ప్రధాన వృత్తులు

      ఈ గ్రామానికి ప్రధాన ఆధారం, ఆదాయం, వృత్తి అన్నీ వ్యవసాయమే. కొందరు వారికి సాయం చేసి కూలీ అనిపించుకుంటారు, మరి కొందరు వ్యవసాయ ఆధారిథ పనులు చేస్తారు, ఇంకొందరు పశువులు ద్వార పాల ఉత్పతిని పెంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ పాలు కొనుక్కోవడానికి పాల సరఫరా సహకార సంఘం వారు, కొన్ని ప్రైవేటు డైరీలు, ప్రైవేటు వ్యక్తులు వస్తుంటారు. ఈ ఊరిలో అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కమ్మ, యాదవులు (గొల్లలు), రజక (చాకలి), కుమ్మరి, ఎరుకల, యానాది, మాదిగ, మాల, వడ్డెర, కంసాలి, బ్రాహ్మణులు, వైశ్య కులస్థుల వారు ఉన్నారు. వీరిలో కమ్మ, యాదవులు, మాదిగ మొదలగు కులస్తుల జనాభా ఎక్కువ. ఈ గ్రామంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ మతాలకు చెందిన వారు ఉన్నారు. అందరూ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధాపపడి జీవిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ గోల్లలు గొర్రెల/మేకల పెంపకం/పోషణను, రజకులు బట్టలుతకడం, కోమట్లు హోటల్స్-చిల్లర దుకాణాలు, కుమ్మరోళ్ళు కుండలపని, కంసాలి వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన వడ్రంగి పని, బ్రాహ్మణులు అర్చకులుగా, ఇలా వారి వారి కులవృత్తిలను చేసుకుంటూ కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తునారు. మిగిలిన కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మరి కొందరు మేస్త్రీ పని,హమాలి పని, కరెంట్ పని, డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకుని సొంత ఆటోల ద్వార కొందరు, దర్జీ పనిలో మరి కొందరు, ఉపాద్యాయ వృత్తిలో ఇలా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఊరి యువత ఎక్కవ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మొగ్గు చూపుతున్నారు. నేటితరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, పడుతున్నారు. ఎక్కువగా యువత చదువులకోసం, ఉద్యోగాల కోసం గ్రామాన్ని విడిచి వలసలు పోతున్నారు.యువత కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

      గ్రామంలో సాగునీటికి కొంతమంది ఊరికి ఈశాన్యంలో ఉన్న చెరువు మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఎక్కువ మంది సాగర్బా కాలువ, బావుల మీద ఆధారపడతారు. ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల చెరువుల్లో కల్లా పెద్ద చెరువు. వర్షాకాలంలో పై నుంచి పారే నీటిని చెరువులోకి మళ్ళిస్తారు. దీనికి చుట్టూ చెరువు కట్టడం ఉంది. ఒక వేళ చెరువు నిండి పోతే అదనపు నీటిని విడుదల చేయడానికి రెండు తూములు ఉన్నాయి. చెరువులో రజకులు చేపలు పట్టుకోవడానికి గ్రామ పంచాయితీ ప్రతి సంవత్సరం వేలం నిర్వహిస్తుంది. అందులో పాడుకున్న వాళ్ళు మాత్రమే ఆ సంవత్సరం చేపలు పట్టి అమ్ముకోవడానికి అర్హులు.

      గ్రామంలో మూడు బియ్యం మరలు (రైస్ మిల్లులు) ఉన్నాయి. చాలా మంది గ్రామస్థులు బియ్యం ఇక్కడే మరాడించుకుని వెళుతుంటారు. కొద్ది మంది తమ పంటను ఈ ఊరికోచ్చే వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు. వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాడతారు. దాదాపు ప్రతీ ఇంటిలోనూ పాడి సంపద ఉండటం వల వాటి వ్యర్థాలను తమ పంట పొలాలను ఎరువుగా వాడుకుంటారు.