తొలి మాట

      మన గ్రామానికి వెబ్ సైట్ ఏంటిరా అని చాలా మంది అనుకోవచ్చు, మన గ్రామానికి కూడా వెబ్ సైట్ ఉంది అని కొందరు గొప్పగా చెప్పుకోవచ్చు. రాను రాను భావితరాలకి గ్రామంతో ఉన్న సంభంద-బాందవ్యాలు మృగ్యమైపోతున్న దశలో వారికి ఒక వారధిని నిర్మించాలన్న ఆలోచన ఈ వెబ్ సైట్ కి నాంది. ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా, చాలామంది మా ఉరు నుండి విదేశాలకి, దేశంలో ఉన్న పలు ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. ఏ దేశమేగినా మాతృభూమిపై మమకారం మాత్రం అందరికీ ఉంటుంది. తమ పిల్లలకి తాము పుట్టిన ఊరు గురించి చెప్పటం ప్రతి తల్లిదండ్రులు చేసే పని. కాని ఇంకా సమగ్రంగా కళ్ళకి కట్టినట్లు చూపించాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేది ఇప్పటి తరానికి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది అవ్వాలి. అప్పుడే అది వారికి చేరుతుంది. దానికి మేము ఎంచుకున్న మార్గం ఇంటర్నెట్. అప్పటికి అసలు గ్రామానికి ఒక వెబ్ సైట్ అనేది ఎవరి ఊహకి అందనిది. ప్రతి సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళటం అనేది గ్రామంలో ఉన్న యువకులకి అలవాటు. ఏ పండక్కి వచ్చినా రాకపోయినా సంక్రాంతికి మాత్రం అందరూ వస్తారు. ఆ నాలుగు రోజులు ఊరంతా సందడే. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఎక్కడెక్కడో ఉండే చిన్ననాటి స్నేహితులంతా ఇంట్లో వండిన పిండి వంటలను తింటూ ఆత్మీయంగా కలుసుకుంటారు. ఊరికి దూరంగా ఉండే ప్రవాసులకి గ్రామంలో ఉండే సామాజిక, రాజకీయ అంశాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉంటే, వారు గ్రామానికి మరింత చేరువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ వారికి తెలుస్తాయి. ఏదైనా వితరణ అవసరం అయినపుడు ఎవరైనా త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది.

      మొట్టమొదటగా 2012వ సంవత్సరంలో మేము “జ్ఞాపకాలు నెమరువేసుకుందాం, మంచిచెడులు చెప్పుకుందాం, యోగక్షేమాలు తెలుసుకుందాం, అందరం ఒకచోట చేరి మధురస్మృతులు గుర్తుచేసుకుందాం, మన ఊరి అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించుకుంటూ, మనందరికి మంచి భవిష్యత్తును ఇచ్చిన మన ఊరి బాగు కోసం ఏం చేయాలో ఆలోచిద్దాం, ఒక్కసారి కలుద్దాం” అంటూ సంక్రాంతి పండుగ వేళ... తన ఊరి బిడ్డలను “పల్లెకు పోదాం...” అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో ఆత్మీయ సమావేశం జరుపుకొన్నాం. ఈ సమావేశంలో “ఐక్యత-అభివృద్ధి” అనే నినాదంతో గ్రామాభివృద్ధి జరుగుతుందని, అలానే వ్యక్తిగత కక్షలు, ముఠాలతో ఏమి సాధించలేమని, అందరూ కలసి కుల-మత-రాజకీయాలకు అతీతంగా ఐక్యతా భావంతో ముందుకు నడిస్తే, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంవైపు నడిపించవచ్చని, అభివృద్ధిలో మన కండ్లగుంట గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో చూడాలన్న కోరికను గ్రామస్తులకు వివరించడం జరిగింది. మన ఈస్ఫూర్తే మరికొన్ని గ్రామాలకు స్ఫూర్తి పొందేలా చేద్దాం అనడంతో గ్రామస్తులందరూ ఏకమై గ్రామాభివృద్ధి కోసం పాటుబడదాం అంటూ ముందుకు వచ్చారు. అదే రోజు ఎవరు ఏమనుకున్నా మన కండ్లగుంట గ్రామానికి కూడా వెబ్ సైట్ ఎలాగైనా పెట్టాలని అనుకున్నాం. ముందుగా గ్రామంలో ఉన్న అన్ని ప్రాంతాలని ఫోటో షూట్ చేశాం. ఇక గ్రామంలో అందరి ఫోన్ నంబర్లు, అందుబాటులో ఉన్న ఈమెయిల్ ఆడ్రస్సులు, పేరొందిన ప్రముఖుల చరిత్ర, న్యూస్ క్లిప్పింగ్లు ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా మొదటి అడుగుని ప్రారంభించాం. మాతో పాటు చదువుకున్న మా మిత్రులు నైతికంగా మద్దతు నిచ్చారు. మా గ్రామం నుండి విదేశాల్లో కొందరు స్థిరపడ్డారు. ఇంట్లో జరిగే ఫంక్షన్లు, బంధువుల పెళ్లిలకి రాలేని పరిస్థితి. అందుకే ఈ వేదిక ద్వారా వారు కోరుకుంటే ప్రతి కార్యక్రమం లైవ్ లో అందించాలనే ఆలోచన మరోటి. దీనికి గ్రామంలో ఉండే వీడియో గ్రాఫర్ల సహాయం తీసుకోవాలనుకున్నం. వారికి దీనిలో ఉండే సాంకేతిక అవసరాలని తెలియ చెప్పి, తద్వారా వారికి కలిగే లాభం కూడా చెప్పటంతో వారు మాతో సహకరించడానికి ముందుకువచ్చారు. గ్రామంలో జరిగిన దేవాలయ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పెళ్లి వీడియోలన్నీ ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో ఉండాలనే మా లక్ష్యానికి ముందడుగుపడింది.

