నా గురించి

      జీవితంలో ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు. కొన్ని సంతోషాన్ని పంచితే, మరికొన్ని బాధల్ని నింపుతాయి. ఆ క్షణంలో ఆనందాల్ని, అశ్రువుల్ని నింపిన సంఘటనలను కొన్నేళ్ల తర్వాత తల్చకుంటే అవే జ్ఞాపకాలు అద్భుతంగా అనిపిస్తాయి. పలక, బలపం పట్టుకుని బడికి వెళ్లిన రోజులు, అయ్యవార్ల కన్నుగప్పి బడి నుండి చెక్కేసి చెరువుదగ్గర, పెద్ద కాలువకట్టల మీద, గాంధీ బొమ్మల సెంటర్, వినాయకుడి గుడి దగ్గర, బొమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకున్న రోజులు, మన అచ్ఛమైన గ్రామీణ క్రీడలుగా ముద్రపడ్డ కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, బొంగరాలాట, సీత-రాముడు-లక్ష్మణుడు-హనుమంతుడు ఆట, కర్రాట, ఏడుపెంకులాట, పిచ్చిబంతి, గోలీలాట, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, త్రోబాల్, కబడ్డీ ఆడుకున్న రోజులు, చింతతోపు దగ్గర చింతకాయలు కొట్టుకుని ఉప్పుకారం అద్దుకుని తిన్న రోజులు, పిల్లలందరూ వెళ్లి కాలువలో ఈత నేర్చుకున్న రోజులు, టీవీలు రాని రోజుల్లో ఆరుబయట వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్న రోజులు, ఊరంతా కలిసి సీతారాముల కళ్యాణం చేసుకున్న రోజులు, కొత్తగా టీవీలు వచ్చిన రోజుల్లో అందరం కలసి ఆదివారం సినిమాలు, క్రికెట్, సీరియల్స్ చూసిన రోజులు, మన మనసులను ఆనందపరిచిన పౌరాణిక నాటకాలు, తోలు బొమ్మలాటలు, బుర్రకథలు, మనందరం కలిసి వెన్నెల్లో నేలమీద కూర్చోని బ్లాక్ & వైట్ లో టీవీ వార్తలు మరియు రేడియోలో నాటికలు, వార్తలు విన్న రోజులు మళ్ళీ తిరిగిరావు ... అవి మన ఆలోచనల్లో, అంతరంగాల్లో మాత్రమే ఉన్నాయి. మరికొన్నాళ్లు పోతే అక్కడి నుంచీ మాయమవుతాయి. కారణం అప్పటి రోజులకు మనదగ్గర ఆధారాలు లేవు. కనీసం పదిమందితో పంచుకంటే పదికాలాలు పాటు నిలిచి ఉంటాయి.

      మన గ్రామ చరిత్ర మరియు గ్రామంలోని పూర్వ పరిస్థితులను మన భావితరాలకు అందించాలన్నది ఒక ఉద్దేశం. మన గ్రామం పుట్టిన మొదలు, ఇక్కడ నుండి ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది ఇతర ప్రదేశాలకు జీవనోపాధి కోసం వలసవెళ్ళారు. అలాంటి వారు తమ సొంత గ్రామాన్ని మళ్లీ చూడాలని వున్నా, వారి వారి పిల్లలకు కండ్లగుంట మన సొంత గ్రామం అని చెప్పడమే తప్ప, ఇక్కడికి రాలేని పరిస్థితి కొందరిది. కనీసం ఈ గ్రామంలో ఏమి జరుగుతుందో, వారి బంధువులు ఎలా వున్నారో, ఎక్కడ వున్నారో తెలుసుకోలేని అయోమయం. మరి వారి పిల్లలకైతే వారి బంధువులు ఎవరో, వారి దాయాదులు ఎవరో, వారి పొలాలు ఎక్కడ ఉండేవో, కనీసం ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలో తెలియని విచిత్ర పరిస్థితి.

