపబడిన మౌలిక సదుపాయాలు ఆవశ్యకరం మరియు తప్పనిసరిగా అందించవలసిన అవసరం ఉంది. మన గ్రామాన్ని మరియు మన పాఠశాల యొక్క మౌలిక సదుపాయాలను అభివృధ్ది పరచుకోవడానికి ఊదారహృదయుల సహకారం ఎంతోఅవసరమవుతుంది.