      ప్రతి విషయం ప్రామాణికంగా ఉన్న తర్వాతనే వెబ్ సైట్ లో పెట్టాలి అనుకున్నాం. విషయ సేకరణ కొరకు అన్వేషణ ప్రారంభించాం. గ్రామంలోని కాకలు తీరిన పెద్దలు కలుసుకున్నాక వారి దగ్గర తెలుసుకున్న విషయాలు ఏ యూనివర్సిటీలోనూ చదువుకోని పాఠాలు. గ్రామంలోని పెద్దలు విషయ సేకరణలో తమ అనుభవాలని జోడించారు. గ్రామాన్ని వీడి సిటీల్లో తమ పిల్లల దగ్గర బతుకు వెళ్ళదీస్తున్న పెద్దలని కలుసుకోవటానికి హైదరాబాదు, విజయవాడలని జల్లెడ పట్టాము. వారు చెప్పిన ప్రతి విషయాన్ని సెల్ ఫోనులో రికార్డు చేసుకుంటూ అన్నిటినీ క్రోడీకరిస్తూ ఒక్కొక్కటిగా వెబ్ సైట్ లో పేర్చుకుంటూ వచ్చాం. గ్రామంలో చాలామందికి అసలు ఇది అర్ధం కాలేదు. వారికి సవివరంగా చెప్పటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మా మిత్రుడుకి వెబ్ సైట్ డిజైనింగ్ అనుభవం ఉండటంతో ఎప్పటికప్పుడు వెబ్ సైట్ నిర్మాణం మాకు సులువు అయ్యింది. 2012 లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తవటానికి పట్టిన సమయం సరిగ్గా రెండు సంవత్సరాలు. మొదటగా 2014వ సంవత్సరంలో సంక్రాంతికి గ్రామ నడిబొడ్డున వందలాది మంది గ్రామస్తుల మద్య కండ్లగుంట.ఓ ఆర్ జీ అనే పేరుతో నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌ. డాక్టర్. కోడెల శివప్రసాదరావు గారి చేతులమీదుగా సగర్వంగా ప్రారంభించాం. అసలు వెబ్ సైట్ ఏంటో చూద్దాం అని వచ్చిన వారందరికీ దాని ఆవశ్యకతని వివరించటంలో మేము సఫలీక్రుతమయ్యాం. మన కండ్లగుంట గ్రామానికి ఉన్న వెబ్ సైట్ మన గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిది.

      మరలా 2017వ సంవత్సరంలో మన వెబ్ సైట్ ను అందరికి అర్ధమయ్యేలా మన మాతృభాష తెలుగులో చేయడం జరిగింది. మన గ్రామ సమాచారాన్ని ఊరి పెద్దలు మరియు ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించడం జరిగింది. ఇంకా చాల సేకరించవలసి ఉన్నది. ఈ వెబ్ సైట్ లో మీరు మీ తండ్రులు, తాతలు మన పాఠశాలలో ఎప్పుడు చదివారు, ఎంతవరకు చదివారు, వారి పుట్టినరోజు మరియు వారి అడ్మిషన్ నంబరుని కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మన పంచాయతీ సమాచారం, మీ రేషన్ కార్డును మీ కుటుంబ ఫొటోతో పాటుగా చూడవచ్చు. మన గ్రామానికి చెందిన వారి ఓటర్ వివరాలు మరియు మన గ్రామంలో ప్రభుత్వం ద్వారా అందుతున్న పెన్షన్, ఆసరా పింఛను వివరాలు, మీ భూమి వివరాలు కూడా చూడవచ్చు. అలానే మన గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్న దాతల మరియు స్ఫూర్తి ప్రధాతల సన్మానాల గురించి వివరాలను అందిస్తూ, మనతో మొదలైన ఈ ప్రయాణం తరువాతి రోజుల్లో భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూ ప్రతిఒక్కరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా “ఐక్యత-అభివృద్ధి” నినాదంతో “గ్రామ వికాసమే-మన అంతిమ ఆశయం” అనే లక్ష్యంతో ముందుకు కదలాలని ఆశిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యవిషయం ఏమిటంటే, ఈ వెబ్ సైట్లో ఉన్న సమాచారాన్ని దాదాపుగా తెలుగులోనే పొందుపరచడం జరిగింది.

