మిషన్ కె.వి.ఫ్

ఒక్కరు చేయలేని దాన్ని అందరూ కలిసి చేస్తే అది – ఐక్యత.

నలుగురి మేలు కోసం చేతులు కలిపి పని చేస్తే అది – అభివృద్ధి.

ఒక్కరు చేయలేని పనిని పదిమంది కలిసి చేసి చూపించవచ్చు. గ్రామం...జిల్లా...రాష్ట్రం...దేశం... ఏదైనా ప్రజల సానుకూల దృక్పథాన్ని బట్టే రాణిస్తుంది. అభివృద్ధి సాధిస్తుంది. అంటే ఐక్యత, సానుకూల దృక్పథంతో ఏదైనా సాధించవచ్చు. అందుకు నిదర్శనం-‘కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్’.

ఎందరో మహానుభావుల అద్భుతమైన దానశీలత, జన్మభూమిపై అంతులేని ప్రేమ, గ్రామస్తుల మరియు దేశవిదేశాల్లో స్థిరపడిన వారందరి సహాయసహకారాలతో కె.వి.ఎఫ్... గ్రామాభివృద్ధే ధ్యేయంగా “ఐక్యత-అభివృద్ధి” నినాదంతో “గ్రామ వికాసమే-మన అంతిమ ఆశయం” లక్ష్యసాధనకై ఆవిర్భవించిన సంస్థే “కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్” - పల్లె ప్రగతికి తమవంతు కృషి చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శవంతంగా నిలుస్తుంది.

మన ఊరిలోని ప్రజలు ప్రతి నిత్యం సంతోషంగా నాణ్యమైన జీవితాన్ని గడపడం కోసం ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఈ ఫౌండేషన్ అంతా చేయడానికి ప్రయత్నిస్తుంది. అలానే ఊరికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం, గ్రామస్తుల జీవన ప్రమాణాలను పెంచడం, గ్రామంలో కొత్త అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చడం, విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచడం ధ్యేయంగా ఈ ఫౌండేషన్ పని చేస్తోంది.

ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఊరి బాగు కోసం నడుం బిగించారు. అయితే, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా.. రెండు చేతులు కలిస్తేనే అది సాధ్యమవుతుంది. అప్పుడే ఓ శబ్దంగా ధ్వనిస్తోంది. అదే అభివృద్ధి నినాదంగా మారుతుంది. అందుకే ఊరి బాగు కోసం చేతులు కలపాలని ఫౌండేషన్ కోరుతోంది. అన్ని పనులు ఒకేసారి కాకుండా ఒక ప్రణాళికాబద్దంగా చేసుకుంటూ వెళ్దాం. చిన్న మొత్తం గాని, పెద్ద మొత్తం కానీ... ఎవరెంత ఇచ్చినా దాన్ని సంపూర్ణంగా గ్రామాభివృద్ధికే వెచ్చిస్తోందీ ఫౌండేషన్. ఎవరైనా తాము ఆర్ధిక సహాయం చేయదల్చుకుంటే నేరుగా ఫౌండేషన్ కు ఇవ్వవచ్చు, లేదా గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని దత్తత తీసుకోవచ్చు. మీరు గ్రామ అభివృద్ధికి చెయ్యాలి/చెయ్యవచ్చు అనుకుంటున్న విషయాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరందరూ ఈ మహాసంకల్పంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం.

మనం చేసే చిన్న సహాయం కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. దయార్ద్ర హృదయాలు చేసే సాయం – ఆర్థికంగా, హార్ధికంగా, సామాజికంగా, ఎందరికో బంగారు భవిష్యత్తునిస్తుంది.

ప్రస్తుతం దాతల సహకారంతో గ్రామంలో సకల సౌకర్యాలతో అందమైన కళ్యాణమండపం రూపుదిద్దుకున్నది. ప్రతి మనిషి యొక్క చివరి మజిలీ కూడా గౌరవప్రదంగా ఉండాలనే అద్భుత తలంపుతో మరో దాత వైకుంఠ మహాప్రస్థానంను ఆధునిక హంగులతో నిర్మించారు.

విద్య, వైద్యం - రెండూ సంపూర్ణంగా ఉన్న ఊరు ఏదైనా సాధించగలుగుతుంది. కె.వి.ఎఫ్. ప్రస్తుతం ఈ రెండూ సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. అందుకు గ్రామస్తులు, దాతల సహకారాన్ని అభ్యర్ధిస్తోంది. ఇంకా ఆరోగ్యకేంద్రం, వృద్ధాశ్రమం, గ్రంధాలయం, మహిళా మరియు యువతకు శిక్షణానైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాలను నిర్ధేశించుకుంది. అలానే గ్రామాన్ని హరితవనంలా ఉంచేందుకు అన్ని చోట్ల మొక్కలను నాటడం, పచ్చదనం-పరిశుభ్రత అమలుచేయడం, వీధి దీపాలను ఎల్ఈడీ బల్బులతో విద్యుదీకరించడం, చదువుతున్న వారికి కెరీర్ గైడెన్స్, ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మెడికల్ క్యాంపులు, రైతు అవగాహన సదస్సులు, మన ఊరి వారి పేర్లు, ఊరి వార్తలు ఒక చోట సేకరించి పెట్టడం... ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి. ఇందుకు కలిసి వచ్చే వారితో కలిసి కె.వి.ఎఫ్. ముందడుగు వేయాలని చూస్తుంది.

అందుకే .... మన ఊరి బాగు కోసం చేయి చేయి కలుపుదాం. మనకెంతో చేసి, మనల్ని ఈ స్థాయిలో నిలిపిన మన ఊరికి కొంతైనా సాయం చేద్దాం. అందరం కలిసి జన్మభూమి రుణం కొంతైనా తీర్చుకొందాం... మీరు వేసే ముందడుగు... గ్రామానికి వెలుగు... అంటూ “గ్రామ వికాసమే... మన అంతిమ ఆశయ” లక్ష్య సాధనకై “కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్” కృషి చేస్తుంది.

“గ్రామ వికాసమే ... మన అంతిమ ఆశయం”