      మన ఊరిలో మూలాలున్న ఎంతోమంది వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కొందరు విదేశాల్లో కూడా ఉన్నారు. వారందికీ ఊరితో ఉన్న అనుబంధాన్ని తెగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఊరిమీద అభిమానమున్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఊరి గురించి మనం పోస్ట్ చేసే సాధారణ ఫొటోలు, వార్తలు వారికి అబ్బురంగా అనిపించొచ్చు. ఊరిలోనే ఉంటున్న అనుభూతిని తీసుకురావచ్చు. జ్ఞాపకాల సరసుల్లో ఈదులాడొచ్చు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ.. ఏ స్థాయిలో ఉన్నా మనం అనే భావనను మనసుల్లో నుంచి చెదిరిపోకుండా చేయవచ్చు. ఇక్కడే పుట్టి దేశ-విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న మన గ్రామస్తులు మరియు యువ తేజాల కోసం ఇక్కడ జరిగే కార్యక్రమాలు, తాజావార్తలు, శుభకార్యాలు, పండుగలు మరియు సంబరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నది మా ఉద్దేశం. గ్రామంలో జరిగే చిన్నచిన్న వేడుకలు, కొలువులు, మరేదైనా ముఖ్య సంఘటనలను ఫొటోల రూపంలో భద్రపరచుకోవడం మన బాధ్యత. మన ఊరు అనే తల్లి వేరు బంధం తెగిపోకుండా కాపాడటమే దీని లక్ష్యం. దీని కోసం కొందరు కష్టపడుతున్నా.. అందరూ సహకరిస్తుంటారు. వీటన్నిటి సమాహరమే ఈ ‘కండ్లగుంట.ఓ ఆర్ జీ’ తయారు చేయబడినది. ఇక నుంచి మన గ్రామంలో మరియు మన జీవితంలో జరిగే మంచికీ, చెడుకీ ఈ వెబ్‌సైట్‌ని వేదికగా చేసుకుందాం.

      ఈ వైబ్‌సైట్‌కి ఓనర్లు, క్లీనర్లు ఎవ్వరూ లేరు మరియు పలానా అని ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిదీ. దీన్ని విజయవతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మన అందరిదీ. దీనికి మనందరి సమిష్ఠి కృషి, సంపూర్ణ సహకారం కావాలి. మీ బంధువులు, స్నేహితులను కూడా దీనిలో భాగస్వాముల్ని చేయండి. ఊరిపై మీకున్న అభిప్రాయాన్ని రాసి మెయిల్ చేయడం మరచిపోకండి. వెబ్‌సైట్ విజయానికి సూచిక దానికి వచ్చే మెయిళ్లు, స్పందనలే. మీరు విహారయాత్రలు, విందులు, వినోదాలకు వెళ్లినప్పుడు, లేదా ఏదైనా పురస్కారం లభించినప్పుడు మరేదైనా ముఖ్య సంఘటన జరిగినప్పుడు దాన్ని మనవాళ్లతో పంచుకోండి. వీలైతే ఫొటోలు జత చేయండం మరిచిపోకండి.

      అగ్గివుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకనర్హం.. అన్నాడు మహాకవి శ్రీశ్రీ. పండుగలు, పర్వదినాల ప్రాశస్త్యాన్ని తెలిపే రచనలు చేయండి లేదా మన గ్రామానికి సంబందించిన ఏదైనా విషయాలు మీ పెద్దల ద్వారా మీకు తెలిసివున్న, తప్పకుండా మన గ్రామ ప్రజలతో పంచుకోండి. అలాంటి రచనలు లేదా విషయాలను తప్పక పంపండి, మేము వాటిని మన గ్రామ వైబ్‌సైట్‌లో మీ ఫొటోతో సహా తప్పక ప్రచురిస్తాం. దీనిలోని ఆర్టికల్స్‌పై మీ స్పందనల్ని తప్పనిసరిగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. వ్యాసాలపై స్పందన లేకపోతే రచయితలు నిరుత్సాహపడవచ్చు. మన సైట్‌లో మార్పులేమైనా చేయాలినిపిస్తే నిరభ్యంతరంగా సూచించండి. ఈ ఆర్టికల్‌లో మీకు ఇబ్బందికరంగా అనిపించిన విషయాలుంటే తెలియజేస్తే, పరిహరిస్తాం.

“గ్రామ వికాసమే ... మన అంతిమ ఆశయం”