      పెళ్ళంటే ఓ జ్ఞాపకం. ఓ తీపిగుర్తు. దాన్ని “గుర్తుండిపోయే జ్ఞాపకం” గా చేసేందుకు 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా..” ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో కళ్యాణమండపం పునఃనిర్మాణ బాధ్యత నాదే అని ప్రకటించి, గ్రామంలోని వారందరూ శుభాకార్యాలను అంగరంగ వైభవంగా జరుపుకొనుటకు కావలసినంత స్థలం దానం చేయడమే కాకుండా, సకలసౌకర్యాలతో సర్వాంగసుందరంగా అత్యంత విశాలమైన కళ్యాణమండపాన్ని పునఃనిర్మించి, వంటశాల, భోజన సామాగ్రి సమకూర్చి, బయట సరుకులు మాత్రమే తెచ్చుకుంటే చాలు, మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనేంత అద్భుతమైన సౌకర్యాలతో “శ్రీ రావెల సత్యనారాయణ గారు” చెరగని చిరునవ్వుతో గ్రామానికి అంకితం చేసిన “కళ్యాణమండపం”, మంచి ఆరోగ్యం మంచినీళ్లతోనే అనే భావంతో శుద్ధమైన మంచినీళ్ళను అందించాలనే సత్ సంకల్పంతో “మినరల్ వాటర్ ప్లాంట్” మరియు “గ్రామ కచేరి” కండ్లగుంటకు లభించిన గొప్ప అస్థి.

      మన ఊరిలో “వైకుంఠ మహాప్రస్థానం” నిర్మాణానికి 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా...” ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో జన్మభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్ప బలంతో శ్రీ పెమ్మసాని బ్రహ్మయ్య గారు నిర్మిస్తానని ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా మన ఊరిలో కనీసం నలుగురు మనుషులు తీసుకెళ్ళడానికి వీలులేని దయనీయ స్థితిలో ఉన్న స్మశాన వాటికను మంచి ఆహ్లాదకరమైన ప్రాంగణంలో కర్మఖాండలను జరుపుకునే విధంగా స్వర్గపురికి ఇదేదారి అన్నట్లు నభూతోః నభవిష్యత్ఃఅనేలాగా ఓ అద్భుతమైన “వైకుంఠ మహాప్రస్థానం” ను దేశంలోని ప్రతి గ్రామం స్ఫూర్తి పొందేలాగా నిర్మించి, గ్రామానికి అంకితం చేశారు.

      జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధునీకరణ కోసం మేము అడిగిన వెంటనే స్పందించి గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ నెల్లూరి నాగేశ్వరరావు రూ. 5 లక్షల నిధులతో డ్రైనేజీ పైపులైనుల ఏర్పాటు, విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం, కిటికీలు, తలుపులు, ఆధునీకరణ పనులు, రంగులు వేయడంతో ఈ పాఠశాల కార్పోరేట్ కు దీటుగా సకల సౌకర్యాలు ఒనగూర్చి, సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

      వీటన్నిటి సమాహారమే ఈ ‘కండ్లగుంట.ఓ ఆర్ జీ’ తయారుచేయబడినది. ఇక నుంచి మన గ్రామంలో మరియు మన జీవితంలో జరిగే మంచికీ, చెడుకీ ఈ వెబ్‌సైట్‌ని వేదికగా చేసుకుందాం. ఈ వెబ్ సైట్ తయారీలో మాకు అన్నివిధాలుగా సహకరించిన మరియు సలహాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ వెబ్ సైట్ మనందరిది మరియు మన గ్రామానికి సంబంధించినది. యవ్వనంలో కవిత్వం రాయాలి, వృద్ధాప్యంలో విమర్శలు రాయాలి. మేమింకా యవ్వనంలోనే ఉన్నాం కాబట్టి ఈ వెబ్ సైట్ లో విమర్శలు వివాదాస్పద విషయాలు ఉండవు. అందుకే నాలుగేళ్ళు గడిచినా ఇప్పటికీ ఒక్క విమర్శకి కూడా తావివ్వలేదు. మున్ముందు మరిన్ని ఉన్నత లక్ష్యాలతో సాగాలన్నదే మా అభిమతం. దీని అభివృద్ధిలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలను అందిస్తారని ఆశిస్తున్నాము.

                  మీ

కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్